సంస్కరణ వెర్సస్ నిర్మూలన-2

గు మాత్రపు చైతన్యం లేనప్పుడు సామాజికంగా పైకి వచ్చే క్రమంలో పై వర్గాన్ని అనుకరించే అకల్టరేషన్ సంస్కృతి అనివార్యమేమో.  ఉద్యోగాలు చేసుకునే దళితులు తమ కుటుంబాలతో సహా ఇన్నాళ్లూ తమని దూరంగా వుంచిన మతాచారాలలో పాల్గొనటాన్ని సమాజంలో తమ ఉన్నతీకరణగా భావించటాన్ని నేను ప్రత్యక్షంగా చూసాను.  వాళ్ళకి ఇన్నాళ్ళు తమని తరతరాలుగా పీడించి అణచివేసినది ఈ మతాచారాలే అన్న భావన కంటే ఆయా మతాచారాలలో పాల్గొనటం ద్వారా తాము ఒక గౌరవనీయమైన సామాజిక స్థానానికి చేరుకున్నామని భావిస్తారని నాకనిపిస్తుంది.  దళితులు, బీసీ కులస్తులు అయ్యప్ప, భవానీ మాలలు వేయటాన్ని ఇలాగే చూడాలి.  అసలు అయ్యప్ప మాల ఒక ఉద్యమంగా మారటానికి ఈ భావనలే ప్రధాన కారణం అనుకుంటాను.  ప్రధానంగా బ్రాహ్మణులకి, ఇంకా కొన్ని పై కులాలకి మాత్రమే పరిమితమైన ‘స్వామీ’  అని పిలిపించుకునే సంబోధన స్టేటస్ ని అయ్యప్ప మాలధారణ ఇచ్చింది.  అందుకే కిళ్ళీ బడ్డీల వాళ్ళు, అరటిపళ్ళ బళ్ళ వాళ్ళు, హమాలీలు వంటి అల్పాదాయ, కింది కులాల వారితో కూడిన జన సమూహాలు ప్రధానంగా ఈ మాలధారణకి ముందుకొచ్చి దాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్ళారు.  దురలవాట్లు మానటానికి కూడా (తాత్కాలికంగా అయినా ) ఒక ట్రీట్మెంట్లా ఈ ఆధ్యాత్మిక మాలధారణ ఉద్యమాలు పనికొచ్చాయనేది ఒక వాస్తవమే కానీ అదొక్కటే కారణం కాదు.  ఈ మాల ధారణ ఉద్యమ ప్రధాన పోషకులు మాత్రం అల్పాదాయ వర్గాల వారే.  ఆధిపత్య కులాల వారు కూడా ఈ మాల ధారణకి పూనుకోవచ్చు కానీ వారిలో అధిక భాగం గురుస్వాములుగా ఎదగటం మనం గమనిస్తాం.  గురుస్వామి అంటే మళ్ళీ అదో ఆధిపత్య చిహ్నం.  అందులోని ఆర్ధికాంశాన్ని కూడా కొట్టేయలేం. కులాధిపత్యం ఇక్కడ కూడా తన అడ్వాంటేజియస్ పొజిషన్ని వదులుకోలేదు.

గవర్నమెంట్ ఆఫీసుల్లో పని చేసే ఎస్.సి./ఎస్.టి. అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుతుంటారు.  వారు ఒక ట్రేడ్ యూనియన్ హక్కుల్ని పొందుతుంటారు.  అయ్యప్ప మాల వేసిన డివిజనల్ సెక్రటరీ అంబేద్కర్ వర్ధంతినాడు ఉపన్యాసమివ్వటం చూసి చాలా ఆలోచించాల్సి వచ్చింది.  అంబేద్కర్ ఫోటోకి దండ వేసి కొబ్బరికాయ కొట్టి, ఊదొత్తులు వెలిగించి నాలుగు చప్పట్లు కొట్టడం తప్పితే వాళ్ళు చేసేదేమీ లేదు.  వాళ్ళకి సంబంధించినంత వరకు అంబేద్కర్ తమకు రిజర్వేషన్లు ఇప్పించాడనే అనుకుంటారు.  అంతేకానీ హిందూ మత దౌష్ట్యం గురించి, కుల దుర్మార్గం గురించి, కుల నిర్మూలన గురించి అంబేద్కర్ ఏం చెప్పాడనేది, ఆయన ఆవేదన ఏమిటనేది వాళ్ళకి పెద్ద పట్టదని నాకనిపించింది.  వారికున్న సోషల్ ఎడ్యుకేషన్ పట్ల చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది.   హిందూ మతం తన మీద తిరుగుబాటు చేసిన మతాల్ని తనలో కలిపేసుకున్నట్లే హిందూత్వ భావజాలాన్ని నమ్ముకునే రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ని కీర్తిస్తున్నాయి.  ఆ రకంగా తమకి అంబేద్కర్ భావజాలానికి వైరుధ్యం లేనట్లు కలర్ ఇస్తాయి. ఈ విషయం పట్ల దళిత కార్యకర్తలు జాగరూకతతో వుండాలి.
****

