“ఎక్కడుంది బ్రహ్మం?” అంటే, “ఎక్కడో ఉండడం ఏమిటి నువ్వే ఆ బ్రహ్మం అయి ఉండగా?” అంటారు రమణులు. దీనినే పంచమహా వాక్యాలలో ‘అహం బ్రహ్మాస్మి’ అంటున్నాం. మనకి ఎంతో దగ్గిరలో ఉన్న ఆత్మలోకి చూడడానికి ప్రయత్నం అతి కష్టం కనక దాన్ని జేరడానికి అనేకానేక దార్లు చూపించబడ్డాయి. అందులోవే నాలుగు రకాల యోగాలు. ఇందులో సులభం భక్తి యోగం, భగవంతుడి మీద భక్తి కుదరడానికున్న సాథనాలలో స్వాధ్యాయం అనేదొకటి. ఈ స్వాధ్యాయంలో భాగమే క్రమంగా ఒక పధ్ధతిలో వేదం చదవడం. ‘వీటిని క్రమ పధ్ధతిలోనే ఎందుకు పలకాలనే’ ప్రశ్నకి సమాధానం ఏమంటే, ఒక్కొక్క మంత్రం ఒక్కోవిధంగా పలికితే చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రత్యేక ప్రకంపనాలు ఉద్భవిస్తాయి. అవి విన్నవాళ్ల మనసుల మీద గాఢంగా వేసే ముద్ర వల్ల మనసు భగవంతుడిమీద సులభంగా కేంద్రీకరించగలుగుతాం. ఇది చాలా మంది అనేకసార్లు వినీ, చూసీ, పరిశీలించీ తెలుసుకున్న విషయం.
అయితే ఈ వేదం ఎలా పలకాలి? ధ్రువుడు అయిదేళ్ల ప్రాయంలోనే కఠోరమైన తపస్సు చేసాక విష్ణువు కనిపించగానే ‘నిన్ను స్తోత్రం చేయాలని ఉంది గానీ నేనెప్పుడూ ఎవరి దగ్గిరా ఏమీ నేర్చుకోలేదు,’ అని మనసులో అనుకుంటున్నప్పుడు తన శంఖాన్ని ధ్రువుడి దవడకి ఆనిస్తాడు విష్ణువు. దానితో సామవేదం నోట్లోంచి వస్తూండగా స్త్రోత్రం చేస్తాడు ధ్రువుడు. అది ప్రత్యక్షానుభవం. అలా ప్రత్యక్షంగా తెలుసుకున్న మహర్షులు వేదం ఎలా పలకాలో తెలుసుకున్నాక మిగతావారికోసం దాన్ని ఇతరులకి అందించారు. అప్పట్నుండి అది ముఖతః ఒకరినుంచి ఒకరికి అందుతూ వస్తోంది. అయితే దాన్ని మరో విధంగా చదవకూడదా అంటే ఒకటే సమాథానం. మీరు వైద్యుడి దగ్గిరకి వెళ్తే ‘ఈ మాత్ర రోజుకి మూడు సార్లు వేసుకో’ అన్నాడు. అబ్బే నేను రోజుకి ఒక్కసారే వేసుకుంటాను అంటే ఏమౌతుంది? ‘మందు మంచిది కాదు, నేను వాడినా తగ్గలేదు’ అనగలరా అప్పుడు? వేదం ఒక విధంగా క్రమంలో చదవడానిక్కూడా ఇదే సమాధానం. గురు ముఖతః నేర్చుకుని ఈ క్రమంలో పధ్ధతిగా చదవడం వల్ల వాక్శుధ్ధి కలగడం, గొంతుక, స్వరపేటిక బాగుపడడం సాధారణం. ఎక్కడో మూల కూర్చుని చదవడం కాక శుచిగా స్నానం చేసి భగవంతుణ్ణి తలుచుకుంటూ పైకి గొంతెత్తి చదువుతూ ఉంటే మనం చదివేది మనకి వినిపించడం వల్ల మరో చెడు ఆలోచన మనసులోకి రాకుండా ఆపగలుగుతాం. అయితే ఎవరైనా వేదం చదవవచ్చా? తినే తిండి వల్ల మనస్సు, ఆలోచనలు ప్రభావితం అవుతాయి కనక వేదం చదివేవారు ఫలానా ఆహారం తీసుకుంటే మంచిది అని నియమం పెట్టారు. ఆ నియమాలకి లోబడితే ఎవరైనా చదవడానికి అర్హులు. మనస్సనేది భగవంతుడికి ముఖ్యం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మానవుడు సృష్టించుకున్న కుల మతాలనేవి ఎన్నడూ అడ్డంకి కాదు.
ఈ వేదం స్వాధ్యాయంగా చదవడానికి – సంహితపాఠం, పదపాఠం, క్రమపాఠం, జటాపాఠం, ఘనపాఠం అనే పధ్ధతులున్నాయి. గురువునుంచి నేర్చుకున్న వేదపాఠం లో ఏ ఒక్క అక్షరం కూడా మరిచి పోకుండా ఉండడానికే ఈ పధ్ధతులన్నీ పెట్టారని అంటారు. వీటికి ఉదాహరణ చూద్దాం.
మంత్రం – నమఃశివాయచ. నమకం లో ఉన్న ఈ మంత్రంలో “నమః, శివాయ, చ” అనే మూడు పదాలున్నాయి. వీటిని అనేక రకాలుగా ఇలా చదవవచ్చు.
సంహితపాఠం – “నమఃశివాయచ” (పదాలు విడతీయకుండా గానం చేసేది సంహితా పాఠం.)
పదపాఠం – “నమః శివాయ చ” (పదాలని విడగొట్టి ఒక్కొక్కపదాన్ని గానం చేయడం.) [1, 2, 3]. ఇలా చదవగలిగేవారిని స్వాధ్యాయి అనడం పరిపాటి.
క్రమపాఠం – “నమఃశివాయ – శివాయచ” (రెండేసి పదాలు ఒక్కొక్కసారి) [1-2, 2-3]. ఇది చదవగలిగేవారు క్రమాంత స్వాధ్యాయిలు.
జటపాఠం – “నమఃశివాయ – శివాయనమో – నమఃశివాయ; శివాయ చ – చ శివాయ – శివాయ చ”
[1-2, 2-1, 1-2; 2-3, 3-2, 2-3]వేదం ఇలా చదవగలిగేవారు జటాంత స్వాధ్యాయిలు. దీనిమీద మరో మెట్టు ఎక్కగలిగేవారు ఘనాపాఠిలు.
ఘనపాఠం – ఈ ఘనపాఠం పదమూడు పదాలు ఒక్కోసారి గుక్కతిప్పుకోకుండా అనగలిగేది. దీని క్రమం ఇలా ఉంటుంది
నమఃశివాయ శివాయనమో నమఃశివాయచ చ శివాయ నమో నమః శివాయ చ
[1-2, 2-1, 1-2-3, 3-2-1, 1-2-3]దీనినే కొంతమంది మరో క్రమం లో చెప్పడం కూడా చూడవచ్చు. 13 పదాలు పైన చెప్పినట్టూ ఆ తర్వాత మరో ఆరు పదాలతో కలిపి.
నమఃశివాయ శివాయనమో నమఃశివాయచ చ శివాయ నమో నమః శివాయ చ
[1-2, 2-1, 1-2-3, 3-2-1, 1-2-3]; శివాయ చ చ శివాయ శివాయ చ [2-3, 3-2, 2-3]ఇలా ఏ మంత్రమైనా పద, జట, ఘన పాఠాలలో చదవవచ్చు. నమకం చివరిలో వచ్చే మహామృత్యుంజయ మంత్రం తో మరో ఉదాహరణ చూద్దాం.
