రెండు నుంచి చీలి
ఒకటిగా మిగలడమంటే
గాలికి
ఊపిరాడకపోవడం,
నీటికి
దాహం తీరకపోవడం,
నిప్పుని
నీరు ఆర్పలేకపోవడం,
రాలే
ఉల్క నుంచి రవ్వలు
వెనుదిరిగి రివ్వున ఎగిరిపోవడం,
సముద్రమంతా ఇంకి
చేపలు హఠాత్తుగా ఎండిపోవడం,
రహదారి నుంచి విడిపోయిన కాలిబాట ఒక
రక్కసి కోనలోకి దారితీయడం,
బొట్టు అస్తమించి
నుదురు పొద్దులేని నింగిలా మారిపోవడం,
ఏడాదులూ నెలలూ
రోజులూ గంటలూ
నిముషాలూ క్షణాలూ
అన్నీ ఏకమైపోయినట్టు,
గాలీ నీరూ నింగీనేలా
నీరూ నిప్పూ అన్నీ కలగలిసి
ఒక్కటిగా, ఆ ఒక్కటీ నేనుగా
ఇప్పుడిలా శేషమయినట్టు
అవశేషమయినట్టు;
ఒక రెండు నుంచి చీలి
ఒక ఒకటిగా మిగలడమంటే
మూల్యరహిత పూర్ణమయినట్టు,
సంపూర్ణమైనట్టు.
అల్లాడేటప్పుడు..
అల్లాడడమంటే యేమిటో
చెట్టు కొమ్మ నుంచి
తెగి రాలుతున్న ఆకునడుగు,
మడుగులో గాలాన్ని
మింగి తన్నుకులాడుతున్న చేపనడుగు,
కరెంటు తీగకి తలకిందులుగా
వేలాడుతున్న ఒంటరి పావురాయినడుగు,
అప్పటి దాకా మండి
ఆరిపోతున్న నిప్పుకణికనడుగు,
కోడెనాగునోటికి
చిక్కి ఆఖరి శ్వాస తీసుకుంటున్న అడివిపిల్లి కళ్లనడుగు,
సాలెపురుగు
అనితరసాధ్యంగా అల్లిన ఉరి ఉచ్చులో
ఊపిరి వదులుతున్న కరుణకోరే కీటకాన్నడుగు,
రేయంతా కాచికాచి
పగటిపొద్దులో గుప్పెడు వెండి మట్టిలో కలిసిపోతున్న
వెన్నెలనడుగు,
అల్లకల్లోలంగా ఏటిమీద
ఎంతపొర్లినా ఏడుపు ఆగని
ఏడేడు లోకాల వేడిగాలి విసురునడుగు,
అల్లాడటమంటే యేమిటో
ఆమెని కోల్పోయి
అహర్నిశలూ నశిస్తున్న నన్నడుగు.
(డాక్టర్ పాలేరు శ్రీనివాస్ కి, ప్రేమతో, ఈ రెండు పద్యాలు)
చిత్రం: సత్యా సూఫీ
*
రెండూ తాత్వికత గాఢతను నింపుకున్న కవితలు. కాలంపై దేవిప్రియ గారి సంతకాలు. వాక్యాల్లో సరళత నచ్చింది.
వెచ్చని స్పర్శతో తప్ప వేరే ఏ విధంగానూ కుదరని స్పందన తెలపడం ఎలా అని సతమతమవుతున్నాను.
పరిపూర్ణమైన కవి, కవిత్వం.
అందించిన సారంగకు కృతజ్ఞతలు..
“రేయంతా కాచికాచి
పగటిపొద్దులో గుప్పెడు వెండి మట్టిలో కలిసిపోతున్న
వెన్నెలనడుగు”…
వర్ణింపనలవి కాని వేదనని కవిత గా మార్చడం దేవీప్రియకే సాధ్యం.
తేలికైన భాష….స్పష్టమైన భావం..లోతైన చూపు…అల్లికలో నేర్పు..వెరసి హృదయానికి హత్తుకునే దేవీ ప్రియ గారి కవిత కు వందనం
పాయల మురళీకృష్ణ
చాలా చక్కగా వ్రాసారు పెదనాన్న. అద్భుతమయిన పదాల అల్లిక, వేదనను కూడా పదాలతో పంచుకోగల ఏకైక కవి మీరు.
మీ kavithvaniki namah sumanjali ????.ఎంత lothina బాధ, ఎవరి వల్ల తీరని ఆవేదన , యేమని తీర్చగలను అంకుల్. వేదనకి అక్షర రూపాన్నిస్తూ , హృదయాలను సున్నితంగా స్పృసించటం meeke chethanavunu. ఆ భగవంతుడు మీకు prasanthathani ఇవ్వాలని కోరుకుంటున్నాను…????????????????
అనంతమైన వేదనను కవిత్వం పట్టుకుంటూ.. చేసే
ప్రయత్నం.. కవిత్వానికి ఆ శక్తి చాలునా.. దేవీప్రియ గారూ.. మీ కవిత్వం అపురూపం.. మీ వేదన అనంతం. బాహ్యంగా కనిపించే దేవీప్రీయ కు.. అంతర్ముఖు డై అన్వేషణ లో అద్భుతంగా అనంతంగా సాగిపోయే దేవిప్రియ కు సామ్యం చూడ తరమా.. అభినందనలు గురువు గారు..