పిడికె

“ఏమైంది జెప్ప జెప్ప అందరూ మొకాలు కడుగుండ్రి. ఒకల తర్వాత ఒకలు కానియ్యాలే. ఒకల కోసం ఒకలు సూసుకుంట ఉంటరా? తానాలు జెయ్యుండ్రి. పని బాగా ఉన్నది. పాల పొరకకు పోయినోల్లు అచ్చే ఆళ్ళ అయ్యింది. సిన్న సెల్లె! తానం జేసినవా? నీవాల్లి ముట్టియ్యి. దప్పులోల్లు ఏరి? బువ్వ అయిందా? పప్పు, షారు సేసిండ్రా? ఈడ వున్నోల్లందరికీ సాయ పొయ్యిండ్రి. పాల పొరకకు పోయినోల్లకు,దప్పులోల్లకు బువ్వ పెట్టాలె. అట్టిగా పంపియ్యద్దు. ఇన్నరా? జెల్ది కానియ్యిండ్రి పనులు”.

ఇల్లంత సందడిగా ఉన్నది. అదినే మరుదండ్లు సరసపు మాటలు, బావ బామ్మరుదుల పరాసికాలు, సిన్న పిల్లల ఏడుపులు, ఆటలతో.

“పెద్దన్నా! పాల పొరుక బండ్లు అచ్చినయే. కసీరు కాడ ఆగినయి. సెల్లె నివాల్లి పట్టుకో. పెద్ద మనిషి బిందెల లీల్లు ఎత్తుకో. ఓరి నర్సిగా! పిలుపు దప్పులు ఏసుకొండ్రి. పోదాం. పాల పొరుక అచ్చిందట. మసుకుల పోయిండ్రు, ఆకలి అయితంది కావచ్చు. పాండ్రి బిరాన. ఆగరాదురా బిడ్డ! ఈ పోరాగండ్రు ఇప్పుడే ఏటో పోయిండ్రు.

ఎన్ని దప్పులు? పోదాం రా?”

“ఏ నీ అవ్వ. మన ఇండ్లల్లయేనాయే ఎన్నయితేంది? తియ్యుండ్రి దప్పులు. పా.. పా.. నడుండ్రి”.

తాడు ముడేసి దప్పులు లేవకున్నా సంకకు ఏసుకొని దప్పు బొత్తకు ఆనించి జనకాం జజ్జన జాం జ నాం నాం నాం జనకాం జజ్జన జాం జనాం నాం నాం అని పెద్దలతోని దప్పులు కొట్టుకుంట సంబురంగా పోతాండ్రు మాసిన బట్టలేసుకొని బుడ్డ పోరగాండ్రు.

ఎడ్ల కాళ్ళు కడిగి పసుపు రాసి నొసలుకు కుంకుమ బొట్టు పెట్టె. పాల పొరుకకు పోయినోల్లకు బొట్టు పెట్టిన తర్వాత ముందట దప్పులు అందంగా వాయించుకుంట నివాల్లి ఆరకుండ తువ్వాల అడ్డంగా పట్టుకొని ఇంటికి చేరినయి కచులం బండ్లు. ఇంటి ముందట బండ్లాపి బండ్లల్ల పాలపొరుక, అందుగు గుంజ తెచ్చి సాపల ఏసిండ్రు. పోరాగండ్రు తాడుకు మామిడాకులు తోరణాలు కడుతండ్రు. గుంజలకు రంగు రంగు కాగితాలు అతికిచ్చిండ్లు. పెద్ద మనుసులకు, దప్పులోల్లకు, పాల పొరుకకు పోయినోల్లకు పోరాగాండ్రను బంతి మీద కూసో బెట్టి మోతుకు ఆకులతోని కుట్టిన ఇత్తరాకులు ఏసి బువ్వ పెట్టిండ్రు.

‘మంచిగున్నదే అనుప పప్పు, షారు అనుకుంట’ ఇత్తార్ల కెళ్ళి పప్పు కింద కారంగా తింటండ్లు అందరూ.

“ఓ పిలగా! ఎటో లేత్తనవ్? దండుగ కడుతవా?