మంత్రం (సంహితపాఠం)
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
పదపాఠం
త్రయంబకం – యజామహే – సుగంధిం – పుష్టి – వర్ధనం – ఉర్వారుక – ఇవ – బంధనాత్ – మృత్యోర్ – ముక్షీయ -మాం – అమృతాత్. పన్నెండు పదాలు ఒకటి నుండి పన్నెండు వరకూ ఒకదాని తర్వాత ఒకటి
క్రమ పాఠం
త్రయంబకం-యజామహే, యజామహే-సుగంధిం, సుగంధిం-పుష్ఠి, పుష్టి-వర్ధనం, వర్ధనం-ఉర్వారుక, ఉర్వారుక-మివ, ఇవ-బంధనాత్, బంధనాత్-మృత్యోర్, మృత్యోర్-ముక్షీయ, ముక్షీయ-మాం, మాం-ఆమృతాత్.
[1-2,2-3,3-4,4-5,5-6,6-7,7-8,8-9,9-10,10-11,11-12]జట పాఠం
త్రయంబకం-యజామహే, యజామహే-త్రయంబకం, త్రయంబకం-యజామహే [1-2, 2-1, 1-2]
యజామహే-సుగంధిం, సుగంధిం-యజామహే, యజామహే-సుగంధిం; [2-3, 3-2, 2-3]
… … …
ముక్షీయ-మాం, మాం-ముక్షీయ, ముక్షీయ-మాం; [10-11, 11-10, 10-11]
మాం-అమృతాత్, అమృతాత్-మాం, మాం-అమృతాత్; [11-12, 12-11, 11-12]
ఘన పాఠం (పదమూడు పదాలు ఒక్కొక్కసారి)
త్రయంబకం-యజామహే, యజామహే-త్రయంబకం, త్రయంబకం-యజామహే-సుగంధిం, సుగంధిం-యజామహే- త్రయంబకం, త్రయంబకం-యజామహే-సుగంధిం [1-2, 2-1, 1-2-3, 3-2-1, 1-2-3]
యజామహే-సుగంధిం, సుగంధిం-యజామహే, యజామహే-సుగంధిం-పుష్టి, పుష్టి-సుగంధిం-యజామహే, యజామహే-సుగంధిం-పుష్టి [2-3, 3-2, 2-3-4, 4-3-2, 2-3-4]
… … …
మృత్యోర్-ముక్షీయ, ముక్షీయ-మృత్యోర్, మృత్యోర్-ముక్షీయ-మాం, మాం-ముక్షీయ-మృత్యో, మృత్యోర్-ముక్షీయ-మాం [9-10, 10-9, 9-10-11, 11-10-9, 9-10-11]
ముక్షీయ-మాం, మాం-ముక్షీయ, ముక్షీయ-మాం-అమృతాత్, అమృతాత్-మాం-ముక్షీయ, ముక్షీయ-మాం- అమృతాత్ [10-11, 11-10, 10-11-12, 12-11-10, 10-11-12]
ఇలా చదవడానికి అద్భుతమైన గ్రాహణ శక్తి, చదివేదానికి స్పృహ, నిరంతర అభ్యాసం, అనుభవం ఉండాలి. వేదం నేర్పడానికి కొన్ని సంస్థానాలు ఉండేవిట పాత కాలంలో. వీటిలో బాగా ప్రసిధ్ధి చెందినది ఉర్లాం సంస్థానం అనేవారు. అక్కడ పట్టా పొందినవారు ఉర్లాం బ్రాహ్మలనీ వీళ్లకి వేదం నేర్పినవారే సరైన గురువులనీ చెప్పుకునేవారు.
ఈ ఉర్లాం పండితులు వేదం చదువుకున్నాక మహారాజులు, జమిందారులూ సంభావనగా ఇచ్చే చిన్న చిన్న చెక్కలకి పల్లెలలో వ్యవసాయం చేసుకుంటూ డబ్బు వచ్చినా, పేదరికంలో ఉన్నా తాము చదువుకున్న వేదాన్ని వదలిపెట్టనివారు. వీరికి – తమకి సంభావన ఇచ్చినవారినీ, దేశాన్ని ఎప్పటికీ మరిచిపోక ఏడాదికో సారి ఎంత కష్టమైనా పడి కాలినడకన ఊర్లన్నీ తిరిగి అక్కడి – ప్రజలకి వేదం వినిపించి వెళ్ళే అలవాటు. వీళ్లకి ఈనాములిచ్చిన జమిందారులో, రాజులో కూడా ప్రజా, దేశ సంక్షేమం కోసం అలా ఏడాదికోసారి ప్రజలకి వేదం వినిపించాలని సూచించి ఉండవచ్చు. ఇలా నడచి రావడం లో దారిదోపిడీకి గురైనా, ఎంతటి దేహ బాథ కలిగినా, తమకి వేదం వల్ల లభించిన ఈనాముకి కృతజ్ఞత వల్ల, తమ మడీ ఆచారాలనీ వదిలిపెట్టకుండా తమకి తెలిసిన గృహస్థుల ఇంటికే వెళ్ళడం మరో అలవాటు. ఈ నడవడంలో ఎంత అర్ధరాత్రి అయినా ఏదో ఒక ఊరు చేరుకుని అక్కడ ధర్మశాలల్లోనో, ఈ గృహస్థుల ఇళ్ళలోనో భోజనానికి ఇబ్బందులు పడడం ఒక ఎత్తైతే, ఇంత కష్టపడి వచ్చినందుకు వీరిని చేరదీసే గృహస్థులు కూడా తమకి ఇబ్బందులున్నా ఏదో తీరినంతలో సంభావన ఇచ్చి వీరిని ఆదరించడం మరో ఎత్తు. చాలాసార్లు వీరికిచ్చిన సంభావనలు దారి ఖర్చులకి కూడా సరిపడని సమయాలు ఉన్నాయంటారు. మొత్తానికి తాము పడిన కష్టాలనీ, చీదరింపులనీ మనసులో పెట్టుకోకుండా, దారిదోపిడీలనీ లెక్కలోకి తీసుకోకుండా, ఈ ఉర్లాం బ్రాహ్మణ సంఘం వేదాన్ని బతికించుకొచ్చింది ఏదో విధంగా.
ఇప్పట్లో అయితే ఈ వేదపాఠాలు నేర్పడానికి గురుకులాలు, సంస్థానాలూ పోయి వేద కళాశాలలు బయల్దేరి ఈ పట్టాలు ఇవ్వడం బెజవాడకీ, సరిపల్లెకీ పాకి మాది బెజవాడ పట్టా, మాది సరిపల్లె పట్టా ని చెప్పుకోవడం వాడుకలోకి వచ్చింది. వేద పాఠశాలల్లో పట్టా పుచ్చుకోవాలంటే ఓ ఇద్దరు ముగ్గురు పృఛ్ఛకుల ముందు కూర్చోవాలి. పృఛ్ఛకులలో ఒకాయన వేదం ఎక్కడో ఒకచోట ఎత్తుకుని చదవడం మొదలుపెడుతూండగానే పట్టా తీసుకోబోయే కుర్రాడు ఆయనతో గొంతు కలిపి చదవాలి. పృఛ్ఛకుడు కాసేపు చదివి మానుకున్నా ఆయన ఆపమని చెప్పేదాకా పరీక్షల్లో కుర్రాడు చదువుతూ ఉండాలి. ఏ మాత్రం అపస్వరం దొర్లినా, చదవలేకపోయినా పరీక్ష పోయినట్టే. మళ్ళీ ఇందులో ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారో లేదో తెలియదు. పరీక్ష పోతే వెంఠనే ఆరునెలలో మరోసారి పరీక్షకి కూర్చోవడం కుదరకపోవచ్చు. మొత్తం అంతా మరో సారి మొదలుపెట్టి చదువుకుని రావాల్సిందే అంటారు. మామూలు పాఠశాలల్లో వందకు ముప్ఫై నలభై మార్కులొచ్చేస్తే సరే సరే అనేసి నట్టూ ఇక్కడ కుదరదు. అపస్వరాలు లేకుండా సరిగ్గా, పూర్తిగా చదవడం వస్తే పట్టా, లేకపోతే వెనక్కి వచ్చి మరో సారి సరిగ్గా వచ్చేదాకా చదువుకోవడమే.
వేదం లో ఘనపాఠం రావాలంటే అనేకానేక సంవత్సరాలు చదవాల్సి ఉంటుందనీ అది మన చదువులతో పోలిస్తే పి హెచ్ డి వంటిదనీ అనడం కద్దు. ఇప్పుడు పట్టాలిచ్చే కళాశాలలు తితిదే వారు పోషించే పధ్ధతి ఉంది. ఆ కళాశాలల్లోనే మళ్ళీ గుడి పూజారులకి ఆగమశాస్త్రం నేర్పే పట్టా వేరే చదువు. ఇప్పుడు అమెరికా హిందూ గుడుల్లో ఉన్న దక్షిణ భారతదేశపు పూజారులు దాదాపు 90 శాతం ఈ తితిదే ఆగమశాస్త్రం నేర్పే కళాశాలలోంచి వచ్చినవారే. ఆగమ శాస్త్రం మాత్రమే నేర్చుకున్న ఈ గుడి పూజారుల్లో వేదం చదువుకున్నవారు ఎంతమంది ఉన్నారనేది చెప్పడం కష్టం.
ఉర్లాం సంస్థానం పోయినా ఈ బ్రాహ్మలు రావడం శ్రావణమాసం కనక వీళ్ళని శ్రావణీకులు అనడం మొదలుపెట్టారు. వీళ్ళలో కొంతమందికి పట్టాలుండడం నిజమైనా చాలామటుకు తమ స్వంత పిల్లలనీ, శిష్యులనీ తీసుకుని బయల్దేరతారు. ఈ గుంపులో పెద్దాయనకి వేదం బాగా వచ్చినా, కూడా వచ్చేవాళ్ళు మాత్రం పట్టాలు సంపాదించబోయే రాబోయే తరంవారు. ఫలానా ఊరి గుడిలో పండిత సభ జరుగుతోంది అని తెలుస్తుంది. ఈ ఊర్లో, ఆ పక్క ఊర్లో, ఇలా అన్నీ కలిపి తలో సభా పెట్టుకున్నప్పుడు వీళ్ళు బయల్దేరతారు. ద్రాక్షారామంలో పండిత సభ అయితే ఆ పక్కన పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి, అమలాపురం అలా అన్ని చోట్లా ఒకే వరసలో జరుగుతాయి పండిత సభలు. అందువల్ల వీళ్ళు ఒక్కో ఊరు చుట్టుకుంటూ అన్ని సభలకీ వెళ్ళి అక్కడ వేదం చదివి ఊరికీ, దాతలకీ ఆశీర్వచనం చెప్పి సంభావన పుచ్చుకుని ఇళ్ళకి చేరతారు. కొంతమంది గృహస్థులు పాతకాలంలో ఉర్లాం బ్రాహ్మలకి ఇచ్చినట్టే, ఈ వచ్చే శ్రావణీకులకి గుడి సభలో కాక తమ ఇళ్ళలో వేదం చదివించుకుని సంభావన ఇచ్చే ఆచారం ఉంది. పిండికొద్దీ రొట్టి అన్నట్టూ వీళ్లకి సంభావన ముడుతూ ఉంటుంది. క్రమాంత స్వాధ్యాయి కి పది రూపాయలిస్తే, జటాంత స్వాధ్యాయి కి ఇరవై, ఘనాపాఠీలకి ముఫ్ఫై అలా పెంచుతూ ఇస్తారు. వీళ్ళకున్న పట్టా, స్థాయి బట్టి ఇచ్చే సంభావన మారుతూ ఉంటుంది.
ఈ శ్రావణీకులలో కొంతమంది పై స్థాయి ఘనాపాఠీలు. వాళ్లకి తితిదే లోనో వేదపాఠశాలలోనో, మరొక చోటో ఉద్యోగం. గుడిలో సభ రేపు అనగా గుర్రబ్బండిలోనో, రిక్షాలో వస్తారు ఒక్కరూను శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రిగారు వచ్చినట్టూ, అదీ ఊరిలో తమకి తెలిసినవాళ్ల దగ్గిరకే. వీళ్ళు వేదం చదవడం కూడా స్పష్టంగా ఓ పై స్థాయిలో ఉండడం గమనించవచ్చు. వీళ్లని చూస్తే “కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మా..” అన్నట్టుంటారు. మానవ దేహమైన కలశంలో మొహం విష్ణువుది, కంఠం రుద్రుడిది అన్నట్టుగా రోజూ చేసే వేదపారాయణవల్ల మొహం బ్రహ్మవర్ఛస్సుతో వెలుగుతూ, వేదం చదువుతూ ఉంటే కంచు మోగుతున్నట్టూ ఉంటుంది.
ప్రస్తుత కాలంలో ఈ శ్రావణీకుల పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ఈ వేదం నేర్చుకునే వారి సంఖ్య బాగా తగ్గి ఉండొచ్చు. దీనివల్ల ఏ ఉద్యోగం రాకపోవడం ఒక కారణం అయితే, ‘వేదం నేర్చుకుని ఏం చేయా’లనే చులకన భావం మరో కారణం. వేదం చదివేవారిని ప్రోత్సాహించడానికి (వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా) మనకో పధ్ధతీ అదీ ఉంటే ఇవి పరి రక్షించుకోవచ్చు లేకపోతే మన తెలుగు భాష కాలగర్భంలో కలిసిపోతున్నట్టే ఈ వేదం చదివేవాళ్ళు కూడా కనుమరుగై, వేదం అంటే గుడిలోచదివే మంత్రాలే అని నమ్మే రోజులకి మనం అతి దగ్గిరలో ఉన్నాం అని చెప్పుకోకతప్పదు.
*
చాలా మందికి తెలియని సమాచారం ఇచ్చారు శర్మగారు. మరింత సమాచారం తదుపర అందిస్తారని ఆశిస్తూ మీకు నా నమస్కారాలు. 🙏
విజయ గారు
నాకు తెలిసిన సమాచారం అంతా ఇదేనండి. ఇంక పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. నేను కాస్త సంస్కృతం తెల్సినవాణ్ణే అయినా వేదం చదువుకున్నవాణ్ణి కాదు. ఈ శ్రావణీకులని నేను ఇండియాలో చాలాసార్లు చూసాను. గుడిలో వేద పండితుల సభలు జరగడం ఇంకా ఉంది (కనీసం నాకొచ్చే వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది). ఈ వ్యాసం రాయడానికి తాడిగడప శ్యామలరావుగారు (శ్యామలీయం బ్లాగు), చిర్రావూరి శర్మ గారు (కష్టే ఫలీ బ్లాగు) సహకరించారు అనడం కంటే వాళ్లు చెప్పినవి నేను క్రోడీకరించాను అనడమే బాగుంటుందనుకుంటా. తెలుగే నాశనం అవుతున్న ఈ రోజుల్లో వేద పండితులని చేరదీద్దాం అని ఎవరైనా అంటే వెర్రివాణ్ణి చూసినట్టు చూస్తారని నా సందేహం. హిందూ మతం నాశనం అవుతున్నప్పుడు, మనం అందరం బానిసల్లా బ్రతకడానికి తయారుగా ఉన్నప్పుడు దాన్ని వంటి చేత్తో సగర్వంగా నించోపెట్టడానికి, మనని కొరడాతో కొట్టి లేచి నించోండ్రా మూర్ఖుల్లారా అని చెప్పడానికి శ్రీరామకృష్ణులూ, వివేకానందులు జన్మించినట్టే, ఈ తెలుగు బాష తెలుగునాట వేదం బతికి బట్టకట్టడానికి ఓ మహాపురుషుడు ఉద్భవించాలి కాబోలు. ఈ వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం.