“ఏంట్రా కోటిగా..ఏంటి చూస్తున్నావ్?’’
ఎక్కడో దూరం నుంచి ఎవరో సన్నగా పిలుస్తున్నట్టు కోటేశ్వర్రావు అటూ ఇటూ చూశాడు. అది మనిషి పిలుస్తున్నట్టుగా లేదు. కాని పిలుపు మాత్రం స్పష్టంగా వుంది. అప్పుడు తను నేషనల్ జాగ్రఫీ ఛానెల్ లో రకరకాల జంతువులను చూస్తూ ఆనందిస్తున్నాడు.
‘’ అద్దంలో బొమ్మ నిజం కాదురా. నిజాన్ని నీ చేతులతోనే తుడిచేస్తావ్. అబద్ధాన్ని నీ ప్రాణంగా ప్రేమిస్తావ్. ఇదేంట్రా?’’
ఈ సారి కంగారే పడ్డాడు కోటి. తేరిపార చూశాడు. గోడంత టీవీ మీద పిడికెడంత పిట్ట కనపడింది. ‘’అది టీవీలో వుందా? నిజంగా వుందా?’’ కొంచెం మీమాంసలో పడ్డాడు. ‘’ కాదు. నిజమే. ఇదేమిటి ఇప్పుడు నేను విన్న మాటలు ఈ పిట్ట అన్నదా? ఛా. అదేం మాట్లాడుతుంది? నాలో నేనే అనుకున్నానేమో.’’ ఇలా ఆలోచిస్తూ ఆ పిట్టనే తదేకంగా చూస్తూ వుండిపోయాడు కోటి. ఒక పసిపాప బిగించిన పిడికిలంత ఉంటుంది ఆ పిట్ట. కాని దాని వొంటి నిండా రంగులే రంగులు. ఒకటి కాదు..రెండు కాదు..ఎన్ని రంగులున్నాయో లెక్కపెట్టాలన్న కుతూహలం కూడా కలిగింది అతనికి. నెమ్మదిగా టీవీవైపు అడుగులేశాడు. అది తుర్రుమంది. ‘’ఎటు నుంచి వచ్చింది? కిటికీ తీసి లేదు. గది తలుపు మూసే వుంది. మరి ఎలా మాయమయ్యింది?’’ ఏమిటో బుర్రగోక్కుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు.
పిట్ట గోడ మీంచి కాస్త వొంగి కిందకి చూశాడు. నేల కూడా కనిపించనంత ఎత్తులో వున్నాడు తను. ఏం కనిపిస్తుంది? ఏదో పొరపడ్డానులే అనుకున్నాడు. నగరాన్ని తదేకంగా చూస్తున్నాడు. అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని తాకుతున్న హర్మ్యాల మీద దొర్లుకుంటూ నగరానికి అటు వైపు వాలిపోయే పనిలో ఉన్నాడు. కొంచెం గర్వంగా కోటేశ్వర్రావు ఫీలయ్యాడు. ‘సూర్యుడు తప్పనిసరిగా మా భవనం మీదుగా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పడే వుంటాడు పాపం. ఎందుకంటే మా మేడ అంత ఎత్తయినది కదా..!’ఇలా అనుకోవడం అతని రోజువారీ సరదా. మేడ కాదు, తనే అంత ఎత్తుకి ఎదిగానని ఆ గర్వం. ఇంతలో మళ్ళీ పిలుపు..
‘ ఏమిరోయ్ కోటీ..నగరం చుట్టూ అడవులెక్కడున్నాయో చూస్తున్నావా?’ ఈ సారి అదిరిపడ్డాడు. ఎవరది నా మనసులో మాట పట్టేశారు? అనుకుంటూ పిట్ట గోడ మీద చూపులు సారించాడు. తన చుట్టూ తాను తిరుగుతూ పిట్ట గోడనంతా పరిశీలనగా చూశాడు. దీర్ఘ చతురస్రాకారంలో వున్న బాల్కనీని మొత్తం దీర్ఘంగా పరిశీలించాడు. పిట్ట గోడ మీద ఒక మూలన ఒక చిన్ని పిట్ట తప్ప మరేమీ లేదు. అదే పిట్ట. దాన్ని చూడగానే అతని మనసు మళ్ళీ ఉల్లాసపడింది. మరోసారి దాన్ని పట్టుకోవాలని కోటి చాలా చలాకీగా ప్రయత్నించాడు. కుదరలేదు.
అలా చాలా రోజులుగా నడిచింది. కోటేశ్వర్రావు ఏకాంతంలో పిట్ట వాలడం ఆనవాయితీగా మారింది. ఇంత చిన్ని పిట్ట కోసం ఇంత ఇదైపోవడమేంటి? అదేంటో కోటేశ్వర్రావుకే తెలియాలి. పేరులోనే కాదు..తనకెన్ని కోట్లున్నాయో తనకే లెక్క తెలీనంత కోటీశ్వరుడు. తలుచుకుంటే కొండమీద కోతినే కాదు కొండను కూడా తన దగ్గరకు రప్పించుకోగల దమ్మున్నవాడు. నగరంలో ఇలాంటి అపార్టుమెంట్లు తనకు ఎన్ని వున్నాయో చెప్పమంటే ఠపీమని చెప్పలేడు. అంతటి వాడు ఈ బుజ్జి పిట్ట మీద మనసు పారేసుకున్నాడు. రోజూ ఉదయమే దాని కోసం తప్పని సరిగా ఎంత పని వత్తిడి ఉన్నా బాల్కనీలో కూర్చుంటాడు. అది కూడా ఇంకేం పనిలేనట్టు అదే సమయానికి అక్కడ వాలుతుంది. దాని రంగులు లెక్కపెట్టాలని కొంచెం దగ్గరగా వెళ్తాడు. అంతే అది తుర్రుమంటుంది. అంత ఎత్తునుంచి అలాగే చూస్తుండి పోతాడు. ఇది రోజు వారీ తతంగమే.
అదో 21 అంతస్తుల అపార్ట్ మెంట్. దాంట్లో కోటేశ్వర్రావు ఫ్యామిలీ ఇరవయ్యో అంతస్తులో వుంటుంది. ఇరవై ఒకటో అంతస్తు కూడా అతనిదే. అయిదు వేల చదరపుటడుగుల ఫ్లాట్ అది. చివరి రెండు ఫ్లాట్లనీ కలిపి డూప్లెక్స్ లాగా తనకు కావలసినట్టు నిర్మించుకున్నాడు. చిట్టచివరి ఫ్లాటులో స్విమ్మింగ్ పూల్, బార్, కాన్ఫరెన్స్ హాలు, అతిథులకు స్పెషల్ రూంలు వుంటాయి. ఆ పైనాతి పై అంతస్తు బాల్కనీలో తనకిష్టమైన మొక్కలు పెంచుతున్నాడు. అవి మనమెప్పుడూ చూడనివి. ఏవేవో దేశాలు తిరిగినప్పుడు ఏవేవో వింతవింత మొక్కలు తీసుకొచ్చి కుండీల్లో పెడతాడు. స్వదేశీ విదేశీ గెస్టులకు ఆ మొక్కల గురించి ఎంతో ప్రేమగా వివరించడం కోటేశ్వర్రావుకి చాలా ఇష్టమైన పని. వచ్చేపోయే అతిథులు అతని ప్రకృతి ప్రేమకు మురిసిపోయి మెచ్చుకుంటూ వుంటే తెగ ముచ్చట పడిపోతాడు. ప్రకృతి అంటే తనకు ఎంత ప్రాణమో అందరూ గుర్తించాలని కోరిక. కాని పైకి..పైపైకి ఎదగాలంటే ప్రకృతిని తొక్కుకుంటూ పోవడం కూడా అనివార్యమని అతని వాదన. అదిగో అప్పుడే సరిగ్గా అతనికి పిట్ట కనిపిస్తుంది. ఏవో మాటలు వినిపిస్తాయి.
‘’ ఏరా..కోటీ..నీ చుట్టూ ఉన్న ప్రకృతిని నీ చేతులతోనే నాశనం చేసి..నీ ఇంట్లోనే ప్రకృతిని కట్టిపారేస్తావా? మట్టి కుండీల్లో..గాజు తొట్టెల్లో మొక్కలు పెంచుతావు. అద్దాల తెర మీద అడవుల్నీ..సరస్సుల్నీ..చెట్లనీ చూసి ఆనందిస్తావు. ఏంట్రా కోటీ? ఇదేమన్నా సబబా చెప్పు? ఐ లవ్ యూ రా కోటి.బట్ ఐ హేట్ యూ రా కోటి. లవ్ హేట్ రిలేషన్ షిప్ మనది.’’ ఇలాంటి మాటలు వినిపిస్తాయి. కలవరపడి తన చుట్టూ ఉన్న జనాన్ని చూస్తాడు. ఎవరూ ఏమీ పట్టించుకోరు.
కోటేశ్
ఒరే కోటీ.. అభివృద్ధి కావాలంటే అందాలు వదులుకోవాలా? కొండలూ గుట్టలూ అడవులూ చూడాలంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చా? డబ్బున్న వాడికే అందాలు అనుభవించే అర్హత వుంటుంది అని కదా నీ అహం? బావుందిరా కోటి. భేష్..భేష్.. అయినా నువ్వంటే నాకెందుకో ప్రేమరా కోటి. చచ్చేంత ప్రేమ. నలిగిపోతున్నావురా. చేసేది తప్పేమో అని పీకులాట మనసులో. చేయక తప్పదని నీ వాదన. లంగరు కుదరడం లేదు. పొంతన పొసగడం లేదు. నీలో నేనున్నానేమో అని నా అనుమానం. నీలో పక్షి మీద నా ప్రేమ. నువ్వు మనిషివి కాబట్టి నా ద్వేషం.
ఈ మాటలు వినగానే కంగారుపడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. పిట్ట మాట్లాడుతున్నట్టే వుంది. లేక తానే పిట్టలో ఉన్నానేమో అనుకున్నాడు. పిట్టగోడ మీద మళ్ళీ పిట్ట ప్రత్యక్షం. ఈసారి దాన్ని తాకాలని పట్టాలని నేలమీద పడుకుని పాకుతూ వెళ్ళాడు. ఒకటే నవ్వు వినిపించింది. మనిషి పక్షి గొంతులో కూర్చుని నవ్వుతున్నట్టుగా వుంది. పిట్టగోడ వారగా పాకుతూ దాని దగ్గరగా వెళ్ళాడో లేదో అంతే అది తుర్రు. ఎంత కష్టమొచ్చింది పాపం కోటిబాబుకి..
కొండనైనా కొనేస్తాడు. అడవినైనా ఆక్రమించేస్తాడు. ఇప్పుడు తానున్నది కూడా అలా ఒక చిన్నపాటి అడవిని నరికి కట్టిందే. ఒక్కడే అడవిలో కడితే వర్కవుట్ కాదని, తనతో పాటు కొందరు చిన్న చిన్నరియల్టర్లను పోగేసి, ప్రభుత్వ అధికారులకు కావలసినంత ఎర వేసి, పాలకులను పట్టేంత వల వేసి ఈ అడవిని స్వాధీనం చేసుకున్నాడు. బుల్ డోజర్ల దెబ్బకి కింద అనాథ గుడిసెలూ..చెట్లూ..చెట్ల మీద గూళ్ళూ అన్నీ ఒక్క రాత్రిలో మటుమాయం.
“’నీ కళ్ళు ప్రకృతి అందాలు కోరుకుంటున్నాయి. నీ దేహం..నీ మనసు సుఖాలు కోరుకుంటున్నాయి. నీకు తెలుసు. నువ్వు తప్పు చేస్తున్నావని. అయినా ఏం చేస్తావు చెప్పు. నువ్వు నీ అధీనంలో లేవురా అందుకే నువ్వంటే నాకిష్టం. ఎలాగైనా గట్టెక్కాలి. నువ్వెలాగైనా ఈ అయోమయం నుంచి గట్టెక్కాలి.’’
సడన్ గా ఇలాంటి మాటలు వినిపిస్తాయి. ఏదో రంగుల రాట్నం ఎక్కినట్టు గిర్రున తిరుగుతాడు. లేదు. అతని బుర్రే అలా తిరుగుతుంది. అప్పుడు ఎటు చూసినా పిట్టే కనిపిస్తుంది.
ఏమైనా ఆ పిట్టను పట్టుకోలేనా? దాని రంగుల్ని చేత్తో తడిమి చూడలేనా? కసి పెరిగిపోతోంది కోటేశ్వర్రావుకి. తలచిందే తడవుగా కొందరు పని మనుషుల్ని కూడా బాల్కనీలోని కుండీల్లో పెరిగిన పెద్ద పెద్ద మొక్కల చాటున నక్కి వుండేలా ఏర్పాటు చేశాడు. పక్షుల్ని పట్టుకునే నిపుణుల్ని రప్పించాడు.
“ ఏరా నువ్వేంట్రా..రాత్రి ఎన్ని గొప్పలు చెప్పుకున్నావ్? నీ అతిథులకు ఎన్ని అబద్ధాలు చెప్పావు? నీకు ప్రకృతి అంటే ప్రాణమా? అది నిజమే. కానీ ప్రకృతిని ధ్వంసం చేయడమన్నా కూడా ప్రాణమే కదా. అది చెప్పవే మరి? అయినా నిన్ను చూస్తే నాకు జాలేరా. ఎందుకో తెలుసా? నిజం చెప్తున్నానని అబద్దం చెప్తావు. అబద్ధం చెప్తున్నానని తెలిసి అది నిజమేననుకుంటావు. పైకి ఒకటి మాట్లాడతావు. లోపల ఒకటి అనుకుంటావు. అందుకేరా నువ్వంటే జాలి నాకు.
ఈ మాటలన్నీ స్పష్టంగా వినపడ్డాయి. కాని మనుషులు మాట్లాడుతున్నట్టు లేదు. మానవ భాషే మరి. ఇదేం విచిత్రం. తను పిట్ట కోసం నియమించిన మనుషుల వంక చూశాడు. వాళ్ళు పిట్ట జాడకోసం కళ్ళు నిక్కించి..చెవులు రిక్కించి బొమ్మల్లా చూస్తున్నారు. చుట్టూ చూశాడు ఎవరూ లేరు. ఎవరైనా ఏమైనా మాట్లాడారా? అని అడిగాడు. ‘ ష్ష్..సప్పుడు చేయకండి సారూ. పిట్ట రాదు..‘ ఇంట్లో పనివాడు నెమ్మదిగా అన్నాడు. “ నాలోంచే ఎవరో మాట్లాడుతున్నారా? లేక నేనే పశ్చాత్తాపపడుతున్నానా?నన్ను నేను తిట్టుకుంటున్నానా? ఏమో కాబోలు. అచ్చం సినిమాల్లోలా జరుగుతోంది ఏమిటో..ఇంతకీ పిట్టేమైంది? ఇలాంటి మాటలు వినిపించినప్పుడల్లా పిట్ట కనిపించేది. ఈ సారి కనిపించలేదేం? దీని తస్సాదియ్యా. ఏమైనా దీన్నివాళ పట్టాల్సిందే.’’
ఎందుకైనా మంచిదని అందరినీ దగ్గరకు పిలిచి మీరంతా పొండి. దాని సంగతి నేను చూసుకుంటాన్లే అన్నాడు. వాళ్ళంతా అలాగేనయ్యా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఒకసారి చుట్టూ తిరిగి పిట్టగోడ చుట్టూ పరికించాడు. అంతలో భుజం మీద ఏదో వాలినట్టనిపించింది. పిట్టే. పట్టుకుందామని చేయి ఎత్తాడో లేదో తుర్రుమంది. డిష్ యాంటినా మీద వాలి ఒకటే నవ్వడం మొదలుపెట్టింది. నిజానికి అది నవ్విందో అలా అని తనే అనుకుంటున్నాడో అంతా అయోమయం.
ఈ అనుమానం తనకే వచ్చిందా లేక తనలో ఉన్న మరొకడికి వచ్చిందా? ఆ మరొకడు మనిషా..పక్షా..? ఇది మరో అనుమానం. ఏ పనిలోనూ తనకు ఇంతవరకూ అపజయమే లేదు. పట్టుకోవాలన్నది చేతికి చిక్కకుండా పోయిందీ లేదు. మరి ఈ పిట్టేమిటి?అసలు ఇది పిట్టేనా పిశాచమా? నన్ను వెంటాడుతోందా? ఎందుకు నేనేం చేశాను?చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఈ పిట్టను తాను మొదటిసారి చూసిన సందర్భం గుర్తుచేసుకున్నాడు.
కోటి ఎంతో ఇష్టంగా తానిప్పుడుంటున్న ఈ ఆకాశ హర్మ్యం కట్టడానికి అక్కడ చెట్లు అన్నీ కొట్టేయాల్సి వచ్చింది. ఒక చెట్టుకున్న గూటిలో పక్షి గుడ్లు రాలి టపటపా చితికిపోయాయి. రంగురంగుల పిట్ట ఒకటి ఆ చితికిన గుడ్ల చుట్టూ తిరిగి తిరిగి ఏదో కూసుకుంటూ ఎటో ఎగిరిపోయింది. అక్కడి పనివారితో పాటు ఆ దృశ్యాన్ని కోటేశ్వర్రావు కూడా చూశాడు. “ అవును అదే పిట్ట. నా మీద కక్షగట్టిందా? నన్ను చంపాలని చూస్తోందా? ఆఫ్టరాల్ గోళీకాయంత లేదు. అదేం చేస్తుందిలే. ఏమో దానికేమైనా శక్తులున్నాయేమో.“ భయమన్నదే లేని కోటేశ్వర్రావు తొలిసారి భయపడ్డాడు. పదుల సంఖ్యలో పనివాళ్ళున్నారు. మీట నొక్కితే పైకొస్తారు. పిలుద్దామా అనుకున్నాడు.
“ ఎవరూ రారు. అవసరానికి ఎవరూ రారు గుర్తుపెట్టుకో.” ఇలా వినిపించింది. దానితో పాటు ఒక భయంకరమైన నవ్వుకూడా వినిపించింది. అది మనిషి నవ్వులా లేదు. ఈ పిట్టే నవ్వుతోందా? ఆ నవ్వు వింటే ఒకసారి జరిగిన ఘటన గుర్తొచ్చింది. ఒకసారి ఈ మేడ కట్టిన కొత్తలో వరద వచ్చింది . అప్పుడేమైంది? కొంచెం కొంచెం వరద నీరు ముంచుకొస్తే తానొక్కడే ఇదే అంతస్తులో కూర్చున్నాడు. ‘ నాకేం కాదు. నేనున్నది ఆకాశంలో నన్ను తాకేది ఎవరు?’ అనుకుని ధీమాలో ఉన్నాడు. ఇంతలో కరెంటు పోయింది. జనరేటర్ వేయడానికి మనిషి లేడు. అందరూ పారిపోయారు. సెల్ పనిచేయలేదు. ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని అంతస్తులన్నీ నడుచుకుంటూ కిందికి దిగాడు. అదృష్టం బావుండి తన పెళ్ళాం పిల్లలు ఏదో ఊరు వెళ్ళారు. అప్పటికే నీరు సెల్లారు నిండి గ్రౌండ్ ఫ్లోర్ పైకి చేరింది. తనకు ఈత వచ్చు కాబట్టి బతుకు జీవుడా అని ఈదుకుంటూ పోయి బతికిపోయాడు. తన ఖరీదైన కార్లూ.. వందలాది పరివారం..ఏదీ అక్కరకు రాలేదు. నీళ్ళలో దిగితే కట్టుకున్న బట్టలు అడ్డు తగులుతాయి అని అన్నీ విప్పేసి కట్ డ్రాయర్ తో నీళ్ళలోకి ఉరికి పారిపోయాడు. ఏ చెట్టయినా వుంటే ఒక కొమ్మయినా పట్టుకుని ఈదులాడాలని చాలా కలవరపాటుతో వెదికాడు . కానీ అక్కడున్న చెట్లన్నీ మాయం చేసింది తనేగా. తాను మాయం చేసిన చెట్లే వరద రూపంలో వచ్చాయా అని అంత ప్రమాదంలో కూడా ఒక క్షణ కాలం అనుకున్నాడు. అప్పుడే..సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. యస్. గుర్తుంది . ‘’ ఆ నవ్వూ ఈ నవ్వూ ఒకలానే వుంది. అవును ఈ పిట్టే అప్పుడు కూడా నా వెంటపడి నన్ను వరద నీటిలోకి నడిపించివుంటుంది.’’
ఒళ్ళంతా తడిసిపోయింది కోటేశ్వర్రావుకి. పిట్ట గోడ మీద రంగురంగుల పిట్ట. ఈ మాటలు మాత్రం పిట్టే మాట్లాడిందని ఖచ్చితంగా నిర్ధారించేసుకున్నాడు. అందుకే ఇప్పుడా పిట్టలో అతనికి రంగులు కనపడ్డం లేదు. రాకాసి నలుపొక్కటే కనపడుతోంది. పెంచుకోవాలనుకున్న పిట్టను చంపేసి మందులో నంచుకోవాలన్నంత కసి పుట్టింది. ఏమైనా పిట్టను పట్టి కోసి అతిథుల్ని పిలిచి ఒక్కో ముక్కా రుచి చూపాలనుకున్నాడు. పిట్టగోడ మీద పిట్ట నవ్వుతూ అతన్నే చూస్తోంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని వైపే వెళ్ళాడు కోటి. దగ్గర దాకా రానిచ్చి అది మరో చోట ప్రత్యక్షమవుతోంది. దా..దా..అంటున్నాడు. బుజ్జీ బజ్జీ..చిన్నీ చిట్టీ అని ఊరిస్తున్నాడు. అది మరో చోటకి ఎగిరి కూర్చుంటోంది. చూస్తుంటే అది రా రా అని పిలుస్తున్నట్టు అనిపించింది కోటికి. అటూ ఇటూ ఎగిరి పిట్టగోడకు ఆనుకుని వున్న వాటర్ టాంక్ అంచున వాలింది పిట్ట. కోటిబాబుకి పట్టుదల దెయ్యంలా పట్టింది.
రారా కోటి..రా. నీలో నా అంశ వుందిరా. నువ్వు సగం పక్షివి.సగం మనిషివి. అందుకే నిన్ను గట్టెక్కించాలి. నీలో ఈ దు:ఖం నుంచి ఈ అయోమయం నుంచి ఈ స్వార్థాలు..ద్వేషాలు..విధ్వంసా
నిజమేనా తనలో పక్షి వుందా? నిజంగా తనంటే తనకే ఇష్టం లేదా? తను చేస్తున్న పనులంటే తనకే అసహ్యమా? మరి మార్గం ఏమిటి? పక్షి నన్నెందుకు పిలుస్తోంది? లేదు పక్షి పిలవటం లేదు. నాకలా అనిపిస్తోంది. నాలోనే పక్షి వుందేమో. అదే మాట్లాడుతోందేమో.
నెమ్మదిగా పిట్టగోడ మీదకి ఎక్కాడు. అమాంతం పిట్టను పట్టాలనుకున్నాడు. పంతం నెగ్గలేదు. అమాంతం అంత పై ఎత్తు నుంచి కిందకి పడిపోయాడు. తనలో ఉన్న పక్షి బయటకు వచ్చి తనను ఎటో ఎగరేసుకుపోతోందనుకున్నాడు. అంతే ఇంక తనకేం తెలియదు.
ఇంతకీ పిట్టను చూసినప్పుడల్లా తనకు ఏవో మాటలు వినిపించేవి కదా.. అవి పిట్ట మాట్లాడిందా లేక తనలోని మరో తను మాట్లాడాడా? అన్న అనుమానం మాత్రం తీరనే లేదు. ప్రకృతి అందాలు చూడ్డానికి ఎంత ఎత్తుకో వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు. మెట్టు మీద మెట్టు కట్టాలనుకున్నాడు కట్టాడు. ఎంతో ఎత్తు నుంచి కొండల్నీ కోనల్నీ చూడాలనుకున్నాడు. వాస్తవానికి తాను చూడాలనుకున్నది నిజాన్నా? అబద్ధాన్నా? మృత్యువునా? జీవితాన్నా ఏమో అతనికేం తెలియనే లేదు.
*
ఒక పక్షితో, ఒక పాత్రతో కథను అద్భుతంగా నడిపించారండీ! కథ చాలా నచ్చింది. కొన్నిసార్లు మన మనసుకే మనం సమాధానం చెప్పలేని పరిస్థితి అనుభవంలో కొస్తుంది. ఆ స్థితిని కధనంలో చక్కగా అల్లి చూపించారు. ధన్యవాదాలు!
thank u siva lakshmi garu
జంతువులు పక్షులని పాత్రలు చేసి మంచి కథలు రాస్తున్నారు సర్…ఇంతకుముందు కుక్క ను పాత్రను చేసి మీరు రాసిన కథ చదివాను సర్…శిల్పం…కథనం…సహజంగా.. హృద్యంగా ఉంటున్నాయి సర్..మీరు రాసిన కథలు అన్నీ చదవాలని ఉంది సర్…
Thank you sir. My story book is coming soon
కథ చాల అధ్బుతంగా వుంది . సారంగకు కృతఙ్ఞతలు ఇంత మంచి కథ అందించినందుకు .మంచి సదేశం .చక్కని శైలి .పాత్రలు గోప్పగున్నాయి .