1
నాదెప్పుడూ
సదాగ్రహమే అంటాడతడు.
ఔనౌను
నీది
సదా ఆగ్రహమే
అంటుంది ఆమె!
2
మౌనమేలనోయి!
అతని నిశ్శబ్ద వైఖరిని
మౌనముద్రేమో
అనుకుని పొరబడేరు!
అది
మౌనముద్రా కాదు
యోగ నిద్రా కాదు
తన మాట
నెగ్గదని తెలిసినప్పుడు
అతడు తాత్కాలికంగా
అణచిపెట్టిన
కోపపు అలజడి!!
—
3
మగతనం
అప్పుడప్పుడు
అతని ప్రవర్తనను చూస్తే
మృగతనానికి వికృతి
మగతనమేమోననిపిస్తుంది.
ఇంతలోనే
ఆ వింత ప్రవృత్తికి
పాపం!
మృగాలనేందుకు
బలిచెయ్యాలీ
అనిపిస్తుంది.
—
4
తప్పక రానున్న ఫలం
ముద్దు ముద్దుగా
ముదురు పచ్చని రంగును
గుప్పున గుబాళిస్తున్న
ఎంచక్కని మామిడి పూత
అక్కడక్కడా ఇప్పుడే కాస్తున్న
ముక్కు మొనదీరిన
చిట్టి చిట్టి మామిడి పిందెలు
తప్పక రానున్న ఫలాన్ని
ఆశలుగా గంపకెత్తుకుంటున్న
మనుజుని మధురానురీతి
తమ ఆకులను రెక్కలుగా మలచుకొని
ఒక్క సారి పక్షులుగా నింగికెగసిన
దివ్యానుభూతి!
*
Lived first two…very nice!…