ఇంతకుముందు అనుకున్నట్లు మతం సంస్కరణలకి అతీతం కాదు. అయితే ఒక్కోసారి సంస్కరణల రూపంలో వంచన కూడా ఎదురవుతుంటుంది.  అందులో భాగమే దళితుల ఆలయ ప్రవేశం, దళిత గోవిందం, దళితుల్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని బ్రాహ్మణ పురోహితులు ఆలయ ప్రవేశం చేయించటం వంటివి.  ఈ మాత్రం సంస్కరణలు చేయకపోతే తన బరువు తానే మోయలేక అంతరించిన డైనోసార్లకి పట్టిన గతే హిందూ మతానికి పడుతుంది.  అయితే ఇటువంటి వాటిని కులాన్ని రూపుమాపగల నిజమైన మత సంస్కరణలుగా భావించలేం.  దళితులకి ఆలయ ప్రవేశం అంటే కుల నిర్మూలన జరిగినట్లు కాదు.  పూజారి దళితుడిని భుజం మీద మోసాడంటే పూజారి ఆహార్యంలోనే మోస్తాడు. అంటే దానర్ధం పూజారి వుంటాడు, అలాగే దళితుడూ వుంటాడన్న మాట.  ఒకడు మరొకడిని మోయటమే ఆధిపత్యాన్ని శాశ్వతీకరించటం.  అలా మోసేవాళ్లనీ, మోయించబడే వాళ్లనీ ఏదో ఉదహరణాత్మకంగా, తాత్కాలికంగా రివర్స్ చేయించటం కులాన్ని శాశ్వతీకరించటమే.  ఎంతైనా పంతులుగారే గొప్పవాడవుతాడు.  హిందూ మతంలో హెచ్చుతగ్గులేం లేవనే అబద్ధాన్ని సృష్టించటం దీని ఉద్దేశ్యం.  కుల వ్యతిరేక చైతన్యం మీద నీళ్ళు చల్లే, తాయిలాలు పంచిపెట్టి, మభ్యపరిచే వ్యూహంగానే ఇది చూడాలి.

****
హిందూ మత సంస్కరణ ఒక్కటే కులాన్ని నిర్మూలించలేదు.  కుల రహిత సమాజానికి సంస్కరణ ఒక్కటే సరిపోదు.  అంతకు మించిన సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ దృక్పథముండాలి.   ఆధిపత్య భావజాలాల కారణంగా మనది నిచ్చెన మెట్ల  సమాజమంటారు కానీ నిజానికి ఇది ‘పిరమిడ్’ నిర్మాణం లాంటిది.  కింద భాగంలో వున్న మెజారిటీ కులాలకి చెందిన ప్రజలకి వనరుల మీద హక్కు లేకపోగా పైకి పోతున్న కొద్దీ జనాభా వున్న కులాలవారికి వనరుల మీద ఆధిపత్యం ఎక్కువ వుంటుంది. అందువలన కులానికి, సంపదకి మధ్యనున్న అనుబంధం ముఖ్యమైనది.   వనరుల మీద, సంపద మీద హక్కుల వ్యత్యాసాన్ని సంస్కరణలతో తీసేయటం సాధ్యమా?  ఈ విషయాన్ని అడ్రెస్ చేయకుండా కుల నిర్మూలన సాధ్యం కాదు.

మనది మెజారిటీ హిందూ మతస్తుల దేశం.  ఆయితే హిందూ మతస్థులకి, రాజకీయ హిందూత్వ వాదులకి ఖచ్చితమైన తేడా వుంది.   తాను హిందువునని నమ్మిన ప్రతి వ్యక్తి హిందూత్వవాది అయ్యుండాలని రూలేం లేదు కానీ ఐతే ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ శక్తుల విజృంభణ నేపధ్యంలో హిందూత్వ వాదుల సంఖ్య పెరుగుతూనే వుంది.  ఒక క్రమంలో భారతదేశంలో చారిత్రికంగా నిలబడిన సెక్యులర్ ఫాబ్రిక్ ఘోరంగా దెబ్బ తింటున్నది.  హిందువుల్ని భయపెట్టి పెట్టుబడిదారుల్లోని అతివాద రైట్ వర్గానికి వోట్ బాంక్ గా మార్చుకోవటమే హిందూత్వ రాజకీయం.  ఈ ఎరుకని, చైతన్యాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఇవ్వటమే ఆలోచనాశీలుర ప్రధాన కర్తవ్యం.

****

ఇది చర్చ మాత్రమే.  తీర్మానమేమీ కాదు.  మరంచేత ప్రశాంతంగా ఘర్షణ పడదాం.  సరేనా?

****

 

అరణ్య కృష్ణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆవేదన ఎక్కువ అధ్యయనం తక్కువ అనిపించింది. సూత్రీకరణలు చాలానే ఉన్నాయి కానీ వాటి వెనుక బలం ఉన్న దాఖలాలు లేవు. భారతదేశంలో (అంటే 47 తర్వాతే) సెక్యులర్ ఫాబ్రిక్ బలంగా నిలబడింది అన్నాం అంటే కాంగ్రెస్ ని ఎత్తినట్టే. కాంగ్రెస్ మతం కుదురు లోనే బతికిందనడానికి వేల దాఖలాలున్నాయి. సాధారణ అభిప్రాయం కాకుండా నిర్దుష్టంగా రాయడం ప్రయోజనకారి

    • 1947 తరువాత సెక్యులరిజం పరిఢవిల్ల్లిందనలేదు కదా కాంగ్రెస్ పాలనలో. మతాన్ని అవసరమైన చోటల్లా కాంగ్రెస్ వాడుకున్న మాటమే నిజమే కానీ అది బీజేపిలా మతమే ఏకైక అజెండా కలిగిన పార్టీ కాదు. అన్నింటినీ ఒకే గాటన కట్టడం సరైంది కాదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు