నేను నీకేసి చూస్తుంటాను…
అవిరళ సంగమ క్షణాల కోసం నిరీక్షిస్తూ!
నేను నీ కోసం ఆశ పడుతుంటాను…
అనంత మోహాస్పద దృక్కులతో స్పర్శిస్తూ!
నువ్వు నా ఎదటే ఉంటావు…
నాలోని నేనేమిటో, తహతహ ఏమిటో పరామర్శిస్తూ,
తాహతు ఏమిటో నిశిత వీక్షణలతో పరీక్షిస్తూ!!
ఈ ప్రపంచం రెండుగా చీలిపోయే బీభత్సాంశాలు
నాకు అంటకుండా, చెవుల చుట్టూ జోరీగలవుతుంటాయి!
వాటిని నీ మాటలతో నాలోకి వంపుతూ
క్షుద్ర చర్చోపచర్చలను అనంతంగా సాగిస్తుంటావు!!
అధికారానురక్త నిమ్న జీవుల కూహకాల్లో దొర్లే
ఎత్తులు – ఎదురొత్తులు పృష్ఠ విసర్జిత వ్యర్థాలనిపిస్తాయి!
ఈ ఏకాంతంలో వాటిని నాలోకి పంపుతూ
పరస్పర అభిముఖ విశ్లేషణల్తో సదా శోషిస్తుంటావు!!
సాహితీ కళా సాంస్కృతిక వైభవ స్తోత్రాలూ సమీక్షలూ
సృజనాత్మకతల వైశిష్ట్యాలూ అన్నీ చేదుగా రుచిస్తుంటాయి!
అవిచ్ఛిన్నంగా తాదాత్మ్యం చెంది, నాలోకి నింపుతూ
ఉపరితల పరిజ్ఞానపు లోతులను తడుముతుంటావు!!
మేథస్సూ…
రాజకీయ జ్ఞానమూ…
సాహితీ పారంగతమూ…
విస్తృత వ్యవహార అభినివేశమూ…
నాలో అన్నీ చూడగలుగుతున్నావే… స్వామీ
మోహాజ్వలితమై తనువంతా భస్మమౌతోంటే…
భగభగమని రగులుతున్నదేమిటో ఎరగవేం?
విరి క్షతముల అలజడిని ఊరడించవేం??
శరమై.. సుస్వరమై… రసమై.. సరసమై…. నువ్వే…
భుగ భగ తాపమోపగా రావేం? నాటుకుపోవేం??
పెయింటింగ్: కె.ఎ. మునిసురేష్ పిళ్లె
Suresh pen power, capable journalist
” మోహాజ్వలితమై తనువంతా భస్మమౌతోంటే…
శరమై.. సుస్వరమై… రసమై.. సరసమై…. నువ్వే… రావేం? ”
శ్రీకాళహస్తి మునిసురేష్ సామే !
ఇది నువ్వు సువర్ణముఖీ నదీ తీరాన్న స్వయంభువు శ్రీకాళహస్తీశ్వరుడి కెదురుగా నిలిచి ప్రార్ధిస్తున్నట్లుగా నాకెందుకు అనిపిస్తాన్నాది సామీ ?
ఆది దిగంబరేశ్వరుడు లా పైనున్న ఆ ఆయమ్మి కో ఆరుమూరల చీర కొనిపెట్టి, నుదుటిన కస్తూరి తిలకం తీర్చిదిద్దితే నీ సీగాన ప్రసూనాంబ శారీరాలకతీతమైన అత్మీయతలను నీపై వర్షిస్తుంది ( బాపు ముళ్లపూడి గార్ల సీగాన ప్రసూనాంబ లాంటిదన్న మాట ).
మనకంత అదురుష్టం నొష్టన రాసుంటే ఆ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు నీపై దీవెనలు కురిపించి …. మోహాజ్వలిత భుగ భగ తాపం నుండి నీ దృష్టిని మరల్చి …. కైలాసపతి కోసం తానెందుకు అగ్నిశిఖలలోకి ప్రాయోపవేశం చేసిందీ అవగతం చేసి …. అలౌకికానందాల జ్నాన పరితాపాలకి దారిచూపుతుంది.
( హయ్య బాబోయ్! గొరుసన్నా !! నాలాంటి నేలక్లాసు ప్రేక్షకుడు ఇట్టాంటి కామెంట్ రాసాడంటే నాకే నమ్మ బుద్ది కావటం లేదు. ఆ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారే నాచేత ఇలా రాయించారా?! మా సంగంవోళ్లు నొచ్చుకోకుండా ఇక నేనా భాస్కరుడి అరుణారుణ వర్ణాల మాటున దాంకుంటా )