పద్దన్నే ఇంత చద్దిబువ్వలో..
ఉడుకుడుకు పొప్పో..
రోట్లో నూరిన ఊరిమిండి కలిపేస్కోని తింటే..
ఎంత రుచిగా ఉండేదో!
బువ్వ గురించి చెప్తే..
రాగి సంగటి గురించి చెప్పాల!
చాట్లోకి ..
రెండు సోలల స్టోరు బియ్యం తీస్కోని..
రాళ్లు ఏరపంచి..
రోంచేపు బియ్యాన్ని తట్టపర్సి, చెరిగి..
కొట్టంలోని..
పొయిగడ్డమీద బూతపేలా పెట్టి..
బియ్యం పోసేది మామయ్మ.
నాలుగు బుడ్డచెమ్ముల నీళ్లు పోసి…
దాంట్లోకి ఇంకా ఎగస్ట్రా నీళ్లు పోసి..
కందికట్టెతో పొయ్యి అంటిచ్చి..
అంటుకున్నాక చీక్కట్టెలు పెట్టి..
సంగటికిఉడికిచ్చేది.
పంత పొయ్యిమీద కుండపెట్టి..
దాంట్లో నీళ్లు పోసి.. రెండుగలాసులు కందివాళ్లుపోసి..
కోసిన టమోటాలు, వట్టి మెరపకాయలేసి..
చిటెకెడు పసుపు, రెండేళ్లతో ఉప్పు వేసి..
బ్యాల్లపుల్చుకు వేచ్చాండ.
తపేలాలో..
పటికి పటికి మని బియ్యం ఉడికి..
గంజి బుడగలు ఎగిరెగిరి చిందుతొక్కుతాంటే..
బూపుల్లతో కలపెబెట్టేది.
కుండలోని బ్యాల్ల నీళ్లు..
మూకటి మూతికి పసుపు పూసుకునేది.
బువ్వ గంజిపడ్తాంటే..
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని…
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్చుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి..
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద..
టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసేది..
ఆతర్వాత మా చెల్లెలికి..
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్చు చేసేది.
మాయమ్మ, నాయిన, చెల్లెలు..
బ్యాల్లపుల్చుతింటాంటే..
నేను మల్లతింటా అనేవాణ్ణి!
నాకతేందో మాయమ్మకు తెల్దా!
బాగా కాలే కాలే..
సంగటిముద్ద పైన బొటనవేలితో గురిగ చేసేది.
దాంట్లోకి తెలవాయికారము, నెయ్యి..
లేదా ఊరిమిండి వేసుకోని తింటాంటే..
రాగి సంగటి సరుక్కుమని..
పొట్టదేవాలయంలోకి ఉరికిత్తేది.
ఆ తిండిరుచి.. మాటల్తో చెప్పలేన్లే!
మానాయిన టాక్టరుపని లేనప్పుడూ..
చుట్టాలొచ్చినప్పుడు..
తెల్లపెట్టకోడో, ఎర్రపెట్టెకోడికో స్పాటు పెట్టేవాడు.
బెరిక్కన.. హలాలు చేసి..
ఈలకత్తితో ముక్కలు కోచ్చాండ.
సంగట్లోకి నాటుకోడి సీలు వేసుకోని తింటాండ్రి.
ఊర్లో యాటలు కోసినరోజు..
మా ఇంటికి అల్లాకండలొచ్చాండా..
అప్పుడూ మా ఇంట్లో సంగటే రాజ్యమేలేది.
వానలకాలమైతే..
ముందురోజే గుడ్లకోడిని చూసి..
మూసిపెడ్తాండె మా నాయిన.
వానాకాలాల్లో సంగటి, నాటుకోడి సీలు..
వాసతో మా ఇండ్లు గప్పుగొడ్తాండె.
సీలు తిననని..
పొప్పో, నూనెంకాయో, బ్యాల్లపులుసో,
కనీసం చనక్కాయల ఊరిమిండో చేసేది మాయమ్మ.
ఇంట్లో తెలవాయికారం స్టాకుంటాండె.
ఓ నిజం చెప్పాల..
వానాకాలంలో కొట్టంలోంచి సంగటి తపేలాను..
వసారాలోని అరుగుమిందికి తెచ్చే..
సంగటి చుట్టూ చుట్టుకునేవాళ్లం.
గడ్డిమోపు మీద కూర్చోని..
టోపీ గిన్నెలో సంగటి ముద్దలో ఊరిమిండేసుకుని..
గాట్లోని ఎనమలతిక్కు..
కొట్టానికి ఉండే కాశీపుల్లలోంచి దుంకే వానచినుకులు సూచ్చా..
గూళ్లల్లో ముడుక్కుండే కోళ్లతిక్కు చూచ్చా ..
ఆకాశవాణి కడపకేంద్రం రేడియోపాటలు ఇంటా..
తింటాంటే..
ఆ సంగటి అమృతమయ్యేది.
ఆ జీవితంలోంచి..
సొర్గంలోకి చేయిపట్టుకోని తీసకపొయ్యేది సంగటి.
అట్ల.. వేలమాట్లు సొర్గంలోకి పోయి వచ్చినా!
……………………..
( పాతికేళ్ల వరకూ నేను ప్యూర్ వెజిటేరియన్ను. నాన్ వెజ్లోకి దుంకినాక .. సంగట్లోకి పిల్లప్పుడు కోడిసీలు తిన్లాకపోతినే బాధపడ్తి. ఈ పొద్దు మాయింట్లో సంగటి, చికెను. అందుకే పిల్లప్పటి సంగటి జ్ఞాపకాలు గుర్తొచ్చి…)
అద్భుతం
thanks
Excellent
thankive so much sir