ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి రచన ఒక యాత్రాచరిత్ర.
కథ కన్నా నాటకం కన్నా నవల కన్నా ఎన్నో దశాబ్దాలు ముందుగా 1838లో వచ్చిన రచన కాశీయాత్ర చరిత్ర. ఏనుగుల వీరాస్వామయ్య.
మొట్టమొదటి ఆధునిక రచన అన్నప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న వస్తుంది.
ఏదో ప్రయాణం చేసి, దాని గురించి కాసిన్ని వివరాలు రాసినంత మాత్రాన అది రచన అవుతుందా? సాహిత్యం అవుతుందా? అసలు యత్రా సాహిత్యమూ సాహిత్యమేనా?
నిన్న మొన్నటి దాకా ఈ విషయం చర్చనీయంగానే ఉంటూ వచ్చింది. నిజానికి ఈ విషయం గురించి ఎంతైనా చర్చించవచ్చు…
ప్రదేశాల వివరాలు, వింతలు, విశేషాలు, దూరాలు, కాలాలు. ఖర్చులు. కష్టాలు, గణాంక వివరాలు గుదిగుచ్చిన పక్షంలో అది యాత్రా సమాచార కరపత్రం అవుతుందే తప్ప అందులో సాహిత్య లక్షణాలు ఉండవన్న మాట నిజం.
ఒక ప్రయాణం అనుభూతి ప్రధానం అయినపుడు, అనుభవాల పరంపర అయినపుడు, ఆయా ప్రదేశాలూ మనుషులూ ఆచారవ్యవహారాలూ సంస్కృతుల, స్పందన- ప్రతిస్పందనల సమాహారం అయినపుడూ, పిపాసా జిజ్ఞాసా ఆప్రయాణానికి మూల ధాతువూ, కారణమూ అయినపుడు ఆ ప్రయాణం యాత్ర అవుతుంది. ఆ రచన సాహితీ స్వరూపం పొందుతుంది.
***
ఈ మధ్య కాలం దాకా తెలుగులో వచ్చిన యాత్రా రచనలు స్వల్పం. అందులో సాహితీ స్వరూపం పొందుపరచుకొన్నవీ ఇంకా స్వల్పం. కానీ గత ఇరవై పాతికేళ్లలో పరిస్థితి మారింది. సాహిత్యం అని చెప్పదగ్గ రచనలు అడపా దడపా కాకుండా క్రమంగా క్రమక్రమంగా తెలుగులో వస్తున్నాయి. ఇదీ సాహిత్యమే అని నిలబడి చెపుతున్నాయి. యాత్రా రచనా ఒక ప్రత్యేక సాహితీ ప్రక్రియే అని చాటగలుగుతున్నాయి. సమావేశాలు సదస్సులో పది మందీ చేరి ఈ ప్రక్రియ గురించీ దాని పరిణామం గురించీ ఆలోచించే అవసరం, అవకాశం కన్పిస్తున్నాయి.
***
1838లో వచ్చిన ‘కాశీయాత్ర చరిత్ర’ నుంచి 2018లో రెహన రాసిన ‘సరిహద్దుల్లో’ వరకూ ఈ నూట ఎనభై ఏళ్లలో అనువాదాలు కలుపుకొని తెలుగు భాషలో దాదాపు రెండు వందలు యాత్రాగ్రంథాలు వచ్చాయి. అందులో కనీసం నలభై యాభై వరకూ సాహితీ స్వరూపం సంతరించుకొన్నవి. ఇరవై పాతిక వరకూ ఇతర సాహితీ ప్రక్రియలతో సహపంక్తి స్థాయి కలిగినవి. ఐదారు తెలుగు సాహిత్యంలో క్లాసిక్స్‌గా నిలబడదగినవి.
ముందుకు వెళ్లేముందు ఒక చిన్న మాట.
ప్రపంచపు విసుగుదలల నుంచి పారిపోయేవారు గాకుండా ప్రపంచాన్ని కౌగలించుకోవడానికి ప్రయాణాలు చేసిన వారి రచనల గురించి మాట్లాడుతాను. వింతలూ, విశేషాల కోసం వెదుకులాడటం కాకుండా ప్రకృతి, మనుషుల కోసం తాపత్రయపడేవారి రచనల గురించి మాట్లాడతాను. అలా వారు పాఠకులతో చేసే మనసు మనసుల మధ్య ఊసులాట గురించి మాట్లాడుతాను.
మిగిలిన భాషల గురించి తెలియదు గానీ తెలుగు యాత్రా రచనల్లో ఒక విశేషముంది. ఆయా యాత్రల గురించి ఒక వ్యాస మాలికో, సుధీర్ఘ వ్యాసమో రాసి పుస్తకంగా ప్రచురించమే కాకుండా కథలు, కవితలు. నవలల రూపంలోనూ ఈ గ్రంథాలు వచ్చాయి. అంపశయ్య నవీన్ యాత్రానవలలూ, ఎండ్లూరి సుధాకర్ లాంటి వారి కవితా రూపపు యాత్రాకథనాలూ, వీరాస్వామయ్యగారే రాసుకొన్న దినచర్య ఆధారంగా నిర్మించబడిన కాశీయాత్రా, అత్యం నరసింహమూర్తి అనే ఆయన ఓడలో అమెరికాకు ప్రయాణం చేస్తూ భార్యకు రాసిన ఉత్తరాల యాత్రా రచన – ఇలా విభిన్న అభివ్యక్తుల్లో తెలుగు యాత్రారచనలు వచ్చాయి.
***
తెలుగులోని అనేకానేక ప్రముఖ రచయితలందరూ తమ తమ ప్రయాణాల గురించి పుస్తకాలు రాసారని చెపితే నమ్మడం కష్టమేగానీ అది వాస్తవం.
స్పందించే మనస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఏదైనా యాత్ర చేసినపుడు ఎన్నో అనుభవాలనూ అనుభూతులనూ మూటగట్టుకొని వస్తాడు. తన ప్రపంచపు పరిధి విస్తరించడం గమనిస్తాడు. తన మనస్సు విశాలమవడం గమనిస్తాడు. ఆ అనుభవాలను, ఈ ఎరుకను పదిమందితో పంచుకోవాలని తహతహలాడుతాడు. ఆ మనిషి రచయిత అయితే ఆ వివరాలను అక్షరాల్లో పొదుగుతాడు. యాత్రా గ్రంథం రాస్తాడు.
తెలుగులోనూ అదే జరిగింది.
శ్రీశ్రీ, రావూరి భరద్వాజ, మాలతీ చందూర్, ఆరుద్ర, సోమ సుందర్, డి.కామేశ్వరి, అక్కినేని నాగేశ్వరరావు, సినారె, గోపి, నాయని కృష్ణకుమారి, మధురాంతకం నరేంద్ర, కవనశర్మ, దాశరథి, బాపురెడ్డి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, వాడ్రేవు చినవీరభద్రుడు, పరవస్తు లోకశ్వర్, మాచవరపు ఆదినారాయణ, దేవులపల్లి కృష్ణమూర్తి వీరంతా యాత్రాగ్రంథాలు రాసినవాళ్లే. వీరే గాకుండా తమ జ్ఞాపకాలలోనూ, స్వీయ చరిత్రలలోనూ వ్యాసరూపంగానూ తమతమ యాత్రా వివరాలు చెప్పిన వాళ్లలో కందుకూరి, కాళోజీ, బుచ్చిబాబు, ఆచంట జానకీరాం, శ్రీపాద, టంగుటూరి ప్రకాశం పంతులు, తిరుమల రామచంద్ర, చిలకమర్తి, ఆదిభట్ల, సంజీవ్‌దేవ్, భానుమతి, టంగుటూరి సూర్యకుమారి, షేక్‌నాజర్… జాబితా అనంతం.
***
మళ్లా విషయంలోకి వస్తే…
1838-2000 మధ్య వచ్చిన ముఖ్యమైన యాత్రాగ్రంథాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ నేను పుస్తకాలుగా వచ్చిన యాత్రల గురించే చెపుతాను. జ్ఞాపకాల్లోనూ, ఆత్మకథల్లోనూ ప్రస్తావించబడిన ప్రయాణాల గురంచి మాట్లాడను. ఆది గ్రంథం కాశీయాత్ర చరిత్ర దగ్గర మొదలు పెడదాం.
మద్రాసు సుప్రీంకోర్టులో ముఖ్య దుబాసీగా పని చేస్తోన్న వీరాస్వామి 1830 మే నెలలో వంద మంది కుటుంబ సభ్యులూ, పరివారంతో మద్రాసు నుంచి బయలుదేరి ఇప్పటి రాయలసీమ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌ల మీదుగా ఉత్తరప్రదేశ్ లోని కాశీనగరం చేరుకొని తిరిగి బీహార్, బెంగాల్, ఒరిస్సా, కళింగాంధ్రా కోస్తాంధ్రాల మీదుగా మద్రాసు చేరుకొన్నారు. అంతా కలసి నాలుగు వేల అయిదు వందల కిలోమీటర్లు. పదిహేను నెలలు. కాలినడక, పల్లకి, పడవల్లో ప్రయాణం… అప్పటికింకా రైళ్లూ బస్సులూ రాలేదు.
తన ప్రయాణపు వివరాలను ఓ మిత్రునికి ఉత్తరాలుగా రాసారు. డైరీలోనూ నమోదు చేసారు. ప్రయాణం ముగిసీ ముగియగానే ఆ వృత్తాంతాన్ని వివరంగా రాతలో 480 అరఠావుల పుస్తకంగా 1831లోనే రాసారు. ఏడేళ్ల తర్వాత వీరాస్వామిగారి మరణానంతరం 1838లో మిత్రుల పూనికతో కాశీయాత్ర చరిత్ర పుస్తకంగా వచ్చింది. ఆ తర్వాత 1869లోనూ, 1941లోనూ, 1991లోనూ ముద్రణలు పొందింది. 1941 ముద్రణకు సంపాదకులు దిగవల్లి వెంకట శివరావు. 1991లో మరోసారి ముద్రింపబడిన ప్రతి ఈ మధ్యకాలంలో అందరికీ అందుబాటులో ఉన్న ప్రతి. ఒకటి రెండేళ్ల క్రితం విశాఖపట్నం నుంచి కూడా మరో ముద్రణ వచ్చిందని వినికిడి.
ధైర్యమూ తెగువా కాలినడకా మంచితనమూ సాథనాలుగా చేసుకొని పల్లెలు పట్నాలు నగరాలు కొండలు అడవులు వాగులు మహానదులు దాటుకొంటూ, దొంగలూ అడవి జంతువుల తాకిడి నుంచి తప్పించుకుంటూ, శారీరక శ్రమా అనారోగ్యాలను అధిగమిస్తూ, తన మంచితనంతో దారి పొడువునా పది మంది స్నేహ సహకారాలను పొందుతూ పదిహేను నెలలపాటు వీరస్వామయ్య చేసిన కాశీ యాత్ర రచన ఒక అధునిక ఇతిహాసమనే చెప్పాలి.
తన మార్గంలో తటస్థపడిన సికింద్రాబాదు, బందరు, నాగపూరు లాంటి నగరాలూ పట్నాల రూపురేఖలనూ అత్మలనూ ఎంతో పరిశీలనతో నైపుణ్యంతో అవగాహన చేసుకొని వివరించారు వీరస్వామయ్య. వాటి వాటి పుట్టుపూర్వోత్తరాలు సరేసరి. పల్లెలూ, పట్నాలు సరేసరి. మనుషుల వేషభాషలు, మాటతీరు, మనస్తత్వం ప్రవర్తనా కళ్లకు కట్టినట్టు చెపుతారు. దారిపొడువునా కనిపించే ప్రదేశాల భౌగోళిక సూక్ష్మవర్ణన పుస్తకం నిండా కనిపిస్తుంది. అలా అని ఆయన తన పరిశీలనను బయటకు కనిపించే విషయాలకే పరిమితం చెయ్యలేదు. దక్షిణాత్యులకూ ఉత్తరాది మనుషులకూ తేడాలు ఏమిటి, ఎందుకొచ్చాయి, ఆంగ్లేయులు ఇంత విశాల భారతాన్ని అవలీలగా జయించి పాలించడానికి కారణాలు ఏమిటి, స్త్రీలు పురుషుల భోగానికే పుట్టారా లేకపోతే పురుషుల్లాగాక జ్ఞానవంతులలై మోక్షం పొందగలరా… ఇలా అనేకానేక విషయాల గురించి ఆలోచనలు చేసి ఈ పుస్తకంలో రాసారు. అంత ఆలోచనా చేసి చివరికి స్త్రీలు లేనిపోని పురుషులు చేసే పనుల జోలికి పోకుండా, వేదాంతాలు విచారించి శుష్కవేదాంతులు అవకుండా, పతి శుశ్రూష కుటుంబ సంరక్షణల మీద దృష్టి పెట్టడమే యుక్తముగా తోచుచున్నది అన్న అభిప్రాయానికి వస్తారు. ఇంత ఉదార వ్యక్తిత్వం ఉన్న వీరాస్వామయ్య ఇలాంటి నిర్థారణకు రావడం నిజానికి ఆనాటి సాంఘిక సామాజిక పరిస్థితులకు దర్పణం. అప్పట్లో ఆ ఆలోచన చాలా మామూలుగా అనిపించి ఉండాలి. 1990లలో అదే ఆలోచన చిరాకూ కోపమూ రప్పించే అవకాశం పుష్కలం. ఇపుడయితే అదే ఆలోచన నవ్వు తెప్పిస్తోంది!!
ఈ రచనలో మరో ఆసక్తికరమైన విషయం భాష.
గిడుగూ గరుజాడల కన్నా ఎన్నో దశాబ్దాల ముందే వీరాస్వామయ్య తన అనుభవాలను అప్పటి వాడుక భాషలో రాసారు. అయినా ఆ ఈ భాష తీరూ, అప్పటి వ్యక్తీకరణా, పదజాలమూ ఇప్పటి పాఠకులకు గిలిగింతలు పెడుతుంది. ముందు కాస్త ఇబ్బంది పెట్టే మాట నిజమే. కానీ ఒక పదీ పదిహేను పేజీలు ఓపిక పడితే అదే అలవాటవుతుంది. ముందుకు నడిపిస్తుంది. అన్నట్టు పుస్తకాన్ని సంక్షిప్తమూ, సరళమూ చెయ్యలన్న ఉద్దేశ్యంతో 1992లో ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో తెలుగు యూనివర్సిటీ వాళ్లు ఆ పని నిర్వహించి ప్రచురించారు. ఇంకో విశేషం ఏమిటంటే 1883లో ఈ పుస్తకం తెలుగులో మొదటిసారి ప్రచురించడాని కన్నా ముందే తమిళ, మరాఠీ భాషల్లోకి వెళ్లింది. తమిళులు ఇదే మా మొట్టమొదటి యాత్రా గ్రంథం అంటారట.
ఒక సందర్భంలో వీరాస్వామయ్య నేను తిరిగిన ప్రతి ఊరు అన్నివిధాల సొంతము వలె తోచుచున్నది అంటారు. ఇది ఒక అచ్చమయిన యాత్రికునికి మాత్రమే కలగగల స్పందన. ఆనాటి సాంఘిక అర్థిక రాజకీయ మత సాంస్కృతిక చారిత్రక ఆలోచనలు, వివరాలు పుస్తకం నిండుగా ఉండడం వల్ల కాశీయాత్ర చరిత్ర ఒక కాలాతీత గ్రంథమయింది. ఏడెనిమిది తరాల పాటు నిలబడి మనుగడ సాగిస్తోంది. నిజానికి ఈ పుస్తకంలో కనిపించే వీరస్వామయ్య ఎప్పుడో రెండు వందల నలభై ఏళ్ళనాడు పుట్టిన చారిత్రక పురుషుడు అనిపించడు. మన కాలం మనిషి మనతో మాటాడుతున్నట్టే అనిపిస్తుంది. ఒక జిజ్ఞాసి తనలోకి తాను చేసిన ప్రయాణమే కాశీయాత్ర అన్నారు పరిశోధకులు మచ్చ హరిదాసు.
***
1846లో అప్పటి మద్రాసు గవర్నరు వేసవికాలం గడపడానికి ఉదకమండలం వెళ్ళినపుడు ఆయన పరివారంలో భాగంగా కోలా శేషాచలకవి కూడా వెళ్లారు. సుమారు ఏడు నెలలు ఆ నీలగిరి కొండల్లో గడిపారు. తన అనుభవాలను 1854లో ‘నీలగిరి యాత్ర’గా రాసారు. అది 1953లో మొదటిసారి ప్రచురింపబడింది. పర్వత ప్రాంతాలూ, విహారానుభవాల గురించి తెలుగులో రాసిన మొట్టమొదటటి పుస్తకమది.
చెళ్లపిళ్ల వెంకటశాస్తి కాశీనగరం చూడాలన్న కుతూహలంతో 1889లో కాశీకి వెళ్లారు. ఆ అనుభవాలను 1934లో రాసారు. వాడుక భాషలో రాసారు. 1948లో అది పుస్తకంగా వచ్చింది. మరో రెండు ముద్రణల తర్వాత 2012లో మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో మరోసారి వచ్చింది ఈ ‘కాశీయాత్ర’ పుస్తకం.
వీరాస్వామయ్య రోజుల్లో కాశీ వెళ్లడానికి కాలినడకే సాధనం అవగా చెళ్లపిళ్లగారి కాలానికి రైలు బండి సౌకర్యం ఏర్పడిపోయింది. వెళ్లేటపుడు రైల్లోనే వెళ్లారు. తిరిగి రావడం మాత్రం కాలినడక, స్డీమరు, జీపు, ఎద్దుబండి ఇలా అనేక అంచెలుగా ప్రయాణం సాగింది. సహజంగానే ఆ తిరుగు ప్రయాణపు యాత్ర అనుభవాల్లో వైవిధ్యం పెరిగింది. అలాగే అప్పటి కాశీనగరం గురించి, అక్కడి తెలుగువారి గురించి, విద్యావ్యవస్థ గురించి, పండిత సభల గురించి రాసిన వివరాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.
విదేశీ యాత్రానుభవాల గురించి వచ్చిన తొలి గ్రంథాలలో చెప్పుకోదగ్గవి కురుమెళ్ల వెంకటరావు 1930లో ఐరోపా దేశాలకు చేసిన యాత్రల గురించి రాసిన ‘మా మహారాజుతో దూరతీరాలు’ అన్న పుస్తకం. దాదాపు అదే సమయంలో అత్యం నరసిహమూర్తి తన అమెరికా ప్రయాణం గురించి ‘భూప్రదక్షికుడు భార్యకు రాసిన లేఖలు’ అనే పేరుతో పుస్తకంగా వేసారు. వెంకటరావుగారి పుస్తక ప్రచురణ 1966లో జరిగింది. నరసింహమూర్తిగారి పుస్తకం 1935లోనే వచ్చింది. ఈ రెండూ లేఖల మూసలోని పుస్తకాలు అవడం యాదృచ్ఛికమేనా?
***
1960లలో అమెరికా ప్రభుత్వం భారత దేశంలోని ప్రముఖ కళాకారులను సాంస్కృతిక రాయబారులుగా తమ దేశానికి ఆహ్వానించి వారికి ఇష్టమయిన పద్ధతిలో రెండు నెలల పాటు అమెరికాలో తిరిగే అవకాశం కల్పించింది. అలా అక్కినేని నాగేశ్వరరావు 1964లో అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చాక ‘నేను చూసిన అమెరికా’ అన్న పుస్తకాన్ని 1965లో ప్రచురించారు.
ఒక ప్రముఖ సినీనటుడిగా అమెరికా వెళ్లిన నాగేశ్వరరావును యాత్రా నిర్వహకులు ‘ఇక్కడ మీరు ఏం చూడదలచు కొంటున్నారు’ అని అడిగినపుడు ‘హాలీవుడ్ సినిమా రంగం గురించి మా దేశంలో చాలా మందికి అవగాహన ఉంది. అంచేత దాన్ని పరిశీలించి ప్రత్యేకంగా నా దేశం వారికి తెలియపర్చగలిగేది అట్టే లేదు. నాటకరంగం అలా కాదు. దాన్ని గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. అలాగే పారిశ్రామికంగా అగ్రరాజ్యమైన అమెరికా ఆ రంగంలో ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో తెలుసుకోవాలని ఉంది. ఆ పైన అందమైన ప్రదేశాలు చూడాలని ఉంది. పోతే నేను రైతు బిడ్డను గాబట్టి అమెరికా వ్యవసాయ విధానాలను చూడాలనుకొంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా అమెరికా ప్రజలను కలుసుకొని వారి జీవన విధానాలు తెలుసుకోవాలనుకొంటున్నాను’ అన్నారు అక్కినేని. ఆ ప్రకారమే గడిపారు. ఒక రైతు కుటుంబంతో ఒక రోజంతా గడిపారు. టంగుటూరి సూర్యకుమారి లాంటి అలనాటి తెలుగుదనపు వ్యక్తుల్ని కలిసారు. న్యూయార్క్‌లో సెంట్రల్ పార్క్ లాంటి సుందర వనాలతో పాటు హార్లెమ్ లాంటి నల్లవారి వాడలూ చూసి వాటి గురించి రాసారు. మాములు మనుషుల్లానే డాలర్లను రూపాయల్లో గుణించి హమ్మో అంత ఖరీదా అని వాపోయారు. తిరిగి వచ్చాక ఏం చూసావూ అని మిత్రులు అడిగితే దేశం కన్నా విశాలమయిన హృదయాలనూ, ఆకాశహర్మ్యాల కన్నా ఉన్నతమైన మనసులనూ, అక్కడ విరివిగా కనిపించే అకుపచ్చని చెట్ల కన్నా అతి చక్కని వసివాడని మనుషులనూ, మామూలు పాటి వంతెనలకన్నా ఎంతో పొడవైన సుహృద్భావ వారధులనూ చూసి వచ్చానని చెప్పారు. తాను అమెరికాలో ఒక రోజు గడిపిన రైతు గ్రామం షార్స్‌బర్గ్ నుంచి తాను పుట్టి పెరిగిన వెంకటరాఘవపురం దాకా మనోవారధి నిర్మించగలిగానని మురిసిపోయారు.
***
తెలుగు యాత్రా సాహిత్య చరిత్రలో మైలురాయిగా చెప్పదగ్గ పుస్తకం ‘కాశ్మీర దీపకళిక’. నాయని కృష్ణకుమారి. 1967.
స్కూలూ కాలేజీ పిల్లల్ని అధ్యాలకులు విహారయాత్రలకు తీసుకెళ్లడం అంత అరుదైన విషయం కాదు. కానీ ఆ యాత్ర కాశ్మీరు దాకా అవడం, అందులోనూ అది అరవై ఏళ్ల క్రితం జరగడం – విశేషమే. వాళ్లను తీసుకు వెళ్లిన అధ్యాపకులు కవీ భావుకులూ పరిశోధకులూ అవడం ఇంకా పెద్ద విశేషం.
“మధ్యాహ్నం ఎండ గంజి పెట్టిన నూలు గుడ్డలా ఫెళఫెళలాడుతోంది” అంటూ తన రచన ఆరంభించిన కృష్ణకుమారి వాళ్ల అబ్బాయి ఫోను చేసి ‘అమ్మా మీ ప్రిన్సిపాలుగారట, పిలుస్తున్నారు’ అనగానే గుండె వేగం పెరగడం, బయట అదే ఎండ అవితర్కిత బుద్ధి యొక్క కోపంలా మండిపడటం గురించి చెపుతారు. అడవుల్లోంచి రైలు వెళుతున్నప్పుడు పరవశ విభ్రమ పొందిన నాయని, పరంజ్యోతి గురించి చిత్రించిన పోతన కలానికి బలం ఇచ్చినది ఇలాంటి ప్రకృతే అయి ఉండాలి అంటారు. పక పక నవ్వుతూ విరగబడే నవయవ్వనపు చెట్ల గురించీ, డెభ్బై ఏళ్ల విరాగుల్లా కనిపించే వృక్షాల గురించీ చెపుతారు. మంచు తెల్లగా పసిపిల్లల నవ్వులా మంచివాడి మనసులా మెరుస్తోంది అంటారు. పుణ్యాత్ముడి అంతంగంలా సరస్సు స్వచ్ఛంగా మెరుస్తోంది అంటూనే పగబట్టిన త్రాచుపాము లాంటి సెలయేరు గురించీ, భయం కలిగించేంత గాఢనీలపు ఆకాశం గురించీ చెపుతారు. ప్రకృతి ముందు వివశులు గాకుండా ఉండటం సాథ్యమే కాదంటారు. తన పరిశీలననూ అనుభవాలనూ ఉహలకూ ప్రకృతికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ఆయా ప్రదేశాలలోనూ, అక్కడి మనుషులలోనూ పరిచయం ఏర్పరుచుకొంటూ, ఆత్మయత సాధించుకొంటూ తన యాత్ర సాగిస్తారు. అదే ఊపులో తమకు దూరదేశంలో ఎదురైన ఇబ్బందులూ, ఆహరపు విషయాల్లో పడిన కష్టాలూ, సహకరించని విద్యార్థినులను ఒక దారికి తీసుకు రావడంలోని ప్రయాస, తాము భారతీయులుగా భావించుకోని కాశ్మీరువాసుల ఆలోచనా ధోరణి – ఇలా ఎన్నో ప్రాపంచిక విషయాలకూ తన కథనంలో చోటు ఇచ్చారు కృష్ణకుమారి.
యాత్రాకథనాలను ప్రదేశాలు, వింతలు, అందాలు అన్న విషయాల పరిధిని దాటించి అనుభవాలు అనుభూతి, స్పందన అన్న విషయ ప్రథానంగా మలచడమన్న ప్రక్రియకు ‘కాశ్మీర దీపకళిక’ నాంది పలికింది. మరో నలభైఏళ్ల తర్వాత ఈ ధోరణి అమరేంద్ర లాంటి వాళ్ల యాత్రా రచనల్లో విరివిగా కనిపించడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమయింది. కాశీయాత్ర చరిత్ర చంద్రమండలం మీద మానవుని తొలి అడుగు లాంటి ఐకానిక్ రచన అయితే కాశ్మీర దీపకళిక ప్రయాణాలూ, యాత్రల గురించి రాయడం అన్న ప్రక్రియను అతి పెద్ద మలుపు తిప్పింది. మైలురాయిగా నిలబడింది. అన్నట్టు సుప్రసిద్ద విమర్శకులు చేకూరి రామారావు ఈ పుస్తకాన్ని తెలుగు వచనానికి రసగుళిక అని అభివర్ణించారు.
***
యాత్రలలో తీర్థయాత్రలది ప్రముఖ స్థానం. మొదటి యాత్ర రచన – ‘కాశీయాత్ర చరిత్ర’ స్థూల దృష్టికి తీర్థయాత్రే. కానీ ఆ పదిహేను నెలల ప్రయాణం ధార్మిక లక్షాలను దాటుకొని సామాజిక చరిత్ర దర్పణంగా మారడం గురించి మనం చెప్పుకొన్నాం.
పరిపూర్ణ ధార్మిక దృష్టితో యాత్రలు చేసి వాటి గురించి రాసిన వాళ్లు మనకున్నారు. అందులో 1986లో సీవీ మనోహరరావు రాసిన ‘కైలాస దర్శనం’ చెప్పుకోదగ్గది.
ఇరవై ఏళ్ల రాజకీయ వైమనస్యం తర్వాత చైనా భారత దేశాలు ఒక ముఖ్యమైన అంగీకారానికి వచ్చి భారత యాత్రికులకు కైలాస మానససరోవర యాత్ర ద్వారాలు తెరచిన తొలినాళ్లలో 1983లో మనోహరరావు ఈ యాత్ర చేసారు. ముప్ఫైరోజుల తన యాత్ర గురించి ఎంతో వివరంగా రాసారు. తెలుగువారికి అంతగా పరిచయం లేని మధ్య ఎగువ హిమాలయాల గురించి విపులంగా వర్ణించారు. ప్రాణాంతకమైన ఆ యాత్రానుభవాన్ని పాఠకులకు సమర్థవంతంగా అందించారు.
వీటన్నికన్నా ఆయన తన పుస్తకంలో వ్యక్తపరిచిన ఒకానొక మనోభావ పరంపర నన్ను బాగా ఆకట్టుకుంది. నిన్న మొన్నటిదాకా కాశీకి వెళ్ళినవాడూ, కాటికి వెళ్ళినవాడూ ఒక్కటే అన్న నానుడి ఉండేది. ఇప్పుడు కాశీయాత్ర మంచినీళ్ళు తాగినంత సులభమయిపోయింది.
కానీ కైలాసమానస సరోవర యాత్ర ఇప్పటికీ ప్రమాదం నిండినదే!
యాత్రకు బయల్దేరే ముందటి రాత్రి మనోహరరావుగారికి నిద్రపట్టలేదట.
కాలేజీ చదువులు దాటని పిల్లలు, ఆదాయవ్యయాలు, తీర్చవలసిన అప్పులు, చెయ్యవలసిన అమ్మాయిల వివాహాలు – ఈ ఆలోచనలన్నీ మూకుమ్మడిగా మనసులో తిరుగాడాయట. చివరికి కాగితాలు, పెన్ను తీసుకుని ఆ ఆలోచనలన్ని రాయడం మొదలుపెట్టారట. దాదాపు రెండు గంటల తర్వాత అది ఒక వీలునామా లాగా తయారయిందట. రావల్సినవి – ఇవ్వాల్సినవి, ఆడపిల్లల వివాహాలు, తల్లి యొక్క పోషణాదులు, మగపిల్లలకి మిగిలేవి – అన్నీ వివరంగా రాసారట. రాసిందంతా మరోసారి చదివితే గుండె భారం, కన్నీళ్ళు, కడుపులో ఆవేదన – మనోదౌర్భల్యం. గీతలోని సాంఖ్యయోగంలోని ఒక శ్లోకం గుర్తుకు తెచ్చుకుని అధైర్యమూ, పిరికితనమూ వదిలిపెట్టి, కైలాసవాసుని ప్రార్థించి యథాస్థితికి వచ్చారట.
తీర్థయాత్ర అయినా, ఎవరెస్టు ఎక్కడమయినా ఒక అసాధారణ యాత్రకు వెళ్ళేముందు దాదాపు ప్రతీ యాత్రికునికీ కలిగే మనోవ్యాకులతకు దర్పణం పట్టిన సంఘటనా, వివరణా ఇది!
***
క్రీ.శ. రెండువేల సంవత్సరపు ముందటికాలంలోకి మరికాస్త చూపు సారిస్తే 1970లలో మాలతీ చందూర్ ప్రభుత్వరంగ పరిశ్రమలూ ప్రాజెక్టులు చూసి వచ్చి రాసిన ‘నవభారతి’ మరో చెప్పుకోదగ్గ పుస్తకం. వాసా ప్రభావతి, డి. కామేశ్వరి, ద్వివేదుల విశాలాక్షి 80లలో తమ విదేశీయాత్రల గురించి పుస్తకాలు రాశారు. అంపశయ్య నవీన్ తన విద్యార్థులతో చేసిన దక్షిణ భారత విహారయాత్రా వివరాలను 1987లో ‘ప్రమాదాల్లో ప్రమదలు’ అన్న యాత్రానవలగా రాశారు. 1980ల చివరలో మల్లాది వెంకటకృష్ణమూర్తి తన ట్రావెలాగ్ రచనా పరంపరకు నాంది పలికారు. దాసరి అమరేంద్ర అనుభూతి ప్రదానంగా ‘మూడు నగరాలు’, ‘స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర’ రాసారు. శ్రీశ్రీ, ఆరుద్ర, సోమ సుందర్, సినారె, గోపి, దాశరథి, రావూరి భరధ్వాజ తమ తమ యాత్రా గ్రంథాలు ప్రచురించారు.
***
1999లో వచ్చిన ఆదినారాయణ ‘భ్రమణకాంక్ష’ ఒక ప్రభంజనం. తెలుగు యాత్రా సాహిత్యాన్ని ఊహాతీతమైన మలుపు తిప్పిన పుస్తకమది.
నేను సంచారానికే తప్ప సంసారానికి పనికిరాను అనే ఆదినారాయణ 1999 నాటికే పదివేల కిలోమీటర్లు పది యాత్రలుగా హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన వెళ్ళి ఉన్నారు. మామూలు ప్రయాణీకులే కాకుండా సగటు యాత్రికులు కూడా వదిలిపెట్టలేని ఆహార, వసతి, రక్షణ లాంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా దాదాపు బైరాగి పంథాలో చేసిన ప్రయాణాలవి. అందులోంచి మూడు యాత్రలను ఎన్నుకుని తనదైన కవితాత్మతో ఎంతో ఆర్ద్రంగా చెప్పుకొచ్చిన రచన భ్రమణకాంక్ష.
యాత్రికులకు ద్రోణాచార్యుడయిన రాహుల్ సాంకృత్యాయన్‌కు శతజయంతి నివాళిగా 1993లో ఆదినారాయణ విశాఖపట్నం నుంచి సాంకృత్యాయన్ సమాధి ఉన్న డార్జిలింగ్ వరకూ నలభై రోజుల పాటు పద్దెనిమిది వందల కిలోమీటర్లు నడిచిన వైనం ‘పాదయాత్రాంజలి’.
తాను చిన్నప్పుడు ఆడిపాడిన గుండ్లకమ్మ నదీమూలాలు అన్వేషించి ఆ నది ఒడ్డునే సాగరసంగమం వరకూ చేసిన మూడు వందల కిలోమీటర్ల యాత్ర ‘ఏటి ఒడ్డున ప్రయాణం’ .
అకాల మరణం చెందిన చెల్లి కోటేశ్వరి జ్ఞాపకార్థం తమ స్వగ్రామం చవటపాలెం నుంచి ఆమె సమాధి ఉన్న ఢిల్లీ నగరం వరకూ 1994 వేసవిలో రెండు వేల మూడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళిన వైనం ‘ప్రార్థించే పాదాలు’.
ఈ మూడు యాత్రల ముప్పేట ‘భ్రమణకాంక్ష’.
ప్రయాణాలు ఇలా కూడా చేయవచ్చు అన్న ఎరుకా, అసలివే యాత్రలంటే అన్న అవగాహన పర్యాటకులకే కాకుండా సామాన్య పాఠకులకు కూడా కలిగించిన పుస్తకం ఈ భ్రమణకాంక్ష.
***
తెలుగు సాహిత్యంలో అనువాదాలకు ప్రముఖ స్థానం ఉంది.
యాత్రా సాహిత్యం విషయంలో కూడా చెప్పుకోదగ్గ అనువాద రచనలు వచ్చాయి.
అనువాదాల విషయంలో నేను 2000 సంవత్సరం దగ్గర ఆగకుండా ఇప్పటిదాకా వచ్చిన పుస్తకాలన్నిటినీ పరామర్శిస్తాను.
విస్మృత యాత్రికుడు లాంటి యాత్రా ప్రధానమైన నవలలే గాకుండా ‘టిబెట్‌లో పదిహేను నెలలు’ లాంటి యాత్రా గ్రంథాలూ రాశారు రాహుల్ సాంకృత్యాయన్.
భారతీయ తత్వవేత్తల పుస్తకాలు, బౌద్ధ ధర్మానికి సంబంధించిన విలువైన సామాగ్రి టిబెట్‌లోనే దొరుకుతాయి కాబట్టి అక్కడికి తప్పకుండా వెళ్ళాలన్నది సాంకృత్యాయన్ సంకల్పం. బాహటంగా సరిహద్దులు దాటడం దాదాపు అసంభవం కాబట్టి అజ్ఞాతంగానే అక్కడికి చేరుకోవాలన్నది ఆయన నిర్ణయం.
1929-30లలో ఆయన టిబెట్ వెళ్ళి ఉన్నారు. అక్కడకు వెళ్ళడం, అవరోధాలు అధిగమించడం, బౌద్ధ గురువుల దర్శనాలు, చర్చలు, టిబెట్ వాసులు, జీవన సరళి, ఆనాటి రాజకీయ పరిణామాలు, అనేక అపురూప గ్రంథాల సేకరణ – ఈ వివరాలన్నీ సాంకృత్యాయన్ ‘టిబెట్ మే సవా బరస్’ అంటూ 1934లో ప్రచురించారు. దానికి పారనంది నిర్మల చేసిన తెలుగు అనువాదం – ‘టిబెట్‌లో పదిహేను నెలలు’ – 2014లో వెలువడింది.
ఆయనే రాసిన ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అన్న యాత్రల మీది గ్రంథం ‘లోక సంచారి’ అన్న పేరు మిద ఆలూరి భుజంగరావు అనువదించగా 1991లో తెలుగులోకి వచ్చింది.
***
ప్రబోధ్ కుమార్ సన్యాల్ అనే బెంగాలీ యువకుడు 1935లో కాలినడకన రిషీకేష్ నుంచి బదరీనాద్ వరకూ వెళ్ళి వచ్చారు. ఆ యాత్రా వివరాలను ఆసక్తికరంగా ‘మహాప్రస్థానేర్ పథ్’ అన్న పేరిట ప్రచురించారు. దాన్ని ‘యాత్రికుడు’ అన్న శీర్షికతో మోతుకూరి వెంకటేశ్వర్లు – కాసుఖేల సత్యప్రియ అనువదించి 1966లో ప్రచురించారు.
వెళ్ళింది తీర్థయాత్రకే అయినా భగవంతునితో కన్నా సామాన్య ప్రజానీకంతో ఎక్కువ మమేకం అయ్యే తత్వం గల వ్యక్తి సన్యాల్. సహ యాత్రికుల ధోరణులు, వాళ్ళు అందించే సహకారం – ప్రోత్సాహం – నిరుత్సాహం, దారిలో తటస్థపడే కష్టాలు – సంతోషాలు, నదులు – కొండలు, పరిసర పరిశీలనతో పాటు అంతః శోధన, దేవుడి పేరు మీద ప్రతి క్షేత్రంలోనూ జరుగుతున్న అత్యాచారాలు, తెలుగు యాత్రికుడు వెంకటస్వామి దారిలో కలవడం, రాణి అన్న సహ యాత్రితో చెలిమి – ఎన్నో విషయాలు ఎంతో చదివించేలా చెప్పారు సన్యాల్. యాత్రికుడు కాళ్ళూ చేతులూ గాలికి వదిలిపెట్టి నదిలోని నీళ్ళ మాదిరిగా ప్రవహిస్తూ వెళ్ళాలి అంటారు!!
పసిఫిక్ మహా సాగరం నడి మధ్యన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దరిదాపుల్లో తహితి లాంటి 1000 పాలినేషియన్ ద్వీపాలు ఉన్నాయి. అక్కడివారు ఎక్కడివారు అన్న విషయంలో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళు దక్షిణ అమెరికాలోని ఇంకాన్ జాతికి చెందినవాళ్ళు. వెయ్యీ, పదిహేను వందల సంవత్సరాల క్రితం తమ నాటు పడవల్లో సముద్రాన్ని అధిగమించి అక్కడికి చేరారు అని నమ్మిన వ్యక్తి నార్వేకు చెందిన థార్ హెయిర్డ్ హాల్. తనది నమ్మకమే గాదు, నిజం కూడా అని నిరూపించడం కోసం అప్పటి ఇంకాన్ వారు నిర్మించిన పద్ధతిలోనే మేకులు ఉపయోగించకుండా తొమ్మిది బాల్సా దుంగల తెప్పను నిర్మించి మరో నలుగురు సాహసికులతో కలసి 1947లో ఏడువేల కిలోమీటర్ల వంద రోజుల యాత్రకు నడుం కడతాడు. ఆ తెప్పకు అప్పటి ఇంకాన్ తెగ నాయకుడు కోన్ టికి పేరు పేరు పెడతాడు. ఆ ప్రయాణ అనుభవాలను ఎంతో వివరంగా రాసి ప్రచురించారు. దానికి దేవరకొండ చిన్నికృష్ణ శర్మ చేసిన అనువాదం ‘కడలి మీద కోన్ టికి’ అన్న పేరు మీద 1957లో పుస్తకంగా వచ్చింది.
సముద్రం మీద నాలుగు రోజులు గడవగానే అది నా స్వంత ఇల్లే అనిపించింది అంటాడు హెయిర్డ్ హాల్. ఒక ప్రదేశంలో కనిపించిన అసంఖ్యాక మత్స్యాలను చూసి అసలీ సముద్రమంతా చేపలమయమా అని విస్తుపోతాడు. టెన్నీలు, సొరచేపలూ, బేడిసల మధ్య జరిగిన మత్స్య యుద్ధం కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. సొరచేపలు, తిమింగలాలు, పెను కెరటాలు, ఒకసారి అనేక దిక్కుల నుంచి వీచే అతి వేగపు గాలులు, సముద్రం మీద కురిసిన ఉప్పు నీటి వర్షం – ఇవన్నఈ వినోదం కలిగించాయే గానీ భయం కలిగించలేదట…
అలా 93 రోజులు ప్రయాణం చేశాక, ఒక ద్వీపం కనిపిస్తుంది. ద్వీపవాసులూ కనిపిస్తారు. కానీ ప్రవాహ బలాల వల్ల వీళ్ళ తెప్ప తీరం చేరలేకపోతుంది. మరో మూడు రోజుల తర్వాత రాతిమయమైన మరో ద్వీపం చేరగలుగుతారు. ఆ సమీపంలోనే ఉన్న నూట ఇరవై ఏడు మంది మాత్రమే జీవించే మరో చిరు ద్వీపం నుంచి స్థానికులు వచ్చి మేళ తాళాలతో మన సాహసికుల్ని తీసుకువెళతారు. వాళ్ళకు తమ ఇంకాన్ జాతి మూలాల గురించి అవగాహన ఉందట. తమ తమ పెద్దవాళ్ళ కబుర్లలో మాత్రమే విన్న బాల్సా దుంగల తెప్పనూ, దానిపై తమ దైవ సమాన నాయకుడు కోన్ టికి అన్న పేరు ఉండటాన్ని చూసి సంబరమే సంబరం. విందులు, సంగీతం, నాట్యం… “ఆ పాలినేషియన్ నాయకుడు నా చుబుకాన్ని చుంబించాడు. నా గడ్డం మీద నాకు అపారమైన గౌరవం కలిగింది” అంటాడు హెయిర్డ్ హాల్. తన నమ్మకం నిజమేనని రుజువయినందుకు అతనికి సంతోషమే సంతోషం!
సింద్‌బాద్ సాహసాలను మరపించే అచ్చమైన సాహసయాత్ర ఇది. అనువాదం ఎంతో రమణీయంగా ఉంది.
***
నా అంచనా ప్రకారం తెలుగులో ఇప్పటిదాకా సుమారు పాతిక అనువాద యాత్రాగ్రంథాలు ఉన్నాయి. పాల్ బ్రంటన్ అన్న ఇంగ్లీషు పాత్రికేయుడు రాసిన ‘ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా’ అన్న 1934 నాటి పుస్తకానికి 2013లో వచ్చిన జొన్నలగడ్డ పతంజలి అనువాదం ‘రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ’. ఆ అన్వేషణా క్రమంలో ఆశ్రమాలూ, బాబాల డొల్లతనాన్ని బట్టబయలు చేయడంలో ఏ మాత్రం సంకోచించడు పాల్ బ్రంటన్.
స్వామి తపోవన్ మహారాజ్ మలయాళ భాషలో రాసిన పుస్తకానికి ఇంగ్లీషు ద్వారా తణుకు రామకృష్ణ జనార్ధన్ చేసిన తెలుగు అనువాదం ‘హిమగిరి విహారం’. 2008లో ప్రచురితం. 1920లలో స్వామి తాను చేసిన గంగోత్రి, బదరీనాథ్, కైలాస మానస సరోవరం, అమర్‌నాథ్ యాత్రలాంటి వాటితో పాటు ఏళ్ళ తరబడి హిమగిరులలో తాను తిరిగిన అనేకానేక ప్రయాణాలను వర్ణించారు. భక్తులనూ, తాత్వికులనూ, యాత్రికులనూ ఏకకాలంలో ఆకర్షించే శక్తి ఉన్న పుస్తకం ఇది. అనువాదం అతి సరళం.
***
అనువాద యాత్రా సాహిత్యంలో మణిపూస ‘ప్రయాణానికే జీవితం’.
మోటారు సైకిలు మీద కులూ మనాలీల నుంచి లడఖ్ ప్రాంతపు ల్హే వరకూ వెళ్ళడమన్నది ఎంతోమంది సాహసికుల స్వప్నం. ప్రతీ ఏడాదీ అనేకమంది ఆ పని చేస్తూనే ఉంటారు. 2004లో పూనా నగరపు అజిత్ హరిసింఘాని కూడా ఆ పని చేశారు. 2008లో తన అనుభవాలను ‘వన్ లైఫ్ టు రైడ్’ అంటూ ఇంగ్లీషులో ప్రచురించారు. అజిత్ హరిసింఘానీ తన యాత్రలో మనుషులతో పాటు కొండల్ని, నదుల్ని, అడవుల్ని – చివరకి రోడ్లనీ తన మోటారు సైకిల్ని భాగం చేశారు. వాటన్నిటితోను తాను చేసిన ఆత్మీయ సంభాషణలను అతి సహజంగా రాసుకొచ్చారు. ఒక సగటు సాహస యాత్రను ఆధ్యాత్మిక ఆత్మశోధనా ప్రక్రియ స్థాయికి అవలీలగా తీసుకువెళ్ళారు. ఆ ఆంగ్ల పుస్తకాన్ని సమర్థవంతంగా ‘ప్రయాణానికే జీవితం’ పేరిట కొల్లూరి సోమ శంకర్ అనువదించి 2014లో ప్రచురించారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయగల పుస్తకం ఈ ‘ప్రయాణానికే జీవితం’.
***
తెలుగు సాహిత్యంలోకి ఏడేళ్ళ క్రితం నిశ్శబ్దంగా ప్రవేశించి అంతే నిశ్శబ్దంగా అప్పటికీ ఇప్పటికీ ప్రభావితం చేస్తోన్న అపురూపమైన పుస్తకం ‘హైకూ యాత్ర’. మత్సువో బషో – నాలుగు వందల ముప్ఫై ఏళ్ళ క్రితం – అనువాదం వాడ్రేవు చినవీరభద్రుడు.
దేశదిమ్మరి కవి అయిన బషో 1684 -89ల మధ్య తాను జపాను గ్రామీణ పర్వత ప్రాంతాలలో చేసిన ఐదు పాదయాత్రల వర్ణన ఈ హైకు యాత్ర. అందులో అయిదవది 165 రోజులు పట్టిన 2500 కిలోమీటర్ల యాత్ర. తాను బస చేసిన ప్రతి ప్రాంతం గురించీ కవితాత్మకంగా వర్ణిస్తూ రాసిన ‘ఒకు నో హొసొమిచి’ జపాన్ సాహిత్యంలో అగ్రగణ్యంగా నిలబడిందట. చక్కటి వచనమే గాకుండా అడుగడుగునా హైకులు నిండి ఉండడం ఈ యాత్రారచన విలక్షణత.
“ప్రేమతో ఆతిథ్యమిచ్చే
సత్రం దగ్గర మజిలీ
నిజమైన విలాసం” – అంటారాయన.
మనమేదన్నా రాస్తే అందులో అపూర్వ విలక్షణ లేకపోతే, నవీనత్వం లేకపోతే ఆ రాయడం వ్యర్థం అనీ అంటారు.
ప్రతీ రోజూ తెల్లవారగానే నాకుండే కోరికలు రెండు – రాత్రికి శుభ్రమైన బస దొరకడం, నా పాదలకు సరిపోయే చెప్పులు దొరకడం అనే బషో – ఏ కొద్దిపాటి సౌందర్య స్పృహ ఉన్న మానవుడు నాకు ప్రయాణంలో తారసపడినా నా ఆనందానికి హద్దు ఉండదు. నాకతడు మట్టిలో కానవచ్చిన మాణిక్యంలాగా అనిపిస్తాడు. అటువంటి అనుభవాల్ని ఒకచోట రాసుకోవడం, నలుగురికీ వినిపించడం యాత్రానుభవంలో నిజమైన ఐశ్వర్యమనుకొంటాను అంటాడు. నా ముందున్న మూడువేల మైళ్ళ ప్రయాణం తలచుకోగానే హృదయం ఉప్పొంగింది అనే యాత్రా పిపాసి బషో.
తన యాత్రలో ఒక చోట వెయ్యేళ్ళు చెక్కు చెదరక నిలబడి ఉన్న స్మారక చిహ్నం ఒకటి కనిపించినప్పుడు బషోకు తన ప్రాచీన మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలిగానని అనిపించిందట.
తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన యాత్రా గ్రంథాలన్నింటిలోకి – మూల రచనలను కూడా కలుపుకుని – మణిపూస ఈ ‘హైకూ యాత్ర’. ప్రయాణానికీ – కవిత్వానికీ – జీవితానికీ, ఉనికికీ – ఉనికి కోల్పోవడానికీ, బయట ప్రపంచానికీ – అంతర్లోకానికీ మధ్య ఉండే హద్దులను అధిగమించిన అపురూప రచన ‘హైకూ యాత్ర’. అసలిది ప్రయాణమా, కవిత్వమా, తత్వమా, జీవన విధానమా – ఐదడుగుల రెల్లు పాక వేసుకోడానికి కూడా సిగ్గుపడే బషో మానవమాత్రుడేనా? నిజంగా ఈ భూమి మీద తిరుగాడాడా అన్న విభ్రమ పాఠకులలో కలిగించే యాత్రగ్రంథం ‘హైకూ యాత్ర’. బషోనూ, అతని హైకూ యాత్రనూ వివరిస్తూ చినవీరభద్రుడు అతి విపులమైన ముందుమాట వ్రాశారు. అతని యాత్రలోని లోతులు వివరిస్తూ జయతి ముఖ పుస్తకంలో విపులమైన వ్యాసం రాశారు.
***
1838 నుంచి 2000 వరకూ తెలుగు యాత్రా సాహిత్యం నడిచిన దారిని ఒక్కసారి సింహావలోకనం చేసుకొంటే ఈ నూట అరవై ఏళ్ళలోనూ యాత్రారచనలు అడపా దడపా రావడమే కనిపిస్తుంది. యాత్రలు చేసిన వాళ్ళు కూడా – వాళ్ళు సామాన్య యాత్రికులయినా, చెయ్యి తిరిగిన రచయితలయినా – తమను బాగా కదిలించిన అనుభవాలను ఒక్కసారి రాయడమూ, మళ్ళీ ఆ జోలికి వెళ్ళకపోవడమూ కనిపిస్తుంది. అయినా పిపాసతో రాసిన గ్రంథాలు రాసిలో కన్నా వాసిలో విలక్షణమై తెలుగు సాహిత్య చరిత్రలో తమ ఉనికిని చాటుకోవడం కనిపిస్తుంది. గత వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నదగ్గ రచనలు అని ఎంపిక చేసినప్పుడు కాశీయాత్ర చరిత్ర, కాశ్మీర దీపకళిక ఆ ఎంపికలో నిలబడడం యాదృచ్ఛికం కాదు.
1990లు వచ్చేసరికి పరిస్థితి మారింది. విరివిగా యాత్రా రచనలు రావడం మొదలయింది. యాత్రా రచయితలు ఒక పరంపరగా పుస్తకాలు రాయడం మొదలయింది. వాటి కోసం ఎదురుచూసే పాఠకులు తయారయ్యారు.
***
సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు.
మోళ్ళు చిగురిస్తాయంటారు.
మొయిళ్ళు వర్షిస్తాయంటారు.
కొన్ని యాత్రా కథనాలను చదివితే నీడపట్టు భద్రజీవులకు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలాంటి కథనాలు తెలుగులో చాలానే ఉన్నాయని చెప్పడానికే ఈ ప్రయత్నం.
చివరిగా ఒకమాట
బిందువులో సింధువునూ
ఆకులో అడవినీ
యాత్రికుడు చూస్తాడు.
మంచి యాత్రాకథనాలు వాటిల్ని పాఠకులకు చూపిస్తాయి.
*
చాలా ఓపిగ్గా… వివరంగా అన్ని విషయాలూ మాకు చూపారు… దాచుకోవాల్సిన వ్యాసం ఇది.
విస్తృతమైన , లోతైన యాత్రా సాహిత్య రచన అందించారు.ధన్యవాదాలు.