సనాతనధర్మం గుట్టు విప్పిన ‘ఎర్రపుంజు’

కృష్ణాజిల్లా పల్లెయాసలో సరదాగా పూర్తయిపోయినట్టుగా అనిపించినా..  ఈ ‘ఎర్రపుంజు’ కథ చెప్పే అసలు నీతి, ఆఖరున యముడు చెప్పిన మాటల్లో లేదు.

బ్బ.. ఎంతకాలమైంది ఇంత సరళమైన కథ చదివి అని సంబరం వేసింది సారంగలో ‘ఎర్రపుంజు’ చదవగానే. సాంబయ్య పేరుతో అచ్చయిన ఈ కథ రాసిన సాంబశివరావును మేమంతా ప్రేమగా సాంబ అని పిలుచుకుంటాం. నాకన్నా దారుణమైన కథలపీనాసి. పాతికేళ్ల కిందట ఒక కథ రాశాడు. ఇది రెండోది. తొలి కథ ‘అయిదో మనిషి’ని చదివి.. తెలుగులో ఇంకో బలమైన కథకుడు పుట్టుకొచ్చాడని అందరం  ఆనందపడ్డా, సాంబడు మాత్రం మృదు గంభీర మౌనపు నవ్వుతో పెన్ను మూసేసి కూర్చుకున్నాడు. ఇతనో మాటలమరాఠీ. సందర్బానికి తగిన చమత్కార పదాలు విసురుతుంటాడు. అవి టీవీ వార్తల్లో స్లగ్‌ లుగా మెరిసి మాయమవుతూ ఉంటాయి. ఏ పురుగు మళ్లీ తొలిచిందోగానీ ఇప్పుడీ ‘ఎర్రపుంజు’ను వండి వడ్డించాడు.

‘ఎర్రపుంజు’ కథలో సాంబయ్య పాతిక ముప్పయి ఏళ్ల కిందటి కృష్ణాజిల్లాలోని  ఒక పల్లెటూరికి 5జీ లైవ్‌ కిట్‌ను పంపే ప్రయోగం చేశాడు.  ఊళ్లో కెమెరాలు పెట్టి దృశ్యదృశ్యాలుగా కథను లైవ్‌లో నడుపుతాడు. దశాబ్దాలుగా పడిలేస్తున్న ఉద్యోగం సాంబయ్యకి ఈ టెక్నిక్‌ని అనాయాసంగా అందించింది. ఇది కథను అద్భుతంగా పండించింది.

కథలో ప్రధాన స్టుడియో యమలోకంలో ఉంటుంది. చిత్రగుప్తుడు మెయిన్ యాంకర్‌. యమధర్మరాజు ఎక్స్‌పర్ట్‌ కామెంటేటర్‌. హఠాత్తుగా వచ్చిన వరదలో చచ్చిపోయి యమలోకంలోకి వచ్చారు శేషమ్మ, సుబ్బయ్య. వారి పాపపుణ్యాల విచారణ సాగుతోంది.  మన ప్రజాస్వామిక దేశంలోని ఐపీసీ లాగా కాదు యమలోకంలోని వైపీసీ(యమలోక పీనల్‌కోడ్‌). నేర చరిత్ర మొత్తం తవ్వితీసిగానీ  తీర్పు చెప్పరు.  శేషమ్మ, సుబ్బయ్యల ఇంట్లో కూరగా మారిన ఎర్రకోడిపుంజును ప్రధాన సాక్షిగా ప్రవేశపెట్టారు. బతుకు జట్కాబండి షో తరహాలో కథ నడుస్తుంది. తొలిగా ఎర్రపుంజు హత్యకేసు విచారణ జరుగుతుంది. ‘..ఆరోజు ఏం జరిగింది?’ అనే చిత్రగుప్తుడి ప్రశ్నతో ఎర్రపుంజు- జ్ఞాపకాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లివస్తూ ఉంటుంది. ఎర్రపుంజు చెప్తున్నవాటిని క్రాస్‌ చెక్‌ చేసుకోవడానికి మధ్య మధ్యలో లైవ్‌లోకి ఇతర సాక్షులను తీసుకుంటూ ఉంటారు. కథంతా ఎర్రపుంజు కోణంలో నుంచే నడుస్తుంది.

