శిశిరం గుర్తొస్తుంది నాకు..
పచ్చని స్మృతి గీతాలతో
విరబూసిన పరిమళాలు
మది నిండా నింపుకుని
ఆకులన్నీ రాల్చేసి మళ్లీ
చిగురించాలని ఆశపడే
శిశిరమే గుర్తొస్తుంది నాకు..
ఎన్ని నీడల సామ్రాజ్యమది.
ఎన్ని తుంట’రాళ్ల’ దెబ్బలు
ప్రేమతో భరించి ఫలాలిచ్చిన
విశాలమైన హృదయం అది.
ఎన్ని గిజిగాళ్ల గూళ్ళకోసం
తనువిచ్చిన అమ్మతనమది.
ఎన్ని తుఫాన్లను ధిక్కరించి
గెలుపొందిన గాంభీర్యమది.
పర్యావర పరిరక్షణలోనే
నిరంతరం నిమగ్నమయ్యే
ఎంత గొప్ప ఔన్నత్యమది..
విషవాయువులని పీల్చేని
ప్రాణవాయువునందించే
ఎంత ఉన్నత వ్యక్తిత్వమది.
వంశాభివృద్ధికి విత్తనమై
మొలకై.. మొక్కై.. మానై
వేవేల శాఖలుగా విస్తరించి
పుష్పించి ఫలదీకరించాకా
ప్రకృతి ధర్మానికి తలొంచి
మోడైన మహావృక్షమంటి
వృద్ధాప్యం ఎప్పుడెదురైనా
నాకు శిశిరమే గుర్తొస్తుంది.
ప్రేమగా నిమరాలనిపిస్తుంది.
*
మంచి కవిత సర్ ! అభినందనలు.
వృద్ధాప్యం ఎదురైనా శిశిరమే గుర్తొస్తుంది
బాగుందన్నా పోయం
వృద్ధాప్యం ఎప్పుడెదురయినా
నాకు శిశిరమే గుర్తొస్తుంది
ప్రేమగా నిమరాలనిపిస్తుంది.
వెరీ నైస్
Wow awesome
బావుందండీ…మీ ఊహ అద్భుతం👌👌👌