మన అందరికి మరణం అన్నా, మనం లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అన్నా చాలా భయం. అందుకే వీలైనంత వరకు ఆ ప్రస్తావనను తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. “ఈ సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే ఒక అంకె తగ్గిపోవడం కాదు, ఆ ఒక్కడితో ముడిపడివున్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం.” అని పూడూరి రాజిరెడ్డి గారు అంటారు. కానీ, మన పూర్వీకులు మరణానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. మరణం స్వేచ్ఛ అని, మరణించిన వాళ్ళు దైవంతో సమానం అని కూడా అంటారు. హిందూవులు, మనిషి మరణం తర్వాత, ‘వైతరణి నది’ తాము చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని కూడా నమ్ముతారు. అలా వైతరణి నది దగ్గర ఉన్న కొన్ని కథలను తీసుకొని కవనమాలి గారు ‘వైతరణీ ఒడ్డున’ అనే కథల సంపుటి రాశారు.
ఈ పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. అన్నీ కూడా అంతర్లీనంగా మరణం చుట్టూ జరిగే కథలే. మరణం గురించి కథలు కదా అని అన్నీ విషాదాంత కథలే అనుకుంటే మన పొరపాటే. ఈ కథలు మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి అలానే ఆలోచింపచేస్తాయి. శిల్పం పరంగా అన్ని వైవిద్యం ఉన్న కథలే.
‘మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే’ అని చెప్పిన మార్క్స్ మాటలను నిజం చేసేలా ఉండే ఒక కుటుంబం గురించి ‘ఆసుపత్రి వరండా’ అనే కథలో చూడచ్చు. ‘మలిసంధ్యలో మధూళి’ కథలో ప్రేమ యొక్క నిర్వచనం చూపిస్తే, ‘పసిడి స్వప్నాలు’ లో ఇద్దరు అనాథ అన్నాతమ్ముళ్ల కలల గురించి, ‘సంభాషణ’ లో ఇద్దరు యువకుల మాటల ద్వారా ప్రస్తుత సమాజపు పోకడల గురించి చెప్తారు. ఇలా ప్రతీ కథ గురించి చేప్పే ప్రయత్నం చెయ్యచ్చు, కానీ, ఒక చిన్న detail చెప్పినా కథ అనుభూతిని పాఠకుడు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కథల గురించి ఎక్కువగా మాట్లాడం చెయ్యట్లేదు.
ఇందులో ఉన్న ప్రతీ కథా ఒక నవలగా, లేదా ఒక మంచి సినిమాలా చెయ్యచ్చు. అలానే ఈ కథల్లో అన్నీ genres ఉన్నాయి. ప్రేమ కథా, చారిత్రాత్మక కథా, జానపథ కథా, రివెంజ్ కథా, self discovery కథా, ఇలా అన్ని రకాల కథలు ఉన్నాయి. ఒక కథలో వచ్చే పాత్రలే మరో కథలో కూడా రావడం వల్ల మనకి చదివేటప్పుడు మరింత కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఇక్కడ ముఖ్యంగా రచన గురించి, శిల్పం గురించి ఎంత మాట్లాడుకుంటామో, అంతే ఎక్కువగా ఈ కథలకు బొమ్మలు వేసిన ‘రా’హుల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి కథను స్థూలంగా బొమ్మలతో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ బొమ్మల ద్వారా మనం కథను ఊహించవచ్చు లేదా కథ పూర్తిగా చదివిన తర్వాత, మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి కూడా ఈ బొమ్మలు ఉపయోగపడతాయి. Anime స్టైల్ లో గీసిన ఈ బొమ్మలు చాలా బాగా నచ్చాయి.
మనం అందరం మరణాన్ని ద్వేషిస్తున్నాం. అందకే ఈ కథల్లో మనకి ఇష్టమైన పాత్ర చనిపోతే చాలా బాధ పడతాము. రచయిత మీద కోపం కూడా వస్తుంది. అయితే జీవించడాన్ని ప్రేమిస్తున్నామా..? ప్రేమించడం అంటే సమస్యలతో కూడిన జీవితాన్ని ప్రేమించడం. జీవితాన్ని సంపూర్ణంగా ప్రేమించడమే ఈ కథల ద్వారా రచయిత మనకి చెప్పాలి అనుకున్నాడు ఏమో అని, ముందు మాటలైనా చెప్పిన ‘చెప్పలేం! మరుక్షణమే, జీవితంలో ఆఖరి క్షణం అవ్వచ్చేమో. అందుకే, ఈ క్షణం జీవిద్దాం!!’ చదివినప్పుడు మనకి అనిపిస్తుంది.
చదవడంలో ఒక మంచి అనుభూతి కావాలి అని కోరుకొనేవాళ్ళు తప్పకుండా ఈ పుస్తకం చదవాలి. సమకాలీన రచయితల్లో ఇంత వైవిధ్య అంశాలతో రాస్తున్న కవనమాలి గారికి అభినందనలు. మీ తర్వాతి పుస్తకం కోసం ఎదురుచూస్తూ…
ఈ పుస్తకం మీకు అమెజాన్ లో దొరుకుతుంది.
లింక్: https://amzn.to/4akdajx
Add comment