పొద్దున్నే గంపలేపి కోళ్లను బయటకు వదులుతూ, ఎర్రపుంజును మాత్రం పట్టేసుకుంది శేషమ్మ. ఊళ్లో  పెళ్లిచూపులకోసం వస్తున్న అక్క కుటుంబానికి వండిపెట్టడానికే అని దానికి అర్థమైపోయింది. ప్రాణభయంతో వణికిపోయింది. ‘దాని దెవసం చెయ్య. ఏం వాయవ వచ్చిందో? దానికి ఉప్పులాయి రానూ.. దాని శిరుసు పగల, దాని కాడిగట్ట..!’ అంటూ శేషమ్మని శాపనార్ధాలు పెట్టింది. ఒకపక్క జ్వరం అనిచెప్పి పాలేరు ఏసోబు పనికి ఎగ్గొట్టాడు. కోడిని కోయడానికి రమ్మని కబురు పెట్టిన కోటేశూ ఇంకా రాలేదు. అక్కావాళ్లు వచ్చేలోగా పనులు వగదెగలేదని శేషమ్మ విసుక్కుంటూ ఉంటే, పాల దుర్గారావు వచ్చాడు.

కోటేశు రాగానే తన పీక తెగుతుందని తెలిసిన ఆ ప్రాణి  దేవుణ్ణి వేడుకుంది. అయినా‘దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా కోడిని కాపాడిన దాఖలా ఉందా? పైగా కోళ్లను బలి ఇస్తుంటే సంతోషంగా స్వీకరించడం.. అదేమిటో వాళ్లు చల్లబడటానికి- మనుషులను చల్లగా చూడటానికి కూడా మా వెచ్చటి రక్తమే కావాలి!’ అని వైరాగ్యపడింది. ఆ ఆఖరి క్షణాల్లో.. కుమిలి కుమిలి..పొగిలి పొగిలి ఏడుస్తూ, గద్దల నుంచి కాపాడిన అమ్మను గుర్తు చేసుకుంది. అప్పుడు దానికి దాహం వేసింది. చచ్చేదానికోసం నీళ్లెవరు పెడతారు! ‘బతికే ఈ కొచేం సేపు కన్నీళ్లను తాగి బతకాలి కాబోలు’ అని దుఃఖపడింది ఎర్రపుంజు. మంచంమీదున్న ముసలి మామకే మంచినీళ్లు ఇవ్వని శేషమ్మ తనకు నీళ్లేం పెడుతుందిలే అని సర్దిచెప్పుకుంది. ఏసోబుకి తనంటే ఇష్టం. వస్తే తనను కాపాడేవాడేమో అని ఆశపడుతూ ఉంటే ‘కొమ్ములు, కోరలు లేని యములోడిలా’ వచ్చాడు కోటేశు. ‘ మాంసం నేను కోసుకుంటా..నువ్వు మెడ తప్పిస్తే చాలు’ అని పదును మెరుస్తున్న కత్తిని అతని చేతికిచ్చింది శేషమ్మ. ‘మాంసం కోసుకోగలిగిన మనిషి.. ఆ మాత్రం పీక కోయలేదా? కోటేశు కోసం పొద్దుటి నుంచి ఎందుకు ఎదురుచూస్తోంది?’ ఆ మతలబు ఏమిటో అర్ధం కాలేదు ఎర్రపుంజుకి. కోడిని చేతికి తీసుకున్న కోటేశు, కసక్కన తలా మొండెమూ వేరు చేసేశాడు.

అట్లా యమలోకానికి చేరుకున్న ఎర్రపుంజు-  శేషమ్మ, సుబ్బయ్యల నేర విచారణలో ముఖ్య సాక్షిగా మారి తన కథంతా యమ, చిత్రగుప్తులకు చెప్పింది. అయితే ఎర్పపుంజు సాక్ష్యం మీద మాత్రమే ఆధారపడి తీర్పు ఇవ్వడం యమలోక ధర్మం కాదు. అందుకే ఎర్రపుంజు ప్రస్తావించిన అందరినీ లైవ్‌లోకి తీసుకుని విచారించారు. అట్లా మొదట లైవ్‌లోకి వచ్చిన పాలదుర్గారావు, పాలల్లో నీళ్లు కలిపి పోసే శేషమ్మ ‘ఎంత కక్కుర్తి ముండో’ చెప్పాడు.

ఆ తర్వాత లైవ్‌లోకి తీసుకున్న పాలేరు ఏసోబు,‘ పదమూడేళ్ల వయసు నుంచి పనిచేశాను. తెల్లవారుజామున వెళ్లి, మళ్లీ ఏ రాత్రికో ఇంటికి చేరేవాడిని. అప్పుడు ఏడాదికి రెండు బత్తాల వడ్డు, రెండు జతల బట్టలు ఇచ్చేవాల్లు. పెద్దయ్యాక నాలుగు బత్తాలు చేశారు’ అని చెప్పినపుడు యమలోకం నివ్వెరపోయింది, భూమ్మీద ఉన్న ఆ ‘ఇన్ హ్యూమన్ చైల్డ్‌ లేబర్‌’ విధానం గురించి విని.

ఆ తర్వాత సుబ్బయ్య మోజుపడ్డ, ఊరి చివర ఉండే రత్తమ్మ లైవ్‌లోకి వచ్చింది. రత్తమ్మ మొగుడి చావుకి సుబ్బయ్యే కారణం అని ఊరంతా గుసగుసలాడేది. అయితే సుబ్బయ్య మాత్రం యమలోకపు విచారణలో, ‘ నేను చంపలేదు స్వామీ. వాడే పూటుగా సారా తాగి నీళ్లలో కొట్టుకుపోయాడు’ అని చెప్పాడు. రత్తమ్మ మాత్రం,‘ ఈత బాగా వచ్చినోడు నీళ్లలో కొట్టుకుపోతాడా? ’ అని నిజం బయటపెట్టింది.

నాలుగో సాక్షిగా ‘చాకిరేవులో పెళ్లాంతో కలిసి బట్టలు ఆరేస్తున్న కోటేశు’ లైవ్‌లోకి వచ్చాడు. ఖండఖండాలుగా మాంసాన్ని కోసే శేషమ్మ, కోడి తలను వేరు చేయడానికి మాత్రం కోటేశుని ఎందుకు పిలిచిందనే సందేహం ఎర్రపుంజుకి లాగే అమాయకపు చిత్రగుప్తుడికీ వచ్చింది. అదే అడిగాడు ఆమెను. ‘ఇది కూడా తెలీదా మీకు? పెళ్లిళ్లకీ చావులకీ- చాకళ్లూ, మంగళ్లూ కొన్ని పనులు చేయాలి. మనిషి పోయినా, గొడ్డు చచ్చినా మాదిగోళ్లతో పని ఉంటుంది. ఎలుకల్ని పట్టాలంటే యానాదుల్ని పిలుస్తాం. మరుగుదొడ్లపని ఉంటే పాకీవాళ్లు చేయాల్సిందే.. చెబితే చాలా ఉన్నాయిలే’ అని తాము పాటించే ధర్మాన్ని వైనంగా వివరించింది శేషమ్మ.

సుబ్బయ్యనీ, శేషమ్మనీ నరకంలో వేయాలని తీర్పు చెప్పాడు యముడు. సుబ్బయ్య అంటే..రత్తమ్మ మొగుడ్ని చంపాడు. తాను కనీసం కోడిని కూడా చంపలేదు కాబట్టి తనను నరకానికి పంపడం అన్యాయం అని అప్పీల్‌ చేసుకుంది శేషమ్మ. అప్పుడు మరో ఇద్దరు సాక్షులను లైవ్‌లోకి తీసుకున్నారు. వారిలో ఒకరు సుబ్బయ్య తల్లి. మంచాన పడ్డాక తమకు ఎంత నరకం చూపిందో వలవలా ఏడుస్తూ వివరించింది ఆమె. ఆ ఆరోపణను నిర్ధారించుకోవడానికి శేషమ్మ పక్కింటి చుక్కమ్మను లైవ్‌లోకి తసుకున్నారు. సుబ్బయ్య తల్లి చెప్పిన మాట నిజమే అని ఆమె కూడా సాక్ష్యం చెప్పింది.

శిక్ష ఖరారైపోయినట్లే అని తేలిపోయింది. ‘దేవుడా.. నీకు పూజలు, పునస్కారాలు ఎన్ని చేశాను. అన్నీ వృధా అయిపోయాయా..అయ్యో’ అంటూ శోకండాలు పెడుతున్న శేషమ్మను గదమాయించి, ‘ కేవలం కొన్ని పూజలు చేసినంత మాత్రాన చెడ్డపనులు మాఫీ కావు. మంచిపనులు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అవే మిమ్మల్ని కాపాడుతాయి. సాటి మనుషుల్నీ, జీవుల్నీ ఏ రకంగా హింసించినా పాపమేనని తెలుసుకోండి’ అని ముగింపు నీతిమాటలు చెప్పి, ఆ మొగుడూ పెళ్లాలిద్దరినీ నరకలోక జీవితానికి సిద్ధం చేశాడు  యముడు.

ఆ నరకశిక్ష విని, వేళగానివేళ ‘కొక్కొరొక్కో’ అంటూ నవ్వుకుంటూ, తుళ్లుకుంటూ తేలిపోయింది ఎర్రపుంజు.

కృష్ణాజిల్లా పల్లెయాసలో సరదాగా పూర్తయిపోయినట్టుగా అనిపించినా..  ఈ ‘ఎర్రపుంజు’ కథ చెప్పే అసలు నీతి, ఆఖరున యముడు చెప్పిన మాటల్లో లేదు. కథ నడిచే క్రమంలో పొరలు పొరలుగా బయటపడ్డ పల్లెటూరి జీవనధర్మంలో ఉంది. శేషమ్మ మాటల్లో అమాయకంగా దొర్లినట్టు కనిపించిన భారతీయ కులవ్యవస్థ నిజరూపంలో ఉంది. సనాతనత్వమే భారతీయ ఔన్నత్యం అని గొప్పలు చెప్పే గప్పాల మాటల వెనుక ఉన్నదేమిటో ఎక్కడా వ్యాఖ్యానించకుండా చెప్పడమే ఈ కథ విశిష్టత. ఇట్లాంటి కథలు కదా ఇప్పుడు కావలసింది.

పైకి వృత్తుల్లా కనిపించే కులవ్యవస్థ అంతరాల వికృత రూపాన్ని ఈ కథ అంతర్లీనంగా వెల్లడిస్తుంది. నేరారోపణ ఎదుర్కొనే శేషమ్మా సుబ్బయ్యలు ఎనిమిది ఎకరాల సేద్యం ఉన్న మధ్యతరగతి శూద్ర అగ్రవర్ణం. పాలేరు ఏసోబు పాత్ర – ఎస్సీ కులాల శ్రామిక దోపిడీకి ప్రతిరూపంగా కనిపిస్తుంది. చాకలి కోటేశు – తమ చేతికి పాపం అంటకుండా బీసీ కులాలను ఎలా వాడుకుంటారో వెల్లడించే పాత్ర. ఊరి చివరి రత్నమ్మ- లైంగిక దోపిడీకి గురైన స్త్రీ. ఎర్రపుంజు- తరాలుగా మెడకాయమీద తలకాయ లేకుండా బతుకుతున్న బడుగువర్గానికి ప్రతీక. మనుమహానుభావుడు ప్రవచించిన ఈ వ్యవస్థ యధాతధంగా ఇలాగే ఇప్పుడు పల్లెల్లో కనిపించకపోవచ్చుగానీ, కొత్త కవచాలు కప్పుకుని పట్టణాల్లో వర్ధిల్లుతూనే ఉంది. ఈ నిజాన్నే చతురంగా కథగా అల్లి చెప్పాడు సాంబయ్య.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును.. సమాజం నిండా ఇప్పటికీ వెర్రి పుంజులూ, వెర్రి పెట్టల సంఖ్య ఎక్కువే. ఆ వెర్రితనమే ఎలైట్ పీపుల్ అనబడే నేరగాళ్లకు అత్యవసరం. సాంబ రెండు కథల బంగారంగా మిగలరాదని ఇక్కడా డిమాండింగ్!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు