పసునూరు శ్రీధర బాబులో మాయా లాంతరు

మెను అతడు చాలా సార్లు ప్రేమించాడు. ఆమె అతడిని చాలా సార్లు తిరస్కరించింది. ఒక సారి శరీరాలు కలిసినా మనసులు కలవలేదు.

ఆమె పాదాల క్రింద  స్వర్గపు అందమైన వస్త్రాలను పరిచేవాడిని కాని పేదవాడిని కనుక తన కలల్నే పరుస్తానని చెప్పాడు.

నీవు లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అన్నాడు.

ఆఖరుకు ఆమె జవాబిచ్చింది.

అవును కదా.. నీవు అందమైన కవిత్వం రాస్తావు దాంట్లో నీకు సంతోషం లేదని వ్యక్తమవుతుంది. అలా వ్యక్తం చేయడమే నీ సంతోషం. వివాహం అనేది నిస్సారమైన వ్యవహారం. కవులు ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దు. నిన్ను వివాహం చేసుకోనందుకు ప్రపంచం నన్ను అభినందించాలి.

ఆమె ఐరిష్ విప్లవకారిణి మాడ్ గాన్.

అతడు మార్మికవాది, తాంత్రిక కవి, నిగూఢ పథికుడు ఈట్స్. ఎక్కడెక్కడికో వెళ్లాడు. దారీ తెన్నూ లేకుండా పయనించాడు. హిందూ తాత్వికతలో కూడా కొట్టుమిట్టాడాడు. ప్రతిమాత్మక, ప్రతీకాత్మక కవిత్వం ఆయన ప్రత్యేకత .

పసునూరి శ్రీధరబాబు  కవితల్లో ప్రతీకలు, దృశ్యాలు నాకు ఈట్స్ ను తలపించాయి.

నారాయణ స్వామి చెప్పినట్లు సైగల్ పాట వింటూ, కిషోరీ అమోంకర్ గానం ఆస్వాదిస్తూ కవిత్వం చదివే వాడిని కాను నేను. దహించుకుపోతూ, ధగ్దమవుతున్నప్పుడే నాకు కవిత్వం గుర్తుకు వస్తుంది. శ్రీధర్ కవితల్లో ఆ దహన శక్తి కూడా ఉన్నది.

పాడుబడిన బావిలోంచి కాలిన రెక్కలతో పక్షులు టపటపా పైకి ఎగిరిపోయే దృశ్యాల్ని చూసే కవి శ్రీధర్. శిథిలమై పోవడం కన్నా తగులబడి పోవడమే మంచిదని దావానలంతో దాహం తీర్చుకోవడానికి తెగించే కవి శ్రీధర్ .

శ్రీధర్ కలలో మెలకువగా ఉంటాడు, మెలకువలో కలలు కంటాడు, నిదురపోయేదెప్పుడు?

నిదురపోని వాడెప్పుడూ రెప్పల ముందు దృశ్యాల్ని చూడకుండా ఉండలేడు.

వర్షం వచ్చినప్పుడు భూమి లోంచి ఎగిసిపడే కాక లాగా జీవితం ఉక్కబోయకుండా ఉండదు.

అందుకే శ్రీధర్ పచ్చని పాటవడం కోసం దుఃఖంలో తడిసిపోతాడు. గాయాన్ని ఏ రెక్కలతోనో మూసేసి చీకటిని కలల్తో అలంకరించేందుకు ప్రయత్నిస్తాడు.

ద్రాక్షపండులో విత్తనంలా ప్రేమలో కూరుకుపోవడం అతడికి అద్వైతానుభవం. కౌగిలిలో వికసించిన మంత్రపుష్పం. ఎవరన్నారు అతడిని  ఆధునికానంతరుడని?

నీలోని దారి తెలుసుకునే ముందు నాలోని దారులు తెలుసుకుని ద్వారాలు తెరుచుకుని వెళ్లిపోవాలి.. నీ కనురెప్పల తలుపులను నీవే తెరిచి పిలిచినప్పుడు మాత్రమే కనిపించే మంత్రనగరి రహస్సమీరంలో దేహం ధూపమయ్యే వైనం.. ఏ మార్మిక తుషారాల లోయల్లోకి తీసుకుపోతున్నాడీతడు?

ఇతడికి మృత్యు రహస్యం తెలుసు.అందుకే గబ్బిలం రెక్కల్లో మృత్యువు వెచ్చదనాన్ని అనుభవించగలడు. చితి వెలుగులాంటి గమ్యాన్ని చూడగలడు.

మనిషి నుంచి మనిషి, మనిషిలోంచి మనిషి పారిపోతున్న శూన్యకాలంలో ఏ పండగనైనా ఎలా చేసుకోగలం?  చర్మరంధ్రాల్లోంచి ప్రేమలు, స్నేహలు, బాంధవ్యాలు, పుట్టల్లోంచి చీమల్లా బిలబిలమంటూ బయటకు వెళ్లిపోతుంటే చేతులు జోడించి ఏ దేవుడినైనా ఏం కోరగలం? కౌగలింతతో ఏ దేహాన్ని ప్రాణంతో ఆస్వాదించగలం?

అన్న శ్రీధర్ లో నేను ఆదిమ యోగినే కాని, ఆధునికుడిని చూడలేను.

శ్రీధర్ కవిత్వమంతా అంతర్ముఖత్వం కనిపిస్తుంది.  లోపల ఎవరైనా ఉన్నారా? అది నిత్యాగ్నియా?

అని అతడు మనను ప్రశ్నిస్తాడు. ఏటి ఒడ్డున ఏం ఉంటుంది? ఎవరో విడిచివెళ్లిన నాలుగు కన్నీటి చుక్కలు, విడిది చేసిన కొన్ని మసక సంభాషణలు, విడిచేసిన ఏకాంతపు ముఖాలు, జలజల పారే ఏటి సవ్వడిలో కలిసి తడిసిపోయిన కొంత పొడి దుఃఖం.. అంతకన్నా ఏమి ఉంటుంది? అని అతడు ప్రశ్నించినప్పుడు

ఒంటరి ఏటి ఒడ్డున నిలుచున్న శ్రీధర్, అతడి మనసులో పరవళ్లు తొక్కే ఏరు మనకు కనిపిస్తుంది.

జ్ఞాపకాలు గాలిలో ఉంటాయి, ఉన్నపళంగా దేహాన్ని చుట్టుకు లాక్కుని పోతాయి అని ప్రారంభించిన శ్రీధర్

ఆనందాన్ని పంచే మనుషులు వేరే ఉంటారు, వారు మనుషులకు ముఖాల్ని తొడిగే ప్రయత్నం చేయరు.. దుఃఖాన్ని ఏకాంతంలో బంధిస్తారు.. అని మనను మనుషుల మధ్య మనుషులకోసం ఎదురు చూసేలా చేస్తాడు.. జ్ఞానంతో మోసపోకుండా ఉండడం నేర్చుకునేందుకు తరుచూ పిల్లలతో ఆడుకోవాలి. అద్దాన్ని తుడుచుకోవాలి అని మనకు ఆత్మజ్ఞానం కలిగిస్తాడు.

ఒక మనిషిని మరొక మనిషిలోకి తీసుకుపోలేని ఈ రోడ్డు మనల్ని ఎక్కడకు తీసుకువెళుతుంది? రోడ్డుమీదకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేకపోతే ఈ ప్రయాణం దేనికి?

అని మనకు తుచ్చమైన అప్రయాణం గురించి గుర్తు చేస్తాడు.

వేగుంట మోహన ప్రసాద్ అంటే శ్రీధర్ కు ఎంతో ఇష్టం.అప్పుడప్పుడూ విమోహమవుతాడు. కాని వేగుంటలా అతడు వినిర్మాణ కవి కాదు. అధివాస్తవిక కవి అంతకంటే కాడు. నిరంతరం ఆత్మను రగిలిస్తున్న చెకుముకిరాళ్లేవో అతడి వద్ద ఉన్నాయి.

లేకపోతే

సమాధిలో కన్నీటి చుక్కలు చిగురు తొడుగుతున్న చప్పుడును ఎలా వింటాడు?

కలలను తిరిగి జీవింపచేయగలిగితే కవి ఒక అద్భుత స్వర్గాన్ని సృజించగలడు.కాలరిడ్జ్ కుబ్లాఖాన్ నూ, మౌంట్ అబోరా గీతాన్ని పాడిన అబీస్సీనియన్ యువతిని సృజించినట్లు.

శ్రీధర్ బాబు ఎక్కడా కలలో స్వర్గాన్ని సృజించలేదు. మోహన ప్రసాద్ కుబ్లాఖాన్ గురించి చెప్పకముందే నిదురపోని మెలకువ చెప్పిన కల గురించి రాశానని అతడే వెల్లడించాడు. అసలు శ్రీధర్ ని చేయి పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్లిన అపరిచితుడెవరు?

మనల్నందరినీ ఎవరో ఒక అపరిచితుడు మనను నిద్రలో, మెలకువలో కలల్లోకి నడిపిస్తాడు. కాని అతడిని మనం మరిచిపోతాం. అతడొక ఇంద్రధనుస్సు. మాయా లాంతరు పట్టుకుని పరుగులు తీసిన వాడు.వాడి జాడ ఎక్కడైనా కనిపించిందా?

పుట్టుకకూ చావుకూ మధ్య, వంతెనలా నిలిచిన ఇంద్ర ధనుస్సు చూపుడు వేలు అందిస్తే చేతులు ఖాళీలేక పట్టుకోలేక ప్రతి క్షణం శ్మశానం వైపే  అడుగులు వేస్తున్నాం. ఇంతా చేసి.. ఓ నెత్తుటి మరకలా మిగిలిపోతున్నాం

అంటాడు పసునూరి శ్రీధర్ బాబు.

మనిషి ఒక పాత్ర,అందులో సారా అతడి ప్రాణం

మాంసం ఒక పైపు,ఆత్మ అందులోని స్వరం

ఓ ఖయ్యాం, మనిషి ఏమిటో లోతుగా కొలిచావా,

ఒక మాయా దీపం, లోపల వెలుగుతున్న కాంతితో !

అన్నాడు ఉమర్ ఖయ్యాం.

తెరిచిన పుస్తకం పక్కన దీపం మండుతోంది, అతడు వెళ్లిపోయాడు అన్నాడు ఈట్స్.

శ్రీధర్ బాబు లోని  మాయా లాంతరు వెలుగుతున్నంత కాలం అతడి కవిత్వం వెలుగుతూనే ఉంటుంది.

ఈట్స్ ఇలియట్ ను రాజేసినట్లు ఎవరో ఒకరు రాజేయకపోతే కవిత్వం ఎలా ప్రజ్వరిల్లుతుంది? ఇది వేన వేల తరాలనుంచి, ఒకరు రాజేసి మరొకరికి అందించిన అక్షరం.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు