ఆగస్టు 25, 1969 న కవి మఖ్దూం మొహియుద్దీన్ ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూశాడు. తన శరీరాన్ని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చే సమయానికి వందలాది మంది తన సహచరులు, మిత్రులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వివాదాలు తనకి కొత్త కాదు. మృతదేహంపై ఎర్రజెండా కప్పే ప్రయత్నాన్ని కొందరు కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం తెల్లటి వస్త్రాన్ని కప్పాలని వాళ్ళ అభిప్రాయం. తాను నిజమైన ముస్లిం కాదు గనక నమాజ్ ఎ జనాజా (మరణించిన వారికోసం ప్రత్యేక ప్రార్ధన) జరపడాన్ని మరికొంతమంది వ్యతిరేకించారు. తన కవిత లోని పంక్తులనే తన సమాధిపైన రాశారు.
బజ్మ్ సే దూర్ వో గాతా రహా తన్హా తన్హా
సో గయా సాజ్ పే సర్ రఖ్ కే సహర్ సే పహలే
వేడుకకి దూరంగా అతడు ఏకాకిగా పాడుతూనే వున్నాడు
తెల్లవారక మునుపే విపంచిపై తలవాల్చి నిద్రపోయాడు
మఖ్దూం విలక్షణమైన కవి. చిత్ర రచయిత కె ఎ అబ్బాస్ తన మిత్రుని గురించి ఇలా రాశాడు,
మఖ్దూం ఒక వెలిగే జ్వాల, తెలిమంచు తుహిన బిందువు
తానొక విప్లవ దుందుభి, మృదు మధురమైన అందెల రవళి
తాను జ్ఞానం, తాను ఆచరణ, తనదొక వివేచన
విప్లవ గెరిల్లా చేతిలోని తుపాకీ, కళాకారుని సితారా సంగీతం
తానొక ఘాటెక్కిన గంధక ధూమం, మరుమల్లెల పరిమళం
విప్లవ చైతన్యాన్నీ, ప్రేమనీ శక్తివంతంగా వ్యక్తీకరించిన కవి మఖ్దూం మొహియుద్దీన్. అందుకే తనని ‘మెహనత్ ఔర్ మొహబ్బత్ కా షాయర్’ (శ్రామికుల కవి, ప్రేమ కవి) అన్నారు. మఖ్దూం మొహియుద్దీన్ కవిత్వ పరిణామాన్ని గమనించిన విమర్శకులు 1947 తర్వాత తన కవిత్వంలో తనదైన వైయక్తికతా, ప్రేమ భావనల వ్యక్తీకరణా కనిపిస్తాయని అంటారు. జంగ్ ఎ ఆజాదీ, తెలంగాణ వంటి బలమైన రాజకీయ కవితలనుంచి తర్వాత కాలంలో గజల్ రూపాన్ని ఎక్కువగా ఎంచుకోవడంలోనూ, ఇంకా తన అభివ్యక్తిలోనూ దీనిని గమనించవచ్చు.
అయితే తన రాజకీయ విశ్వాసాలని మఖ్దూం ఎన్నడూ వదులుకోలేదు. తన తొలిదశ కవితా సంకలనం సుర్ఖ్ సవేరా (ఎర్ర కాంతుల ఇనోదయం), తర్వాత దశలోని సంకలనాల గురించి చెబుతూ, ‘సుర్ఖ్ సవేరా లోని ఇతర కవితలు – మౌత్ కా గీత్, ఇంతెజార్, తూర్, ఆతిష్ కదా వంటి కవితల్లో కూడా మీకు విప్లవం, ప్రేమ రెండూ కలగలిసి కనబడతాయి. ఇప్పుడు రాసిన కవితలలో చారాగర్, రఖ్స్ చదవండి. అవి ఎలా ప్రారంభమౌతాయి, ఎలా ముగుస్తాయన్నది గమనించండి. నిజానికి విప్లవం, ప్రేమ ఒకదాన్ని ఒకటి పెనవేసుకొన్నాయి.’ ఈ వ్యాసంలో మనం తర్వాత చదవబోయే ఆఖిర్ ఎ షబ్ కూడా లో ఇదే విషయాన్ని మనం చూడవచ్చు.
ఇష్క్ కే షోలే కో భడ్కావో కి కుచ్ రాత్ కటే
దిల్ కే అంగారోం కో దహ్కావో కి కుచ్ రాత్ కటే
ప్రేమ జ్వాలలని ఎగదోయండి, చీకటి రాత్రి కొంచెం గడిచిపోతుంది
హృదయంలోని నిప్పురవ్వలని రగలనీయండి, చీకటి రాత్రి కొంచెం గడిచిపోతుంది
అని పిలుపు నిచ్చిన కవి కదా మఖ్దూం మొహియుద్దీన్!
మఖ్దూం గీతాలు, గజళ్ళు సినిమాలలో కూడా పేరు పొందాయి. చారాగర్ (‘ఏక్ చమేలీ కే మండువే తలే’), ‘ఫిర్ ఛడీ రాత్ ఫూలోం కీ’, ఇంకా ‘రాత్ భర్ ఆప్ కీ యాద్ ఆతీ రహీ’ పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ కి మఖ్దూం అంటే చాలా అభిమానం. మఖ్దూం చనిపోయిన తర్వాత ఫైజ్ మాస్కో నగరంలో ఉన్న సమయంలో తనని గుర్తు చేసుకున్నాడు. ఫైజ్ తన స్మృతిగీతాలలో మఖ్దూం గీతాలలోని ఎత్తుగడనే ఎంచుకొని రాశాడు. ఒక కవి రాసిన కవితలోని ఎత్తుగడనే మరొక కవి ఎంచుకుని రాయడం ద్వారా ఆ కవిని గౌరవించి నివాళి అర్పించే సంప్రదాయం ఉర్దూ కవిత్వంలో ఉంది. మఖ్దూం గీతాలనీ, తన సంస్మరణలో ఫైజ్ రాసిన రెండు నివాళి గీతాలనీ చదువుకుందాం.
రాత్ భర్
మఖ్దూం మొహియుద్దీన్
ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్
చష్మ్ ఎ నమ్ ముస్కురాతీ రహీ రాత్ భర్
రేయి రేయంతా ముసురుకున్న మీ జ్ఞాపకాలే
రేయి రేయంతా చెమ్మగిల్లిన కళ్ళు నవ్వుతూనే ఉన్నాయి
రాత్ భర్ దర్ద్ కీ షమా జల్తీ రహీ
ఘమ్ కీ లౌ థర్ థరాతీ రహీ రాత్ భర్
బాధా దీపం వెలుగుతూనే ఉంది రేయి రేయంతా
దుఃఖపు జ్వాల వణుకుతూనే వుంది రేయి రేయంతా
బాఁసురీ కీ సురీలీ సుహానీ సదా
యాద్ బన్ బన్ కే ఆతీ రహీ రాత్ భర్
అందమైన వేణుగానపు పిలుపులు
జ్ఞాపకాలు కమ్ముకుంటూనే వున్నాయి రేయి రేయంతా
యాద్ కే చాంద్ దిల్ మేఁ ఉతర్తీ రహే
చాందినీ జగ్మగాతీ రహీ రాత్ భర్
జ్ఞాపకాల జాబిలి మదిలో ఒరిగి పోతూనే వుంది
వెన్నెల మిలమిల మెరిసిపోతూనే వుంది రేయి రేయంతా
కోయీ దివానా గలియోం మేఁ ఫిర్తా రహా
కోయీ ఆవాజ్ ఆతీ రహీ రాత్ భర్
ఎవరో వెర్రివాడు వీధులలో తిరుగుతూనే వున్నాడు
ఎవరిదో పిలుపు వినిపిస్తూనే వుంది రేయి రేయంతా
రాత్ భర్ కవితలో మఖ్దూం ఎంచుకున్న ప్రతీకలలో విరుద్ధ అంశాలను ఒకే భావం కోసం ఎంచుకోవడాన్నీ, ఒకే మానసిక స్థితిలో విరుద్ధ అంశాలు కలగలిసిన భావాన్ని వ్యక్తీకరించడాన్నీ మనం గమనించవచ్చు. ముందుగా, ‘రేయి రేయంతా ముసురుకున్న మీ జ్ఞాపకాలే/ రేయి రేయంతా చెమ్మగిల్లిన కళ్ళు నవ్వుతూనే ఉన్నాయి’ అని ఎత్తుకోవడంలోనే ఆ మానసిక స్థితి వ్యక్తం అవుతుంది.
జ్ఞాపకమై, పక్కనే లేని స్థితిలో బాధ కన్నులని చెమ్మగిల్లేలా చేసింది. అయితే, ఆ జ్ఞాపకాలు చిరునవ్వుని కూడా తీసుకొచ్చాయి. అది కనులు చెమ్మగిల్లిన రాత్రి, ఆ చెమ్మగిల్లిన కనులలో జ్ఞాపకాలు చిరునవ్వులు రువ్వుతూనే వున్న రాత్రి కూడా. అది బాధా దీపం, దుఃఖపు జ్వాల వణుకుతూ వెలిగిన రాత్రి. అది, మదిలో ఒరిగిపోయిన జ్ఞాపకాల జాబిలి, వెన్నెల మిలమిల మెరిసిపోయిన రాత్రి కూడా. అది అందమైన వేణుగానపు పిలుపులై జ్ఞాపకాలు కమ్ముకున్న రాత్రి. అది, ఎవరో ఒక వెర్రి వాడు వీధులలో తిరుగుతూ, ఏవేవో పిలుపులు వినిపిస్తున్న రాత్రి కూడా. మనసులో హాయి, అయినా ఒక అశాంతి, చెమ్మగిల్లిన కనులు, పెదవులపై చిరునవ్వుల జ్ఞాపకాలు కలగలిసిన మానసిక స్థితికి హృద్యమైన వ్యక్తీకరణ మఖ్దూం గీతంలో మనకి కనిపిస్తుంది.
ఇక మఖ్దూం మొహియుద్దీన్ కి నివాళిగా ఇదే ఎత్తుగడలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన కవితని చూడండి,
మఖ్దూం కీ యాద్ మేఁ (మఖ్దూం స్మృతిలో)
ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్
-ఫైజ్ అహ్మద్ ఫైజ్
ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్
చాందినీ దిల్ దుఃఖాతీ రాత్ భర్
రేయి రేయంతా ముసురుకున్న మీ జ్ఞాపకాలే
రేయి రేయంతా మనసుని వెన్నెల వేధిస్తూనే వుంది
గాహ్ జల్తీ రహీ గాహ్ బుఝ్ తీ రహీ రాత్ భర్
షమా ఎ ఘమ్ ఝిల్మిలాతీ రహీ రాత్ భర్
క్షణం వెలుగుతూ, క్షణం ఆరిపోతూ
దుఃఖ దీపం మిణుకుమిణుకుమంటూనే వుంది రేయి రేయంతా
కోయీ ఖుష్బూ బదల్తీ రహీ పైరహన్
కోయీ తస్వీర్ గాతీ రహీ రాత్ భర్
ఏదో పరిమళం మారి మారి వీస్తూనే వుంది
ఏదో ఒక రూపు పాడుతూనే వుంది రేయి రేయంతా
ఫిర్ సబా సాయా ఎ శాఖ్ ఎ గుల్ కే తలే
కోయీ కిస్సా సునాతీ రహీ రాత్ భర్
పూల కొమ్మల నీడలో గాలి తెమ్మెర
ఏవేవో కథలు వినిపిస్తూనే ఉంది రేయి రేయంతా
జో న ఆయా ఉసే కోయీ జంజీర్ ఎ దర్
హర్ సదా పర్ బులాతీ రహీ రాత్ భర్
అరుదెంచని ఆ మనిషి కోసం గడియ వేసిన తలుపు
పలవరిస్తూ పిలుస్తూనే ఉంది రేయి రేయంతా
ఏక్ ఉమ్మీద్ సే దిల్ బెహల్తా రహా
ఏక్ తమన్నా సతాతీ రహీ రాత్ భర్
ఒక ఆశ మనసులో ఆనందాన్ని నింపుతూనే వుంది
ఒక కోరిక వేధిస్తూనే వుంది రేయి రేయంతా
ఫైజ్ నివాళి గీతంలో మఖ్దూం భావనలకు పొడిగింపుతో పాటు, తాను మఖ్దూంనే ప్రత్యేకించి తలచుకోవడం కూడా కనిపిస్తుంది. మఖ్దూం ఊహలో తలచుకున్న వ్యక్తి ఒక అమూర్త భావం అనుకుంటే, ఫైజ్ నివాళిలో మఖ్దూం ప్రతిరూపం కనిపిస్తుంది. మదిలో ఒరిగి పోయిన జ్ఞాపకాల జాబిలితో వెన్నెల మిలమిల మెరిసిపోయిన రేయిని మఖ్దూం తలచుకోగా, మఖ్దూంని తలచుకుంటూ, అది మనసుని వెన్నెల వేధిస్తూనే వుండిన రాత్రియని ఫైజ్ ప్రారంభిస్తాడు. బాధా దీపం, దుఃఖపు జ్వాల వణుకుతూ వెలిగిన రాత్రిని మఖ్దూం తలచుకోగా, ఫైజ్ దానిని ఇంకొంచెం పొడిగిస్తాడు, ఆ దుఃఖ దీపం వెలుగుతూ, ఆరిపోతూ విలపిస్తుందని ఫైజ్ అంటాడు. రేయి రేయంతా ‘క్షణం వెలుగుతూ, క్షణం ఆరిపోతూ/ దుఃఖ దీపం మిణుకుమిణుకుమంటూనే వుంద’ని ఫైజ్ అంటాడు. ఫైజ్ గీతంలో ఎటువైపునుంచో మారి మారి వీచే ఒక పరిమళం, రేయి రేయంతా పాడుతూనే ఉన్న రూపం మఖ్దూంని గుర్తుకు తెస్తాయి. పూల కొమ్మల నీడలో గాలి తెమ్మెర మఖ్దూం కథలు వినిపిస్తూనే ఉంటుంది.
ఎవరో వెర్రివాడు వీధులలో తిరుగుతూ, ఏవేవో పిలుపులు వినిపిస్తున్న రాత్రిని మఖ్దూం తలచుకోగా, అరుదెంచని మఖ్దూంని తలచుకుంటూ తలుపు గడియ తనకోసం ఎదురు చూస్తూ, పలవరిస్తూ, తననే పిలుస్తూ ఉందని ఫైజ్ అంటాడు . మఖ్దూం, హృదయాన్ని రెపరెపలాడించే ఒక ఆశ. అదే సమయంలో మనసుని వేధించే ఒక తీరని కోరిక కూడా. ఫైజ్ తన గీతంలో మఖ్దూంని తలచుకోవడం కోసం, మఖ్దూం ఊహలనే ఉపయోగించున్న తీరు మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
రాత్ భర్ ఆప్ కీ యాద్ ఆతీ రహీ అన్న మఖ్దూం మొహియుద్దీన్ గీతాన్ని గమన్ సినిమాలో జైదేవ్ సంగీత దర్శకత్వంలో ఛాయా గంగూలీ అద్భుతంగా పాడింది. ఇంకా ఎందరో ఇతర గాయకులు కూడా అంతే ప్రతిభావంతంగా, అర్ధవంతంగా పాడారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ గీతాన్ని కూడా చాలామంది పాడారు. వాటిని యూట్యూబ్ లో చూడవచ్చు/ వినవచ్చు. లెల్లె సురేష్ ఆధ్వర్యంలో చిందు బృందం హైదరాబాద్ లో ఉర్దూ కవిత్వం పై కాలం గుండెచప్పుడు ఇటీవలే నిర్వహించిన కార్యక్రమంలో మఖ్దూం మొహియుద్దీన్ గీతాన్ని ఒక దృశ్య రూపకంగా ప్రదర్శించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=MaUa94I8HtQ
ఇక మఖ్దూం రెండవ కవిత ‘ఆఖిర్ ఎ షబ్’. ఇది మరింత ప్రత్యేకమైనది.
ఆఖిర్ ఎ షబ్
-మఖ్దూం మొహియుద్దీన్
బఢ్ గయా బాదా ఎ గుల్ గూఁ మజా ఆఖిర్ ఎ షబ్
ఔర్ భీ సుర్ఖ్ హై రుఖ్సార్ ఎ హయా ఆఖిర్ ఎ షబ్
వలపుల మధువు కైపెక్కినదీ తుది జాము వేళలో
చెక్కిలి మరింత ఎరుపెక్కినదీ తుది జాము వేళలో
మంజిలేఁ ఇష్క్ కీ ఆసాఁ హుయీ చల్తే చల్తే
ఔర్ చమ్కా తేరా నక్ష్ ఎ కఫ్ ఎ పా ఆఖిర్ ఎ షబ్
అడుగు అడుగు సాగి రాగా చేరువయిందీ వలపుల గమ్యం
నీ అడుగుజాడలు మరి మరి మెరిసినవీ తుది జాము వేళ
ఖట్ ఖటా జాతా హై జంజీర్ ఎ దర్ ఎ మై ఖానా
కోయీ దివానా కోయీ ఆబ్లా పా ఆఖిర్ ఎ షబ్
మధుశాల తలుపు తడుతున్నారెవరో తుది జాము వేళ
ఎవరో వెర్రి వాడు, ఎవరో నెత్తుటి పాదాలతో బాటసారి
సాఁస్ రుక్తీ హై ఛలక్తే హుయే పైమానే మేఁ
కోయీ లేతా థా తేరా నామ్ ఎ వఫా ఆఖిర్ ఎ షబ్
తొణికిసలాడే మధుపాత్రలో వూపిరి నిలిచిన కాలం
ఎవరో నిన్నే తలచుకుంటున్న తుది జాము వేళ
గుల్ హై కిందిల్ ఎ హరమ్ గుల్ హై కలీసా కే చరాగ్
సూ ఎ పైమానా బఢే దస్త్ ఎ దువా ఆఖిర్ ఎ షబ్
మసీదులో లాంతరు, చర్చిలో దీపం ఆరిపోయిన వేళ
మధు పాత్రని అర్థిస్తూ చేతులు చాచిన తుది జాము వేళలో
హాయె కిస్ ధూం సే నిక్లా హై షహీదోం కా జులూస్
జుర్మ్ ఛుప్ సర్ బ గరేబాఁ హై జఫా ఆఖిర్ ఎ షబ్
కోలాహలంగా మొదలైంది అమరుల ఊరేగింపు
దోపిడీ, దౌర్జన్యాలు తలదించుకున్న తుది జాము వేళలో
ఇసీ అందాజ్ సే ఫిర్ సుబహ్ కా ఆంచల్ ఢల్కే
ఇసీ అందాజ్ సే చల్ బాద్ ఎ సబా ఆఖిర్ ఎ షబ్
ఉదయపు మెలి ముసుగు తొలగిపోయింది
ఉషోదయ మలయ మారుతం వీచిన తుది జాము వేళలో
ఇది కేరళ ఎన్నికల నేపథ్యంలో రాసిన కవితయని మఖ్దూం స్వయంగా చెప్పాడు. రాజకీయ విశ్వాస ప్రకటనకు గజల్ ప్రేమ పరిభాషని మఖ్దూం ఇక్కడ ఎంచుకున్న తీరు ఆసక్తికరమైనది. కేరళ ఎన్నికల నేపథ్యంలో రాసిన కవిత అనే దృష్టితో దీనిని ఇంకొక్క సారి ఆసాంతం చదివితే మొత్తం కవిత సరికొత్త వెలుగులో కనిపిస్తుంది. కవిగా మఖ్దూం ప్రత్యేకత మనకి అర్ధమౌతుంది.
ఇక ఇదే ఎత్తుగడతో మఖ్దూం మొహియుద్దీన్ కి నివాళిగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితని చూడండి.
మఖ్దూం కీ యాద్ మేఁ (మఖ్దూం స్మృతిలో)
ఆఖిర్ ఎ షబ్
-ఫైజ్ అహ్మద్ ఫైజ్
యాద్ కా ఫిర్ కోయీ దర్వాజా ఖులా ఆఖిర్ ఎ షబ్
దిల్ మే బిఖరీ హుయీ ఖుష్బూ ఎ హినా ఆఖిర్ ఎ షబ్
జ్ఞాపకాల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి
గోరింటపూల పరిమళం మదిలో నిండిన తుది జాము వేళలో
సుబహ్ ఫుటీ తో వో పహలూ సే ఉఠా ఆఖిర్ ఎ షబ్
వో జో ఏక్ ఉమ్ర్ సే ఆయా న గయా ఆఖిర్ ఎ షబ్
తెల్లవారే వరకూ తోడుగా ఉంటాడనుకున్న మనిషి
తుది జాము వేళలో కనులు తెరిచే సరికి అసలు లేనేలేడెన్నడూ
చాంద్ సే మాంద్ సితారోం నే కహా ఆఖిర్ ఎ షబ్
కోన్ కర్తా హై వఫా అహద్ ఎ వఫా ఆఖిర్ ఎ షబ్
వెలవెలబోతున్న నక్షత్రాలు చందమామని అడిగాయి తుది జాము వేళ
ప్రేమకి కట్టుబడి కడదాకా నిలబడిందెవ్వరని
లమ్స్ ఎ జానానా లియే మస్తీ ఎ పైమానా లియే
హంద్ ఎ బారీ కో ఉఠే దస్త్ ఎ దువా ఆఖిర్ ఎ షబ్
తన స్పర్శ కోసం, మధుపాత్ర కోసం
దైవ ప్రార్ధన కోసం చాచిన చేతులు అలాగే ఉన్నాయి తుది జాము వేళలో
ఘర్ జో వీరాఁ థా సర్ ఎ షామ్ వో కైసే కైసే
ఫుర్కత్ ఎ యార్ నే ఆబాద్ కియా ఆఖిర్ ఎ షబ్
సాయంత్రం నుంచీ తాను లేని ఇల్లు చిన్నబోయింది
ఎడబాటు శూన్యమే నిండిపోయిన తుది జాము వేళ
జిస్ అదా సే కోయీ ఆయా థా అవ్వల్ ఎ షబ్
ఉసీ అందాజ్ సే చల్ బాద్ ఎ సబా ఆఖిర్ ఎ షబ్
మునిమాపు వేళలో అందంగా అడుగు పెట్టినట్లే
మలయ మారుతమై వీచింది తుది జాము వేళలో
మఖ్దూంకి నివాళిగా ఫైజ్ ఎంచుకున్న రెండు గీతాలలో మరొక ప్రత్యేకతని మనం చూడవచ్చు. మొదటిది, రాత్రికి సంబంధించినది కాగా, రెండవది, రాత్రికి ముగింపుగా ఎంచుకున్న తుది జాము వేళకు (ఆఖిర్ ఎ షబ్) సంబంధించినది.
అడుగు అడుగు సాగి రాగా, గమ్యం చేరువై, అడుగుజాడలు మరింతగా మెరిసిపోయే తుది జాము వేళ, గాయపడిన పాదాలతో నడిచివచ్చిన బాటసారి ఎవరో మధుశాల తలుపు తడుతున్నాడని మఖ్దూం ఊహిస్తే, ఆ వేకువ జాములో జ్ఞాపకాల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయని, మదిలో గోరింట పూల పరిమళం పరుచుకున్నదనీ మఖ్దూంని తలచుకుంటాడు ఫైజ్. తొణికిసలాడే మధుపాత్రలో వూపిరి నిలిచిన కాలం / ఎవరో పెదవులపై తన పేరే తలచుకుంటున్న తుది జాము వేళ గురించి మఖ్దూం రాస్తే, తెల్లవారే దాకా పక్కనే ఉంటాడనుకున్న ఆ మనిషి, అసలు రానే రాలేదనే విషాదాన్ని ఫైజ్ తలచుకుంటాడు.
ప్రేమకి కట్టుబడి కడదాకా నిలబడిందెవ్వరని ఆ తుది జాము వేళలో వెలవెలబోతున్న నక్షత్రాలు చందమామని అడిగాయని ఫైజ్ అంటాడు. మసీదులో లాంతరు, చర్చిలో దీపం ఆరిపోయిన వేళ/ మధు పాత్రని అర్థిస్తూ చేతులు చాచిన తుది జాము వేళలో’ మతాలకు మించిన మానవత్వాన్ని మఖ్దూం ముందుకు తెస్తే, మఖ్దూం వెళ్ళిపోయాక, ‘తన స్పర్శ కోసం, మధుపాత్ర కోసం/ దైవ ప్రార్ధన కోసం చాచిన చేతులు అలాగే ఉన్నాయి’ అని ఫైజ్ ఊహిస్తాడు. అమరుల ఊరేగింపు కోలాహలంగా మొదలయి, దోపిడీ, దౌర్జన్యాలు తలదించుకున్న తుది జాము వేళని మఖ్దూం ఊహిస్తే, మఖ్దూం వెళ్ళిపోయాక సాయంత్రం నుంచీ తాను లేక చిన్నబోయిన ఇంటినీ, తన ఎడబాటు శూన్యమై నిండిపోయిన తుది జాము వేళ గురించి ఫైజ్ తలచుకుంటాడు.
ముగింపుగా, ఉదయపు మేలి ముసుగు తొలగిపోయి, ఉషోదయ మలయ మారుతం వీచిన తుది జాము గురించి మఖ్దూం రాస్తే, మునిమాపు వేళ అందంగా అడుగుపెట్టిన మఖ్దూం కవిత్వం వలే ఉషోదయ మలయమారుతం వీచిన తుది జాము వేళలో మఖ్దూంనీ, మఖ్దూం కవిత్వాన్నీ తలచుకుని నివాళి అర్పిస్తాడు ఫైజ్. ఒక గొప్ప కవికి మరొక గొప్ప కవి అర్పించే నివాళి ఇంతకంటే ఘనంగా ఉండగలదా?
చిత్రం: శ్రీరామ్ కారంకి
*
Add comment