పేరులోనే ‘వేట’ అనే వృత్తి కలిగిన షికారీలు వొక ప్రత్యేకమైన సంచార జాతి. వీరు ఆంధ్ర ప్రదేశ్ కి మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో వీరు నివశిస్తున్నారు. యూల్ బర్నర్, ఎడ్గర్ థర్ స్టన్, వకుళాభరణం లలిత వంటి పరిశోధకులు షికారీ జాతి గురించి కొంతమేరకు అధ్యయనం చేశారు. ఎడ్గర్ థర్ స్టన్ వీరిని తమిళనాడులో నివశించే మరొక సంచార జారి ‘కొరవలు’ తో పోల్చాడు. షికారీలకు మహారాష్ట్రలో ‘పార్ధీలు’, కర్ణాటక లో ‘హక్కి’, ‘పిక్కీ’ ‘చంచర్’ అనే పేర్లు వున్నాయి. సంస్కృతిలో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నివశించే ‘నక్కల’వారికి, ‘గువ్వల’ వారికి షికారీలకు దగ్గరితనముంది. ప్రభుత్వ అధికార పత్రాల ప్రకారం యితర రాష్ట్రాలలో వీరు షెడ్యూలు తెగల జాబితాలో వున్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో వీరు వెనుకబడిన కులాల జాబితాలో వున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోనూ, కర్నూలు జిల్లాలోని మునగాలపాడు, పసుపుల, గూడూరు, వోర్వకల్లు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆత్మకూరు, జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణాలలో వీరు నివసిస్తున్నారు. వీరికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నివశించే షికారీలతో సంబంధాలున్నాయి. షికారీలు చత్రపతి శివాజీ ఆంధ్ర ప్రదేశ్ దండయాత్ర సమయం లో వొచ్చి యిక్కడే స్థిరపడ్డారని వారిచ్చిన సమాచారాన్ని బట్టి అర్ధమవుతుంది. తమది శివాజీ వంశమని, ఆయన్ని తాము దేవుడిగా భావిస్తామని షికారీ తెగకు చెందిన పెద్దలు చెబుతారు. జాన్సన్ Sketches of Field Sports అనే పుస్తకంలో షికారీలు యూరోపియన్లతో కలిసి వేటలో పాల్గొనేవారని వీరు హిందువులలో తక్కువ జాతి వారని రాస్తే, వకుళాభరణం లలిత వీరికి బహుశా! యూరోపియన్లే ‘షికారీ’ అనే పేరు పెట్టి వుండొచ్చని అంటారు. షికారీలలో ‘నీర్ షికారీ’, ‘శెట్టి షికారీ’ అనే వుప తెగలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ గెజిట్ ‘నీర్ షికారీలను నేరస్థ జాతుల జాబితాలో వొకరిగా ప్రస్థావించింది. యితర ఆదిమ తెగలవలెనే షికారీలను కూడా నేరస్థ జాతుల చట్టం ప్రకారం పరిగణన లోనికి తీసుకుని వుండొచ్చు.
షికారీలకు మార్వాడీలు వొకే తండ్రికి వేర్వేరు తల్లుల వలన పుట్టినవారి వారిద్దరిదీ రక్త సంబంధముందని షికారీలు చెబుతారు. షికారీలు మొదటి భార్య సంతానమైతే, మార్వాడీలు రెండవ భార్య బిడ్డలని, మార్వాడీల తల్లి తన భర్త కుటుంబ అవసరాలకిచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసి తన బిడ్డలను ధనవంతులను చేసిందని వారు వివరించారు. మార్వాడీల వద్ద షికారీలు యాచన కెళ్ళినప్పుడు వారు షికారీలకు చద్దిపడిపోయిన అన్నం పెట్టకుండా అప్పుడే వండిన వేది అన్నం పెడతారని దానికి కారణం తమ రక్త సంబంధమేనని వారు అంటారు. అయితే మార్వాడీలు దానిని అంగీకరించరు.
షికారీల ప్రధాన వృత్తి జంతువులను వేటాడడం. ‘గొప్పెన్’(catapult) ను వుపయోగించి పక్షులను కొడతారు. ‘గొప్పెన్’, ‘టాంటలోన్’, ‘కండలెన్’, ‘జాలిన్’, ‘పిపియన్’, ‘మాంగరిన్’ అనే ఆయుధాలను వారు వేటకు వుపయోగిస్తారు. గొప్పెన్ అనే వేటాడే పరికరాన్ని వారికి తమ కులదేవతయైన కొడియన్ దేవి యిచ్చిందని చెబుతారు. పూర్వం మహారాష్ట్రలో ‘సవాయ్ లోధి’ అనే రాజు తమ జాతిలో వుండేవాడ్ని, అతని కొడుకైన ‘లగ్మన్’ పశువులను కాస్తుండగా వొక ముసలి స్త్రీ వొక దేవాలయం నుండి వచ్చి యేదైనా వరం కోరుకోమంటే అతడు యితర సంపదలేవీ అడగకుండా ఆమె చేతిలో వున్న కర్రతో యేదైనా ఆయుధం చేసి యివ్వమని అడగగా ఆమె లగ్మన్ కి గొప్పెన్ ను చేసిచ్చి ఆ సందర్చంగా ఆవులు, కోతులు, కాకులు, పాములు, పిల్లులను చంపొద్దని అతనితో ప్రమాణం చేయించుకుని వెళ్ళిందని షికారీలు తమ పుట్టు పూర్వోత్తరాల గురించి చెబుతారు. యీ వృత్తాంతం మాట యెలా వున్నా షికారీలు పైన చెప్పిన జంతువులు, పక్షులను వేటాడాడరు.
యిటీవల కాలం వరకు వేట ప్రధాన వృత్తిగా వారు బతికి దొరికిన పక్షులను వేటాడి వాటి మాంసంతో జీవిస్తున్నారు. వేటలో దొరికిన జంతువుల మాంసాన్ని తమ సమూహంలో అందరూ సమానంగా పంచుకుంటారు. అన్ని జంతువుల మాంసాన్ని కలిపి వండుకుని తినడం వారికి అలవాటు. షికారీలకు నక్క మాంసం అంటే యెంతో యిష్టమని చెబుతారు. షికారీలలో కొన్ని గోత్రాల స్త్రీలు తమ గోత్రానికి సంబంధించిన నియమం ప్రకారం కోడి, పొట్టేలు, దున్నపోతు వంటి జంతువుల మాంసాన్ని, కోడిగుడ్లను తినరు. తమ జాతి నియమాన్ని అతిక్రమించి వాటిని తింటే తాము అనారోగ్యం పాలవుతామని వారి నమ్మకం.
షికారీల మరో వృత్తి సారా తయారు చేసి అమ్మడం. వారు సొంతగా తయారు చేసిన సారాని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తుంటారు. వారి సారా తయారీపై ఆంక్షలున్నప్పటికీ రహస్యంగా యిళ్ళలోనూ, చెట్ల పొదల్లోనూ సారా తయారు చేస్తుంటారు. గతంలో షికారీలు దొంగతనం చేసేవారని తెలుస్తుంది. వేటాడడానికి కొన్ని ప్రదేశాలను యెన్నుకుని అక్కడ తాత్కాలికంగా జీవించేటప్పుడు తమ సమీపంలో వుండేవారివద్ద అన్నం అడుక్కుంటారు. అడుక్కోవడానికి యితరుల యిళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలను గమనించి తర్వాత ఆ యిళ్ళకు కన్నం వేస్తారు. అడుక్కోవడానికి గుంపుగా వెళ్ళి పెద్దగా అరుస్తారు. షికారీలన్నా వారి అరుపులన్నా యితరులకు భయం. షికారీలు తమ గ్రామానికి వచ్చారంటే దొంగతనం జరగవచ్చని గ్రామస్తులు భయపడతారు. అయితే గ్రామంలో అడుక్కునేటప్పుడు వారు మాల, మాదిగ కులాలు యిచ్చిన ఆహారాన్ని తీసుకోకుండా వారి పట్ల అంటరానితనాన్ని పాటిస్తారు.
షికారీల సామాజిక జీవనం, స్త్రీల స్తితిగతులు ప్రత్యేకంగా వుంటాయి. వారి కుల కట్టుబాట్లు కఠినంగా వుంటాయి. కుల పంచాయతీ, వ్యక్తిగత జీవితంలో కుల పెద్దల జోక్యం యెక్కువేనని చెప్పాలి. షికారీలు పితృస్వామిక కుటుంబ విధానాన్ని పాటిస్తారు. వివాహాలు పెద్దల నిశ్చయం ప్రకారం, యువతీ యువకుల యిష్ట ప్రకారం జరుగుతాయి. నిశ్చయ తాంబూలాలలో తమలపాకుల్లో చెక్కెర, కుంకుమ పెట్టి యురువైపుల వారు వొకరికొకరు యిచ్చుకుంటారు. పెళ్ళి ఖర్చులు మగపెళ్ళి వారు భరిస్తారు. వివాహ విశ్చయం తర్వాత వధూ వరులిద్దరిళొ యెవరైనా వివాహం వద్దనుకుంటే వారు కుల పెద్దలకు 500 రూపాయలు జరిమానా కట్టవల్సి వుంటుంది. ఆ డబ్బుని పెద్దలు వృద్దులకు దానంగా యిస్తారు. భార్యా భర్తల తగువులు, విడాకుల వంటివి కుల పెద్దలే అప్రిష్కరిస్తారు. స్త్రీ తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఆమె పెళ్ళి సమయంలో ఆమె భర్త తరుపున తల్లిదండ్రులు పెళ్ళి ఖర్చులో సగ భాగాన్ని వారికి చెల్లించవల్సి వుంటుంది. పురుషుడు తన భార్య నుంచి విడాకులు పొందాలనుకుంటే అతడేమీ చెల్లించాలిసిన పని లేదు. షికారీ కులానికి చెందిన యువతీ యువకులుపెద్దల ప్రమేయం లేకుండా పారిపోయి పెళ్ళి చేసుకుంటే వారు అమ్మాయి 50 రూపాయలు, అబ్బాయి 525 రూపాయలు కులపెద్దలకు జరిమానా కింద కట్టవల్సి వుంటుంది. కులాంతర వివాహాలను షికారీ పెద్దలు ఆమోదించరు. యితర కులాలవారిని వివాహం చేసుకునా, అక్రమ సంబంధం పెట్టుకున్నా వారిని తమ కులం నుంచి వెలివెయ్యడమనే ఆనవాయితీ షికారీలలో వుంది. షికారీ స్త్రీ తమకంటే ‘తక్కువ’ అని భావించే వ్యక్తిని వివాహం చేసుకుంటే గంగరేని ముల్లుతో ఆమె ముక్కు కుడివైపు చివరన కోసి, యెడమ చెవిని పొడిచి వాత పెడతారు. మగ వాళ్ళు అదే ‘తప్పు’ చేస్తే వారి యెడమ చెవిని గంగరేని ముల్లుతో పొడిచి వాత పెడతారు. ఆ తర్వాత తమ కుల దేవతలందరికీ వొక్కొక్క రూపాయి చొప్పున వారి చేత జరిమానా కట్టిస్తారు. యీ లోపల వారి యింట్లో సామాను ముట్టుకుంటే వొక్కోదానికి వొక్కో రూపాయి చొప్పున జరిమానా వేసి కొరడాతో కొడతారు. అక్రమ సంబంధం కలిగిన స్త్రీ తన తప్పును అందరి ముందు వొప్పుకుని తన భర్తకు, పెద్దలకు కాళ్ళు మొక్కాల్సి వుంటుంది. కొన్నిసార్లు అక్రమ సంబంధం వున్న స్త్రీ పురుషులను కలిపి తాళ్ళతో కట్టేసి వాళ్ళ తలపైన 50 కేజీల బరువుండే గుండు పెట్టి గొలుసులతో కొడతారు.
షికారీ కుటుంబాలు పితృస్వామిక విధానాన్ని కట్టుదిట్టంగా పాటించినప్పటికీ స్త్రీలు ఆహార సేకరణ నుండి సారా తయారు చేసి అమ్మడం వరకు కుటుంబ భారాన్ని మోస్తుంటారు. స్త్రీలకు ఆస్థి హక్కు లేదు. మగ సంతానం లేని కుటుంబాలలో ఆస్థి ఆడపిల్లలకు కాకుండా దాయాదులకు చెందుతుంది. దాయాదులకు కూడా మగ సంతానం లేకపోయినప్పుడు తల్లిదండ్రుల ఆస్థి వారి అల్లుడికి చెందుతుంది. భర్త చనిపోయిన స్త్రీని ఆమె సోదరుడు వివాహం చేసుకునే ఆచారం షికారీ తెగలో కూడా వుంది.
షికారీల మత సంస్కృతి యితరుల కంటే భిన్నంగా వుంటుంది. వారిలో హారకతియా, హిక్కోతియా, చావండియా, పిండలాజ అనే యేడు గోత్రాలున్నాయి. వీరందరికీ ‘ధనీభావో’ అనే దేవుడు కులదైవంగా వుంటాడు. ధనీభావోకు యేడుగురు కుమార్తెలు. వారు వొక్కో తెగకు కుల దేవతగా వుంటారు. వారితో పాటు షికారీలు దుర్గా దేవిని కూడా కొలుస్తూ ప్రతి సంవత్సరం ఆమె కోసం జాతర నిర్వహిస్తారు. వారి జాతరలో జంతు బలి, మద్యపానం తప్పనిసరిగా వుంటుంది. జాతరలో అమ్మ వారికి దున్నపోతును బలి యిస్తారు. వారికి తమ తెగకు చెందిన పూజారి వుంటాడు. అతడే జాతర, పండుగలు, మత సంబంధమైన ఆచారాలను నిర్వహించడంలో పౌరోహిత్యం చేస్తాడు. జాతరలో దున్నపోతును నరికినప్పుడు చిందిన రక్తంతో నైవేద్యం పెడతారు. తర్వాత ఆ నైవేద్యాన్ని అన్నం, నెయ్యితో కలిపి దేవత యెవరి శరీరాన్ని ఆవహిస్తుందో ఆ వ్యక్తి చేతులతో పట్టుకోకుండా నేరుగా నోటితో అందుకుని తింటాడు. యీ ఆచారాలు ఆఫ్రికన్ పాటించడం విశేషం.
షికారీలు వుత్తరాది రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన తెగ కాబట్టి వలస వచ్చి సంచార జీవనం గడిపే క్రమంలో వారి భాష మరాఠీ, హిందీ, వుర్దూల సమ్మేళనంగా మారిపోయింది. వీరి భాషకు లిపి లేదు. షికారీల స్వభావం క్రూరంగానూ, మొరటుగానూ వుంటుందని యితరులు అంటారు. వారు దొంగతనాలు చెయ్యడంలో అరితేరినవారని వలసవాద ప్రభుత్వ రికార్డులు పేర్కొన్నాయి. బ్లేడును నోట్లో వేసుకుని నమిలి శతృవు మీద వుమ్మడం వారికి అలవాటనీ, షికారీలు మూర్ఖులనీ, యితరులను నమ్మరనీ, అనుమానం కలిగితే యెదుటివారిని చంపడానికి వెనుకాడరనీ, నమ్మితే ప్రాణం యిస్తారనీ షికారీల స్వభావం గురించి యితరుల అభిప్రాయం. అలాగే షికారీలు అపరిశుభ్రంగా వుంటూ బట్టలు మాసిపోయేదాకా మార్చుకోరనీ, స్త్రీలు యిటీవలి కాలం దాకా రవికలు తొడుక్కునేవారు కాదని తెలుస్తుంది. స్త్రీలు ధరించే చీరలో కొంతభాగం కత్తిరించి మగవారు గోచీ పెట్టుకుంటారని పరిశీలకులు పేర్కొంటారు. షికారీల పిల్లలు సరైన పోషకాహారం లేక రోగాల పాలౌతుంటారు. అయితే షికారీలు స్థిర నివాసం యేర్పాటు చేసుకునే ప్రయత్నంలో వారి అలవాట్లలో క్రమంగా మార్పులొస్తున్నాయి. గతంలో వారి వృత్తులైన వేట, సారా తయారు చేసి అమ్మడం వంటివి మానేసి ఆటో డ్రైవర్లుగానూ, వాచ్ మెన్లు గానూ రోజువారీ కూలీలుగానూ తమ జీవనోపాధిని సంపాదిస్తున్నారు. పిల్లలను చదించడం కూడా షికారీలు ప్రారంభించారు.
*
Magnificent research on pardhees(shikaaree)
Thanks to madam swaroopa Rani
నేను మార్వాడీలు,లంబాడీలు ఇద్దరూ ఒకే తండ్రికి ఇద్దరు స్త్రీలకు కలిగిన సంతానం అని విని వున్నాను..అది అబద్దమని తేల్చేశారు. శివాజీ వారసులే ఈ షికారీలు అన్నది తెలియచేసిన చల్లపల్లి స్వరూపరాణి గారికి కతజ్ఞతలు
valuable information. thanq thanq swaroopaji