బువ్వ అయిపోతే ఇంకింత ఏయించుకొని తినాలె. బంతిలకెల్లి ఎట్ల లేత్తవ్ అందరుండంగ? బంతి మీద కూసున్నప్పుడు అందరూ కలిసి లేవాలె. ఇన్నవా వాయి?”

“అబ్బ బావ! మీది అయిపోయేదాక కూసుంట కానీ బువ్వ అద్దె”.

“గయ్యన్ని నడువయి. తినుమంటవా? మమ్ముల కూడా లేవుమంటవా? నాతోని చెప్పు మరి. ఏమో ఎత్తుకపోయినట్టు దవ్వ దవ్వ తిన్నవ్. ఇప్పుడు లేత్త అంటే సుట్టం ఒప్పుకోదు. ఎయ్యి. సేంద్రనికి బువ్వ ఎయ్యి” అన్నడు బావ సరసంగ.

“నువ్వు బంతిల ఉంటే గియ్యే కైతికాల లెక్కలు జేత్తవ్ బావ. సరే గింతంత ఎయ్యే. లేకపోతే ఆయినే ఊకునే పురుగు కాదు”.

అందరూ తిన్న ఇత్తార్లు ఆన్నె ఉంచి లీల్లు పట్టుకొని సేతులు కడుక్కొని ముచ్చట్లు పెట్టుకుంట కుసున్నరు. మొత్తం ఇత్తార్లు తీసి సేతులు కడుక్కొని, ‘నేను బోల్లు(గంజులు) తెత్త రాజ, కట్టం అయితదని’ రాజయ్య ఇంటికి పోయిండు పోషయ్య.

‘రాజు నాయిన్న! రాజు నాయిన్న’ పిలుసుకుంట పోయిండు ఇంటికి కొంత దూరం నుండే. అలుకు లేక ఆకిలంతా రాల్లు రప్పలు తేలి పొక్కిలై దుమ్మంత రేగుతంది. రేగు చెట్టు ఆకులన్నీ రాలిపోయి మోడు పారి ఉన్నది. ఆకిలంత రేగుముండ్లు రాలి సుక్కలు ఆరబోసినట్టుగా ఉన్నది. అడుగేద్దమంటే కట్టంగా ఉన్నది. గుడిసె మొత్తం ఎలుకల కాపురానికి చెదలు ఆగ్రానికి మట్టి పట్టే. గడ్డి లేకుండా ఆసాలు తేలి ఉన్నది.

“అన్న నువ్వానే? అయ్య లేడే” అని తువ్వాల మెడకు ఏసుకొని మొండి పాయంటుతో పలిగిన కింది పెదవి మీద తోలు కొరుక్కుంటూ బైటికి అచ్చిండు సంతు.

“పండుకున్నవార తమ్మి”.

“ఆ! ఇప్పుడే అచ్చిన్నె. కొంచెం సేపు పందామని ఒరిగిన. నువ్వు అచ్చినావ్”.

“రేపు బుజ్జి లగ్గం కదా! అంటలు అండుటానికి బోల్లు కావాలెరా తమ్మి”

“సరేనే! నేను ఇత్త ఆగు” అని బోల్లు మొత్తం ఒకదాని తరువాత ఒక్కటి ఏసి బేసిన్లు, జెగ్గులు, గంటెలు కూడా ఏసి “ఒక్కనివి ఎట్ల పట్టుకపోతవే? నేను కూడా రావాల్ల పట్టుకొని” సంతు అడిగిండు.

“గియ్యింటికి ఇద్దరం ఎందుకురా తమ్మి? నాకు ఎత్తు నేను పట్టుకపోత. నువ్వు పండుకో. ఏమన్న తిన్నావా? లేదా? ఇంటికి రా తిన” అని మరిసిపోయిన సంగతి సెప్పిండు.

“ఇంకొచెం సేపాగి అత్తనే. నిద్రలేక కండ్లు మంట మండుతన్నై” అని బోల్లు నెత్తి మీద ఎత్తిండు సంతు.

