శతజయంతుల జీవన పాఠాలు

ది నలుగురు  గొప్ప రచయితల శత జయంతి సంవత్సరం. ఆరుద్ర, బైరాగి, మునిపల్లె రాజు, దాశరథి ఈ నలుగురి శతజయంతులు ఈ ఏడాది జరుపుకుంటున్నాం.  గత అయిదేళ్లలో ప్రముఖ  రచయితల శతజయంతులు ఎన్నో జరుపుకున్నాం. 1925 నుంచి 1935  వరకూ తెలుగు సాహిత్యంలో ఎందరో పుట్టిన దశాబ్దం కాబట్టి ఇంకా కొందరి శతజయంతులు తప్పక వస్తాయి.

తెలుగు సాహిత్య చరిత్రలో ఇరవయ్యవ  శతాబ్దం మొదటి మూడు  దశకాలు అనేక రకాలుగా ముఖ్యమైనవి. సామాజికంగా, రాజకీయంగా తెలుగు నేలలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల్ని అనేక మంది తెలుగు రచయితలు తమ రచనల్లో పదిలపరిచారు. కొంతమంది సాహిత్యానికే పరిమితం కాకుండా, ఆ  కాలం నాటి సామాజిక రాజకీయ ప్రజా జీవనంలో కూడా భాగమయ్యారు.

వీళ్ళందరి జీవితాలు, రచనల నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఆ రచయితలూ కవుల సాహిత్య కృషిని నెమరేసుకునే సమయంలో మొత్తంగా వాళ్ళ జీవితాలు నేర్పుతున్న పాఠాల సారాంశం ఏదైనా మనం తీసుకుంటున్నామా? లేదా, కనీసం ఒక ఆలోచన అటు దిశగా వెళ్తోందా?!

1920 నుంచి 1925 దాకా అయిదేళ్ళ కాలం తీసుకుంటే…ఆరుద్ర, బైరాగి, మునిపల్లె రాజు, దాశరథి  రావి శాస్త్రి, బెల్లంకొండ, అనిశెట్టి, రెంటాల ఇలా ఎన్నో పేర్లు గుర్తుకొస్తున్నాయి. ఈ జాబితాలో చేర్చవలసిన పేర్లు ఇంకెన్నో ఉండవచ్చు . వీళ్లలో ఎంత మంది రచనలు మళ్ళీ మళ్ళీ మనం ఎన్ని చదువుతున్నాం? రచయితలుగా వీళ్ళ జీవితాల నుంచి మనమేం నేర్చుకున్నాం? వాళ్ళ రచనల్లో ఎన్ని కాలానికి నిలబడ్డాయి?అందుకు కారణాలేమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన  సందర్భం ఇది.

వీళ్ళల్లో కొందరు నాలుగైదు పుస్తకాలు మాత్రమే రాస్తే కొందరు దాదాపు వందో, రెండొందలో  పుస్తకాలు రాశారు.ఈ రచయితల సుదీర్ఘ కృషిలో రాశి కూడా బలమైన పాత్ర పోషించినా, వాసి వాళ్ళను ప్రత్యేకంగా నిలబెట్టిందని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయనక్కరలేదు. వాసి లేకుండా రాశి పోసిన సాహిత్యం ఎంతో ఎటో కొట్టుకుపోయిన అనుభవాలు కూడా మనకున్నాయి.

శత జయంతుల రచయితల్లో కనీసం ఒక్కొక్కరి నుంచి ఒక్కో పుస్తకమైనా ఇవాళ మనం మళ్ళీ చదువుకోవాల్సినవి వున్నాయి.

ఈ రచయితలందరినీ కలిపే సాధారణాంశం  ఒకటుంది. వీళ్ళందరూ దాదాపుగా భారతీయ సాహిత్యంతో పాటు, ప్రపంచ సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు. కొందరు అనేక అనువాదాలు చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా, ప్రపంచ, స్థానిక సామాజిక రాజకీయ పరిణామాల్ని అవగాహన చేసుకుంటూ, పీడితుల  పక్షాన నిలిచారు.

ఆకలిదప్పులు, అన్యాయం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, మానవత్వపు విలువలు, మానవ సంబంధాలకు తమ రచనల్లో పెద్ద పీట వేశారు.  కేవలం ఆనాటి రాజకీయ, సామాజిక సన్నివేశంలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అవి మాట్లాడి తీరాల్సిన అంశాలు. పీడితుల పక్షాన నిలబడటమే రచయిత ప్రధాన కర్తవ్యం. రాజాశ్రయంలో గొప్పగా బతికిన కవులూ, రచయితల రచనలు  సంఖ్యానేకం అయినా వాళ్ళ తరవాతి కాలాల్లో  ఎక్కువ  జీవించలేదు.

ఇవాల్టి రచయితల్లో ఎంత మందికి ఈ విషయాల పట్ల అవగాహన, నిబద్ధత వుంది? మన పూర్వ రచయితలూ కవుల అంకిత భావం మనలో ఎంతమేరకు వుందన్నది ప్రశ్నే!

చూస్తూండగానే గత పదేళ్ళలో సాహిత్య రంగం చాలా మారిపోయింది. కొత్త సాంకేతిక మార్పుల్ని సాహిత్యం పట్టించుకొని తీరాల్సిన స్థితి ఏర్పడింది. ఎందుకంటే, ఇవాళ సాహిత్య ప్రచారానికి అవే ప్రధాన సాధనాలుగా మారిపోయాయి కాబట్టి.

అవార్డుల కోసం, పురస్కారాల కోసం, తక్షణ కీర్తి ప్రతిష్టల కోసం ఎన్నెన్ని పైరవీలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నిత్యం వెలుగులో ఉండటం కోసం ఒకొక్కరు వేస్తున్న ఎత్తుగడలు రాజకీయ కౌటిల్యుడికి కూడా తెలిసి ఉండవు.

పత్రికలకు రచన పంపాక ఆగే సహనం కూడా ఉండటం లేదు కొందరికైతే. ఆలస్యమైతే సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకోవటమే కాకుండా, సొంత పత్రికలు పెట్టుకున్న వాళ్ళున్నారు. ఒక రచన అచ్చైన ప్రతి వారు రచయితే. ఒక పుస్తకం వచ్చిన ప్రతి వారి కన్ను సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్, బుకర్ ప్రైజ్ ల మీదే.  ఏ ఒక్కరూ పక్కవారి రచనలు చదవటానికి, చదివామని చెప్పటానికి కూడా సిద్ధంగా లేరు. ఇవి కేవలం ఏ ఒకరిద్దరి గురించో కాదు. ఇలా చేస్తున్న రచయితలెవరో పేర్లు చెప్పక్కరలేదు. రచయితల మధ్య స్నేహ సంబంధాలకు  కుడి ఎడమల అంతర్యుద్ధం మరొక ప్రతిబంధకం కులమతాలకు తోడు. రచయితలుగా ఎవరు నమ్మిన సిద్ధాంతాల వైపు వాళ్ళు నిలబడగలిగే హక్కు, స్వాతంత్ర్యం వారికున్నాయి. కానీ అవి వ్యక్తులుగా మన మధ్య స్నేహాన్ని, మానవ సంబంధాలను కూడా నిర్దేశించటం విచారకరం.

చదవకుండానే, రాయకుండానే  స్టేజీ లెక్కి మాట్లాడే విమర్శక శిఖామణులు సాహిత్యానికి వచ్చిన మరో ముప్పు. ఒక పక్క తక్షణ కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు, పురస్కారాలు, జేజేల కోసం ఆరాట పోరాటాలు, మరో పక్క మంచి సాహిత్యాన్ని చదవకపోవటం వెరసి తెలుగు సాహిత్య స్థాయి మిగతా భాషలతో పోలిస్తే వెనుక పడే వుంది.

అనువాద రంగంలో సమస్యలు వేరే రకం. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి వెళ్తున్నవి తక్కువ, ఇంగ్లీష్, ఇతర భారతీయ భాషల నుంచి తెలుగు లోకి అనువాదాలు మాత్రం మొదటి నుంచి బాగా వస్తున్నాయి. అయితే ఇందులోని రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. మూల భాష నేర్చేసుకున్నామని చెప్పే మాటల్లో నిజానిజాలు ఎవరికీ తెలియవు. కొందరు అనువాదాలు చేయరు. కానీ చేసే వాళ్ళ మీద మాత్రం బండ రాళ్ళు విసురుతారు. ఇందులో సాహిత్య ప్రయోజనం కంటే స్వార్థమే కనిపిస్తుంటుంది. సద్విమర్శ చేయవచ్చు. తప్పొప్పులను ఎత్తి చూపి మంచి అనువాదాన్ని ప్రోత్సహించటం ఆరోగ్యకరం.

తెలుగులో కొత్త పబ్లిషర్స్, కొత్తతరం రచయితలు గత రెండేళ్ళల్లో ఎక్కువవటం శుభ పరిణామమే. ప్రింట్ ఆన్ డిమాండ్ వచ్చాక మొదటి వంద కాపీలు కూడా మొదటి ముద్రణ కిందే లెక్క. కొందరేమో నాలుగో ముద్రణా, అయిదో ముద్రణా అంటూ బెదరగొట్టేస్తున్నారు. పుస్తకాల అమ్మకాల లెక్కలు మాత్రం తెలియవు. నక్క తోక తొక్కి మీరు కానీ Insta Influencer అయితే మీ పుస్తకం సేల్స్ ఆరు అంకెల దాకా పోవచ్చు. మరో పక్క కనీసం వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోవటం లేదని కొందరి మొత్తుకోళ్ళు. కనీసం అయిదొందల కాపీలైనా  అమ్మితే కానీ అణా పైసా రాయల్టీ  ఇవ్వమంటున్న పబ్లిషర్స్ వెరసి సొంత ఖర్చుతో పుస్తకాల ప్రచురణ.ఇదీ తెలుగు సాహిత్య పరిస్థితి.

పైరసీ, గ్రంథ చౌర్యం, కృత్రిమ మేధ అదనపు సమస్యలు. వీటన్నింటి కంటే ప్రధాన సమస్య మరొకటుంది. సినిమా ఛాన్స్ లను దృష్టిలో పెట్టుకొని రచనలు చేయటం. ఒక కథో, నవలో సినిమాగానో, టీవీ సీరియల్ గానో తెరకెక్కితే మంచిదే. కానీ తెర కెక్కటం కోసమే రచనలు చేయటం, సినిమా స్థాయిని దృష్టిలో పెట్టుకొని తెలుగు సాహిత్యాన్ని అంచనా కట్టడం వల్ల తెలుగు సాహిత్యానికి జరిగే కీడే ఎక్కువ.

శతజయంతులంటే ప్రత్యేక సభలు, సమావేశాలు, కాంస్య విగ్రహాలు, ప్రత్యేక సంచికలే కానక్కర లేదు. ఆయా రచయితల పుస్తకాలు కొని చదవండి. వీలైతే అవి ఎందుకు నచ్చాయో, నచ్చలేదో నాలుగు వాక్యాలు రాయండి.

ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని ఒక్క చేత్తో చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆరుద్ర చేసిన జీవిత కాలపు కృషి ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ చదవండి. ‘నూతిలో గొంతుకల’తో మాట్లాడిన కవి బైరాగి కవిత్వలోకంలో పలవరించండి. ‘కోటి రతనాల వీణ నా తెలంగాణ’ అని నినదించిన కవి దాశరథితో గొంతు కలపండి. ‘అస్తిత్వ నది ఆవలి తీరాన’ మునిపల్లె రాజు సృజించిన మార్మిక లోకం లోకి వెళ్ళి రండి.

పుస్తకాలకు సేల్స్ వుంటాయి కానీ సాహిత్యానికి కాదు. రచయితలారా మీరెటు వైపు?

*

కల్పనా రెంటాల

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వర్తమాన తెలుగు సాహిత్యపు విషాద దృశ్యాన్ని చక్కగా ఆవిష్కరించిన కల్పనగారికి ధన్యవాదాలు.

  • ప్రస్తుతం తెలుగు సాహిత్యంపై పేరుకుంటున్న పాచిని యాసిడ్ వేసి మేరీ కడిగేశారు కల్పనగారు … చాలా బాగా రాసారు . ధన్యవాదాలు .

  • మంచి వ్యాసం కల్పన గారు. గతించిన సాహిత్య దిగ్గజాలని కనీసం ఇలా అయినా తలుచుకోవాలి, వారి ప్రేరణలను గుర్తు చేసుకోవాలి, మనం ఎక్కడున్నా, ఎటు వెళ్తున్నాం అని గమనించుకోవాలి.

  • శతజయంతుల జీవన పాఠాలు వ్యాసం వాస్తవాలకు దగ్గరగా ఉంది. నేటి సాహిత్యం తీరు చూస్తుం టే ఎవరికైనా బాధ కలుగుతుంది. కేవలం వాస్తవాలను విస్మరించి కల్పనా ప్రపంచంలో విహారించటం వల్ల ఒరిగేదేమీ లేదు. నలుగురు శతజయంతుల సందర్భంగా వారు రాసినటువంటి రచనలు చదివితే ఆనాటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవనస్థితిగతులు అర్థమవుతాయి కేవలం విగ్రహాలు పెట్టడం లేదా మరి వేదికల మీద సభలు నిర్వహించటం వాటి వల్ల పెద్దగా ఒరిగేది ఏది లేదు.కనీసం నేటి తరం వారు ఆనాటి రచనలు చదివి వారి నుండి స్ఫూర్తి పొందితే బాగుంటుంది కల్పన గారికి అభినందనలు

  • వ్యాసం బాగుంది. ఆయా ప్రముఖుల పుస్తకాలు కొని చదవాలన్న సూచన ఇంకా బాగుంది.

  • “చదవకుండానే, రాయకుండానే స్టేజీ లెక్కి మాట్లాడే విమర్శక శిఖామణులు సాహిత్యానికి వచ్చిన మరో ముప్పు. ఒక పక్క తక్షణ కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు, పురస్కారాలు, జేజేల కోసం ఆరాట పోరాటాలు, మరో పక్క మంచి సాహిత్యాన్ని చదవకపోవటం వెరసి తెలుగు సాహిత్య స్థాయి మిగతా భాషలతో పోలిస్తే వెనుక పడే వుంది.”

    బాగా రాశారు

  • vaaastavaalni chakkagaa telipaaru. ayinaa vaaru
    maararu. Brown sastri gaa piluvabade late Dr. Janamaddi Hanumath Sastri gaaru 20-10-1925 na janminchaaru. vaaari satajayanthi koodaa2025.

  • శత జయంతుల రచయితల్లో కనీసం ఒక్కొక్కరి నుంచి ఒక్కో పుస్తకమైనా ఇవాళ మనం మళ్ళీ చదువుకోవాల్సినవి వున్నాయి.

    Thank you.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు