ఓ సంక్షోభ సమయాన నిశ్శబ్దం మేల్కొంటూ కాలం నిదురిస్తుంటుంది నల్లగా నిగనిగలాడుతూ చీకటికి నకలుగా కొన్ని జతల బూట్లచప్పుడు మలయమారుతపు గుండెచీల్చుకుంటూ వెళుతుంది నిశిని నమ్ముకొని బతికే రేయిపక్షులు బెదిరి చెదిరేలా వడివడి అడుగుల్లో రాజ్యం ఏజెంట్లు చీకటి చట్టాల విప్పారిన నీఘా కళ్ళతో గంభీరంగా వస్తారు కుట్రకథల ఫైళ్ళు పట్టుకుని మిణుకుమిణుకుమనే నక్షత్రాల కాంతి కనుమూస్తూ తెరుస్తూ ఉంటుంది ఎక్కడో ఓ తీతువు గొంతులోకి ఆర్తనాదం జారిపడుతుంది అప్పుడు ఓ ముగ్గురు యువతల్ని వాళ్ళ ఇళ్ళ నుండి పట్టుకెళతారు ఆ ఇండ్లల్లో ఎవరికీ కనిపించని తుపాకులు రాజ్యద్రోహ పుస్తకాలూ అందులో రాజ్యాన్ని ఓడించే పదాలు పరమ ప్రమాదకరంగా అనిపిస్తాయి అసలా పదాలే నిజానికి ఆయుధాలని నేరం మోపబడుతుంది అందులోంచి చురకత్తులు మొలిచి రాజ్యం కుత్తుక మీద నాట్యం చేస్తాయనే భయం వారి ప్రతి కదలిక లో కనబడుతుంది వణుకుతూనే ప్రతి వస్తువునూ ముట్టుకుంటారు ఇళ్ళంతా పుస్తకాలతో చిందరవందర చేస్తారు అవి మందుపాతరలనీ వాటిలో పుటలు డైనమైట్లని వారి నమ్మబలుకుతారు కుట్రల వేలిముద్రలను వెంటతెస్తారు పండంటి ఇంటిని తీవ్రవాదుల ఠికానా అని ప్రకటిస్తారు బలంగా ధృఢంగా ధైర్యానికి మారు పేరులా ఉన్న యువతుల్ని భయం భయంగా వాళ్ళు జీపెక్కిస్తారు ఆ పిల్లల కళ్ళలో ఆత్మవిశ్వాసం చూసి రాత్రికి ధైర్యం వస్తుంది ఆ పరిసరాల గుండెదిటవు చేసుకుంటాయి ఆ పిల్లలా, వారి తల్లిదండ్రులా ఆత్మీయతనూ స్నేహాన్నీ పంచుకు పరవశించిన వాడ ఇండ్ల తలుపుల రెప్పలు ఫెవీక్విక్ లాంటి భయం అంటుకున్నట్లు మూతపడిపోతాయి తెల్లారిన శబ్దం విన్నదాకా మరణం నటిస్తాయి అమావాస్య చీకటి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అని నినదించడం మొదలెడుతుంది ఆ వీధుల్లో పడి ఉన్న రాయీ రప్పా వీధిదీపాలన్నీ ఆ పిల్లల కుట్రలో పాలుపంచుకోనందుకు బాధపడడం ఆరంభిస్తాయి ముగ్గురాడపిల్లల నీడలు నిర్భంధాల సాక్షిగా జీపునుంచి తప్పించుకొని సీతాకోకల్లా ఎగరడం పరిసరాలు ప్రాణప్రదంగా చూస్తాయి రాజ్యం కుట్ర నిజం పిల్లల కుట్ర అబధ్ధం అని తల్లిదండ్రులు మీడియా ముందు సత్యాన్ని వెలిబుచ్చుతున్నపూడవి అక్కడే తచ్చాడతాయి… * |
Add comment