తమిళ మూలం:అంబై
అంబై(1944) అసలు పేరు సి.ఎస్.లక్ష్మి. ప్రముఖ తమిళ స్త్రీ వాద రచయిత. తమిళనాడులో పుట్టి, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో జీవించింది. ప్రస్తుతం ముంబైలో వుంటుంది. JNU నుంచి ‘American policy towards refugees fleeing Hungary due to the failed revolution of 1956’ గురించి Phd చేసింది. తనని తాను ‘feminist who has lived without compromise’ అని చెప్పుకుంటుంది. ఆమె తన కలం పేరు ‘అంబై’ గురించి చెప్తూ ‘Ambai is the one who is reborn as Sikandi—a man and takes revenge on Bhishma. I like the androgynous quality of the name’ అంది.
కథలు, నవలలు రాసింది. బహుశా తమిళం నుండి ఇంగ్లీషులోకి ఈమె రచనలు అనువాదమయినంతగా యింకే తమిళ రచయితవీ అవలేదు. ఆమె పరిశోధకురాలు. చరిత్రకారిణి. ఆమె రచనలు యేడు సంపుటాలు ప్రచురణ అయ్యాయి.
యెక్కువగా మానవ సంబంధాలు ఆమె రచనల్లో వస్తువు. వివిధ రకాల ప్రేమలు, మనుషుల మధ్య వుండే ఖాళీతనం, పరస్పరం కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం, స్త్రీల నిశ్శబ్ద యాతన, లైంగిక విభిన్నతల ఆమోదం, దేహాల గురించిన యెరుక వంటి యితివృత్తాలు ఆమె రచనల్లో తరచుగా కనిపిస్తాయి. స్త్రీల జీవన వాస్తవాలని సున్నితంగా, వ్యంగ్యపు హాస్యంతో తన రచనల్లో చిత్రిస్తుంది.
‘స్త్రీలు తమ దేహాల్నీ, మెదళ్ళనీ, యిళ్ళనీ, male egoల నుంచి యెలా కాపాడుకోవాలో అంబై కథలు చెప్తాయి’ అంటుంది రేణుకా నారాయణన్.
‘The Face Behind the Mask:Women in Tamil Literature’ ఆమె చేసిన అతి ముఖ్యమైన non-fiction రచన. ప్రస్తుతం SPARROW(Sound and Picture Archives for Research on Women)అనే సంస్థను స్థాపించి నడుపుతుంది. స్త్రీ రచయితల, కళాకారుల worksను భద్రపరచడం దీని ముఖ్య వుద్దేశం.
ఇటీవలే వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు చాలా అవార్డులొచ్చాయి.
(వొరువర్-మట్రొరువర్-1997)
*
కొండల్లో సన్నని, వంకరటింకర దారిలో బడ బడమని శబ్దం చేస్తూ పోతూ ఉంది ఆ చిన్న బస్సు. మైదాన ప్రాంతం నుండి కొండ మీదికి తీసుకొస్తున్న కూరగాయల మూటలతో బండి నిండిపోయింది. క్యాబేజి, కొత్తిమీర, సొరకాయ, టమోటా, క్యారెట్, ఉల్లిపాయ, అల్లం కలిసిపోయిన వొక వాసన గుప్పుమంటూ వుంది ఆ బండిలో. కాసేపు గడిస్తే, సూర్యాస్తమయ సమయం. బండిలో పరుచుకున్న మంద్రమైన, పసుపు రంగు కలిసిన వెలుతురులో, బండిలో ఉన్న మనుషులు కూరగాయల మూటలతో పాటు కలిసి కనిపిస్తున్నారు. యెర్రటి టమోటాలు బయటకు కనిపిస్తున్న మూటవెనుక తెల్లటి ముఖంతో గోధుమ రంగు జుట్టుతో వొక పాప నిద్ర పోతూ ఉంది. తెల్లని తలగుడ్డతో వుల్లిపాయల సంచిని రొమ్ము దాకా పైకి లేపి పట్టుకుని వొక ఆకారం. ఆకుపచ్చ మేలి ముసుగులో పచ్చ, ఎరుపు, పసుపు గాజులు వేసుకున్న చేతిని సొరకాయ మూట మీద వేసుకొని వొక స్త్రీ. యెవరో చాలా శ్రద్ధతో గీసిన చిత్రాల్లా ఆ బండిలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు.
మాథ్యూ నాథన్ చిత్రాల్లో వీళ్లలో యెంత మంది రంగు రంగుల గీతలుగా, తేలుతున్న కళ్ళుగా, పరుచుకున్న మేలిముసుగులుగా, పూర్తి నగ్న ఆకారాలుగా వున్నారని వాళ్ళను చూస్తూ అనుకున్నాడు అరుళన్. అతని పక్కన, అతని ముడతలు పడిన చేతిని పట్టుకుని కూర్చుని వున్న పిల్లవాడు వీరు, అతని భావాల్ని అర్థం చేసుకొన్న వాడిలా, తలెత్తి అతన్ని చూశాడు. అతని పొడవైన నెరిసిన వెంట్రుకలు వీరు నెత్తి మీద పడుతున్నాయి. జనప దారంతో కట్టిన, పూర్తిగా నెరిసిన అతని జుట్టు మీద వీరు కళ్ళు పరిగెత్తాయి. మామూలుగా అయితే అతని తెల్లని జుట్టు అతని భుజాల మీద వేలాడుతుంటుంది. గాలిలో తేలుతూ. అయితే యీ రోజు వొక ప్రత్యేకమైన రోజు. యెగిరే జుట్టును జనప దారంతో కట్టిన దినం. మాథ్యూ నాథన్ శరీరం, ఆకాశాన్ని తాకుతున్న పొడవాటి దేవదారు చెట్టు క్రింద పూడ్చిన దినం. తలెత్తి చూస్తున్న వీరూని చూసి మెల్లగా చిరునవ్వాడు అరుళన్. వీరు అతన్ని యింకొంచెం ఆనుకొని కూర్చున్నాడు.
వీరు అక్కడున్న బంగాళదుంపల పొలంలో పని చేసేవాడు. మిగతా సమయం వీరిద్దరికీ కొడుకు లాగా, దగ్గరి బంధువులాగా వీళ్ల యింటిలో పెరిగాడు. ప్రతి శుక్రవారం వర్ణ చిత్రాలు గీయడానికి రంగుల పెయింట్లను కొనుక్కొచ్చేట్లు గానే ఆ వేళ కూడా యిద్దరూ వెళ్ళారు. నాథన్ లేకపోయినప్పటికీ ఆ శుక్రవారపు సంప్రదాయాన్ని యిద్దరూ పాటించారు. వీరు తన చిత్రకళను ప్రాక్టీసు చేయడం కోసం, రెండు చిన్న కాన్వాసులు, కాగితాలు వీరు ఒడిలో భద్రంగా ఉన్నాయి.
యిలా వొక బస్సులో కూర్చునే నాథన్, అరుళన్ 40 సంవత్సరాలకు ముందు ఈ కొండ గ్రామంలో నివసించడానికి వచ్చారు. దానికి వొక వారం ముందు మాత్రమే వొక పార్టీలో కలుసుకున్నారు వాళ్ళు. అనేక సంవత్సరాలకు ముందు సైనికుడుగా వున్న అరుళన్ వాళ్ల నాన్న యీ కొండ ఒడిలో నివసించాడు. యెప్పుడైనా వుదయపు వేళల్లో కొండల్ని చూస్తూ ‘వడక్కిల్ యిమయమలై పాప్పా-తెర్కిల్ వాళుం కుమరి మునై పాప్పా’ (ఉత్తరాన హిమాలయాలు – దక్షిణాన నివసించే కుమరి శిఖరం) అంటూ గర్జిస్తున్నట్టు ఆయన సుబ్రహ్మణ్య భారతి పాటను పాడటం కలలాగా జ్ఞాపకం ఉంది. కుమరి మొన అంటున్నప్పుడు గొంతు గాలానికి చిక్కుకున్నట్టు గద్గదమయ్యేది. ఆయన వూరికీ ఆయనకు వున్న సంబంధం గురించి అరుళన్‌కు అంతవరకే తెలుసు. తల్లిదండ్రులు చనిపోయాక అరుళన్ సాహిత్యంలో, సంగీతంలో మునిగిపోయి కొండ క్రింద వున్న ఆ పట్టణంలో చాలా సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. యెండా కాలం కొండ ప్రాంతాలకు సందర్శకులుగా వచ్చే చాలా మంది అతనికి స్నేహితులు. అలాంటి వొకరు యేర్పాటు చేసిన వొక పార్టీనే అది. స్త్రీ పురుషులు చుట్టూ గుమికూడి వుండగా, మ్యాథ్యూ నాథన్ కూర్చొని మాట్లాడుతున్నాడు.
‘భారతీయ తండ్రి, విదేశీ తల్లి సృష్టించిన వర్ణ చిత్రకారుడు’ అని అతన్ని గురించి యీ మధ్య పత్రికలో వచ్చింది. “మీ వేర్లను వెతుకుతూ వచ్చారా?” అని పత్రికా విలేఖరి అడిగిన ప్రశ్నకు, “ప్రత్యేకంగా నా వేర్లను వెతుకుతున్నా అంటే, అది నా వెతుకులాటను పరిమితం చేస్తుంది. నాలాంటి వాళ్ల వేర్లు ప్రపంచమంతా వుంటాయి. విమానం మారడానికి ముందు చాలా గంటలు గడపాల్సిన విమానాశ్రయాలన్నీ మాకు ఆవాసాలే. మా నాన్న ఇండియా నుంచి బదిలీ అయ్యి, విదేశాలకు వెళ్ళింది 20వ శతాబ్దపు ఆరంభ సంవత్సరాలలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. అప్పుడు ఆయన తన పాండిచ్చేరి యింటి తోటలో నుంచి రెండు పిడికిళ్ళ మట్టిని వొక పొట్లం కట్టుకుని పోయారట. ఆయన ప్యారిస్ కు పోయి చేరాక వొక చిన్న తోటలో దాన్ని వేసి వొక మొక్కని నాటారంట. యీ ప్రపంచంలో ఆయన వెళ్లిన ప్రదేశాలన్నిటికీ ఆ తొట్టి, అందులో రెండు పిడికిళ్ళ మట్టి కూడా వెళ్ళాయి. వేరే ఎన్నో రకాల మట్టి అందులో కలిసినా అందులో తన దేశపు మట్టి ఉందని ఆయన నమ్మారు. ఆ మట్టిలో నాటిన మొక్క వేర్లు ప్యారిస్లో మా ఇంటి తోటలో దృఢంగా వున్నాయి. నా వెతుకులాట వేర్లకు సంబంధించింది కాదు” అని చెప్పారు.
వేర్లను వెతకడం అనేది వొక వుద్వేగ భరితమైన అవసరమని భావించని కాలం అది. అలెక్స్ హేలీ ఆఫ్రికా వేర్లను గురించి రాయడానికి యింకా చాలా కాలం వుంది. మనుషులు యింకా విడి విడి వ్యక్తులుగా చీలిపోని, ముక్కలు కాని, పూర్తిగా పతనం కాని కాలం. రెండవ ప్రపంచ యుద్ధ బీభత్సాల నుంచి ప్రాణాలతో బయటపడి ప్రపంచమంతా వేర్లను వ్యాపించడానికి యూదులు ప్రయత్నిస్తున్న రెండవ దశాబ్దం. చాలామంది సిద్ధాంతాల కోసం, మానవత్వం కోసం సొంత దేశాల్ని వదిలేయడానికి ప్రయత్నించి ముందుకు వచ్చిన సమయం. భూగోళ మ్యాపులకు పరిమితం కాకుండా ప్రపంచ పౌరులుగా జీవించడం సాధ్యమే అని కొంతమంది నమ్మిన రోజులు. అందువల్ల వేర్లను గురించి మ్యాథ్యూ నాథన్ చెప్పింది యెవరినీ ఆశ్చర్యపరచలేదు. తరువాత ఆయన చెప్పింది బుద్ధి జీవుల వలయంలో అలజడుల్ని రేపింది.
“వొక వేళ మీరు వొక సహచరిని వెతుకుతూ వచ్చారా ఇండియాకు?” అని విలేఖర్లు అడిగినప్పుడు
“లేదు. సహచరిని వెతుకుతూ కాదు. స్త్రీల పట్ల నాకు ఆసక్తి లేదు” అని మామూలుగా చెప్పాడు.
ఆ పార్టీకి ఆయన్ని ఆహ్వానించింది కూడా ఒక అపూర్వ జంతువు లాగా అతన్ని చూసేందుకే అని అరుళన్ గ్రహించాడు. అది బహిరంగంగా చర్చించని అంశం. యిలాంటి భావాల్ని కలిగి ఉండే వాళ్ళు అప్పుడు చెట్ల బొరియల్లో వుండే గుడ్ల గూబలు.
పార్టీలో ఆ రోజు చర్చించిన పలు అంశాల్లో చావు గురించిన భావాలూ వచ్చి చేరాయి. హఠాన్మరణం, రోగగ్రస్త మరణం, ప్రమాదవశాత్తు మరణం అని రకరకాల చావుల గురించి మాట్లాడారు.
“నేను వొంటరిగా చావడానికి ఇష్టపడను. నా పక్కన యెవరైనా వుండాలి” అన్నాడు మ్యాథ్యూ నాథన్.
“పక్కన యెవరున్నా చనిపోవడం మీకు మాత్రమే సాధ్యమవుతుంది” అన్నాడు అరుళన్.
కూర్చునే, పక్కన నిల్చున్న అరుళన్ ని తలెత్తి చూశాడు మ్యాథ్యూ నాథన్. మృదువైన చూపుతో కూడిన నీలి కళ్ళు.
“మీరు యెలా చావాలని కోరుకుంటున్నారు” అన్నాడు.
“ఒక పక్షి లాగా. యెవరు గమనించకుండా. సేవలు చేయించుకోకుండా. ఉన్నట్టుండి. యే ప్లాను లేకుండా. యెవరూ జ్ఞాపకం పెట్టుకోకుండా”
“పక్షులు అలానే చేస్తాయా?”
“అలానే వుండాలి. వేరే యే విధంగా అనేది తెలియదు”
పార్టీ ముగిశాక, అరుళన్ మ్యాథ్యూని తన ఇంటికి ఆహ్వానించాడు. చిత్రకళ గురించీ, కవిత్వం గురించీ కొన్ని మాటలు సాగాయి. మ్యాథ్యూ నీలి కళ్ళు, మృదువైన పొడవాటి వేళ్ళు, నున్నటి ముఖం- వాటిలో అరుళన్ మునిగిపోయాడు. అరుళన్ నల్లటి దేహం, చురుకైన కళ్ళు, పొడవాటి రింగుల జుట్టు మ్యాథ్యూని వశ పరుచుకున్నాయని అతడు తర్వాత చాలా సార్లు చెప్పాడు. అతి త్వరలో కలిసి జీవించాలని నిర్ణయించుకొన్నారు. రాళ్ళు రప్పలతో నిండిన కొండ దారుల్లో అనేక మైళ్ళు బస్సులో వెళ్లి, నడిచి, మోటార్ బైక్ లో వెళ్లి, వాళ్లు జీవించడానికి వొక చిన్న కొండ గ్రామాన్ని యెంచుకున్నారు. అది వాళ్ళ అజ్ఞాత జీవన ప్రదేశమని కొందరు వ్యంగ్యంగా విమర్శించినా మ్యాథ్యూ దాని గురించి పట్టించుకోలేదు. అరుళన్ కూడా “ఇది మా గూడు” అనేవాడు మితృలతో.
చిత్రకళలో, రచనల్లో, కొండ ప్రాంత చెట్లను నరికి వేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడంలో, వీరు లాంటి బాలబాలికలకు చిత్రకళ, రచనల్లో శిక్షణ ఇవ్వడంలో గడిచిన యేళ్ళు యెన్ని అని లెక్క వేసేలోగా మ్యాథ్యూ జబ్బు పడ్డాడు.
ఆ చివరి నెల మ్యాథ్యూ వేసిన చిత్రాలు చాలా విభిన్నమైనవి. గోడకి వేలాడదీస్తే దూది లాగా యెగిరిపోతాయేమో అని అనిపించేట్లు అవి అలంకరించబడి ఉన్నాయి. “భారం లేదు, భారం అవసరం లేదు” అని వొక సారి మ్యాథ్యూ వాటిని చూసి చెప్పాడు. దాని తరువాత వీరుని గీశాడు. రోజూ సాయంత్రం మీరు వచ్చి చిత్రం వేయడానికి ఆయన యెదురుగా ఆయన కోరుకున్నట్టు నిలబడే వాడు. యీ చిత్రంలో వీరు వొక వైపుకు తిరిగి పడుకొని ఉన్నాడు. నగ్నంగా. నవ్వుతూ. తెల్లటి నవ్వు. అతని దేహం యే విధమైన వత్తిడి లేకుండా ఉంది. వాడి మగతనం వొక లేత మొగ్గ వాలినట్టు, విశ్రాంతి భంగిమలో ఉంది. వొక గంధర్వుడిలాగా నేల మీది నుంచి లేచి పైకి వెళ్లే తేలికతనం ఆ దేహంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
మాథ్యూ మంచంలో పడున్న రోజులు అతి తక్కువే. అతని శరీరాన్ని రోజూ తుడుస్తున్నప్పుడు వొక పరిచిత కవితలాగా జ్ఞాపకాల్లో నిలచిపోయింది.
ఐరోపా రక్తం కలవడం వల్ల ముడతలు యెక్కువగా వున్న తెల్లటి దేహం. పచ్చటి నరాలు పైకి తేలిన కోమలమైన చేతులు. పక్షిపిల్ల మృదువైన మెడ లాగా మాంసం లేని మెడ. యెముకలు తేలిన దవడలు. నీలి రంగు కళ్ళు. యెండు కొబ్బరి ఆకుల వలె తడి కోల్పోయిన పెదాలు. వెంట్రుకలు లేని ముందటి నెత్తి. పూర్తిగా నెరిసి పోయి బంగారు రంగులో వెనుక మూపురం వరకు వేలాడుతున్న జుట్టు. వెంట్రుకలు లేని వక్షస్థలం. యెప్పుడూ బిగుతు బట్టలు వేసుకోకపోవడం వల్ల యే విధమైన గురుతులు పడని నడుము. యెండిపోయిన జలపాతంలా జారిపోయిన తొడలు, కాళ్ళు. వాడి వత్తలైన పండులా లేత యెరుపు రంగులో అతని పురుషాంగం.
వొక్కోసారి వేడినీటిలో బట్టను తడిపి వొక్కో అంగాన్ని తుడుస్తున్నప్పుడు అతని చేతుల్ని పట్టుకుని, “అరుళ్, చావు చాలా విచిత్రమైంది కదా?” అని చెప్పి, అతని అరచేతిని తన యెండిన పెదాల మీద పెట్టుకున్నాడు నాథన్. “అరుళ్, నన్ను క్షమించు, దీన్ని నేను వొంటరిగా చేయాల్సి వుంది” అన్నాడు.
నీళ్ళు నిండిన కళ్ళతో అరుళన్ అతన్ని తట్టాడు. రాత్రి నిద్ర లోంచి వున్నట్టుండి మెలుకువ వచ్చినప్పుడు మ్యాథ్యూ అతన్ని చూస్తూ కూర్చుని వున్నాడు.
“కాళ్ల కింద నేల మెల్లగా జారి పోతున్నట్టు వొక అనుభూతి అరుళ్. కాన్వాసు మీద పై చివరివరకూ రంగుల బ్రష్ ను తీసుకెళ్లి కాన్వాసు పక్కల దాని చతురస్ర చివర్లను దాటి రంగుల్ని జారవిడుస్తున్నట్టుంది.” మళ్లీ కొనసాగిస్తూ “నన్ను ఒక దేవదారు వృక్షం కింద పూడుస్తావా?” అన్నాడు.
“అలాగే మ్యాథ్యూ”.
తర్వాత చాలా సేపటి దాకా నిశ్శబ్దంగా వున్నారు.
బస్సు పరిగెడుతూ ఉంది.
ఉషోదయపు వేళ వెలుతురుని పూసుకున్న వర్ణ చిత్రాన్ని గుర్తు చేస్తున్నట్టు మ్యాథ్యూ చనిపోయాడు. కళ్ళు తెరిచి చూసే సరికి మ్యాథ్యూ బంగారు రంగు వెంట్రుకలు దిండు మీదుగా పరుచుకొని వున్నాయి. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు పడుకొని వున్నాడు. తల వొక వైపుకు వాలి ఉంది. అనంతమైన శాంతి కనిపిస్తుంది ముఖంలో.
అరుళన్ దగ్గరికి పోయి వణుకుతున్న చేతులతో అతని తలను నిమిరాడు. “సాహెబ్, సాహెబ్” అన్నీ వెక్కివెక్కి ఏడ్చాడు వీరు.
పదిహేను రోజులకు ముందు వర్ణచిత్రాలన్నిటినీ వొక పెయింటింగ్ గ్యాలరీకి పంపించారు. వీరును గీసిన చిత్రం మాత్రం పెద్ద సైజులో యెదురుగా వుంది-వాళ్ళిద్దరి స్వప్నం లాగ.
ఆకాశాన్ని తాకుతున్నట్టు యెత్తుగా నిలిచిన, గాలిలో ఎగురుతున్నట్టు విష్ విష్ శబ్దంతో ఊగుతున్న రెమ్మల కొమ్మలతో ఉన్న దేవదారు వృక్షం కింద వీరు గుంత తవ్వాడు. తెల్లటి బట్టను కప్పిన మ్యాథ్యూ దేహాన్ని అందులో వుంచారు. వెనుక యెవరో స్త్రీలు యేడ్చారు. శరీరాన్ని పెట్టి, మట్టిని కప్పి సమం చేశాక, యెక్కడినుంచో ఒక పాప వచ్చి అందులో పొర్లింది.
కిటికీ బయట సూర్యాస్తమయం. హిమాలయ పర్వతాల మంచు ముక్కలు, నిప్పులో పట్టెడు బొగ్గుల లాగా మెరుస్తున్నాయి. లోయలో వున్న యిళ్ల పొగ గొట్టాల నుంచి వస్తున్న పొగ వొక దూసర వర్ణ చార లాగ కనిపిస్తూ వుంది.
బస్సు కొంతమంది ప్రయాణికుల్ని దింపడం కోసం ఆగింది. అరుళన్ వున్నట్టుండి లేవడంతో కొంచెం వులిక్కిపడిన వీరు కూడా లేచాడు. వాళ్లు మామూలుగా దిగాల్సిన స్థలం కాదది. అరుళన్ బస్సు నుంచి దిగాడు. వీరు కూడా కాన్వాసును, పెయింట్ ట్యూబుల్ని తీసుకుని దిగి పక్కన నిలబడ్డాడు. కొండ దారి అంచులో నిలబడి కొండల్ని చూశాడు అరుళన్. తెల్లటి పంచె, కుర్తా ధరించి ఉన్నాడు. వెండి కిరీటం లాగా జుత్తు ప్రకాశించింది.
వీరు తలను ఒకసారి నిమిరి, అతను జారిపడడం మొదలుపెట్టాడు. దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడిలా రెండు చేతుల్ని చాచాడు. పంచె కూడా గాలిలో అలల్లాగా లేచింది. ఆ అస్తమయ వెలుగులో వొక తెల్లని పక్షి తన గమ్యం వైపు నిదానంగా యెగురుతున్నట్టు అతడు మెల్లగా క్రింది వైపు పడిపోతూ ఉన్నాడు. తరువాత వొక బండకు ఢీకొని పడ్డాడు. బిత్తరపోయిన వీరు “సాహెబ్” అని అరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అరుళన్ తెల్లటి వస్త్రాల మీద యెరుపు రంగు, మొరటు బ్రష్ తో మెల్లగా చల్లినట్టు, పరుచుకుంది.
**********
యిందాక అంబైకు యీ కథ లింక్ పంపాను. ‘Thanks Daamu. I can make out only the English portions of my biodata! What have you written where you have used the words male ego?
Happy the story got published’. అని మెసేజ్ పెట్టింది.
నేను ‘That’s Renuka Narayanan’s quote: ‘ The stories of Ambai tells women how to save their bodies, minds and homes from male egos’
అంబై మెసేజ్: ‘Haha! Actually the stories tell men also the same thing hopefully!’