పోషం నెత్తి మీద బోల్లు ఎత్తుకొని గుడిసె దాటిండు. గంతే! కూటర్లు బుయ్య్ బుయ్య్‌మని దుమ్ము రేపుకుంట అచ్చి సంతు ఇంటి ముందట కంకర రోడ్డు మీద ఆగినయి. ఎనుకకు బరువుతో ఉన్న తలకాయ తింపి సూడగా, దవ్వ దవ్వ దిగి ‘సంతుగా! ఆగురా అరేయ్’ అని పెరట్లకెల్లి ఇంటి ముందటికి ఉరుకుతండ్రు పోలీసులు.

ఒక్కసారి పోషంను నూకేసి గబ్బడ గబ్బడ ఉరుకుతండు. పోషం తేరుకొని సూసేటల్లకు సంతు రాజయ్య దడి దునికి ఒక్కటే ఉరుకుడు. ఎటు సూత్తలేడు. ముండ్లు కంపలు ఏం సూత్తలేడు. పోషం జెప్ప జెప్ప ఇంటికొచ్చిండు. బోల్లు కింద దించి గజగజ అనుకుతండు.

“ఏమైందిరా పోషం? గింతగానం అనుకుతన్నవ్” పెద్దన్న అడిగిండు.

“సంతుగాడు ఇంట్లనే ఉన్నడు” కొంచెం ఆగి మొస తీసుకొని, “పోలీసులు అచ్చిండ్లు” మల్ల కొంచెం ఆగి మొస తీసుకొని “ఆనెంట పడ్డరు. ఆడు ఇప్పుడే రాజన్న దడి దునుకంగా సూసిన”. కాళ్ళు రెక్కలు ఆడుతలేవు. నోరంత ఎండుకపోయింది. ‘అటు తెనిగిండ్ల కెల్లి ఎనిమిదో, తొమ్మిదో దల్లున్నయి

ఆడు దొరుకతడు కావచ్చంటూ’ అనుకుంట లీల్లు తాగిండు.

పెండ్లి సందడి అంతా ఆగిపోయింది. అందరూ ఒకదగ్గర గుమిగూడి సంతు ఉరికినకెల్లి సూత్తండ్రు.

కండ్లు మూసి తెరిసేటాల్లకు సిడిమెల తెనిగిండ్ల దాక ఉన్న దల్లు అన్ని దునికి కట్ట కింద పొలాల కెల్లి ఉరికిండు‌ సంతుగాడు. పొలాలు కోసి కొయ్య కల్లు బరిసెల లెక్క ఆకాశం కెల్లి సూసుకుంట వున్నయి. ముండ్లు కూడా కొయ్యకాల్లకు తోడు అయినయి. సంతు దొరుకకుంట పోలీసులు రాకుంట కొయ్యకల్లు, ముండ్లు కూడా సాయం సేత్తనయి.

ఎట్ల ఉరికిండు సంతుగాడు? గిన్ని దల్లు ఎట్లా దునికిండు ఈడు? ఇంట్ల పండుకుంటె అయిపోవు కదా! వేరే ఎక్కడనన్నా పండుకుంటే అయిపోవు కదా! అందరి నోటా ఇదే మాట. పోషం మాత్రం నేను పోకపోతే ఆనికి నిదుర పట్టు. పోలీసులకు ఆడు వేటగానికి పులి దొరికినట్టవ్ అనుకున్నడు గుండెదడ అనుకుడు ఆగలేదు.

ఈడు దొరుకుతడా ఏంది? ఇవారకే రెండు మాట్ల దొరికితే ఆల్లు కీళ్ళు పాపి బాగా కొట్టి రోకలి బండలు ఎక్కిచ్చే. కంది కట్టెను కొట్టినట్టు కొట్టి పెయ్యంతా సింతపండు సేసిండ్రు. ఆ దెబ్బలకు బాగా రోజులు పని సెయ్యలేదు. నడువ రాలేదు. ఆనికి ఏ సుఖం ఉన్నది.

ఇంట్ల బువ్వ అండే దిక్కులేకపాయే. ఆడే బువ్వ కూరలు అండుకొని కైకిలి పోవాలె. దొరల పాలన సూసి, పార్టీల కలిసి రాత్రంత పార్టీల పని సూసుకుంటడాయే. పాపం ఆనికి నిదుర ఆగారం లేక ఎన్ని రోజులయితందో? దుప్పులోలె ఉన్న ముండ కొడుకులు తోడేళ్ళు పడ్డట్టు ఎంబడి పడ్డరు. సంతుగాన్ని ఈసారి ఇడిసి పెట్టరే. సంపుతరు దొరుకుతే అని బాధ పడుకుంట మాట్లాడుకుంటండ్రు అందరూ.

ఎండాకాలం దినమాయే. పోలీసులు గస్ కొడుతండ్లు. అయినా ఇడిసి పెట్టకుంట ఎంబడే ఉరుకుతండ్రు. సంతు, పోలీసుల ఉరుకుటానికి వరి కొయ్యలు మొత్తం పర్‌పర్‌మని సప్పుడైతంది. అడుగుల కింద పడ్డ కొయ్యకాల్లు మల్ల లేత్తన్నయి. సంతు దొరుకుతడా ఏందని ఆశ్చర్యంతో సూసుటానికి.

“అరేయ్ లం..కొడుకా! ఏం తింటాన్నవ్ రా గింతగనం ఉరుకుతాన్నవ్? ఇగనన్నా ఆగరాదురా. మొస అత్తలేదారా? లొంగి పోరా. నీకు పైసలు ఇప్పిత్తంరా! ఆగురా సంతుగా! ఏమనంరా!”

“అరేయ్! మీకు దమ్ముంటే నన్ను పట్టుకొండ్రా సూద్దాం” అని ఇంకా లగాంచి ఉరుకుతండు. ఎనుకనే ఉన్న యువ పోలీసుకు సంతు అంగి దొరికింది. “దొరికినవ్‌ర సంతుగా” అని సంబురంగా అన్నడు యువ పోలీసు.

చెయ్యి ఎనుకకు అని అంగిని కొట్టిండు సంతు. అంతే! పోలీసు చేతుల కెల్లి అంగి దూరం అయ్యింది.

“ఏమయింది సార్? రాండ్రి జెల్లి పట్టుకొండ్రి? పట్టుకుంటా అంటిరి కదా?” సంతు పరాష్కంగా  అన్నడు ప్రాణంతో చెలగాటం ఆడుకుంట. తుపాకులు చేతుల పట్టుకొని ఈడుసుకుంట ఉరుకతండ్రు. తప్పది జీతం తీసుకుంటున్నాం కదా పోవాలి అన్నట్టు‌. పోలీసులు ఒకలిద్దరు తప్ప సంతుకు అందరూ కొంత దూరంగనే ఉన్నరు.

ఒక్కసారి సంతు ఎనుకకు సూసేటల్లకు పోలీసుల బట్టలు తడిసి, సత్తువ సచ్చి సంతుగాన్ని సిదిగెల్ సిదిగెల్ పోడువాలే అన్న కసితో ఉరుకుతండ్రు.

ఉన్నట్టుండి సంతు ఆగిపోయిండు. పోలీసులకు అర్ధం కాలే. ఈడు ఎందుకాగిండని కొంత ఎనుకా ముందాలోసించ సాగిండ్రు. ఇంతవరుదాకా సంతు మీద ఉన్న చూపు ఒక్కసారిగ చుట్టుపక్కలకు మళ్ళింది. తుమ్మలు, నీలగిరి చెట్లు కోసిన పొలాలు, చెరువు కట్టతో అంతా నిర్మానుషంగ ఉంది మీ చోద్యం సూతం అన్నట్టు.

సంతుకు దగ్గర ఉన్న పోలీసు “తొందరగ రాండ్రి! ఈని కాలు నెర్రెల ఇరికింది” అని సంతోషం పట్టలేక గట్టిగ అరువగా ఎనుక ఉన్న పోలీసులు మొద్దు బారిన కాళ్ళు భారంగా ముందుకేసిండ్రు. “దొరికినవ్‌ర. తప్పించుకునుడు నీ తరం కాదురా సంతుగా” అని దగ్గర ఉన్న పోలీసు రాంగనే బిగించి కాలు పీక్కొని మల్ల ఉరుకుడు మొదలు పెట్టిండు. సంతు మీద ఉన్న ద్యాస భూమి మీద లేక ఎనుకనే ఉన్న పోలీసు కాలు అదే నెర్రెల ఇరికింది.

“అబ్బా! కాలు నెర్రెల ఇరికింది” అని మొత్తుకున్నడు. ముందుకు ఉరికిన సంతు ఎనుకకు సూసేటల్లకు తుపాకి కింద పెట్టి కాలు పట్టుకొని కూసున్నాడు పీక్కోను ప్రయత్నిస్తూ.

“ఏమయింది సార్? రాండ్రి. ఆన్నె ఆగుతెట్లా? పట్టుకొండ్రి” అంటూ సంతు పోలీసుల అసమర్ధతను ఎత్తి చూపిండు.

“అరేయ్ సంతుగ! షూట్ ఆర్డర్ లేక బతికినవ్ రా!

లేకపోతే ఇప్పటికే సంపుదుం బిడ్డా! లొంగి పోరా. అరేయ్ లొంగి పోరా. ఇంతకు ముందు దొరికినప్పుడే సంపిన అయిపోవురా” అంటూ అంటూ పోలీసు గుణం సూపుతూ ప్రాదేయపడుతూ మొసపోసుకుంట వస్తున్నరు.

చెరువు కట్ట ఎక్కి కూసోని పోలీసులు కట్ట కిందికి రాంగానే అంగిల కెల్లి బాంబు తీసి “ఇగ రాండ్రి. మీరో నేనో తెల్సుకుందాం. ఊరు దగ్గర ఉన్నది, ప్రజలకు ఏమన్న అయితదని బాంబు ఎయ్యలే. లేకపోతే అడుగు ముందుకు ఏత్తే బాంబు ఏత్త. అట్టిగ సత్తరు సారూ! మీ పెండ్లం, పిల్లలు అనాధలైతరు. మీ ఇష్టం. మీరు నన్ను అంత సిత్రహింసలు పెట్టినా, ఇప్పుడు నేను దొరికిన నన్ను సంపుతరు. నేను మీ అంత కటికున్ని కాదు. ఇగ మీరే నిర్ణయించుకొండ్రి. సత్తరా? బతుకుతరా?” అని చేతుల బాంబు సూపించిండు.

“సంతుగా! మేము కాలువకుంట ఉంటే నువ్వూ మా మీదనే బాంబు ఏత్తవార” అని పోలీసులు మొద్దుబారిన కాళ్ళతో గునుసుకుంట ఎనుకకు తిరిగిండ్రు. ప్రాణాలు దక్కినై సంతుగాడు మంచోడే అనుకుంట.

చెమటతో తడిసిన శరీరాన్ని చెరువు కట్ట మీద చెట్ల స్వచ్ఛమైన గాలి తల్లి కొంగుతో బిడ్డకు వూపినట్టుగా హాయి గొలుపగా, చేతులున్న పిడికెను కింద పారేసిండు. ఏకాంత వాతావరణంలో ఎండిన పెదవుల మీదికి చిరునవ్వు అచ్చింది.

*

బాట వెంట పోతూ ఉంటే….కథలు: సదయ్య

* నమస్తే అన్నా! మీ గురించి చెప్పండి.

నమస్తే! మాది కరీంనగర్ జిల్లా రామగుండం దగ్గరున్న పొట్యాల. పుట్టింది, పెరిగింది అక్కడే! కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్ చేశాక వరంగల్ సి.కె.ఎం కాలేజీలో ఎంఏ తెలుగు చేశాను.

* సాహిత్యంతో పరిచయం ఎలా ఏర్పడింది?

చదువులో నేను యావరేజ్ స్టూడెంట్‌ని. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్ ‘ప్రపంచ రాజ్యాల సంగ్రహ చరిత్ర’, ‘కన్యాశుల్కం’, ‘మహాప్రస్థానం’, ‘అసమర్థుని జీవయాత్ర’.. లాంటి పుస్తకాలు పరిచయం చేశారు. స్కూల్ పుస్తకాల కంటే వాటినే ఆసక్తిగా చదివేవాణ్ని. అర్థమైనా, కాకపోయినా పూర్తిగా చదవడం నాకున్న అలవాటు. అలా వాటి ద్వారా సాహిత్యం చదవడం అలవాటైంది. పీజీకి వచ్చిన తర్వాతే తెలుగు సాహిత్యంపై అవగాహన పెరిగింది.

* కథా రచన ఎప్పుడు మొదలు పెట్టారు?

కథల కన్నా ముందు కవిత్వం రాశాను. నేను ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు పదో తరగతి చదువుతున్న నా మిత్రుడు ఒకరు పరీక్ష సరిగ్గా రాయలేని తన బాధని ఆత్మవిమర్శలాగా కాగితం మీద రాసేవాడు. అది చూసి నాకు కవిత్వం రాయాలనిపించింది. రాసి మా టీచర్‌కి చూపిస్తే మెచ్చుకున్నారు. ఆ తర్వాత 2010లో వరంగల్ లొ  గోదావరి సాహితి మిత్రులు ‘మా భూమి మాకు కావాలి.. మా హైదరాబాద్ మాకు కావాలి’ అనే పుస్తకావిష్కరణ సభకు వెళ్లాను. అక్కడ కొందరు పెద్దల్ని చూశాక ఓ కవిత రాశాను. దాన్ని చూసిన మా గురువు గారు విరసం కవిత్వ వర్క్‌షాప్‌కి తీసుకెళ్లారు. అక్కడ నేను రాసిన కవిత చదివితే అందరూ దాని తమ అభిప్రాయాలు వెల్లడించారు. అలా కవిత్వం రాయడం మొదలైంది.

* కథల వైపు అడుగులెలా వేశారు?

నేను కథా రచన చేయడం అప్రయత్నంగా జరిగిందనే చెప్పాలి. మా ఊరి సమీపంలో జరిగిన ఓ సంఘటన గురించి విని దాన్ని కథగా రాశాను. 2013 జూన్‌లో ‘సాహిత్య గోదావరి’ త్రైమాసిక పత్రిక మొదటి సంచికలో అది ప్రచురితమైంది. ఆ తర్వాత ‘దొరల పంచాయితీ’, ‘ఉడో’, ‘నక్కతోక’, ‘సంఘర్షణ’ కథలు రాశాను.

* మీకు నచ్చిన రచయితలు? రచనలు?

చిన్నప్పుడు చదివిన ‘చెంఘీజ్ ఖాన్’, నల్లా నర్సింహులు గారి ‘నా అనుభవాలు’, వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ లాంటివి బాగా గుర్తున్నాయి. అల్లం రాజయ్య గారి కథలు నాకు చాలా ఇష్టం. ‘జనకకు.. మల్లెప్పుడు దొరుకకు.. మనోళ్లను మరువకు’ అంటూ అలతి మాటలతో అర్థవంతమైన వాక్యాలు రాయడం ఆయనకు చెల్లింది.

* మీ కథల్లో పల్లె వాతావరణం, అక్కడి భాష, సంస్కృతి బాగా ప్రతిబింబిస్తుంది. దాన్ని కథల్లోకి తెచ్చేందుకు చేసే సాధన గురించి..?

నేను పెరిగింది పల్లెలో. చిన్నప్పటి నుంచి ఇక్కడి పరిస్థితులు, ఈ మనుషులను చూస్తూ ఎదిగాను. గ్రామాల్లో స్త్రీలు రోజంతా కష్టపడతారు. ఆ కష్టం నన్ను బాగా ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచనలే నా రచనల్లో కనిపిస్తాయి.

* ముందు ముందు ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

బాట వెంట పోతూ ఉంటే నన్ను ఏడిపించే అంశాలే నా కథలు. ఆ అంశం మనల్ని కదిలించాలి. ఏడిపించాలి. వేధించాలి. అప్పుడే కథలైనా, కవిత్వమైనా పుడుతుంది! అలాంటి కథలు రాయాలని ఉంది.

*

ఉప్పులేటి సదయ్య

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు