ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది ఈ కథల్ని చదివిన తరువాత. ఆరు కథల్లోనూ సారూప్యంగా కనిపించేది బహుజన నేపథ్యమే ఐనప్పటికీ ఒకదానితో మరొకటి పోలిక లేని జీవన వీచికలివి. డా. సంధ్యా విప్లవ్ వీటిని కథా రూపంలో చెప్పారు కాబట్టి మనం కథలు అనుకోవాలే కానీ నిజానికి ఇవన్నీ సజీవ చిత్రణలే.
దాష్టిక కులాలైనా, పీడిత కులాలైనా… భారతదేశంలో అన్ని కులాల్లోనూ పురుషాధిపత్య భావజాలాలే రాజ్యమేలుతున్నాయి. బహుజన మహిళలు మిగతా సమాజం నుండి కులం సమస్యతో పాటుగా తమ కుటుంబంలోని పురుషుల నుండి హింసని, వివక్షని, అవమానాల్ని అదనంగా ఎదుర్కోవలసి వస్తుంది. పురుషాధిపత్యం పురుషుల ప్రవర్తనల నుండి కమ్యూనిటీ విశ్వాసాల వరకు అన్నింటిలోనూ కనిపిస్తుంది. ఈ కథల్లో రచయిత్రి కులానికి సమాజానికి, అలాగే జెండర్ కి పురుషాధిపత్యానికి వున్న బంధాలలోని ప్రదర్శితమయ్యే అమానుషత్వం యొక్క అన్ని హింసాత్మక, విషాద కోణాల్ని బాగా పట్టుకోవడమే కాక ఎంతో ప్రభావవంతంగా, ఆర్ద్రంగా, హృదయానికి హత్తుకునేలా, కొన్నిచోట్ల గుండెల్ని కలచివేసేలా సజీవ మహిళామూర్తుల్ని ప్రధాన పాత్రలుగా చేసుకొని రాశారు. ఆ ఆరుగురు స్త్రీలు రచయిత్రి బాల్య, యవ్వన జ్ఞాపకాలు. వారు కేవలం జ్ఞాపకాలు కాదు నిజానికి. తనకి స్ఫూర్తి ప్రదాతలు.
ఈ ఆరుగురు మహిళలు అసాధారణమైన వారని రచయిత్రి అనటంలో అర్ధం వారు సమాజంలో అందరికీ తెలిసిన లేదా అందరూ గుర్తుపట్టే సెలబ్రిటీలు కారు. వారు సాంఘికంగా పేరు ప్రతిష్టలు కలిగిన వారు కారు. ఆర్ధికంగా సంపన్నులు కాదు. ఉన్నత పదవుల్లో వున్న వారు కాదు. పెద్ద చదువులు చదివిన వారు కారు. దెబ్బ తగిలితే దుఃఖించే వారు కావచ్చు. అవమానపడితే తల దించుకునే వారే కావచ్చు. ఆ ఆరుగురిలో ఒకరు బంజారా తెగకి చెందిన దాయిని (మంత్రసాని), మరొకరు ప్రభుత్వాసుపత్రిలో ఆయా, ఇంకొకరు జిలా స్థాయి క్రీడాకారిణి, ఒకామె పాత సామాన్లు కొనడం కోసం వీధుల్లో తోపుడు బండితో తిరిగే వృద్ధ స్త్రీ, ఇంకొకామె అభాగ్యురాలైన ఒక ముస్లీం మహిళ, చివరామె ఒక సంపన్నుల గృహంలో పని చేసే నోరు లేని మూగ పనిమనిషి. మరి రచయిత్రికి వారిలో కనబడ్డ అసాధారణత్వం ఏమిటంటే అది జీవితంలో వారి పోరాట తత్వం. ఏ సందర్భంలోనూ పరిస్థితుల నుండి పారిపోక పోవడం, బాధ్యతల కాడిని దింపకపోవడం, మనుషుల్ని ప్రేమించకుండా వుండకపోవడం, మనిషి పట్ల విశ్వాసం సడలిపోకుండా తమని తాము కాపాడుకోవడం, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథాన్ని కోల్పోకపోవడం… వారిలోని ఈ లక్షణాల వల్లే రచయిత్రికి వారు అసాధారణ మహిళల్లా కనిపించారు.
“కలువతార” కథ పాఠకుల్ని 1930ల నాటి వరంగల్ జిల్లా రాంచంద్రు నాయక్ తండా గోర్ గిరిపుత్రులకు చెందిన ఒక ఇంట్లో ఒక గర్భిణీ యువతి పురిటి నొప్పులతో మొదలవుతుంది. మగ పిల్లవాడు పుట్టకపోతే తిరిగి ఇంట్లోకి రానివ్వని భర్త, అత్త మామల బెదిరింపుల నేపథ్యంలో పుట్టింటికి చేరిన ద్వాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే బతకడానికి పోరాటం చేస్తూనే మగ బిడ్డ పుట్టకపోతే తన భవిష్యత్తు ఏమౌతుందోనని భయమూ పడుతుంటుంది. ఆమె తల్లి లచ్చ క్రితం కానుపులో ద్వాలి ఒక మృత శిశువుకి జన్మనిస్తే దెయ్యం పిల్ల పుట్టిందని, అది తండాకి నష్టదాయకమని చుట్టుపక్కల వారు ఆడిపోసుకుంటుంటే సమాధానం చెప్పలేని స్థితిలో మళ్లీ ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో విపరీత మానసిక ఘర్షణకి గురవుతుంటుంది. మునుపటి మృత శిశువు కలల్లోకి మాత్రమే కాదు వాస్తవంలో కూడా ఆమెని వెంటాడుతున్న భ్రాంతికి గురవుతుంటుంది. కథ ఎత్తుగడే మనల్ని చేయిపట్టి కథలోకి లాక్కుపోతుంది. ఒక మేజికల్ రియలిజం ధోరణిలో ఉత్కంఠభరితమైన శైలిలో కథ మొదలవుతుంది. నిజానికి ఈ కథ నాయకి లచ్చ కాదు, ద్వాలీ కాదు. ద్వాలీకి పురుడు పోసిన దాయిని (మంత్రసాని) సోని ఈ కథకి నాయకి. ఇప్పటి ఆధునిక వైద్య సౌకర్యాలు, పరికరాలు, విధానాలు, ఔషధాలు లేని ఆ కాలంలో తన అనుభవం, అవగాహన, నైపుణ్యం, జ్ఞానంతో సోని గోర్ గిరిపుత్రుల ఇళ్లల్లోనే కాదు చుట్టుపక్కల గ్రామాలలో గొప్ప దాయినిగా పేరు తెచ్చుకుంటుంది. ఎంతో నిండైన, సాఫల్యవంతమైన, గౌరవప్రదమైన జీవితం గడిపిన సోని వృద్ధాప్యంలో గుండెపోటుతో హఠత్తుగా మరణిస్తే ఆమె చావు అసహజమైందని, ఆమె దయ్యమైందని తండావాసులు ఆరోపిస్తారు. ఆమెకి అంత్యక్రియలు జరగడానికి వీల్లేదంటారు. అప్పుడు ఆ తండాలోని చదువుకున్న సిపీఐ పార్టీలో పని చేసే యువకుడి జోక్యంతో ఆమెకి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరుగుతాయి. అజ్ఞానంతో, మూఢత్వంతో నిండి వున్న గ్రామీణ, తండా వాసులలో మార్పు రావడానికి వామపక్ష భావజాలం అవసరం, ప్రమేయాన్ని రచయిత్రి చెప్పకనే చెబుతారు. ఒక పీరియడ్ నేపథ్యంలో, చారిత్రిక దృష్టితో, దృశ్య చిత్రణ ప్రధానంగా సాగిన ఈ కథ పాఠకుల్ని ఒక గొప్ప భావోద్వేగానికి లోను చేయడమే కాదు, విస్మయపరుస్తుంది కూడా. బంజార ప్రజల భావజాలాలు, నమ్మికలు, ఆచారాల్ని, భాషని ఎంతో ఒడుపుగా చిత్రీకరించారు రచయిత్రి. ఇదో చకచ్చకితమైన భావనని కలిగించే కథ.
“కంలమ్మ”, “గురుదక్షిణ” కథలు రచయిత్రి బాల్య జ్ఞాపకాలు. ఆ వయసులో తన మనసు మీద ముద్ర వేసిన ఇద్దరు మహిళల గురించిన కథలు ఆ రెండు. తనని బాల్యంలో ప్రభావితం చేసిన బహుజన మహిళల జీవితాల్ని కథలుగా చెబుతున్న క్రమంలో తనని కూడా ఓ పాత్రని చేసుకొని చెప్పిన రెండు కథల్లో ఒకటి “కంలమ్మ” కాగా రెండోది “గురుదక్షిణ”. బాల్యంలో వుండే అమాయకత్వాన్ని, వ్యక్తుల పట్ల కలిగే క్రేజ్, ఆరాధనా భావాల్ని చెప్పాలంటే సునిశిత హాస్యాన్ని మించిన సాధనం లేదు. ఈ రెండు కథల్లోనూ మనకి ఆ పద్ధతి కనబడుతుంది. కంలమ్మ వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త చనిపోగా కారుణ్య నియామకం కింద మంజూరైన ఆయా ఉద్యోగం చేస్తుంటుంది. కంలమ్మ తన ఉద్యోగాన్ని జీవనోపాథిగా భావించదు. రోగుల్ని పలకరించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, డిస్చార్జై వెళ్లే వారికి వీడ్కోలు పలకడం, కొత్తగా చేరే వారికి మార్గ దర్శకత్వం చేయడం, వారి కష్టాలు సహనంతో వినడం, సహానుభూతి పరదర్శించడం…ఇలా ఒక మానవీయమైన ప్రవర్తనతో, దృక్పథంతో ఆమె తన విధుల్ని నిర్వార్తిస్తుంటుంది. వైద్య రంగంలో పని చేసే సిబ్బందికి వుండాల్సిన సహానుభూతి, మానవీయ దృక్కోణం కంలమ్మలో కనిపిస్తాయి. అదేదో వృత్తి పట్ల నిబద్ధతలా కాకుండా మనుషుల పట్ల ప్రేమ, బాధ్యత ఆమె సహజ స్వభావమని, కంలమ్మలోని ఆ లక్షణమే రచయిత పసి మనసుపై బలమైన ప్రభావం చూపించిందని మనకి అర్ధమవుతుంది. అన్ని కథల్లో కనిపించినట్లే ఈ కథలో కూడా తెలంగాణ మాండలిక మువ్వల సవ్వడి వినిపిస్తుంది. రచయిత్రి తానెంచుకున్న పాత్రల సహజ సంభాషణా శైలి ఆమె రచనా విధానానికి పెద్ద బలం. ఇదో హృద్యమైన కథ.
క్రీడలతో పిల్లలకుండే అనుబంధం గొప్పది. ఆ వయసులో ఎవరో ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీని రోల్ మోడల్ కింద పెట్టుకోవడం, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి కదలికని విస్మయంగా గమనించడం, ఆ వ్యక్తి మూర్తిమత్వం,(పర్సనాలిటీ)ప్రవర్
“పాత పేపార్లు గొంట…పాత పుస్కాలు గొంట…ఇనుప సామాన్లు గొంట..బీరు బరాండి సీసాలు గొంట” అంటూ వీధుల వెంబడి తోపుడు బండి నెట్టుకు తిరుగుతూ జీవించే డెబ్భై ఏళ్లు పైబడ్డ ఒంటరి పెంటమ్మ కథే “బతుకు బండి”. అందరితో ముచ్చట్లు చెబుతూ, కష్ట సుఖాల వివరాలు తెలుసుకుంటూ తన పాత సామాన్ల కొనుగోలు వ్యాపారం చేసే పెంటమ్మ ఒక రోజు నుండి కనబడకుండా పోతుంది. ఆమె కోసం బస్తీ వాసులు ఎదురుచూస్తుంటారు. ఆమె మాత్రం రాదు. ఇదో ఆర్ద్రమైన కథ.
పిత్రుస్వామ్యం పడగ కింద మనుగడ సాగించే ఏ మతమైనా స్త్రీ వ్యతిరేకమేనని “ఏక్ అమ్మీ ఔర్ అజహర్” కథ నిరూపిస్తుంది. తన భర్త తనతో అన్ని రకాలుగా అన్యాయంగా, స్వార్ధంగా, దుర్మార్గంగా ప్రవర్తించి, తాగుడుకి చెడుతిరుగుళ్లకి అలవాటుపడి హింసించినా సంపన్నుల ఇంట్లో వంట పని చేయడం ద్వారా అతని ద్వారా కలిగిన ఏడుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేస్తుంది రహీమా బేగం. అతనికి వున్న వివాహసెతర సంబంధంలోని మహిళ ఎయిడ్స్ వ్యాధితో చనిపోతే ఆమెకి పుట్టిన పసివాడిని భర్త నుండి ఎలాంటి సహకారం లేకున్నా చేరదీసి కన్న తల్లి కంటే మిన్నగా పెంచుకుంటుంది. కౌమార్య దశ వరకు ఎదిగిన ఆ పిల్లవాడు జన్యుపరమైన వ్యాధితో నరకం అనుభవిస్తుంటే విలవిల్లాడిపోతుంది. చివరికి వాడినీ దక్కించుకోలేకపోతుంది. అజహర్ స్థానంలో ఆమె మనవరాళ్లు చేరతారు. జీవితమంటే సుఖ దుఃఖాలకతీతమైన ఓ పోరాట ప్రయాణమని రహిమా బేగం జీవితం నిరూపిస్తుంది. ఇదో జీవన వాస్తవికతని అర్ధం చేయిస్తూ గుండెని మెలిపెట్టే కథ.
చివరి కథ “దాల్చ”. నిజానికి ఈ కథ పరిమాణం దృష్ట్యా దీన్ని కథ అనే కంటే నవలిక అనొచ్చేమో. దాల్చ అనేది వరంగల్ ప్రాంతంలో ప్రముఖమైన వంటకం. ఏ సంబరం తాలూకు దావత్లో అయినా, ఏ కుటుంబ కార్యక్రమంలో అయినా దాల్చ ఖచ్చితంగా కనిపించే వంటకం. ముందుగా పప్పు, కాయగూరలతో శాకాహార వంటకంగా తయారైన అనంతరం దానిలో మాంసాన్ని మిళితం చేస్తారు. దాన్ని దాల్చ అంటారు. ఈ వంటకం ప్రస్తావన “దాల్చ” కథ మొత్తం వస్తూనే వుంటుంది. ఇందులో ప్రధాన పాత్ర ఎడ్డి పుల్లమ్మ. అందరూ ఎడ్డి అనే పిలుస్తుంటారు. ఎడ్డి సాధారణ మహిళ కాదు. జన్యు లోపం వల్ల మెదడు ఎదగక మంద బుద్ధితో వుంటుంది. పౌష్టికాహార లోపం వల్ల కేవలం నాలుగడుగులే పెరిగింది. పంగ కాళ్లతో నడుస్తుంటుంది. ఏదీ సరిగ్గా వినపడదు, అర్ధం కాదు. మాటలు కూడా రావు. ఏ మాట్లాడినా బా…బా…ఆ…ఆవ్ అనే శబ్దాలు మాత్రమే వస్తాయి. ఈమెకి అలసట అనేదే వుండదు. చంద్రమౌళి అనే దొర కుటుంబంలో పని చేస్తుంటుంది. ఆ కుటుంబం ఆదరణకి నోచుకుంటుంది. అమెరికా నుండి ఆ ఇంటి ఆడబిడ్డ వచ్చిన సందర్భంగా ఆ కుటుంబం జరుపుకునే వేడుకని, అందులో దాల్చ వండే విధానాన్ని, వేడుక సందర్భంగా పెల్లుబుకే సాంస్కృతిక వాతావరణాన్ని రచయిత్రి చాలా బాగా వివరిస్తారు. నిజానికి ఎడ్డి మరణంతో ఈ కథని ఆపేసి వుంటే చాలా గొప్ప కథ అయివుండేది. ఎడ్డి మరణం తరువాత నడిపిన కథ సినిమాటిగ్గా అనిపించింది. ప్రపంచీకరణ బడుగు వర్గాలకు మంచి అవకాశాలు కల్పించినట్లుగా చూపించారు. ఇది కేవలం భ్రమ మాత్రమే. ప్రపంచీకరణ ఆఫర్ చేస్తున్న అవకాశాలు ప్రధానంగా పై కులాలకు మాత్రమే లబ్ది చేకూరుస్తాయి. వాస్తవానికి బహుజన కులాలకు చెందిన పేదలు విదేశాలకు వెళ్లడమంటే గల్ఫ్ దేశాల్లో నానా రకాలుగా నరకయాతన అనుభవించేదానికే పరిమితమవుతుంది. ఈ కథలో హైలైట్ చేయబడిన భూస్వామ్య దొరల ఔదార్యం కూడా ప్రశ్నార్ధకమే. ఒక మంచి కథని రచయిత్రే కొంత బలహీనపరిచారేమో అనిపించింది.
ఏదైనా సన్నివేశాన్ని దృశ్యమానం చేయడంలో మంచి ప్రతిభ కలిగి వున్న రచయిత్రి కొన్ని లోపాలని అధిగమిస్తే బాగుంటుంది. ఆమె చిన్న కథల్ని చాలా బాగా నిర్వహించగలిగారు కానీ పెద్ద కేన్వాస్ వున్న కథల్ని నిర్వహించడంలో కొంత తడబడ్డారేమో అనిపిస్తుంది. ఈ బలహీనతని ఆమె అధిగమించగలరని నమ్మకముంది నాకు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతి, భాష, యాసల పట్ల ఎంతో మంచి అవగాహన, వ్యక్తీకరించే నైపుణ్యం, వారి అభ్యున్నతి కోసం తపించే నిబద్ధత కలిగిన రచయిత్రి గొప్ప నిబద్ధతతో రాసిన కథా సంపుటి “దాల్చ”. చదవండి.
“దాల్చ” కథ సంపుటి. రచయిత్రి డా. సంధ్యా విప్లవ్. వెల 200 రూపాయిలు. కాపీలకు 8978677018 / 9494555141
ప్రముఖ సాహిత్య విమర్శకులు అరణ్య కృష్ణ గారికి కృతఙ్ఞతలు. ఇంత సమగ్ర విశ్లేషణ కథలకు లభించడం చాలా ప్రోత్సాహకారంగా ఉంది. మీ సూచనలు కూడా దృష్టిలో ఉన్నాయి తదుపరి రచనలు ఇంకా విభిన్నంగా ఉంటాయి. అరణ్య కృష్ణ గారికి కృతజ్ఞతలు.
సారంగా ఎడిటర్ అండ్ టీం కి కృతజ్ఞతలు.