ఎక్స్ వై ల హోరాహోరీ యుద్ధంలో
గెలుపెవరిది?!
ఓటమి ఎవరిది?!
చివరాఖరికి
ఎక్స్ వై తో కూడుతుందా?
ఎక్స్ ఎక్స్ సంధి కుదుర్చుకుని వై ని తరుముతుందా?!
ఏదేమైనా ఏదో ఒకటి తప్పనిసరి
ఆ పోరు ఎడతెగక తప్పదు సృష్ఠి పరంపరలో
అబ్బాయో అమ్మాయో
పేగు తెంచుకుని కెవ్వుమంటూ నేల పైకి
తనతో పాటు
కులాన్ని మోసుకొచ్చిన విషయం తెలిసే సరికి ఆశ్చర్యం!!
తప్పటడుగులు వేసే నాటి నుండే
సంఘం అసలు రంగు తెలవటం మొదలవుతుంది
వెంట తెచ్చుకున్న కులం వెంటాడుతుంటే
తప్పెవరిదనే ప్రశ్న మొదలౌతుంది
వస్తుంటారు
పోతుంటారు
కలిసీ కలవక కలవలేక
దూరంగా సుదూరంగా
బతికినంత కాలం వేటాడుతుంది కులం!
ప్రతిభ పరిగణనలోకి అక్షరం కన్నా వేగంగా
కులం పాకుతుంది అంతర్లీనంగా
భుజం శీర్షం పైకి వెళ్ళాలంటే
ఎన్ని మెట్లు ఎక్కినా
మింగుతుంటూనే వుంటుంది కులం!
ప్రాణి కన్నా
బలంగా కులం వుంటుందంటే
క్రోమోజోములు పోరాడేవే కావు!
ఓ ప్రాణి కి జీవం పోసేవే కాదు!!
*
Add comment