తమిళ మూలం: దిలీప్ కుమార్
తెలుగు: దాము
దిలీప్ కుమార్(1951)మాతృభాష గుజరాతీ. తమిళనాడులో స్థిరపడ్డాడు. యీయనవి మూడు కథా సంపుటాలు, కొన్ని పరిశోధక వ్యాసాలు ప్రచురణ అయ్యాయి. హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు నుంచి తమిళంలోకి అనేక రచనల్ని అనువాదం చేశాడు. తమిళం నుండి ఇంగ్లీషులోకి అనువదించిన రెండు ప్రసిద్ద కథా సంపుటాలకు-A Place to Live: Contemporary Tamil Short Fiction(1999), The Tamil Story: Through The Times, Through The Tides(2016)- సంపాదకుడు.
ఆయన కథలు మళయాళం, కన్నడ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, హిందీ, వుర్థూ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జెక్, జెర్మన్ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, చికాగో, యేల్ యూనివర్సిటీలలో, ఫ్రాన్సులోని INALCOలో వర్తమాన తమిళ సాహిత్యం మీద వుపన్యాసాలిచ్చాడు.
చెన్నైలో వొక సాహిత్య పుస్తకాల షాపును దాదాపు 25 యేళ్ళు నడిపాడు.
వీరి నాన్న చనిపోవడంతో 9వ తరగతిలో చదువును ఆపేయాల్సి వచ్చింది. టీ బాయ్‌గా, బట్టల షాపులో గుమస్తాగా, యిస్త్రీ అంగడిలో సహాయకుడుగా, టైలర్ షాప్‌లో బాయ్‌గా-యిలా అనేక పనులు చేస్తూ ప్రముఖ తమిళ రచయిత అయ్యాడు. యిరవై యేళ్ల వయసు నుంచి కథలు రాస్తున్నాడు. యీయన కథలకు చాలా అవార్డులొచ్చాయి.
‘Dilip Kumar situates his plots in a tightly woven nexus of racial, class, and language stratifications. Kumar is a writer of proximities, a poet of the close-quartered soul, so it’s not surprising his command of atmosphere is masterful; his stories emanate a sense of the simple density of life’ అంటాడు Bailey Trela.
యితని నాలుగు కథల ఆధారంగా లఘు చిత్రాలు తీశారు.
ఈ కథను కోయంబత్తూరులో జరిగిన సంఘటనల్ని ఆధారం చేసుకుని 1997లో రాశాడు. కానీ 2002 వరకు ప్రచురించడానికి యెవరూ ముందుకు రాలేదు. ఈ కథ ఆధారంగా తమిళ దర్శకుడు అరుణ్ కార్తిక్ 2020లో ‘నాసిర్’ పేరుతో సినిమా తీశాడు. దీనికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులొచ్చాయి.
***
సమయం 06:03. మీ పేరు మెహబూబ్ ఖాన్
మీరిప్పుడు నిద్రపోతున్నారు.
ఉదయపు ప్రశాంతతలో మునిగివుంది కోయంబత్తూరు. వెరైటీ హాలు వీధిలో పాడుబడిన చిన్న భవనం. యింటి ముందు రెండు అందమైన తిన్నెలు. ముందు తలుపు తెరిస్తే వొక చిన్న నడవ. దానికి రెండు పక్కలా ఆరు చిన్న గదులు. మూడు ముస్లిం కుటుంబాలు. మీ కుటుంబం యెదురెదురుగా వున్న వున్న రెండు చిన్న గదుల్లో నివసిస్తోంది. మీ యిల్లు చాలా చిన్నది. అమ్మీజాన్ అని మీరు పిలిచే అమ్మ ఫాతిమా, భార్య తాజ్ బేగం(ఆమె యిప్పుడు కొళుంజివాడిలో వున్న వాళ్ళ అమ్మగారింటికి పోయి వుంది. మీకు పెళ్ళయి యిరవై యేళ్ళయింది. మీకు పిల్లలు లేరు.), మేనల్లుడు ఇక్బాల్.
మీకిప్పుడు వయసు నలబై రెండు. మీరు పొట్టిగా, తెల్లగా వుంటారు. యెత్తు పళ్ళు, పొడుగు ముక్కు. పెద్ద కళ్ళు, చిన్న కనుపాపలు. లిబర్టీ కట్‌తో, మోకాలిదాకా వున్న పొడవైన మీగడ రంగు చొక్కా. గుదికాలు దగ్గర మడిచిన లూజు లూజు ప్యాంటు. యెనిమిది దాకా చదువుకొన్నారు. రాజ్ రోడ్డులో వున్న ‘ఫ్యాషన్ ప్యాలస్’ అనే బట్టల షాపులో మీరు గుమస్తా. జీతం రూ.180.
మీ పని వేళలు: వుదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. భోజన విరామం: మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు. జీతం సరిపోకపోవడం వల్ల, ఆదివారం వుదయం టిప్ టాప్ యిస్త్రీ షాపులో మీరు బట్టకింత రేటు చొప్పున యిస్త్రీ చేస్తారు. మీకు వుర్థూ, తమిళం, మలయాళం అన్నీ కొంచెం కొంచెం వచ్చు. మీరు కష్టజీవి. నవ్వుతూ మాట్లాడుతారు. రోజుకి పది మంగళూరు గణేష్ బీడీలు కాలుస్తారు. నాలుగు టీలు తాగుతారు.(షాపులో మూడు, యింట్లో వొకటి.) మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్తారు.
దీనితో పాటు, మీ దగ్గర అరకొరగా వొక తాత్విక దృష్టి కూడా వుంది. అందువల్ల కవిత్వం యిష్టం. ఆదివారాలు 50ల, 60లలోని హిందీ చిత్రాల పాటల శైలిలో మీరు కవితలు రాస్తారు. మీ కవితల్లో యీ పదాలు తప్పకుండా వుంటాయి: జిందగీ, జాం(మధువు), రబ్(దేవుడు), యిష్క్, వక్త్(కాలం), దిల్, ప్యార్, జవానీ(యవ్వనం), తన్హాయి(వొంటరితనం), మౌత్(మృత్యువు). మీ కవితల అభిమానులు మీ సహోద్యోగులు-లీలాధర్, నందు, వీరు, అర్జున్ దాస్. వీరంతా సింధీలు. కొంత వరకు వుర్థూ, హిందీ తెలిసిన వాళ్ళు. మీలాగే చదువును సగంలో వదిలేసిన వాళ్ళు.
మధ్యాహ్న సమయాల్లో, మేనేజర్ టికమ్ దాస్ లేనప్పుడు మీరు మీ కవితల్ని వీళ్ళ ముందు ప్రదర్శిస్తారు. కవితల్ని చెప్పేటప్పుడు కూడా చేతిని గుండెల మీది నుంచి ముందుకు తీసుకెళ్ళి, వొక అల లాగా కదులుతూ, అభినయిస్తూ, వింటున్న వారి ముక్కు దాకా వచ్చేస్తారు. యెదుటి వాళ్ళు, “వాహ్ జనాబ్” అనో, “మాషా అల్లా, క్యా బాత్ హై” అనో వుత్సాహపరుస్తారు. మీరు తల వంచి, చేతిని మూడుసార్లు నెత్తి దాకా తీసుకెళ్ళి ‘సలాం’ చేస్తారు.
మీరొక ప్రశ్నార్థకం లాగా పడుకొని వున్నారు. నల్లటి పెదాల మధ్య నుంచి మీ ముందటి పళ్ళు కొంచెం కనిపిస్తున్నాయి. మీ ముఖంలో ప్రశాంతత నెలకొని వుంది. గాఢంగా నిద్రపోతున్నపుడు మీరు కల్లాకపటం తెలియని వాడిలాగ, నిస్సహాయ ప్రాణిలాగ, గొప్ప ప్రేమను యిచ్చేవాడిలాగ, కోరుకునేవాడిలాగ వున్నారు.
06:33. మీరు కళ్ళు తెరుస్తున్నారు. మీ కదలికలు విని, ఫాతిమా కూడా మేలుకుంటూ వుంది. నలబై రెండేళ్ళుగా ఆమె యిది చేస్తూ వుంది. ఆమె లేచి లైటు వేస్తూ వుంది.
రెండడుగుల ట్యూబు లైటు వెలుగులో, ఇక్బాల్ అవిటి కాళ్ళు కనబడుతుంటే, బోర్లా పడుకొని వున్నాడు.(యేడేళ్ళకు ముందు కోయంబత్తూరు నుంచి తారాపురంకు వెళ్తున్న బస్సూ, తారాపురం నుంచి కోయంబత్తూరుకు వస్తున్న లారీ, నేరుగా వొకదాన్నొకటి ఢీకొన్నపుడు బస్సులో ప్రయాణిస్తున్న యిరవైమంది ప్రమాద స్థలంలోనే చనిపోయారు. అలా చనిపోయిన వారిలో మీ చెల్లెలు కతీజా, ఆమె భర్త సయ్యద్ కూడా వున్నారు. పోలియోతో బాధపడుతున్న ఇక్బాల్ కోయంబత్తూరులోనే వుండడం వల్ల బతికిపోయాడు.)
మీరు, “యా అల్లా” అని పెద్ద నిట్టూర్పు విడుస్తున్నారు. లేచి పెరట్లోకెళ్ళి, మూత్ర విసర్జన చేసి, అలానే పళ్ళు తోముకొని, ముఖం కడుక్కొని వస్తున్నారు. యెప్పటిలాగా, చొక్కా వేసుకొని యిత్తడి గ్లాసు తీసుకొని పార్శిల్ టీ తేవడం కోసం నవాబ్ హకీం రోడ్డులో వున్న ముబారక్ టీ స్టాలుకు పోవడానికి రడీ అవుతున్నారు. తిన్నె మీద కరీం తాత సగం నిద్రలో పొర్లుతున్నాడు. మిమ్మల్ని చూసి, రోజూ అడిగే ప్రశ్నే అడిగాడు, “కిదర్, ఛాయ్ లఖ్కానే …?” (టీ తేవడానికా?)
నవాబ్ హకీం రోడ్డు పల్చటి మంచు తెరతో కప్పబడి, కల లాగ ప్రశాంతంగా వుంది. స్టాలులో కొయ్య గుంజకు చివర కట్టి వున్న స్పీకరు నుంచి వొక పాత హిందీ సినిమా పాట గాలిలో సన్నగా తేలి వస్తోంది. మీరు ఆకాశం కేసి చూస్తూ నడుస్తున్నారు. మీ హృదయం వింత అనుభూతుల్తో పొంగి పొర్లుతూంది. విచార వదనపు చంద్రుడు, బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న మేఘాలు వొక విషాద సౌందర్యాన్ని వెలువరిస్తున్నాయి.
07:15. రేడియోలో ‘భూలే బిస్త్రీ గీత్’ వింటున్నారు.
సురయ్యా, బేగం అఖ్తర్, తలత్ మొహమ్మద్ కలసి మిమ్మల్ని ద్రవింపచేస్తున్నారు. యీ రోజు వెంట వెంటనే బేగం అఖ్తర్ పాడిన రెండు గజళ్ళు వింటున్నారు. ‘యే మొహబ్బత్ తేరే అంజాం పే రోనా అయా.’ (ఓ ప్రేమా, నీ ఫలితం నాకు దుఃఖాన్నిచ్చింది.), ‘ జిందగీ కుచ్ భి నహీ ఫిర్ బి జీయే జాతే హై'(జీవితం యేమీ లేదు అయినా జీవిస్తున్నా) పాటలతో ఆమె హృదయాన్ని నలిపేస్తూ వుంది. బేగం అఖ్తర్ ఫోటోని చూశారు. ఆమె విశాలమైన నుదురు, లోతైన కళ్ళు మీ మనసులో మెదులుతూనే వున్నాయి. ‘ఆమెది మనిషి జన్మే కాదు! లోకంలోని దుఃఖాలన్నిటినీ నరాలుగా మార్చి ఆమె స్వరపేటికలో అమర్చేశాడు అల్లా’ అని అనిపిస్తొంది మీకు.
07:30. ఇక్బాల్ దేక్కుంటూ పెరట్లోకెళ్ళి, “మామూ మామూ” అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు వాడి కాళ్ళు కడిగి, నిక్కరు తొడుగుతున్నారు. వాడి జీవం లేని కాళ్ళు, జీవం లేని పిండాల లాగ చల్లగా పడున్నాయి.
యింట్లో గోధుమ పిండి అయిపోయిందని అమ్మీజాన్ చెప్పింది గుర్తొస్తోంది మీకు. మీ పక్కింట్లో వున్న మెకానిక్ దస్తగిరి దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకోవాలి మీరు.
07:45. దస్తగిరి యింట్లోకి తొంగి చూసినపుడు, నురగ నిండిన నోటితో అతను పళ్ళు తోముకుంటున్నాడు. మిమ్మల్ని చూసి, “యేం కావాలి?” అని కనుబొమలతోనే అడిగాడు. మీరు వొక క్షణం సందేహిస్తూ నిలబడ్డారు. కుర్చీలో వున్న ‘దిన తంతి’ పత్రిక మీ కళ్ళల్లో పడింది. ‘కుచ్ నహీ…అక్బార్” (పత్రిక) అని గొణుగుతున్నారు. దస్తగిరి వంగి, దినపత్రిక తీసుకొని మీ వైపుకి చాస్తున్నాడు. దాన్ని తీసుకొని మీరు తిన్నె దగ్గరికి వస్తున్నారు. ‘ప్రముఖ నటికి రహస్య వివాహం’, ‘యెద్దుల బండిని ఢీకొన్న లారీ’, ‘పట్టపగలు సాహసోపేత దొంగతనం’, ‘పెళ్ళికూతురు జాలి గొలిపే మరణం’, ‘ఆండియార్ పాడబోతున్నారు’, ‘రేపటి నుంచి కిరోసిన్ ధర పెరుగుదల’, ‘కన్నె తీవు ప్రజాసంఘం…కోయంబత్తూరు టీ అంగడిలో టీ యిచ్చే గ్లాసులు సరిగా కడగక పోవడం వల్ల దుర్వాసన వస్తుందని ఫిర్యాదు లేఖ’. ‘రంభతో కార్తిక్ గొడవ’, వంటివన్నీ చదువుతున్నారు. యిప్పుడు, షాపుకెళ్ళి లీలాధర్ దగ్గరో, నందు లేదా అర్జున్ దాస్ దగ్గరో యాబై రూపాయలకు సర్దుబాటు చెయ్యాలని నిర్ణయించుకుంటున్నారు.
08:15. పెరట్లో వున్న కామన్ బాత్రూంకి మీరు స్నానం చెయ్యడానికెళ్తున్నారు. లైఫ్‌బాయ్ సబ్బుతో వంటిని బాగా రుద్ది స్నానం చేస్తున్నారు. మీకు అన్నీ శుభ్రంగా, స్వఛ్చంగా వుండాలి. మీ గోర్లు కూడా అందంగా కత్తిరించబడి, మెరుస్తూ వుంటాయి. ‘మనసును యెలాగూ శుభ్రంగా వుంచుకోలేము, శరీరాన్నయినా శుభ్రంగా వుంచుకోవచ్చు కదా’ అనుకొంటారు మీరు. మీకు నిఖా అయిన కొత్తలో మీరు రెక్సోనా సబ్బుతో మాత్రమే స్నానం చేసే వారు. తాజ్ బేగంకు రెక్సోనా సబ్బంటేనే యిష్టం. ఆమె స్నానం చేసి వస్తే, యిల్లంతా గుబాళించేది. అంతలా పూసుకొని స్నానం చేసేది. కానీ, పాపం ఆమెది చెమట శరీరం. యెప్పుడు చూసినా చెమటలు కారుస్తూ వుండేది.
అప్పుడంతా ఆమె రాత్రుళ్ళు కూడా స్నానం చేసేది. ఆమె చెమట వాసన, రెక్సోనా సుగంధం కలసిపోయి మిమ్మల్ని పిచ్చెక్కించేది. పెద్ద, తెల్లటి బేరికాయల లాగున్న ఆమె రొమ్ముల మధ్య ముక్కును రుద్ది, వాసన పీల్చి నవ్వే వాళ్ళు మీరు. మీరలా చేస్తున్నప్పుడు తాజ్ బేగం దాన్ని లోలోపల చాలా ఆస్వాదించేది. కానీ, “యే క్యా బత్తిమీజి”(యేంటీ పోకిరి వేషాలు) అని దొంగ కోపాన్ని ప్రదర్శించి, మీ బుగ్గ మీద ముద్దుగా కొట్టేది.
యిప్పుడంతా మారిపోయింది. తాజ్ బేగంకు యీ రోజు వుత్తరం రాయాలని గుర్తు చేసుకుంటున్నారు.
08:45. షాపుకు వెళ్ళడానికి మీరు వప్పణక్కర వీధిలో నడుస్తున్నారు. సినిమా పాటలు వినిపిస్తున్న టవును బస్సులు, యితర వాహనాలు అడ్డదిడ్డంగా పరిగెడుతున్నాయి. పొద్దెక్కే కొద్దీ, యీ పొగ, శబ్దాలు యింకా పెరుగుతున్నాయి. ముందు కంటే, యిప్పుడు వీధి యిరుకై పోతున్నట్టు అనిపిస్తోంది. దారిలో యెదురుపడే తెలిసిన వారందరికీ సలాం చెబుతూ నడుస్తున్నారు మీరు.
హోటల్ కైలాష్ యజమాని గల్లా పెట్టె దగ్గర కూర్చొని, “క్యా పహిల్వాన్, సబ్ కైరియత్ తో హై నా?” (పహిల్వాన్, అంతా బాగే కదా?) అని అడుగుతూనే, నోట్లను లెక్కబెట్టుకొంటున్నారు.
మీరు షాపు దగ్గరికి వెళ్ళడానికీ, యెదుటి వైపు వీధి నుంచి నందు రావడానికి సరిగ్గా సరిపోయింది. మేనేజర్ టికమ్ దాస్ 10 గంటలకి మాత్రమే వస్తాడు. నందూనే షాపు తెరుస్తాడు. నందూకు భుజాల్లో యే యిబ్బందీ లేదు. అయినా అతడు బెణికినట్టు కుడి భుజాన్ని కొంచెం పైకి లేపి నడుస్తాడు.
నందు వెడల్పాటి ముఖంలో ముక్కు పెద్దది. అతని వెనుక, అందరూ అతన్ని ‘గరుడ’ అని పిలుస్తారు. షట్టర్‌ను పైకి లేపడానికి అతని పక్కన నిలుచొని వంగబోతుంటే, అతను అప్పుడే కాల్చిన ఛార్మినార్ సిగరెట్టు వాసన మిమ్మల్ని తాకుతోంది.
09:15. షాపులో పని కుర్రాడు షణ్ముగం వూడవడం ముగిస్తున్నాడు. గల్లా పెట్టె వెనుక తగిలించి వున్న లక్ష్మీ, గురునానక్, శివుడు వంటి పటాలకి కర్పూరం వెలిగించి పూజ చేస్తున్నాడు నందు. అర్జున్ దాస్, వీరు అందరూ వారికి కేటాయించిన కౌంటర్లలో నిలబడి వున్నారు. యిప్పుడు, ర్యాకుల్లో వున్న పెట్టెలన్నీ బయటికి తీసి, వొకటొకటిగా దుమ్ము దులిపి, తుడిచి పెట్టాలి. పిల్లలు, ఆడవాళ్ళ విభాగం మీ బాధ్యత. యింకా సూటిగా చెప్పాలంటే, దిగువ మధ్యతరగతి వాడకందార్లనూ, కోయంబత్తూరు చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చినప్పుడు, వాళ్ళను మీ దగ్గరికి నెట్టేస్తారు. మీ సాధారణ రూపం కారణంగా, యీ వాడకందార్లు మీతో సహజంగా మెలుగుతారు. మీ కలివిడితనంతో కూడిన మాటలతో మైమరచి, యేదో వొక గౌనో, లోదుస్తులో కొనుక్కొని వెళ్తారు. పెద్ద నగరపు నాగరిక వున్నత వర్గ ‘కస్టమర్ల’ను, ఠీవిగా బట్టలు ధరించిన లీలాధర్, వీరు, అర్జున్ దాస్, గమనించుకొంటారు. పై స్థాయి వాడకందార్లను యెదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యం కానీ, ఆకారం కానీ మీకు కొంచెం కూడా లేదనుకొంటాడు మీ మేనేజర్ టికమ్ దాస్.
యీ రోజు షోకేసుల్లో వున్న ప్రదర్శన అలంకారాల్ని మార్చే రోజు. ఆ పని మీదే. మీకు తోడుగా షణ్ముగంని పెట్టుకొంటారు. దీన్ని పూర్తి చేయడానికి రెండు మూడు గంటలు పడుతుంది. పోయిన వారం వేసిన బట్టల్ని వొక్కొక్కటే తొలగించి, షోకేసుని ఖాళీ చేస్తున్నారు. షణ్ముగం షోకేసులోకి దూరి, కేసు అద్దాల్ని నీటితో తడిపి, ‘మాలై మురసు’ పత్రికల్ని మంచిగ తడుపుతున్నాడు. అద్దాల మీద బొట్లు బొట్లుగా అతుక్కుని వున్న చిన్న చిన్న పురుగుల మరకల్ని బాగా తుడిచి శుభ్రం చెయ్యమని వాడిని పురమాయిస్తున్నారు. వాడు అది చేసే లోపల, బయటకు తీసిన బట్టల్ని మీరు మడతపెడుతున్నారు. తర్వాత, మళ్ళీ షోకేసు లోపలికి దూరి, షణ్ముగంకు కంద విలాస్ విబూతి పొట్లాన్ని యిస్తున్నారు. విబూదిని తేలికగా అద్దాలపైన పూసి, కాసేపాగి మళ్ళీ తుడవాలని వాడికి చెబుతున్నారు. యీ వారానికి కావాల్సిన బట్టల్ని మీరు యెంచుకుంటున్నారు.
షణ్ముగం పని ముగించుకొని బయటికి రాగానే, సల్వారు కమీజుల కొన్ని దుప్పట్టాల్ని, కొన్ని జాకెట్ గుడ్డ ముక్కల్ని తెచ్చి, షోకేసు వెనుక వైపు అమరుస్తున్నారు. తర్వాత, త్వర త్వరగా వాటి మీద రక రకాల బాబా స్యూట్‌లనూ, మగవాళ్ళ బట్టల్ని తగిలిస్తున్నారు. షోకేసు మధ్యలో వున్న నల్లటి బొమ్మ పోయిన వారం సల్వార్ కమీజు ధరించి వుంది. అందువల్ల, యీ వారం ఆమెకు పల్చటి నైట్ డ్రెస్ తొడుగుతున్నారు. చనుమొనలు లేని రొమ్ములు, మధ్యలో యేమీ లేని తొడలున్న ఆ బొమ్మకు మీరు తొడిగిన గులాబీ రంగు నైటీ అందంగా అమరిపోయింది. మీరు ఆ చలువ రాతి బొమ్మ రంధ్రాలు లేని ముక్కుని ముద్దుగా గిల్లి వదులుతున్నారు.
షోకేసులో నుంచి మీరు బయటికి వస్తున్నపుడు అన్ని కౌంటర్లలోనూ బట్టలు పరిచి వున్నాయి. చాలా మంది వాడకందార్లు వచ్చి పోయినట్టున్నారు.
13:00. మీరు త్వర త్వరగా మసీదుకు వెళ్తున్నారు. యెండ తీవ్రంగా లేకపోయినప్పటికీ, మీరు యింతకు ముందులాగ వేగంగా నడవలేకపోతున్నారు. పెళ్ళికి ముందు మీకు వరిబీజం వుండేది. రెండు తాటికాయల్లాగ అవి ఆడి ఆడి, మీరు నడుస్తున్నప్పుడు మీకు నరకం చూపెట్టేవి. అప్పుడు కూడా మీరు యింతకంటే వేగంగా నడిచే వారు.
13:45. ఇక్బాల్ వొక పాత నోటు పుస్తకంలో స్కెచ్ పెన్నుల్తో బొమ్మ వేస్తున్నాడు. ఇక్బాల్ బొమ్మలు బాగా వేస్తాడు. యిప్పుడు వేస్తున్న బొమ్మలో, చుట్టూ కంచె వేసి వున్న వొక కుటీరం, నలు వైపులా పచ్చిక బయలు, అందులో వొక జింక పిల్ల, ఆకాశంలో మేఘాలు, కొన్ని పక్షులు, వొక మూలలో సూర్యుడు. అన్నీ బాగున్నాయి. జింక ముఖం మాత్రం కొద్దిగా కుక్క ముఖంలాగుంది.
“యీ భవనాన్ని యే ధరకు యిస్తారు జనాబ్?”
“మేము దీన్ని వెయ్యికంటే తక్కువకు అమ్మము. అయితే, మీరు నా మామూ కాబట్టి, మీకు రూపాయికి యిస్తాం…”
“జింక పిల్లతో కలిపా?”
“జింక పిల్లను అమ్మం.”
“యెందుకు జనాబ్? నిషేధం యేమైనా వుందా?”
“జింక పిల్లను అమ్మడానికి మాకు అనుమతి లేదు.”
“మరి యేం చేయాలి? యెవరి దగ్గర అనుమతి తీసుకోవాలి?”
“జింక పిల్ల వాళ్ళమ్మ దగ్గరే తీసుకోవాలి.”
“మరి వాళ్ళమ్మ యెక్కడ?”
“ఆమెను నేను యిక మీదటే సృష్టించాలి.”
“రేపటికి రానా జనాబ్?”
“లేదు. వచ్చే శుక్రవారం వచ్చేయండి.”
మీరు ఇక్బాల్‌ని అలానే లాక్కుని, గుండెలకు హత్తుకొంటున్నారు. ఇద్దరూ గట్టిగా నువ్వుతున్నారు.
15:05. టికమ్ దాస్ భోజనానికి వెళ్ళున్నారు. నందూ గల్లా పెట్టె దగ్గరే వొంటి భుజాన్ని యెగరేస్తూ నిలుచున్నాడు. లీలాధర్, అర్జున్ దాస్, వీరు-ముగ్గురూ వొక మూలలో స్టూల్స్ మీద కూర్చొని రేడియోలో పల్లె పాటలు వింటున్నారు. మిమ్మల్ని చూసి వుత్సాహం వస్తూ వుంది వాళ్ళకి.
లీలాధర్: యేం మెహబూబ్ తిన్నావా?
మెహబూబ్: రోజూ తింటూనే వున్నాం కదా?
అర్జున్ దాస్: విరక్తిగా మాట్లాడకు. భార్య యింకా వూరి నుంచి రాలేదా?
మెహబూబ్: విరక్తి లేదు, యేం లేదు.
లీలాధర్: యెప్పుడొస్తుంది?
మెహబూబ్: వచ్చే వారం.
లీలాధర్: రాత్రుళ్ళు నువ్వు లేకుండా మీ బేగం యెలా నెట్టుకొస్తూ వుందో?
మెహబూబ్: ఛీ..ఛీ..యేం మాటలవి?
లీలాధర్: ఛీ ఛీ యేంటి ఛీ ఛీ! కోరిక లేనట్టుగానే వుంటారు యీ ఆడ నక్కలు. నువ్వే జాగ్రత్తగా వుంటూ, పని సరిగా జరపాలి. “చాలు, చాలు” అంటూ మూలగాలి గాడిదలు! మీ జోరూ వూరి నుంచి రాగానే, మొదటి పనిగా దాన్ని నెరవేర్చు. నేను దెబ్బతిన్న వాడ్ని. చెబుతున్నా వినుకో.
లీలాధర్‌కి రెండవ ఆట సినిమా చూడ్డం యిష్టం. దాదాపు వారానికి నాలుగు రోజులు రెండవ ఆటకు వెళ్ళిపోతాడు. యీ లోగా, లీలాధర్ భార్యకు యెలానో వొక ఆటోవాడితో సావాసం యేర్పడింది. రోజూ లీలాధర్ అటు సినిమాకు బయలుదేరగానే, యిటు పక్క ‘అన్ని దార్లూ తెలిసిన రూటుగాడు’ వచ్చేస్తాడు. వొక రోజు టికెట్ దొరక్క, లీలాధర్ తిరిగి రావడంతో, యిద్దరూ దొరికిపోయారు.
విషయం విడాకుల దాకా పోయింది. లీలాధర్ మామగారు అతడి కాళ్ళ మీద పడి బతిమలాడిన తర్వాత అంతా సర్దుకుంది. లీలాధర్ భార్య షీలు పొట్టి, యెర్రెర్రటి యెరుపు. ఆమెని చూస్తే, ‘యిది పాలే ముట్టని పిల్లి’ అనిపిస్తుంది.
కబుర్లు యిలానే చుట్టి చుట్టి యెక్కడికో పోతున్నాయి. వున్నట్టుండి అర్జున్ దాస్, “సరె, సరే దాన్ని వదులు. మెహబూబ్, నువ్వేదైనా కవిత చెప్పచ్చు కదా?”
మెహబూబ్: యేం గొప్ప కవిత. అన్నీ పాతవే కదా. కొత్తగా యేం లేదు.
అర్జున్ దాస్: సరే, ఫర్వాలేదు. పాతవి పాతవే. వాటిలో నుండే యేదైనా చెప్పు.
మెహబూబ్: నా, బాబా. నేనొక వుత్తరం రాయాలి.
అర్జున్ దాస్: యెవరికి?
లీలాధర్: యింకెవరికి? వాడి భార్యకే.
వీరు: పెద్ద ఫోజు కొట్టొద్దు. వొకే వొక కవిత చెప్పేసి, పోయి రాసుకో.
మీరు కాసేపు ఆలోచించి, తర్వాత, పీఠికతో సహా, సన్నద్దమవుతున్నారు.
జీవితం మీద అదుపు లేదు నాకు
లేదు నాకు యే ఆరోపణ కూడా
దాన్ని అసహ్యించుకొనే మూఢుడ్ని కాను
అయితే యీ రోజు
యౌవనపు సంధ్యలో
మౌనపు వొక వొడ్డున నిల్చున్నాను
దయలేని కాలం వరదలా ప్రవహిస్తోంది
శతాబ్దాల విశ్రాంతి కోసం
వొంటరితనం కురుస్తోంది వర్షంలా ఆవలి వొడ్డున
“వో నా ప్రియమైన స్నేహితులారా, కవి మెహబూబ్ అడుగుతున్నాడు, జీవితమంటే వొంటరితనం, మౌనం కాక, యింకేమిటని.”
మీరు కవిత చివరి పంక్తి చదువుతున్నపుడే అందరూ “వాహ్ వాహ్” అని అరుస్తున్నారు.
16:00. “టికమ్ దాస్ యింకా రాలేదా?” అని అడుగుతూనే లోపలికొస్తున్నారు ‘బాంచోద్’ భగవాన్ దాస్. హిందీలో బాంచోద్ అంటే సోదరితో సంభోగం చేసేవాడు అని అర్థం. కానీ, భగవాన్ దాస్ అలాంటి వాడు కాదు. పైగా, ఆయన వయసు 75. ఆయన మాట్లాడేటప్పుడు సుమారుగా పది క్షణాలకొకసారి ‘బాంచోద్’ అనే పదాన్ని వుపయోగిస్తాడు. అందువల్ల ఆయనకు యీ పట్టం పెట్టారు. ఐందు ముక్కు దగ్గర నివసించే ఆయనకు, వుప్పార వీధిలో రెడీ మేడ్ బట్టల ఫ్యాక్టరీ వుంది. రోజూ మధ్యాహ్నం ఫ్యాక్టరీకి పోయే దారిలో యిక్కడ తొంగి చూసి వెళ్తాడు. యజమాని కిషన్ చంద్‌కూ, మేనేజర్ దాస్‌కూ చాలా దగ్గరి వారు. వచ్చి కాసేపు కూర్చుంటారు. యెవరడిగినా, అడగకపోయినా యేదో వొకటి మాట్లాడుతూనే వుంటారు.
వొక వాణిజ్య శాఖ పన్నుల అధికారిని ముందు పెట్టి, ఆయన యీ రోజు వుపన్యాసం యిస్తున్నారు.
“బాంచోద్, పన్ను వెయ్యి. యెవరు వద్దంటారు? వేస్తే కట్టేసి పోతా. అందుకోసం నా ఖాతా పుస్తకాల్ని యెత్తి విసిరేస్తే యేంటి అర్థం? నువ్వు ఘూస్(లంచం) తింటావా? చెప్పు, వొప్పుకుంటాను. బాంచోద్, మంత్రులు, ఎం.పీ.లు, ఎమ్.ఎల్.ఏలు అందరూ తింటున్నారు. నువ్వు కూడా తిను. బాంచోద్, అది న్యాయం. అయితే, నా ఖాతాల్ని, బాంచోద్, ‘అబద్దం’ అని చెప్పద్దు. నేను పాకిస్తాన్ నుంచి చిరిగిన పైజామాతో పారిపోయి వచ్చిన వాడ్ని. 48లో కొలాబాలో కారం అప్పడాలు అమ్మి బాంబేలో యెదిగిన వాడ్ని. నేను అబద్దం చెబితే, బాంచోద్, దేవుడు నన్ను క్షమించడు.”
యెగరేస్తున్న భుజంతో, నందూ చిరునవ్వుతో తలాడిస్తూ ఆయన మాట్లాడేది వింటున్నాడు. కాసేపాగి భగవాన్ దాస్ షణ్ముగంతో, “రేయ్ ఛోటూ, తాగడానికి కొంచెం మంచినీళ్ళీవ్వు. బాంచోద్ యేం వుక్క?” అని కుర్చీలో నుంచి లేస్తున్నారు.
16:30. మీరు టై మరియు సాక్స్ కౌంటరు మీద వంగి, వొక తెల్ల కాయితం మీద వుత్తరం రాయడం మొదలుపెడుతున్నారు.
“వేనవేల గులాబీల మృదుత్వాన్నీ, వేనవేల చందమామల మనోహరత్వాన్ని కలిగి వున్న, నా ప్రాణంలో ప్రాణమైన బేగం తాజ్ గారికి, మీ దాసుడు మెహబూబ్ రాసుకొన్నది యేమిటంటే, మేం అందరం యిక్కడ క్షేమం. మీరు, మీ చుట్టూ వున్న వారు అక్కడ క్షేమంగా వుండేందుకు అల్లా అండగా వుండుగాక.
మీరు లేకుండా యిల్లే బోసిపోయింది. అయితే, వొక రకంగా మీరిక్కడ లేకుండా వుండడమే మంచిది. యెందుకంటే, యింటి పరిస్థితి యేమీ బాగా లేదు. రెండు వారాలుగా నాకు యిస్త్రీ పని లేదు. యింట్లో బియ్యం, పప్పు, గోధుమ అన్నీ ఖాళీ అయిపోయాయి. నిన్న అమ్మీజాన్ నూర్ పిన్నిని చూసేందుకు కోటైమేడుకు పోయింది. రెండు డజన్ల కోడి గుడ్లు, కొన్ని చేపలు యిచ్చి పంపించింది నూర్ పిన్ని. దాంతో పాటు, కరీం తాత నుంచి ఐదు, పది అని తీసుకొనే బండి నడిపిస్తున్నాము. యీ రోజు షాపులో లీలాధర్ దగ్గర యాబై రూపాయలు అప్పు తీసుకున్నాను. యెల్లుండి జీతం పడగానే కొంచెం వూపిరి పీల్చుకోవచ్చు.
ఇక్బాల్ క్షేమంగా వున్నాడు. దేక్కుంటూ దేక్కుంటూ యెన్నో చిన్న చిన్న పనుల్ని అమ్మీజాన్‌కు చేసిపెడుతున్నాడు. నిన్న అమ్మీజాన్ చెబుతున్నా వినకుండా నా ప్యాంటు, చొక్కాల్ని యిస్త్రీ చేసిచ్చాడు. ఫోటో చూసి అప్పాజాన్ బొమ్మ వేశాడు. నీ యెడబాటు, నా కంటే కూడా ఇక్బాల్‌నే యెక్కువ బాధిస్తోంది. “మమ్మీజాన్ యెప్పుడొస్తుంది. యెప్పుడొస్తుంది?” అని యేడుపు ముఖంతో రోజూ మూలుగుతున్నాడు. మీ కడుపులో పుట్టకపోయినా, వాడు మీ బిడ్డే. వాడి కాళ్ళను చూస్తున్నపుడంతా, అల్లా దర్బారులో యిలాంటి వొక న్యాయమా అని గుండె అదురుతుంది.
అమ్మీజాన్ వల్లకావడం లేదని స్పష్టంగా తెలుస్తా వుంది. అయితే, ఆమె పంటి బిగువున సంబాళించుకొంటూ వస్తూ వుంది. పోయిన వారం ఆమెను చెకప్ కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాను. గర్భ సంచిలో క్యాన్సర్ వుండచ్చని, చాలా పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు సోమవారం వస్తాయి. యెలా వున్నా, గర్భ సంచి తీసెయ్యడమే మంచిదని డాక్టరు చెప్పారు. మీరు త్వరలో తిరిగొస్తే, దానికి కావాల్సిన యేర్పాట్లు చెయ్యచ్చు. పొత్తి కడుపులో వస్తున్న నొప్పిని భరించలేక ఆమె పడి దొర్లుతా వుంది. వొక పసి బిడ్డలాగ ముడుచుకొని పడుకొని వున్నప్పుడు చూస్తే, ఘోరంగా అనిపిస్తుంది. వచ్చే నెల ఆమెకు 65 నిండుతాయి.
మీ అప్పాజాన్ ఆరోగ్యం యెలా వుంది? చక్కెర స్థాయిల్ని అదుపులోనే పెట్టుకున్నారని అనుకొంటాను. మీ సోదరులంతా క్షేమంగా వున్నారని తలుస్తాను.
మీ అప్పాజాన్‌కు నా సలాం. మీ అందరికీ నా ప్రేమ.
యిట్లు
మెహబూబ్ ఖాన్”
16:45. మేనేజర్ వచ్చే వేళయింది. నందు సాంబ్రాణి వత్తుల్ని వెలిగించి, దేవుళ్ళ పటాలు, గల్లా పెట్టె, కౌంటర్లు, ర్యాకులు అన్నిటికీ తాకించి వస్తున్నాడు. వాడకందార్లు రావడం మొదలైంది.
19:30. 16 పొడుగు చేతుల బనియన్లు, 7 లోపావడాలు, 6 చెడ్డీలు, 1 డజన్ చేతి రుమాళ్ళు, 8 బాబా స్యూట్లు, 5 గౌన్లు-వీటిని చాలా మంది వాడకందార్లకు అమ్మిన తర్వాత, మీరు టీ తాగడానికి బయలుదేరుతున్నారు. కే.కే. బ్లాకులో నంబియార్ అంగడిలో టీ తాగి, వొక బీడీ ముట్టిస్తున్నారు. బీడీని తాగుతూనే, పెద్ద మార్కెట్టులోకి దూరి, వుల్లి, బంగాళా దుంప మండీల్ని దాటి, కిరాణా అంగళ్ళు వున్న చివరి వరుస వరకు వొక చుట్టు చుట్టి బయటికి వస్తున్నారు. దార్లో, రాజేశ్వరీ హాలు వాకిట్లో శెట్టియారుని చూసి, చిర్నవ్వు నవ్వి, తిరిగి వస్తున్నారు.
20:00. షాపులో రద్దీ లేదు. పూర్తి నిశ్శబ్దంగా వుంది. చొక్కాల కౌంటరులో, విప్పి పరచి వున్న చొక్కా గుడ్డల్ని మడచి పెట్టడానికి లీలాధర్‌కు సహాయం చేస్తున్నారు. యెప్పటిలానే, యజమాని కిషన్ చంద్, కూరగాయలు నింపిన సంచితో, తెల్లటి నైలాను చీర, చేతులు లేని తెల్లటి రవికెను ధరించిన భార్య వెంట రాగా, షాపులోకి వస్తున్నారు.
టికమ్ దాస్ పైకి లేస్తున్నారు. గల్లా దగ్గర వాళ్ళిద్దరూ యెదురెదురుగా కూర్చున్నాక, యెప్పటిలానే షణ్ముగం గాజు గ్లాసులో వారికి మంచినీళ్ళు యిస్తున్నాడు. కిషన్ చంద్ బీడీని వెలిగించుకొంటూనే, ఖాతా పుస్తకాల్ని తిరగేస్తున్నారు.
20:30. తాగి ముగించిన మూడవ బీడీని యాష్‌ట్రేలో వేసి నలుపుతూ లేస్తున్నారు కిషన్ చంద్. ఆయన బయలుదేరి వెళ్ళిన కాసేపటికి షాపులో లైట్లు ఆరిపేస్తున్నారు. నందు గల్లా పెట్టె కౌంటరు మీద, ఖాతా పుస్తకాల నుంచి బిల్లింగ్ మెషిన్‌లోకి బిల్లుల్ని యెక్కిస్తున్నాడు.
యెలుకల బోనులో పెట్టడానికి కే.కే. బ్లాకు నుంచి మసాలా వడ తీసుకొని రమ్మని మీరు షణ్ముగాన్ని పంపిస్తున్నారు. మీ షాపులో మూడు, నాలుగు యెలుకలున్నాయి. దొంగ హరామీలు!
20:45. యీ రోజు అమ్మకాలు రూ. 18,437/- తక్కువే. కిషన్ చంద్ చెబుతుంటారు, మొత్తం స్టాకులో రోజూ 0.75% అయినా అమ్మాలని. మీరు షోకేసు లైట్లను ఆర్పేసి, షాపు ముందు వేలాడదీసున్న శాంపిల్ పీసుల్ని విప్పుతున్నారు.
వున్నట్టుండి భగవాన్ దాస్ లోపలికొచ్చి నిలబడుతున్నారు. మేనేజర్‌ని చూస్తూ, “టికమ్, విన్నవా? ఉగ్గడంలో పెద్ద గొడవంట. యేదో సమస్య రాబోతుంది. యీ దేశం బాగుపడదు. బాంచోద్, మిలిటరీవాడు వస్తేనే అంతా సరి అవుతుంది.
21:00. షాపును మూసేస్తున్నారు. మీరు బయలుదేరుతున్నారు. వీధిలో ‘గుప్పు’ మంటూ వొక తెలియని వుద్రిక్తత వ్యాపిస్తూ వుంది. అంగళ్ళన్నీ హడావిడిగా మూసేస్తున్నారు. షణ్ముగం, మీరు వేగంగా నడుస్తున్నారు. షణ్ముగం వాళ్ళిల్లు పేరూరులో. వాడు ఏ1 పోలీసు స్టేషను పక్కకెళ్ళి బస్సు పట్టుకోవాలి. వప్పణక్కర వీధి బోసిపోతూ వుంది. లీలాధర్ యిచ్చిన యాబై రూపాయల్లో హొటల్ కైలాష్‌లో వొక డబల్ రొట్టె, సుక్కా చాప్స్ తీసుకుంటున్నారు మీరు. వెరైటీ హాలు రోడ్డులో అంత భయం కనిపించలేదు. తిన్నె పక్కనే నిలబడి వున్న కరీం తాత అడిగాడు, “యేంటి, ఉగ్గడంలో గొడవంట కదా?”
“యీ పక్క యేమీ లేదు, కానీ అంగళ్ళన్నీ మూసేసారు.”
21:45. యెప్పటిలాగానే ఇక్బాల్ మీ కోసం తినకుండా యెదురు చూస్తున్నాడు. అమ్మీజాన్ చపాతీలు, బంగాళాదుంప కుర్మా చేసిపెట్టి వుంది. మీరు తెచ్చిన చాప్స్ నంజుకొంటూ ముగ్గురూ భోజనం ముగిస్తున్నారు. మీ దగ్గర మిగిలున్న నలబై రూపాయల్ని అమ్మీజాన్‌కు యిచ్చేసి, బీడీ కాల్చుకునేందుకు తిన్నె దగ్గరికి వస్తున్నారు.
22:30. బయటి తలుపు వేసేసి లోపలికి వస్తున్నారు. ఇక్బాల్ నిద్రపోతున్నాడు. మీరు వాడి పక్కకెళ్ళి పడుకుంటున్నారు. వొకటి రెండు నిమిషాల తర్వాత, వాడ్ని దగ్గరికి లాక్కుని, హత్తుకుంటున్నారు.
మరుసటి రోజు
08:45. మీరు తిన్నె మీద కూర్చొని, దస్తగిరి వార్తాపత్రికను చదువుకుంటున్నారు. దస్తగిరి తన మెకానిక్ షాపుకు వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మానాన్నలు వూరి నుంచి యీ రోజు మధ్యాహ్నం తిరిగొస్తున్నారు. అమ్మీజాన్ లోపలుంది. కరీం తాత స్నానం చేస్తున్నాడు. ‘టిప్ టాప్’లో యీ రోజైనా యిస్త్రీ పని దొరికితే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. వీధిలో జన సంచారం తక్కువగా వుంది. అంతా ప్రశాంతంగా వుంది.
09:15. పడమటి దిక్కునుంచి, వున్నట్టుండి యేదో భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. మూసి వున్న షట్టర్లను యెవరో కొట్టి, ధ్వంసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. దాంతో పాటు, ఆవేశపూరితమైన గొంతులు వినిపిస్తున్నాయి. మీరు ఆందోళనగా తిన్నె మీది నుంచి లేచి, వీధిలోకి వచ్చి చూస్తున్నారు. వప్పణక్కర వీధి చౌరస్తా నుంచి వొక పెద్ద గుంపు మీ వీధిలోకి చొచ్చుకొని రావడం కనిపిస్తా వుంది.
భయంకరమైన నినాదాలు చేస్తూ, యెలుగెత్తి అరుస్తూ, ఆ గుంపు నిదానంగా నడచి వస్తూ వుంది. గుంపులో వున్న ప్రతి వొక్కరూ యేదో వొకటి చేతిలో పట్టుకొని వున్నారు-కట్టెలు, రాడ్లు, లాఠీలు, కిరోసిన్ క్యాన్లు.. మీరు బిత్తరపోతున్నారు.
వీధి మధ్యలో నిల్చున్న మిమ్మల్ని చూసిన ఆ గుంపు, బూతు తిట్లతో భీతిగొల్పే విధంగా అరుచుకుంటూ, మీ వైపు వేగంగా పరిగెత్తుకొస్తూ వుంది.
యేమైంది, యెవరు వీళ్ళు, యెందుకిలా పరిగెత్తుకొస్తున్నారు..యేమీ అర్థం కావడం లేదు మీకు. కానీ, యేదో అపాయం ముంచుకొస్తుంది అని మాత్రం మీ మనసు చెబుతోంది. పరిగెత్తుకెళ్ళి ఇక్బాల్‌ను యెత్తుకొంటున్నారు. నవాబ్ హాకీం రోడ్డు వైపు వెళ్ళి తప్పించుకొందాం అని మీరు అనుకుంటున్నారు. కానీ, అంత లోపే, గుంపు మీ వైపుకొచ్చి, మిమ్మల్ని చుట్టుముడుతూ వుంది. ఇక్బాల్ మీ మెడను గట్టిగా అదిమి పట్టుకొంటున్నాడు.
గుంపులో యెక్కువ మంది నున్నగా షేవ్ చేసుకొని, స్నానం చేసి వచ్చినట్టుగా వున్నారు. పొట్టి చేతుల బనియన్లు, ఖాకీ నిక్కర్లు వేసుకొని వున్నారు. చేతిలో వున్న యినుప రాడ్లని, కట్టెల్ని గాల్లోకి విసురుతూ కేకలు పెడుతున్నారు. వెడల్పాటి భుజాలు, లేత మీసం వున్న వొక యెర్రటి కుర్రవాడు నెత్తినీ, కనుబొమల్నీ కోపంతో ముడివేసి, పళ్ళు కొరుకుతూ, చేతిలో లాఠీ ఝులిపిస్తూ మీ వైపు వురుకుతున్నాడు.
మొదటి దెబ్బ మీ మెడ మీద పడుతూ వుంది. “అమ్మా” అని అరుస్తున్నారు. మీ వూపిరి వేగం పెరుగుతూ వుంది. మీ యింద్రియాలు పదునెక్కుతున్నాయి. మీరు అదుపు తప్పి, ముందు వైపుకు తూలుతున్నారు. యింకో దెబ్బ మీ నడి నెత్తిన పడింది. మీ నెత్తి నుంచి రక్తం యెగజిమ్ముతూ వుంది. ఇక్బాల్‌ను యెవరో మీ నుంచి లాగి, విసిరేస్తున్నారు. వాడు అరుస్తూ యెక్కడో పోయి పడుతున్నాడు. మీరు తలను పైకి లేపుతున్నారు. మీ నుదురు రక్తంతో తడిసిపోతోంది. మీకు కళ్ళు తిరుగుతుంటే, మీ మెడనూ, యెడమ దవడనూ చేర్చి వొక లాఠీ పదఘట్టన చేసింది. మీ యెడమ చెంప చీలి, మాంసం బయటికొచ్చి వేలాడుతూ వుంది. దాన్లోంచి రక్తం పెల్లుబుకుతోంది. నొప్పికి తట్టుకోలేక అరుస్తూనే మీరు కిందికి వాలిపోతున్నారు. మీ శరీరం నేలను తాకే లొపే మీ మీద కొన్ని భయంకరమైన దెబ్బలు పడుతున్నాయి. మీరు పూర్తిగా నేల మీదికి కుప్ప కూలుతున్నారు. చావు దగ్గరికెళ్తున్నారని మీకు లీలగా తెలుస్తోంది. చావు ముందు మీకు యింక దేని గురించీ ఆలోచన లేదు.
ఇక్బాల్‌ని వీళ్ళు చంపేశారా?
వంట చేసుకుంటున్న అమ్మీజాన్ యేమవుతుంది?
స్నానం చేస్తున్న కరీం తాతను అలానే తగలబెట్టేస్తారా?
దస్తగిరి యింటిని కూల్చేస్తారా?
తాజ్ బేగం యెలా వుంది?
ఇక్బాల్ వేసిన జింక పిల్ల, ఫ్యాషన్ ప్యాలస్, షణ్ముగం, వీరు, నందు, అర్జున్ దాస్, లీలాధర్, టికమ్ దాస్, కిషన్ చంద్, భగవాన్ దాస్, టిప్ టాప్ డ్రై క్లీనర్లు, ముబారక్ టీ స్టాలు, మంగళూరు గణేష్ బీడీ, బేగం అఖ్తర్, సురయ్యా, మీరు రాయాలనుకొన్న రాయని కవితలు-యిలా యెవరి గురించీ, దేని గురించీ తలచుకోకుండానే మీరు చనిపోతున్నారు.
మీరు చనిపోయారు.
**************
Daarunam….
Manasu dravinchindi brother.
దాము తమిళ కథల అనువాదాలు చాలా బాగుంటున్నాయి.
‘ఒక గుమాస్తా కథ’ వొక శిల్పపరమైన అద్భుతం. ఒకటిన్నర రోజు జీవితాన్ని కథగా ఇలాకూడా చెప్పవచ్చునని రాసి చూపినట్టుంది.
కథ నిలువునా నిండిన విషాదం అటు బడుగు జీవితంలోని, ఇటు సమాజం లోని విషాదాన్ని ఏకకాలంలో చూపింది. ఇలాంటి కథలకు రచనాకాలం కూడా ఇస్తే పాఠకులకు దేశ చరిత్రలో లింక్ దొరుకుతుంది. థాంక్యూ🌹
Thank you Murthy. రచనా కాలం రచయిత పరిచయంలో వుంది చూడండి.
‘ఈ కథను కోయంబత్తూరులో జరిగిన సంఘటనల్ని ఆధారం చేసుకుని 1997లో రాశాడు’
మీ కామెంట్ దిలీప్ కుమార్ కి పంపాను. ఆయన జవాబును పోస్ట్ చెయ్యమన్నారు.
Dear Mr.Srinivasa Murthy,
Quite touched by your comment…But the credit also goes to our dear Daamu for making it accessible to good writers like you and you could appreciate it too.
Regards
Dilip
శైలి చాలా different గా బావుంది. కథ ముగింపు ఊహించలేదు. మీరు ఎంచుకుంటున్న కథలు, అనువాదం చాలా realistic గా, సరళమైన భాషలో వుంటున్నాయి. ధన్యవాదాలు🙏🏻
ఆఫ్సర్ నా ఫేస్బుక్ పోస్ట్ కింద ‘ఈ మధ్య చదివిన కథల్లో గొప్పగా అనిపించింది’ అని కామెంట్ పెట్టారు. దీనికి దిలీప్ కుమార్ జవాబు ‘Dear Mr.Afsar Mohammed,
Can’t thank you enough for your such generous comments to my story…Really grateful 🙏🙏🙏’
Dilip
ఊపిరి సలపనివ్వని కథనం ,అంతే గొప్ప అనుసృజన .
ఎక్కడా నమోదవక ,ఏ జాడలూ మిగలక ,ఇలా మాయమైపోతున్న మనుషులు ఎందరు !
చాలా డిస్టర్బ్ చేసిన కథ .