పిచ్చోళ్లకు కులం లేదు
మతం లేదు.
వాళ్లు
లింగాతీతులు భావజాలాలకు
బయట బతుకుతారు.
వాళ్ల అమాయకత్వానికి
మనం అనర్హులం.
వాళ్ళ భాష కలల భాష కాదు,
మరో వాస్తవానిది.
వాళ్ళ ప్రేమ
వెన్నెల వంటిది.
అది పూర్ణిమ నాడు
పొంగి ప్రవహిస్తుంది.
పైకి చూసినపుడు
మనం ఎరుగని దేవుళ్లని చూస్తారు వాళ్ళు.
వాళ్ళు చేతులెత్తేసారని మనం అనుకుంటే
వాళ్ళు రెక్కలాడిస్తున్నారన్నట్టు.
వారి దృష్టిలో ఈగలకు కూడా
ఆత్మలుంటాయి, పచ్చని మిడతల దేవుడు
తన సన్నని కాళ్ళతో ఎగిరి గెంతేయగలడు.
అప్పుడప్పుడు వాళ్ళు
చెట్లు రక్తం కార్చడం చూస్తారు,
వీధుల్లో సింహ గర్జనలూ వింటారు.
కొన్నిసార్లు
మనలాగే పిల్లికూన కళ్ళల్లో స్వర్గం తొంగిచూడడం కంటారు.
కానీ చీమలు బృందగానం చేయడం
వాళ్ళు మాత్రమే వినగలరు.
వాళ్ళు గాలి భుజాన్ని తడుతున్నపుడు
మధ్యధరా సముద్రపు తుఫాన్ని
శాంతింపజేస్తున్నట్టు.
వాళ్ళ బలమైన
పదఘట్టనలతో అగ్నిపర్వతం
బద్దలుకావడాన్ని ఆపగలరు.
వాళ్లకు వేరే కాలస్పృహ ఉంటుంది.
మన
వంద సంవత్సరాలు వాళ్ళకొక క్షణంపాటు.
ఇరవై క్షణాల్లో వాళ్ళు క్రీస్తును చేరుకోగలరు,
మరో ఆరు క్షణాలైతే బుధ్ధునితో ఉండగలరు.
ఒకే ఒక్క రోజులో
మొట్టమొదట్లో బిగ్ బాంగ్ ను చేరుకుంటారు.
పిచ్చోళ్ళూ
మనలాంటి పిచ్చోళ్లు కాదు.
—
నత్తి
నత్తి అంగవైకల్యం కాదు.
అదొక మాట రీతి.
మాటకూ, చేతకూ మధ్య నిలిచే నిశ్శబ్దంలా
నత్తి
మాటకూ, దాని అర్థాలకూ మధ్య నిలిచే నిశ్శబ్దం.
నత్తి భాష పుట్టుకకు ముందునుండే ఉందా
తరువాత వచ్చిందా?
అది ప్రాదేశికమా
లేక భాషేనా?
ఇలాంటి ప్రశ్నలు
భాషా శాస్త్రజ్ఞులకు నత్తి పుట్టిస్తాయి.
మనం నత్తిగా పలికిన ప్రతిసారీ
అర్థ దేవునికి
బలి సమర్పిస్తున్నట్టు.
జనసమూహం మొత్తంగా నత్తినపుడు
నత్తి వాళ్ళ మాతృభాష అవుతుంది
ఇప్పటి మన పరిస్థితిలా.
దేవుడు మనిషిని సృజించినపుడు
ఆయన నత్తికి లోనై వుండే ఉండాలి.
అందుకే ప్రార్థనలనుంచి ఆజ్ఞలదాకా
మనిషి పలికే ప్రతి మాటా
నత్తిగా పలుకుతుంది
కవిత్వంలా.
ఎంచుకున్న వస్తువులు పలికించిన భావాలు బావున్నాయి
Reading those poems is a joy.
My Gosh!!! So different and so much meaning offered…wow. Great.Regards.