ఇక నుంచి నిర్మొహమాటంగా రాయదల్చుకున్నాను.
మన తెలుగు విమర్శకులు నా గౌరవాన్నీ ఆదృతినీ ఆర్జించలేకపోయారు. నేను రాసే రోజుల్లో సి.నా.రె ను నాకు తెలిసిన సాహితీమిత్రులు ఎవరూ చెప్పుకోతగ్గ కవిగా పరిగణించేవారుకారు (ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం రాక ముందు నుంచే). అయినా, అచ్చులో ఆయన పేరు చాలా కనిపించేది. ఆయనకు శిష్యగణం మెండుగా ఉండేది, యూనివర్సిటీ లోపలా, బయటా కూడా. ఆయన రాసిన “కర్పూరవసంత రాయలు” వంటి ఛందోకవిత్వం బాగున్నా, వచనకవిత్వం తేలిపోయేది (విశ్వంభర కూడా).
అయితే మన పత్రికల పేజీల్లో ఈ విషయం ఆయనకు నిక్కచ్చిగా చెప్పినవారు లేరు. “నలుగురు కూచొని నవ్వేవేళల” మాత్రం అంతా ఒకేమాట అనుకునేవారు. ఆనాటి నుంచి నాకు ఈ అవార్డుల కథలంటే నవ్వుతాల విషయం అయిపోయింది. కవులకు ప్రోత్సాహం గుర్తింపూ ఉండాల్సిందే. నేను అవార్డులకు (అవి ప్రభుత్వం ఇచ్చినాసరే) ఫక్తు వ్యతిరేకిని కాను. ఏదో బాధ! తెలుగు కవిత్వానికి తెలుగు దేశాల బయట ఏర్పడ్డ పేరెటువంటిదనే ప్రశ్న నన్ను తొలిచేసేది, ముఖ్యంగా ఉద్యోగార్థం బెంగళూరు వచ్చాక. అజంతాకు అవార్డు వచ్చిందంటే కారణం నాకు తెలిసిన తెలుగు పండితులొకరు పూనుకొని అజంతా పేరు రికమెండ్ చెయ్యడమే. అయితే, సార్త్రే (Jean Paul Sartre) అంతటివాడు ఏకంగా నోబెల్ బహుమతినే తిరస్కరించి చిరస్థాయిగా నిలబడ్డాడు. ఇది అందరికీ కరదీపిక కావాలి.
కవుల్ని ప్రోత్సహించడానికే కాబోలు చేకూరి రామారావుగారు ఆంధ్రజ్యోతిలో చేరాతలు మొదలుపెట్టారు. ఆరోజుల్లో ఆయన కవుల్నెంతమందినో ప్రోత్సహించారు (ఆ లిస్ట్‌లో నేనూ ఏదో కనిపించాను). కానీ వాటిని విమర్శ అనడం కష్టం. అవి మంచి సమీక్షలు. “అందరి తప్పుల్నీ మన్నించే తండ్రి లాంటి వారు” అని వేగుంట మోహనప్రసాద్ ఆయన్ను అభివర్ణించారు. అది నిజం.
అసలు ఏ కవికైనా తను మెచ్చే సాటికవి పొగడ్తకన్నా గొప్ప అవార్డు ఉండదు. “కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికే తెలుసు” అని తిలక్ అన్నాడంటే ఊరికే అన్నాడా? రాసినవాడికే రాయడమంటే ఏమిటో తెలుస్తుంది. విమర్శ అంటే సమ్యక్‌దృష్టితో చారిత్రకావగాహనతో సమకాలీన సమాజం ప్రతిఫలించినదిగా ఏ రచననైనా చూడగలగడం. ఇది కేవలం ప్రోత్సాహకవాక్యాలతో ఆగదు. మంచికవుల్ని సద్విమర్శకులెన్నగలరు, సద్విమర్శకులెన్నిన కవులు కాలపరీక్షనెదుర్కొని నిలబడగలరు.
మంచి poem చదివితే కడుపునిండా భోజనం చేసినట్టుండాలి. నాకెప్పుడూ ఈ మినీకవితలూ నానీలు వగైరాలు ఎప్పుడో ఎక్కడో quote చెయ్యడానికి ఒకటో రెండో మినహా ఏవీ ఆనలేదు. వాటిని పట్టించుకోవడం మానేశాను. వాటిపై చర్చ ఈ వ్యాసంలో ఉండదు.
అస్తిత్వవాదం బలంగా తెలుగులో వేళ్ళూనుకోకముందు ఇప్పటి లబ్ధప్రతిష్ఠులైన కవులకు సొంతగొంతు అనేది ఉండేది. ఈ వాదాల మాయాజాలంవల్ల కాబోలు చాలామంది తమతమ కులప్రాంతాలనూ genderనూ దాటి బయటపడలేక, ఫక్తు రాజకీయ కవిత్వమే రాశారు. అదీ నినాదస్థాయికి దిగువగా పెట్టిన కేకలవంటి మాటలే రాశారు. ఒక్క సమకాలీన విమర్శకుడైనా వీటిని ప్రశ్నించాడా?
కవిత్వం ముందు కవిత్వం కావాలి. ఈ రాజకీయ సోది కథలరూపంలోనూ కరపత్రాలరూపంలోనూ మరేదో ప్రక్రియరూపంలోనూ రావచ్చు. అలా కాలేదే! కవులనుంచి పాఠకప్రపంచం ముందు ఆశించేది కవిత్వాన్నే. నేను రాసిన ఈ రచన అసలు కవిత్వమేనా అని ప్రశ్నించుకోకుండా ఇందులో “అస్తిత్వఘోష” ఉందిలే అని సమాధానపరుచుకుంటే మిగిలేది అందరికీ తెలిసిన అస్తిత్వపు identity యే, అందర్నీ కదిలించే కవిత్వం కాదు. కవిత్వం అనే మాటలోనే ఏదో ఆకర్షణ ఉంది. కనుక ఆ శీర్షికే అందరికీ కావాలి.
కవితను కాకుండా సంతకాన్ని మాత్రమే చూడడం తెలుగులో తొలినుంచీ ఉంది. ఈమాట ఒకానొక సందర్భంలో వేగుంట మోహనప్రసాద్ నాతో అన్నారు. ఇదేమిటి అనే ప్రశ్న కన్నా ఇదెవరు రాశారు అని దిగువన పేరు చూసి, తరువాత కవిత చదువుతారు. ఇటువంటి ధోరణులు ప్రబలి ఇప్పుడు ఎవరి పాఠకులు వారికే అనే స్థాయికి దిగజారాం. మొదట్నుంచీ కవిత్వానికి ఆదరణ తక్కువే. “Only poets read poets” అన్నాడు వేగుంట నాతో ఆ కాలంలోనే. ఇప్పుడు poets అనే మాటకూ విశేషణాలు జోడించాలేమో! ఏ కులమతప్రాంతాలకు చెందిన కవులకు ఆయా కులమతప్రాంతాల కవులే పాఠకులయ్యారు. ఇది పరిధి కుదింపు. ఇంత చెప్పాను కనుక నన్ను మీరు “సొంతగొంతున్న లబ్ధప్రతిష్ఠులు” లేరా అనడిగితే ఓ ఒకరిద్దరి పేర్లు చెప్పగలను. అది ఎవరికివారు తెలుసుకోగలరు కూడా!
దీనికి పరిష్కారమా? నాదగ్గర దివ్యౌషధమో మంత్రదండమో లేవు. వ్యక్తుల్లో చలనం ఎలాగో రావాలి. నా మటుకు “సత్యం వద” (ఓ ఉపనిషద్వాక్యం) అన్నారు కనుక ఉన్నమాట చెప్పగలను. భగవద్గీతలో “యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” అన్నట్టు ఈ పనికి శ్రేష్ఠులు, పెద్దలు ముందు పూనుకుంటే మిగత అందరూ అదే చేస్తారేమో!
మళ్ళీ కలుద్దాం.
*
కాస్తంత generalisation పక్కన పెడితే మీరు చెప్పినది చాలావరకు నిజం. రాస్తూ రాస్తూ ఉంటే కొన్ని మంచి వాక్యాలు అక్కడక్కడ కనిపిస్తాయనే నానుడి సినారె కి కూడా వర్తిస్తుంది.
Agreed, sir. Thanks for your response.
-Vasu-
వాసు గారూ చాలా బాగా చెప్పారు. మళ్ళీ కలుద్దాం అన్నారు కనుక సంతోషం. నమస్తే.
Thanks, sir. Namaste.
-Vasu-
“శ్రేష్ఠులు, పెద్దలు” – ఆ పెద్దవాళ్ళెవరూ? వారికేమి పని పూనుకునేందుకు? పెద్దయ్యాక విమర్శ చేయాల్సినవసరమేముందీ? పెద్ద అయ్యేందుకే విమర్శ అయితేనూ.
ఏంటో! ఎంతసేపూ పెద్దల భజనే, ఎవరు చేసినా!
దేవి గారూ,
మీ స్పందనకు కృతజ్ఞతలు.
ఇక్కడ శ్రేష్ఠులు అనేమాటే కీలకమైనదండీ, పెద్దలు అన్నమాటకన్నా. ఈ గీతావాక్యంలో వాస్తవముంది. పేరొందిన విద్వాంసులు ఓ నలుగురు నిజాయితీగా విమర్శలు చేస్తే తతిమ్మా అందరూ దానినే అనుసరిస్తారని నా భావన. ఇదంతా పరిధి కుదింపుని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. నా prime target తెలుగులో ఉన్న విమర్శవ్యవస్థ. “మళ్ళీ కలుద్దాం” అన్నాను కదా, ఇంకా ఉంది.
-వాసు-
సరిగ్గా చెప్పారు. సమస్య ఏంటంటే
విమర్శ అనేది రచయితలు రాయటం ఆపేశాక Rehabilitation వ్యాపకంగా మారుతుంది. వారి దృష్టి సొంత పరపతి పెంచుకోవటంపై తప్ప రచనలపై ఉండదు!
ఎన్నదగినవారనుకున్నవారు
ఎంచుకున్నవాటినే చుట్టూ చేరినవారూ మోస్తారు. ఆ ఎన్నదగినవారనుకున్నవారి నిజాయితీ, పరిధులు లేని దృష్టి కీలకం! దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల ఆ దృష్టి అన్నివైపులా ప్రసరించదు. అదే లోపం.
Will await for more !
మీరన్న మాటలు అక్షరాలా నిజాలు. చేరా గురించి, సి.నా.రె గురించి చెప్పిన మాటలు నా దృష్టి లో కూడా అవే ఆలోచనలే.
ధన్యోఽస్మి, రాజారామ్గారూ.
-వాసు-
కుండ కొంచెమే బద్దలు కొట్టారు. ఇంకా కొండ ఉంది. ఇంకా పోనీలే అనుకుంటున్నారు. చర్నాకోల లేపారనుకున్నా. విదిలించారంతే. వీపు పగలగొట్టే ప్రయత్నం ప్రారంభించలేదు. ఎదురుచూపులే మిగిల్చారు.👏👏👏
రామఫణిగారూ,
“మళ్ళీ కలుద్దాం”.
-వాసు-
చాలా నిక్కచ్చిగా,స్పష్టమైన అభిప్రాయం చెప్పారు. ఈ భజన బృందాలతో నిజంగా మంచి కవిత్వం ఏదో తెలియని పరిస్థితి.
ఎవరో ఒకరు ఇలా ఖచ్చితంగా చెప్పకపోతే సాహితీ చరిత్ర లో మోసే వారు లేని చాలా మంది మరుగున పడిపోతారు.
సుభద్రాదేవి గారూ,
మీ ఆవేదనలో నిజముంది. చిన్నపాటి ప్రోత్సాహమైనా లేక రాయడం ఆపేసినవారు నాకు తెలుసు. మనం చెయ్యగలిగినదల్లా నిజాయితీగా స్పందించడమే.
-వాసు-
అద్భుతంగా చెప్పారు. నిర్భయంగా నిజాల్ని వెల్లడించారు. ఇలాంటి తతంగాన్ని మనబోటి వాళ్ళం చూస్తూ ఉండడమే, తప్ప ఏమీ చేయలేం.
సుశీలగారూ,
ధన్యవాదాలు. నిజానికి అందరమూ కొంత చెయ్యగలం. చదివినవాటికి నిజాయితీగా స్పందించడం.
-వాసు-
సారంగ పత్రిక లోని రచనలు బాగుంటున్నాయి,
నా రచనలు పంపడానికి మీ చిరునామాకు చెందిన మెయిల్ ఐడీ తెలుపగోరెదను.
ముద్దు వెంకటలక్ష్మి, పిఠాపురం.
https://magazine.saarangabooks.com/%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81/