ప్రసాద్ అమెరికాలోని మేరీల్యాండ్ లో గత పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు, అతని భార్య రాధిక కూడా సాఫ్ట్వేర్ రంగం లోనే పని చేస్తుంది. వారిద్దరికి ఒక కొడుకు ఆకాష్ సెవెంత్ గ్రేడ్ లో ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ శాతం మంది తమ పిల్లలని ప్రభుత్వ స్కూల్ లోనే చదివిస్తారు. ఏరియాని బట్టి స్కూల్ కి ర్యాంకింగ్ ఉంటుంది. మంచి ర్యాంక్ ఉన్న స్కూల్ లో చేరాలి అంటే ఆ స్కూల్ పరిధి లో ఉన్న ఇంట్లోనే నివసించాలి. అందుకనే ఆకాష్ స్కూల్ కోసం ఈ మధ్యనే టాప్ ర్యాంకు లో ఉన్న స్కూల్ ఏరియా జర్మన్ టౌన్ లో ని కొత్త ఇంటికి మారారు.
“ప్రసాద్ , ఈ ఏరియా లో ఒక్క తెలుగు ఫామిలీ కూడా కనపడడం లేదు, ఎవరన్నా కనీసం ఒక్క తెలుగు ఫామిలీ అయినా ఉంటే బాగుండేది” అప్పుడే మారిన కొత్త ఇంట్లో బాక్స్ నుండి డెకొరేటివ్ పీసెస్ తీస్తూ, కిటికీ లోంచి బయటకు చూస్తూ అంది రాధిక.
“కావాలనే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేస్ లో ఇల్లు తీసుకోవద్దనుకున్నాము కదా! మళ్ళీ ఇప్పుడా విషయం ఎందుకు? అయినా అక్కడక్కడా కొన్ని ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ” టీవీ స్టాండ్ అసెంబుల్ చేస్తూ అన్నాడు ప్రసాద్ కొంత అసహనంగా.
“నీవన్నది కరెక్టే కానీ, మన ఇంతకు ముందు నైబర్ హుడ్ లో ఆకాష్ కి చాల మంది ఫ్రెండ్స్ ఉండే వారు, ఇక్కడ వాడికి కనీసం ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉండి ఉంటే బాగుండేది అని నా ఉద్దేశం” అన్నది రాధిక, లోపల మాత్రం తనకూ ఎవరన్నా తెలుగు ఫ్రెండ్స్ ఉంటే బాగుండేది అన్నట్టే ఉంది.
“అమెరికన్ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాడికి ఆడు కోవడానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. ఒక స్ట్రీట్ తర్వాత గుజరాతి ఫామిలీ కూడా ఉన్నట్టుండి కదా ప్రతి ఇంటి దగ్గర బాస్కెట్ బాల్ హూప్ కూడా ఉంది. నిన్న పక్కింటి డెబి ఎప్పుడన్నా వచ్చి ఆడుకోమని ఆల్రెడీ వాడికి చెప్పింది, వాళ్ళ పిల్లలు ఎప్పుడో జాబ్ వచ్చి మూవ్ అయి పోయారట ” సర్ది చెప్పాడు ప్రసాద్.
రాధికకు మాత్రం తన పక్కింటి తెలుగు ఫ్రెండ్స్ ని మిస్ అయిన ఫీలింగ్ నుండి మాత్రం అంత ఈజీ గా బయటకు రాలేక పోతుంది. నిజంగా చెప్పాలంటే ముందు ఎల్లికాట్ సిటీ లో ఇల్లు తీసుకుందామని ప్రసాద్ ప్రపోజ్ చేస్తే రాధిక నే వద్దు అన్నది, ఎందుకంటె అది ఒక లిటిల్ ఇండియా, ఎటు చూసిన ముఖ్యంగా తెలుగు వారు . ప్రతి దానికి పిల్లల మధ్య, లేడీస్ మధ్య, మగ వాళ్ళ మధ్య అనవసరపు పోటీ. ఎవరెన్ని చెప్పినా ప్రసాద్ మాత్రం తన లిమిట్ లోనే తాను ఉండే వాడు, అదేవిధంగా రాధిక కూడా! అందుకనే రాధిక తక్కువగా ఇండియన్స్ ఉండే ప్రాంతంలో మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఇల్లు తీసుకుందామని పట్టుబడి మరీ ఈ ఏరియాకి వచ్చారు. సామాను కొంత సర్ది , కొంత సేపు రెస్ట్ తీసుకొని గ్రాసరీ స్టోర్ కి వెళ్లారు పాలు ఇంకా కొన్ని కూరగాయలు తీసుకోవడానికి . షాపింగ్ చేస్తున్న రాధికకి ఒక తెలుగు జంట కనపడింది, వాళ్లతో ఒక బాబు కూడా ఆకాష్ అంత వయసున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మాట కలిపింది. వివరాల్లోకి వెళితే, ఆమె పేరు శ్వేత, వాళ్ళ బాబు పేరు వరుణ్. ఆకాష్ ది వరుణ్ ది సేమ్ స్కూల్ అండ్ క్లాస్ అని మాటల్లో తెలిసింది. రాధిక సంతోషానికి అవధులు లేవు . రెండు వీధుల తర్వాత వాళ్ళ ఇల్లు, అంటే అప్పుడప్పుడు ఆకాష్ ఆడుకోవడానికి, తనకు తెలుగు వాళ్ళు లేరు అనే కొదువ తీరినందుకు లోలోనే చాల సంతోషించిది . ఇద్దరూ ఫోన్ నంబర్లు ఎక్స్చేంజి చేసుకొన్నారు. ఇద్దరి ఇండ్లు కూడా దగ్గరే ఉన్నాయని, పిల్లలు కలసుకోవడానికి బాగా ఉంటుందని తెలిసి శ్వేత కూడా చాలా సంతోష పడింది.
టైం దొరికినప్పుడన్నా ప్యాకింగ్ డబ్బాలు విప్పుతూ సామానులు సర్దుకుంటుంది రాధిక. సమ్మర్ హాలిడేస్, అప్పటికి ఇంకా స్కూల్స్ స్టార్ట్ కావడానికి ఒక నెల ఉంది. ఆకాష్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ లో మార్నింగ్ టైమ్ లో బిజీ ఉంటున్నాడు, సాయంత్రం వేళలో ఒక్కడే ఆడుకుంటున్నాడు. వరుణ్ ని తీసుకొని వస్తే పిల్లలిద్దరూ ఆడుకుంటారని శ్వేతకి ఫోన్ చేసింది రాధిక .
“అయ్యో వాడు టి.జె ( థామస్ జెఫెర్సన్ అనే మంచి పేరున్న టాప్ హై స్కూల్ ) కాంపిటీషన్ కోచింగ్ సమ్మర్ క్యాంప్ లో ఉన్నాడు, రోజంతా అక్కడే ఉంటాడు, ఆ క్లాసు లేకుంటే అసలు నేనే మిమ్మల్ని డిన్నర్ కి పిలవాలని అనుకున్నా, అందుకే ఫోన్ చేయడానికి వీలు కాలేదు”
“ఓ అలాగా ..” లోపల మాత్రం చాలా సంతోష పడింది రాధిక ఓ మంచి ఫ్రెండ్ దొరికినందుకు, అదీ డిన్నర్ కి పిలిచే అంత! ” మీ బాబు సమ్మర్ హాలిడేస్ లో ఏమి చేస్తున్నాడు ?” అడిగింది శ్వేత.
ఈ సారి వి.టి సేవ ఆర్గనైజషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఈ సైన్స్ ప్రాజెక్ట్ పిల్లలని బాగా ఎంగేజ్ చేసింది ” చాల ఉత్సాహాంగా చెప్పింది రాధిక.
“ఓ అలాగా , అయితే అకాడెమిక్స్ క్లాసెస్ కి వెళ్లట్లేదా ఆకాష్? ” ఈ సైన్స్ ప్రాజెక్ట్ పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపకుండా అంది శ్వేత.
“ఎలాగూ స్కూల్ స్టార్ట్ అయితే స్కూల్ వర్క్ చాలా ఉంటుంది కదా, సమ్మర్ లో కూడా ఎందుకూ అని మేమే) పంపలేదు ” చాల క్యాజువల్ గా చెప్పింది రాధిక .
” ఓ అలాగా ” అని ఆ టాపిక్ అక్కడితో పూర్తి చేసి వాళ్ళ స్కూల్ , కాలేజీ ఇంకా ఇన్నో విషయాలు మాట్లాడుకున్నారు, మొత్తానికి ఇద్దరిదీ ఒకే డిస్ట్రిక్ట్ ఇండియాలో. ఇద్దరు, ముగ్గురు కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇండియాలో .
“అయ్యో .. మాట్లాడుతుంటే టైమే తెలియలేదు, వాడిని క్లాస్ నుండి పిక్ చేసుకోవాలి, మళ్ళీ మాట్లాడుతా ” అంది శ్వేత బై చెపుతూ . ఇద్దరికీ ఒక స్నేహ పూరిత వాతావరణంలో ఎంతో దగ్గరయిన ఫీలింగ్ తో ఆ సంభాషణ ముగిసింది.
ఆరోజు వీకెండ్ . పొద్దున్నే ఒక ఫ్రెండ్ వాట్స్ ఆప్ మెసేజ్ పంపింది రాధికకి, సారాంశం: “ఈ రోజు బ్యాక్ టు స్కూల్ షాపింగ్ లాస్ట్ డే టాక్స్ ఫ్రీ ” అని.
” ఊప్స్! ఇల్లు సర్దడంలో పడి బ్యాక్ టు స్కూల్ షాపింగే మరిచి పోయాను” అనుకొని వెంటనే శ్వేతకి ఫోన్ చేసింది కలసి షాపింగ్ కి వెళ్లొచ్చు అనుకొని!
“వరుణ్ కి సమ్మర్ కోర్సు టెస్ట్ ఉంది, ఈ రోజే లాస్ట్ క్లాస్! నేను వరుణ్ ని డ్రాప్ చేసి వస్తా కొంచెం లేట్ గా, నీవు వెళ్ళు ” అంది శ్వేత . సరే అని బ్రేక్ ఫాస్ట్ చేసి ఆకాష్ తో వాల్ మార్ట్ కి వెళ్ళింది రాధిక. అది టాక్స్ ఫ్రీ వీక్ కాబట్టి కిక్కిరిసిన జనం, ఇండియాలో దసరా పండుగ షాపింగ్ గుర్తుకు వచ్చింది రాధికకి. మొత్తానికి స్కూల్ నుండి వచ్చిన లిస్ట్ అంతా షాపింగ్ చేసి బిల్లు కట్టుతుంటే శ్వేత కనపడింది. ఆకాష్ కళ్ళు వరుణ్ కోసం చూస్తున్నాయి .
“టయర్డ్ అయినాడట, ఇంట్లోనే ఉంటా అన్నాడు వాళ్ళ డాడీతో , చాలా రోజులు అయ్యింది కదా ఎక్స్ బాక్స్ ఆడక అదీ బడాయి” అంది శ్వేత ఆకాష్ ని చూస్తూ!
” రేపు వరుణ్ ని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళండి, పిల్లలిద్దరు కలసి ఆడుకుంటారు” అంది రాధిక శ్వేత తో .
“సరే , సరే , మళ్ళీ ఫోన్ చేస్తా ! ” హడావిడిగా కొనాల్సిన లిస్ట్ చూసుకుంటూ, అన్ని ఐటమ్స్ దొరుకుతాయో లేవో అన్న సందేహంతో షాపు లోనికి పరుగులు పెట్టింది శ్వేత. శ్వేత వెళుతున్న వైపు చూస్తూ బయటకు వెళ్లారు రాధిక, ఆకాష్.
వరుణ్ ని ఆడుకోవడానికి పంపమని ఒకటి, రెండు సార్లు ఫోన్ చేసి చెప్పింది శ్వేతకి. ఆకాష్, వరుణ్ తో కలసి ఆడుకోవచ్చన్నది భ్రమ లాగే మిగిలి పోయింది, కానీ ఇంటి దగ్గర్లోని గుజరాతి బాబుతో, ఇంకా కొందరు అమెరికన్ పిల్లలతో అపుడప్పుడు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. అలా సమ్మర్ గడిచి పోయింది. సరే లే, సమ్మర్ కోర్సు వల్ల వరుణ్ బిజీ అయ్యాడు కదా, ఇంకా రోజూ ఇంటి దగ్గరే ఉంటారు కదా, ప్రతి రోజూ స్కూల్ తర్వాత కలవవచ్చులే అని తనకు తాను సముదాయించుకుంది రాధిక. తెల్ల వారితే స్కూల్ తెరుస్తారు సమ్మర్ బ్రేక్ తర్వాత. ఆకాష్ రాత్రి నుండే స్కూల్ బ్యాగ్ సర్దు కుంటున్నాడు. స్కూల్ బ్యాగ్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్నట్లు.
రాధిక ఆలోచనలన్నీ ఆకాష్ దినచర్యల వైపు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు పాపం ఒక్కడే బాస్కట్ బాల్ ఆడుకుంటున్నాడు కంపెనీ లేక. స్కూ ల్ అయిపోయాక సాయంత్రం వరుణ్ వస్తే ఆడుకోవడానికి కొంచెం కంపెనీ ఉంటుంది కదా అనుకుని శ్వేత ఫోన్ చేస్తే చెబుదాము అనుకుంటుంది రాధిక గత వారం రోజులుగా! కానీ శ్వేత నుండి ఎలాంటి కాల్ రాలేదు. అలా ఒక వారం గడిచి పోయింది. స్కూల్ వర్క్ తో బిజీగా ఉన్నప్పటికీ ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లోని ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాడు ఆకాష్ . ఒక రోజు శ్వేత ఫ్యామిలీని డిన్నర్ కి రమ్మని ఆహ్వానించింది రాధిక, ఆ విధంగా నైనా కనీసం పిల్లలు ఆడుకుంటారేమో అని.
“అయ్యో మీరే కొత్తగా వచ్చారు, మేమె పిలుద్దామనుకుంటున్నాము… కానీ యు నో…” అని నసిగింది శ్వేత.
“అయ్యో దానిదేముంది, మరో సారి మేము వస్తాములే, మీరు రండి ఈ సాటర్ డేకి” అని ఒప్పించింది రాధిక.
“సరే, నేను ఏమన్నా తీసుకురావాలా, మీకొక్కరికే ఎందుకు శ్రమ ” అంది శ్వేత.
“అయ్యో దానిదేముంది , రెండు ఫ్యామిలీ లే కదా, వచ్చేయండి ఏమీ తేవద్దు ” సంతోషంగా చెప్పింది. తనకు కష్టం కలిగించవద్దు అన్న శ్వేత మనస్తత్వానికి పొంగి పోయింది రాధిక . ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అన్న సంతోషం తో మరొక్క సారి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
“గైస్ , అయామ్ రెడీ, కమాన్ లెట్స్ గో.. ” రెడీ అయ్యి కారు కీస్ తీసుకుని బయటకు వచ్చింది శ్వేత. వరుణ్ , రాజేష్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు .
“అబ్బ బ్బ, వీళ్ళు ఎప్పుడూ లేటే … ఈ రోజుల్లో ఆడవాళ్ళ కంటే మగవాళ్లే ఎక్కువ టైం తీసుకుంటున్నారు రెడీ కావడానికి” గుణుక్కుంటూ మరొక్క సారి గట్టిగా కేకేసింది రాజేష్, వరుణ్ కోసం కారు డ్రైవర్ సీట్లో కూర్చున్న శ్వేత .
భర్త రాజేష్ కూడా సాఫ్ట్వేర్ రంగంలో డిఫెన్సు డిపార్ట్మెంట్ లో గత పన్నెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. రాజేష్, వరుణ్ రాగానే కారు స్టార్టు చేసి హోమ్ డెకార్స్ షాప్ ముందు ఆపింది శ్వేత. రాజేష్, వరుణ్ ఇద్దరూ వింతగా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూసారు శ్వేత వైపు .
“ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు వట్టి చేతుల్తో వెళ్తామా? అసలే వాళ్ళకు అది కొత్త ఇల్లు” అనుకుంటూ షాప్ లోకి వెళ్ళింది .
పది నిమిషాల తర్వాత ఒక గిఫ్ట్ ప్యాక్ తో బయటకు వచ్చింది శ్వేత. ఇంకో అయిదు నిముషాల తర్వాత రాధిక ఇంటి ముందు ఆగింది కారు. అందరూ దిగి వెళ్లారు, గిఫ్ట్ రాధికకి ఇచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పింది శ్వేత.
” అయ్యో.. ఎందుకీ ఫార్మాలిటీస్” అనుకుంటూనే గిఫ్ట్ తీసుకుంది రాధిక.
రాజేష్, ప్రసాద్ అదే ఫస్ట్ టైం కలవడం. కొంచెం సేపు పరిచయాలు, ఆఫీస్ పేర్లు, ఇండియా లో ఎక్కడి నుండి అని పూర్తి వివరాలు జరిగి పోయాయి ఆపిటైజర్స్ తీసుకుంటూ. వైన్, స్కాచ్ ఏది కావాలని అడిగితే వైన్ అన్నాడు రాజేష్. ప్రసాద్ వైన్ బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసులలో సర్వ్ చేసాడు. రాజేష్ తన చేతిలో ఉన్న ఐ ఫోన్ లో వాట్స్ అప్ మెస్సేజెస్ చూస్తూ అప్పుడప్పుడు తనే నవ్వు కుంటున్నాడు! చీర్స్ కొట్టి ఫస్ట్ సిప్ తీసుకున్నారు ఇద్దరూ! లేడీస్ రెండు గ్లాసులతో జ్యూస్ సర్వ్ చేసుకుని సిప్ చేస్తున్నారు. గ్రాసరీస్ కి ఎక్కడికి వెళ్తారు, జనరల్ ఐటమ్స్ ఎక్కడ చీప్ గా ఉంటాయో అని వివరాలు తీసుకుంది రాధిక, కొంచెం సేపు నిశ్శబ్దం. ఆకాష్, వరుణ్ వాళ్ళ ఆటలో మునిగి పోయారు, అదే.. ఆట అంటే ఎక్స్ బాక్స్ ఆట.
” ఆటలు అంటే మన చిన్న తనం లోనే! ఎన్ని ఆటలుండేవి ? గిల్లిదండ మొదలు, కొక్కో, కబడీ, టోక్కా .. ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు తప్ప ఇంకా ఏ ఆటలు ఆడట్లేదు కదా?” పిల్లలిద్దరినీ చూస్తూ, చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరువేసుకున్నాడు ప్రసాద్.
“అవును, అప్పుడు అన్నీ బయట ఆడుకునే ఆటలే! మేము కూడా చాలా ఆటలు ఆడేది” వంత కలిపాడు రాజేష్ .
” పిల్లలకి మరీ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి” అన్నాడు ప్రసాద్ .
రాజేష్ మాత్రం తన ఐ ఫోన్ లో వాట్స్ అప్ మెసేజ్ పై దృష్టి పెట్టాడు. మళ్ళీ కొంచెం సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది!
“ఆకాష్ ఆక్టివిటీస్ ఏంటి?” నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, స్ప్రింగ్ రోల్ని తన ప్లేట్ లో వేసుకుంటూ అడిగింది శ్వేత!
“వాడు కరాటే బ్లాక్ బెల్ట్, ఫైవ్ ఇయర్స్ నుండి వెళ్తున్నాడు, స్కూల్ తర్వాత అదే మెయిన్ ఆక్టివిటీ. స్కూల్ బ్యాండ్ లో డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు, హోమ్ ట్యూషన్ మాథ్స్ లో వీక్లీ టు క్లాస్సేస్ , ఫోటోగ్రఫీ ఇష్టం టైం దొరికినప్పుడన్నా ఏదో ఒక కొత్త
టెక్నిక్ తో ఫోటోలు తీస్తాడు” అన్ని వివరాలు చెప్పింది, ఇంకా ఏమి మర్చిపోలేదు కదా అన్నట్లు ప్రసాద్ వైపు చూసింది. ప్రసాద్ కూడా తల ఊపాడు అంతే అన్నట్లు .
“మరి, మాథ్స్ ఓలంపియాడ్ , టి.జె ట్రైనింగ్ కి వెళ్లట్లేదా? ” ఆశ్చర్యాన్ని కలిగిన ప్రశ్నార్థక ఫేసుతో అంది శ్వేత.
“స్కూల్ లో మంచి ర్యాంక్ వస్తుంది, లాస్ట్ ఇయర్ కూడా టాప్ ర్యాంక్స్ వచ్చాయి. స్కూల్ ప్రాజెక్ట్స్ , అస్సైన్మెంట్ లు అన్ని ప్రాంప్ట్ గా ఫినిష్ చేస్తాడు. ప్రసాద్ అప్పుడప్పుడూ హోంవర్క్ కి హెల్ప్ చేస్తుంటాడు అందుకనే ఇంకా ఎక్కువ అకాడెమిక్స్ లో స్ట్రెస్ ఇవ్వము” రాధిక చెప్పింది ఆకాష్ ని మెచ్చుకున్నట్టుగా.
“వరుణ్ ఏ క్లాస్ కి వెళ్తాడు ?” ఉత్సాహం కొద్దీ అడిగింది రాధిక
” టి.జె ట్రైనింగ్ కె పూర్తి టైం పోతుంది, ఇంకా మాథ్స్ ఒలింపియాడ్ కి వెళ్తున్నాడు, స్పోర్ట్స్ కి ఇంక టైం లేదు, స్కూల్ లో ఎట్లాగూ పి .ఇ క్లాస్ ఉంటుంది కదా అని” చాలా గొప్పగా చెప్పింది శ్వేత.
” ఓ అలాగా ” అని ఫిజికల్ ఎడ్యుకేషన్ అసలు అవసరమే లేదన్నట్టున్న శ్వేత జవాబు విని కొంచెం ఆశ్చర్య పడి గ్యాప్ ఇచ్చి ” నీ హాబీస్ ఏంటి?” అడిగింది రాధిక శ్వేతని.
” హాబీలా, పాడా? ఆ ఇప్పుడు నాకు అంత టైం లేదు, జస్ట్ జాబ్. ఆఫీస్ నుండి రాగానే వీడితోనే సరిపోతుంది, టి.జె క్లాస్ కి డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ , దగ్గరుండి హోమ్ వర్క్ చేపిస్తాను. నెక్స్ట్ ఇయర్ నుండి ఎస్ ఏ టి (SAT – కాలేజీ అడ్మినిషన్ కి టెస్ట్ ) ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము, ఏమన్నా బెస్ట్ కోచింగ్ ఎంక్వయిరీ చేసారా?”
రాధికకి చాల ఇబ్బందిగా ఉంది, ఎంత సేపు పిల్లల స్టడీస్ పైనే చర్చ. చిన్నప్పటి ఆవు కథ గుర్తుకు వచ్చింది, ఏది మాట్లాడినా చివరికి టాపిక్ పిల్లల అకాడెమిక్ స్టడీస్ చుట్టూ తిరగడం. ఇంకో నాలుగు సంవత్సరాల తర్వాత రాయాల్సిన ఎస్ ఏ టి (SAT ) టెస్ట్ కి ఇప్పటినుండి ప్రేపరేషనా? రాజేష్ కూడా ప్రసాద్ ని ఏదో అడుగుతున్నాడు ఆకాష్ స్టడీస్ గురించి. తన హాబీలు అన్నీ కేవలం కొడుకు స్టడీస్ కోసమే వదలేసి, వాన్ని ఒక యంత్రంలా నడిపించడం, వాడిపై కేవలం అకాడమిక్స్ స్టడీస్ ప్రెషర్ పెట్టడం ఎంత వరకు సమంజసం? మనసులో ఎన్నో ప్రశ్నలు సుడులు తిరుగుతుంటే, అన్నీ లోపలే దాచుకొని పైకి ఇవేమి కనపడనట్టు.
“లేదు అట్లాంటి ప్లాన్ అయితే లేదు, టెన్త్ గ్రేడ్ కి వచ్చినప్పుడు కదా అందరూ SAT ట్రైనింగ్ ఇప్పించేది?” ఇంకేమి మొహమాటం లేకుండా చెప్పింది .
“అట్లాంటిదేమీ లేదు, ముందు నుండే స్టార్ట్ చేస్తే కొంచెం వాళ్లకి ఈజీగా ఉంటుంది, మార్క్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి వీలు ఉంటుంది” తానే కరెక్ట్ అన్నట్టు చెప్పింది శ్వేత.
“మరి క్లాస్ హోమ్ వర్క్స్ కి, అస్సైన్మెంట్స్ కి కొంత ఇబ్బంది అవుతది కదా, టైం సరిపోతుందా?” ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నట్టు అడిగింది రాధిక. శ్వేత మాత్రం కొంత వింతగా చూసింది ఆ ప్రశ్న నచ్చనట్లుంది ముఖః కవళికలు బట్టి .
“అందుకే అవసరం లేని ఆక్టివిటీస్ అన్నీ మాన్పించేశాము సాకర్, స్విమ్మింగ్ లాంటివి ” వాటితో పని లేదు అన్నట్లు చెప్పింది శ్వేత.
“ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయ్యింది, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందామా? ” ఏమాత్రం మొహమాటం లేకుండా అన్నది శ్వేత.
“అయ్యో సారీ, రేపు వీకెండే కదా లేట్ గా డిన్నర్ చేస్తారేమో అనుకున్న, పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా అని, ఆ ..అన్నీ రెడీ గా ఉన్నాయి” పిల్లలు ఇంకా కొంచెం సేపు ఆడుకుంటే బాగుండు అనిపించినా లేచింది సర్వ్ చేయడానికి. వరుణ్ రోజూ రాత్రి సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ చేస్తాడు. ఈ రోజు ఆల్రెడీ ఎనిమిది దాటి పోయింది, వాడికి మార్నింగ్ క్లాస్ ఉంది అందుకని” అని కొంచెం గ్యాప్ ఇచ్చి పిల్లల వైపు తిరిగి.
“రేపు సండే కదా ? ” సండే నాడు కూడా క్లాసా అన్నట్టు చాల ఆశ్చర్యంగా అంది రాధిక.
“ఆ.. అది.. ఒక క్లాసు ఉంది. ఆ టీచర్ కి రేపు ఒక్క రోజే ఫ్రీగా ఉందట అందుకని” ఇంగ్లిష్ క్లాస్ అని చెప్పబోయి, మల్లీ ఆకాష్ ని కూడా ఎక్కడ పంపుతారో అని నోటి వరకు వచ్చిన మాటని ఆపేసింది.
“ఓ … ‘ ఐ సి ” అని మాత్రం అంది రాధిక .
“వరుణ్ టైం టు డిన్నర్, యు హావ్ మార్నింగ్ క్లాస్” గేమ్ లో బిజీగా ఉన్న పిల్లలని ఉద్దేశించి దాదాపు అరచినంత పని చేసింది అంది శ్వేత.
“నో మమ్, కొద్ధి సేపు ఆడుకొని డిన్నర్ చేస్తాను, గివ్ మీ ఫ్యూ మోర్ మినిట్స్” వేడుకుంటున్నటుగా ముఖం పెట్టాడు వరుణ్.
” యు హావ్ మార్నింగ్ క్లాస్ టుమారో ” అంది శ్వేత.
“ఎస్ మమ్, ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం ఐ హావ్ ఎవర్ ప్లేడ్ ” ఎన్ని రోజుల నుండి ఈ మాత్రం ఆడే టైం ఇవ్వలేదో వాడి మాటలని బట్టి తెలుస్తుంది.
“ఓ.కే, బట్ జస్ట్ ఫైవ్ మినిట్స్” ఇంక ఎక్కువ సేపు వాదించలేక సరే అన్నట్టు అయిదు నిముషాల పర్మిషన్ ఇచ్చింది శ్వేత.
“థాంక్ యు మమ్ ” అని ఆటలో మునిగి పోయాడు వరుణ్ ఆకాష్ తో.
రాధిక మాత్రం కొన్ని కర్రీస్ మైక్రోవేవ్ లో వేడి చేసి టేబుల్ పై సర్దింది, అన్నట్టు గానే అయిదు నిమిషాల్లో ఆట ముగించి డిన్నర్ టేబుల్ దగ్గరికి వచ్చి, డిన్నర్ కానిచ్చారు పిల్లలిద్దరూ. పెద్ద వాళ్ళు కూడా డిన్నర్ స్టార్ట్ చేశారు. సాధారణంగా ఏ వీకెండ్ పార్టీ అయినా రాత్రి పదకొండు తర్వాతే డిన్నర్ చేస్తారు, ఎనిమిది గంటలకే డిన్నర్ చేయడం చాలా వింతగా తోచింది రాధికకి. ప్రసాద్ కి సినిమాలు అంటే ప్రాణం, చిన్నప్పుడు చేసిన కొన్ని డ్రామాల వల్ల నటన లో కొంత ఆసక్తి కలిగింది, అంతే కాక కొంత సాహిత్యము లో ప్రవేశం ఉంది. ఈ మధ్య న్యూయార్క్ లో జరిగిన ఒక ప్రముఖ తెలుగు హీరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి జరిగిన అడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి నటించడం జరిగింది.
“మూవీస్ చూస్తుంటారా? ” రాజేష్ నుండి ఎలాంటి మాటలు రాక పోవడంతో ఇంకేమి టాపిక్ లేక తనే స్టార్ట్ చేసాడు ప్రసాద్ .
“ఈ మధ్య చాలా రోజులు అయ్యింది సినిమాలు చూడక, ఆ.. అంత టైం కూడా ఉండట్లేదు వరుణ్ తోనే సరిపోతుంది, అయినా ఇప్పుడు వస్తున్నవన్నీ చెత్త సినిమాలే కదా !” ఐ ఫోన్ లో వాట్స్ అప్ చూస్తూ తలను పైకెత్తి అన్నాడు రాజేష్ ఏ మాత్రం ఇంటరెస్ట్ లేని టాపిక్ లాగా. అన్నీ చెత్త సినిమాలే అనే సరికి కొంత ఈగో హార్ట్ అయ్యింది ప్రసాద్ కి.
“అసలు ఏం తెలుసనీ సినిమాల గురించి, ఒక్క మాటలో కొట్టి పారేస్తారు చెత్త సినిమాలు అని – తెలిసిన వాడు, తెలియని వాడు.. ప్రతి వాడూ సినిమాల గురించి మాట్లాడమే!” అని మనసులోనే అనుకుని, కోపం తారా స్థాయికి చేరినా ఇంటికి వచ్చిన గెస్ట్ కదా అని తనకు తాను సముదాయించుకున్నాడు.
“లేదండీ ఈ మధ్య తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వాళ్ళ ఇమేజ్ కి భిన్నంగా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా ఆకాష్ కి ” ఘాజీ” బాగా నచ్చింది, సబ్ మెరైన్ గురించి చాల విషయాలు తెలుసుకున్నాడు, చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టు” ఉదాహరణలతో చెప్పే సరికి ఇంకేమీ చెప్పాలో అర్థం కాక.
“మాకు వరుణ్ తోనే సరిపోతుంది వాడి అసైన్మెంట్స్ అని, వాడి ప్రాజెక్ట్స్ అనీ! ” కొంత ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు రాజేష్.
శ్వేత కలగ చేసుకుంటూ “అన్నట్లు అడగడం మరిచా అప్పటినుండి… ఆకాష్ కి ఏ సబ్జెక్టు ఇంటరెస్ట్? ఐ మీన్.. ఫ్యూచర్ లో మెడికల్ లేదా ఇంజినీరింగ్? ఏదన్నా కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాడా? మొన్న సమ్మర్లో ఒక రోజు జాన్ హాప్ స్కిన్స్కి క్యాంపస్ చూడడానికి వెళ్తే వాడికి బలే నచ్చేసింది. వరుణ్ మాత్రం మెడికల్ స్కూల్ అదీ జాన్ హాప్కిన్స్ లో మాత్రమే చేస్తా అంటున్నాడు. ఈ మాట విని ప్రసాద్ కి, రాధికకి దిమ్మ తిరిగినంత పని అయ్యింది. నిజంగా వాడు అన్నాడో లేదో కానీ, వీళ్ళకి మాత్రం వాన్ని అందులోనే చేర్పించాలని ఉన్నట్లుంది అన్నట్లు రాధిక, ప్రసాద్ ఇద్దరూ మనసులోనే అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విషయం అంతా తిరిగి తిరిగి మళ్లీ పిల్లవాడి స్టడీస్ దగ్గరికే వచ్చి ఆగి పోయింది! కనీసం ఎదుటి వారి మనోగతాన్ని అర్థం చేసుకోలేని వారి మనస్తత్వాన్ని అమాయకమనాలో, ఆజ్ఞానం అనాలో, అత్యాశ అనాలో అర్థం కావట్లేదు ప్రసాద్, రాధికలకి.
“ఏంటి వీళ్లకు పిల్లవాడి చదువు తప్ప ఇంకే ద్యాస లేదా? వరుణ్, వాడి చదువు తప్ప వీళ్ళ జీవితంలో ఇంకేమీ లేదా ? పిల్లవాడి చదువు జీవితంలో భాగం, కానీ జీవితమే వాడు అయిపోయి ఈ పసి వయసులో వాని పై కేవలం సబ్జెక్టు భారం మోపి , వాడి ఇష్టమేంటో తెలుసుకోకుండా, ఆడుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వక, కనీసం కంటినిండ నిద్రను కూడా దూరం చేస్తున్న ఈ తల్లి తండ్రులనేమనాలి?” అని మనసులో అనుకుంది రాధిక .
“అయ్యో .. డిసర్ట్ తిని వెళ్ళండి” అని అందరూ డిన్నర్ ముగించుకొని వెళ్ళడానికి సిద్దమౌతుంటే బలవంతంగా ఆపి తనే తయారు చేసిన మ్యాంగో కుల్ఫీ సర్వ్ చేసింది రాధిక. వాడికి మార్నింగ్ క్లాస్ ఉంది అని హడావిడిగా తిన్నట్టు చేసి వెళ్లి పోయారు శ్వేత అండ్ పార్టీ. ఆకాష్ మల్లీ వెళ్లి ఎక్స్ బాక్స్ ఆటలో మునిగిపోయాడు. సెండ్ ఆఫ్ ఇస్తూ వాళ్లనే చూస్తూ నిలుచుంది రాధిక, మనసులో ఎన్నో జవాబు లేని ప్రశ్నలు, సందేహాలు! వాళ్ళు వెళ్లిన వైపు అలాగే చూస్తూ నిలబడి పోయింది .
“వరుణ్, కమాన్ వేక్ అప్.. వేక్ అప్..” శ్వేత లేపుతుంది వరుణ్ ని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి.
“మామ్, టుడే ఈజ్ సండే.. కనీసం ఈ ఒక్క రోజు అన్నా ఇంకొంచెం సేపు పడుకోనీయమ్మా!” అభ్యర్థిస్తున్నాడు వరుణ్ వచ్చి రాని తెలుగులో.
“నో .. లాస్ట్ ఇయర్ ఇంగ్లిష్ లో నీకు ఆవివేక్ కన్నా వన్ పెర్సెంట్ తగ్గింది, నెక్స్ట్ మంత్ లో నీకే ఎక్కువ రావాలి, అప్పుడే నువ్వు టి.జె.కి క్వాలిఫై అవుతావు. ఈ రోజు నుండి ప్రతీ సండే హోమ్ ట్యూషన్ ఉంటుంది. నిన్ననే చెప్పాను కదా సెవెన్ కల్లా నువ్వు రెడీ అవ్వాలి అని, అందుకే అంత సేపు ఆడుకోవద్దు అన్నాను కదా ఆకాష్ తో” అరుస్తుంది వరుణ్ పై . ఆ ఆరుపు చూస్తే వివేక్ కి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కోపం వరుణ్ పై తీసుకుంటున్నదనిపిస్తుంది.
“అమ్మా ! ఆల్రెడీ టి.జె ప్రెప్ ( థామస్ జెఫెర్సన్ హైస్కూల్) కోర్స్ లో ఇంగ్లీష్ కవరవుతుంది కదా? ఇంకా నాకు ఉన్నఈ ఒక్క మార్నింగ్ కూడా సరిగ్గా నిదుర పోనివ్వవా?” బ్రతిమిలాడుతున్నాడు నిద్ర కోసం .
ఎప్పుడూ దేని కోసం అల్లరి చేయని పిల్లవాడు మొదటి సారి ఆదివారం ఉదయం నిద్ర కోసం పోరాడుతున్నాడు తల్లి తండ్రులతో.
“రోజూ లేస్తున్నావ్ కదా.. ఇంకా ఈ ఒక్క రోజు కూడా అలవాటు అయితే ప్రతి రోజు ఒకే టైం కి లేవొచ్చు. నీకోసమే కదా బంగారం డాడీ.. నేనూ.. కష్ట పడేది” బుజ్జగిస్తూ సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుంది శ్వేత, వరుణ్ మాత్రం వినే పరిస్థితిలో లేడు. అసలు వీకెండ్ హాలిడే ఎందుకు ఇస్తున్నారో ఈ తల్లి తండ్రులకి ఎవరయినా అర్థం చేస్తే బాగుండేది అన్నట్టు ఒక చూపు చూసి “ప్లీజ్ అమ్మా నాకు ఇంకా నిద్ర వస్తుంది” అంటూ మళ్ళీ కంఫోర్టర్ లో తలని దూర్చి ముసుగు పెట్టాడు వరుణ్.
“ఏంటి.. ఏమఉతుంది? పొద్దు పొద్దునే నన్ను నిద్ర పోనీకుండా” విసుక్కుంటూ కళ్లు నలుపుకుంటూ వరుణ్ బెడ్ రూమ్ కి వచ్చాడు రాజేష్. రాత్రంతా ప్రొడక్షన్ లో ఏదో ఇష్యూ వచ్చిందని కాల్ వస్తే ఫిక్స్ చేసి ఏ రెండు గంటలకో నిద్ర పోయాడు, ఐ.టి లో ఉన్న వాళ్లకి ఇది మాములే!
“వివేక్ కి లాస్ట్ ఇయర్ ఇంగ్లిష్ లో మన వాడికన్నా వన్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, ఆ గ్యాప్ ఎలాగన్న వరుణ్ ఈ మంత్ లో కవర్ చేయాలని..”
“ఓ అలాగా ….” అన్నాడు రాజేష్ ఇంకేమి మాట్లాడాలో తెలియక.
” అలాగా.. కాదు. ఎంత కష్టపడి ఈ ట్యూషన్ ఆరెంజ్ చేశాను అనుకున్నారు? మొన్న మన వరుణ్ క్లాస్మెట్ అమ్మాయి డెబి వాళ్ళ అమ్మ జెన్నిఫర్ కలిసింది, మాటల్లో తెలిసింది వాళ్ళ ఇంటి దగ్గర ఉండే టీచర్ దగ్గరికి వివేక్ ఇంగ్లీష్ క్లాస్ కి వెళ్లుతాడట! డెబి ని కూడా ఇంగ్లీష్ ట్యూషన్ కి పంపడానికి వివేక్ వాళ్ళ అమ్మ చంద్రని అడిగిందట క్లాస్ ఎలా ఉందీ అని, అంతే! చంద్ర అగ్గి మీద గుగ్గిలం అయ్యిందట. మా బాబుని పంపే చోటికి మీరెట్లా పంపుతారు అని ఒకటే గొడవ పెట్టిందట, జెన్నిఫర్ చెప్పింది మొన్న కలసినప్పుడు” చాలా వింతగా చెప్పింది శ్వేత.
“అలా కూడా ఉంటారా మనుషులు? అయినా జెన్నిఫర్ ఎలా ఊరుకుంది? ” విచిత్రంగా ముఖం పెట్టాడు రాజేష్.
” ఏంటో, మధ్యలో ఆమె పెత్తనం? పాపం! గొడవ ఎందుకనీ డెబి ని క్లాస్ కి కూడా పంపడం లేదట జెన్నిఫర్!”
“మరి మన వరుణ్ కూడా వెళుతుండని తెలిస్తే గొడవ చేస్తదేమో ఆ చంద్ర” అనుమానంగా మొహం పెట్టి అన్నాడు రాజేష్ .
“అందుకే కదా ఈ గొడవ అంతా, ఎవరికీ తెలియొద్దనే మార్నింగ్ క్లాస్ కి పంపుతున్నాను. టీచర్ కి కూడా చెప్పాను ఎవరికీ చెప్పొద్దు అనీ ముఖ్యంగా చంద్రకి, జెన్నిఫర్ కి అందుకే సండే మార్నింగ్ స్లాట్ ఇచ్చింది” తన అతి తెలివికి తనే సంతోషపడుతూ చెప్పింది శ్వేత.
వరుణ్ దగ్గరికి వెళ్లి బెడ్ షీట్ ముఖం పై నుండి లాగి “యు హావ్ ఓన్లీ టెన్ మినిట్స్ టు గెట్ రెడీ, దిస్ ఇస్ మై ఫైనల్ వార్నింగ్ ” అంటూ కిచెన్ వైపు వెళ్ళింది శ్వేత వరుణ్ కి పాలు కలపడానికి.
ఇంకేమి మాట్లాడలేక, వరుణ్ పట్ల తన నిర్ణయం ఏదీ పనిచేయదని తెలిసి బెడ్ పైకి వెళ్లి ముసుగు పెట్టి పడుకున్నాడు రాజేష్ . ఎంత అరిచినా బాహుబలి లో శివగామి శాసనానని కన్నా తిరుగు ఉంటుందేమో కానీ వాళ్ళ అమ్మపెట్టిన శాసనానికి తిరుగు ఉండదని తెలుసు. పది నిమిషాల్లోపే వరుణ్ రడీ అయ్యి వచ్చి, కిచెన్ లో రెడీ గా ఉన్న మిల్క్ తాగాడు. నిండా వింటర్ జాకెట్ వేసుకొని, రెండు చేతులకి గ్లవుస్ వేసుకుని మైనస్ డిగ్రీస్ లో ఉన్న ఎముకలు కొరికే చలినుండి వేడి చేయడానికి కారులో హీటర్ ఆన్ చేసి సిద్ధంగా ఉంది శ్వేత. వింటర్ జాకెట్ వేసుకొని, నిండుగా ముసుగు పెట్టుకుని కారులో సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాడు వరుణ్.
కారుని ట్యూషన్ టీచర్ ఇంటివైపుకి తోలుతూ, రాత్రి రాధిక వాళ్ళ ఇంట్లో జరిగిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంది శ్వేత. “అసలేంది వాళ్ళు, పిల్లలకు అకాడమిక్ స్టడీస్ ఎంత అవసరమో కూడా తెలియదా? అసలు టి.జె గురించి కూడా ఏమి తెలియనట్లుంది. అమ్మో వీళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తే రేపు వరుణ్ అకాడెమిక్స్ సంగతేంటి? వాడి టి.జె అడ్మిషన్ సంగతేంటి?” అని మనసులో అనుకుని.. “వరుణ్.. యు హావ్ టు గెట్ టీజె సీట్, నౌ ఆన్వార్డ్స్ యు అర్ నాట్ ప్లేయింగ్ విత్ ఎనివన్.. ఓకే? ” అన్నది శ్వేత ఆకాష్ తో ఆడొద్దు అని చెప్పలేక.
“ఓకే మమ్” అన్నాడు వరుణ్. మనసులో ఒకింత ఇబ్బందిగా ఉన్నప్పటికీ “అబ్బా! ఎన్ని క్లాసులు అటెండ్ కావాలి ఇలా.. ఆ ఆకాష్ ప్రతి రోజు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడట ఎంచక్కా? కరాటేకి వెళ్తున్నాడట, అక్కడికి తన క్లాస్మే ట్స్ కూడా చాలా మంది వెళ్తున్నారట, నేను ఆడుకోక ఎన్ని రోజులయ్యింది..? “మనసులోనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నా ఒకే అనక తప్పలేదు అమాయకంగా మొహం పెట్టి.
సమయం ఉదయం ఎనిమిది అవుతుంది, రాధిక అప్పుడే నిద్ర లేచింది. రాత్రి అందరూ డిన్నర్ చేసిన తర్వాత అన్నీ సర్ది పడుకునే సరికి చాలా టైం అయ్యింది, పడుకున్నట్టే కానీ మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
లేచి ఒకసారి ఆకాష్ ని చూసి వచ్చింది, హాయిగా నిద్ర పోతున్నాడు తన బెడ్ రూంలో. ప్రసాద్ కూడా నిద్ర లేచి ఫోన్ లో వాట్స్ అప్ మెసేజెస్ చూసుకుంటున్నాడు. ఎందుకో మనసులో ఒకవైపు కొంచెం గిల్టీ ఫీలింగ్, తాము ఆకాష్ విషయంలో తప్పు చేస్తున్నామా అని మనసులో అనుకుంది రాధిక.
“మనమేమన్న తప్పు చేస్తున్నామా వాడిని టి.జె ట్రైనింగ్ కి పంపకుండా?” అన్న సందేహం వెలిబుచ్చింది ప్రసాద్ తో.
“ఎవరో ఏదో చేస్తున్నారని దాన్ని మనం ఇంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం లేదు, హి ఐస్ ఫైన్.. నో వర్రీస్” అన్నాడు ప్రసాద్.
“ఏంటో, వరుణ్ అక్టీవిటీస్ చూస్తుంటే ఎందుకో పీటీ అనిపిస్తుంది. ఎప్పుడో ఇంకా అయిదు సంవత్సరాల తర్వాత చేరవలసిన కాలేజీ గురించి ఇప్పటి నుండే అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? ఎలాంటి ఫిజికల్ ఆక్టివిటీస్ లేకుండా ఆ పసివయసులో అన్ని క్లాసులు రుద్దడం కనీసం వాడికి ఒక సండే కూడా ఫ్రీ లేదు, కంటినిండ నిద్ర కూడా పోనీయకుండా..?”
“రాధికా, నేను చిన్నప్పుడు చదివినంతా తెలుగు మీడియం, అదీ సర్కారు స్కూల్ లో, చదివింది ఐఐటీ లో మెకానికల్ ఇంజనీరింగ్, ఇప్పుడుచేస్తుంది ఐ టి జాబ్. జస్ట్ బ్యాచ్ల ర్స్ డిగ్రీ చేసినవారు కూడా ఇప్పుడు ఐటీ లో ఉన్నారు. మనం చదువుకున్న పరిస్థితితో పోల్చితే ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టం డిఫరెంట్, స్టడీస్ తో పాటు జనరల్ ఆక్టివిటీస్, ప్రెసెంటేషన్ స్కిల్స్ లో ఇక్కడి పిల్లలు ముందుంటారు. మొన్నటికి మొన్న సైన్స్ ప్రాజెక్ట్ ప్రెసెంటేషన్ అంతా చేసింది ఆకాశే గదా, వాళ్ళ గ్రూప్ కి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. అన్నిట్లో మంచి ర్యాంకులే కదా వాడికి వస్తున్నాయి?” అని సముదాయించాడు ప్రసాద్.
“అవును” అంది రాధిక ప్రసాద్ మాటలు వింటూ.
“తమ పిల్లలు బాగా చదువు కోవాలి అనేది ఆశ. ఇది ఏ తల్లి తండ్రులకయినా ఉండొచ్చు, ఉండాలి! కానీ అందరికన్నా మా పిల్లలు మాత్రమే బాగా చదవాలి, టాప్ ర్యాంకులు రావాలి అన్నదే అత్యాశ. ఈ అత్యాశే ఎందరో పసిపిల్లల బతుకుని బుగ్గి చేస్తుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, ఎవరినో చూసి మన పద్ధతి ఎందుకు మార్చుకోవాలి?” చాలా మాములుగా ఆ విషయం వదిలేయ్ అన్నట్లు చెప్పాడు ప్రసాద్.
“వరుణ్ టి.జె విషయం తెలిసిన నుండీ, నేను ఈ టీజె స్కూల్ పై చాలా అనాలిసిస్ చేశాను. అది గొప్పకు చెప్పుకోవడం, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ తో కలసి చదవడం తప్ప దాని వల్ల రేపు చేరబోయే కాలేజీ సీటుకి ఏ సబంధమూ లేదు అని తెలుసుకున్నా” తనకు తెలిసిన విషయం చెప్పింది రాధిక.
” అవును, వాడికి ఆల్రెడీ టాలెంట్ ఉండి సీటు వస్తే మంచిదే, కానీ సీట్ కోసం లేని టాలెంట్ ని తెప్పించడానికి చేస్తున్న ప్రయాత్నాలే పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. చెప్పొద్దు అనుకున్న కానీ.. సరే విను! మొన్న మా ఆఫిసులో ఒకాయన కొడుకు మన ఆకాష్ వయసే, సూసైడ్ చేసుకున్నాడు”
“వాట్ ..మిడిల్ స్కూల్ స్టూడెంట్ సూసైడా? ఆందోళనగా అంది రాధిక.
“ఎస్! నువ్వు ఎక్కడ కంగారు పడతావో అని చెప్పలేదు, అయితే పోలీస్ ఎంక్వయిరీలో ఒక నోట్ దొరికిందట, దాని సారాంశం ఏమంటే… వాడికి చాలా ఇష్టమయిన సాకర్ గేమ్ ని ఈ మధ్యే మాన్పించి, అకాడమిక్స్ కి ఎక్స్ట్రా క్లాసేస్ కి పంపిస్తున్నారట, హోమ్ వర్క్ మీద చాల టైం పెడుతున్నాడట. రాబోయే రోజుల్లో ఇంకా కష్ట పడాలి, క్లాసులు పెరిగిన కొద్దీ హోమ్ వర్క్ ఎక్కువ అవుతుంది, కష్టపడటం ఎక్కువ అవుతుంది అనీ వాడి మైండ్ లో ఫిక్స్ అయ్యాడట, అంత కష్టపడి బ్రతుకే బతుకు నాకు వద్దు , నేను ఇంతకన్నా కష్ట పడలేను అని రాసాడట. జీవితం అంటే ఏమిటో తెలియని వయసు, కానీ ఈ పసిహృదయాలకి అర్థం అయ్యింది మాత్రం జీవితం అంటే కష్ట పడడం, ఇంకా కష్ట పడటం మాత్రమే! ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని బతుకు అని” చాలా ఉద్విగ్నతకు లోను అయ్యాడు ప్రసాద్ చెప్పుకుంటూ .. మల్లీ ఒక నిమిషం ఆగి తనే
“ఒక కఠిన నిర్ణయానికి వచ్చే వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళ నిండు జీవితం బలి అవుతుంటే.. దానికి కారణం ఎవరు ? అత్యాశకు పోయే తల్లి తండ్రులే కదా? మన వాడు రేపు డాక్టరో ఇంజనీరో కావాల్సిన పనిలేదు, వాడికి నచ్చిన పనిచేసుకుంటే చాలు” వాడి భవిష్యత్తు పై అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసాడు ప్రసాదు.
“కేవలం పే-చెక్ కోసమే పని చేయడమనేది ఇప్పటి పిల్లలు చేయడం లేదు, చేయరు కూడా” అన్నాడు ప్రసాద్.
“మీరన్నది కరక్టే, ఎవ్వరిని అడిగినా డాక్టర్ ఇంజనీర్ అని మాత్రం అంటారు” అంది రాధిక
“తప్పని సరిగా ఉద్యోగం చేయాలనేది అప్పుడు మన తండ్రులు నేర్పింది, కాంపిటీషన్ తట్టుకొని ఏదో ఒక ఉద్యోగం లో చేరాలి అంతే! చదువు, ఉద్యోగం అనే రెండు మాటలు తప్ప మనకెట్లగూ ఒక పాషన్, హాబీ లేకుండా పెరిగాము. ఇప్పుడు ఈ కంట్రీ లో మన పిల్లలు నేర్చుకుంటుంది వేరు. మన ఆకాష్ ని చూస్తున్నావు కదా, వాడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. వీలయినంత వరకు ఫోటోగ్రఫీ బుక్స్, బ్లాగ్స్ చదువుతాడు. కెమెరాతో రోజూ ఒక కొత్త టెక్నిక్ ని చూపుతాడు తన ఫొటోస్ లో. రేపు వాడు ఫోటోగ్రఫీ లో డిప్లొమా, మాస్టర్స్ చేస్తా అంటే ఎక్కడికి అయినా పంపుతా! ఎవరికి తెలుసు వాడికోసం హాలివుడ్ లో ఎలాంటి పొజిషన్ వెయిట్ చేస్తుందో ” చాలా ఇంటరెస్టింగ్ గా వింటున్నది రాధిక ప్రసాదు మాట్లాడుతుంటే.
మూడు నెలల నెలల తర్వాత :
ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కార్డు వచ్చింది ఆకాష్ స్కూల్లో, అన్నింట్లో మంచి ర్యాంకులు వచ్చాయి ఎప్పుడూ వచ్చినట్టే. సడెన్ గా రాధిక ఫోన్ మ్రోగింది, ఎవరా అని చూసింది అది శ్వేత నుండి. అప్పుడెప్పుడో తమ ఇంటికి డిన్నర్ కి వచ్చిన తర్వాత గత మూడు నెలల్లో ఎప్పుడూ ఫోన్ చేయలేదు శ్వేత. నిజం చెప్పాలంటే శ్వేత తమ ఇంటికి లంచ్ కి పిలుస్తుంది అని కొన్ని రోజులు ఎదురు చూసింది రాధిక, లంచ్ కాదు కదా ఒక ఫోన్ కూడా చేయలేదు ఇంత వరకూ. ఇంత విచిత్రంగా ఉండే మనుషుల్ని ఎప్పుడూ చూడలేదు, ఆకాష్ కి కంపెనీ ఉంటుందని ఎంతెంతో ఆశ పడింది, కానీ తాను ఆశించినట్టుగా ఏదీ జరగలేదు, కానీ ఆకాష్ కి ఇప్పుడు ఎందరో అమెరికన్ ఫ్రెండ్స్ ఇంటి పక్కనే, ఒక గుజరాతీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తాను కూడా దాదాపుగా మరచి పోయింది శ్వేతని, ఎందుకంటె ఇపుడు పక్కన ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్ ఎక్కువయి పోయారు, ఆకాష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ పిల్లలతో. బహుశా ఆకాష్ కి ర్యాంకు ఎంత వచ్చింది అని ఫోన్ చేసినట్టుంది.
“హలో రాధికా ” అని అనగానే తన జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి “హలో.. ఆ చెప్పు శ్వేతా” ఏ మాత్రం ఉత్సాహం లేదు ఆ పలకరింపులో.
” వరుణ్ గానీ మీ ఇంటికి వచ్చాడా?” స్కూల్ నుండి ఇంటికి రాలేదు, ఈ పాటికి రావలసింది!” శ్వేత గొంతులో కొంత ఆందోళన కనిపెట్టింది రాధిక.
“వరుణ్..మా ఇంటికా? కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అంది రాధిక.
“వరుణ్ మా ఇంటికి ఇంత వరకు ఎప్పుడూ రాలేదు ఆ రోజు మీతో తప్ప, ఇంతకు ఏం జరిగింది?” కొంత ఆతృత వ్యక్తం చేసింది రాధిక.
“నిన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, వాడికి హిస్టరీ అండ్ సైన్స్ లో ర్యాన్క్- బి వచ్చింది, అందుకని నేనే వాని పై కోపం చేశా! రాత్రి చాలా అప్సెట్ గా ఉన్నాడు, పొద్దున మామూలుగానే స్కూల్ కి వెళ్ళాడు, ఇప్పటికే రావాల్సింది ఇంకా రాలేదు, అందుకే కొంత కంగారుగా ఉంది”
“స్కూల్ కి ఫోన్ చేసారా.. ”
“ఎస్, అందరికీ ఫోన్ చేసాక చివరిగా ఆకాష్ తో ఏమన్నా వచ్చాడా అని ”
“లేదే, మరి పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా .. ?
“లేదు.. లేదు.. నేను మల్లీ ఫోన్ చేస్తా, వేరే ఫోన్ వస్తుంది” ఫోన్ పెట్టేసింది శ్వేత .
రాధికకి కూడా చాలా కంగారుగా ఉంది, పిల్లలు ఎవరికీ అయినా పిల్లలే, ఆపద వచ్చింది అంటే తట్టుకునే రకం కాదు రాధిక . వెంటనే ప్రసాద్ కి ఫోన్ చేసింది, విషయమంతా చెప్పింది.
“ఓ అవునా, నేను ఆల్రెడీ బయలుదేరాను ఆఫీసు నుండి, డ్రైవ్ లో ఉన్నా, రాగానే వాళ్ళ ఇంటికి పోయివద్దాము, ఎందుకైనా మంచిది మరొక్క సారి స్కూల్ వద్ద చూడమను, లేదా నీవువెళ్లి చూడు” అని చెప్పి ఫోన్ కట్ చేసాడు. చాలా కంగారుపడ్డాడు ప్రసాద్, అయ్యో ఎక్కడికి పోయుంటాడో , ఏమయ్యుంటాడో అని ఆందోళనకు గురి అయ్యాడు. వాళ్ళు డిన్నర్ కి వచ్చిన రోజు గుర్తుకు వచ్చింది. వరుణ్ రూపం మనసులో మెదిలింది, ఆకాష్ తో కలసి ఆడుకోవడం, కొద్ది సేపు నవ్వుకోవడం అంతా గుర్తుకు వచ్చింది. చూసింది ఒక్కసారే అయినా బాగానే గుర్తుంది. వాళ్ళు డిన్నర్ కి వచ్చిన తర్వాత, వాడి తల్లితండ్రులు వాడి చదువు కోసం పడుతున్న ఆరాటం, తనూ రాధిక చాలా సేపే డిస్కస్ చేసారు కాబట్టి అంత ఈజీ గా మర్చిపోలేదు ప్రసాద్. అప్పుడప్పుడే చీకటి కమ్ముకో బోతుంది, వీపు పై పెద్ద బ్యాక్ ప్యాక్ తో ఎవరో వ్యక్తి దూరంగా రోడ్డు పై నడుస్తుంటేనో సడెన్ గా స్లో చేసాడు తన కారుని. అసలే ఎముకలు కొరికే చలి, సాధారణంగా ఆ రోడ్ పై ఎవ్వరూ నడవరు, అది లోకల్ హైవే! ఎవరో హోమ్లెస్ మనిషి, లేదా కారు రిపేర్ అయినా వచ్చి ఉంటుంది అనుకున్నాడు. కారు ఆవ్యక్తిని సమీపిస్తున్న కొద్దీ మరింత పరిశీలనగా చూసాడు. ఎక్కడో చూసినట్టు కొంచెం తెలిసిన ఫేసులా ఉంది. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు, ఎవరో కాదు వాడు వరుణ్! ఏమాత్రం ఆలస్యం చేయకుండా సడెన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక నుండి చాలా హారన్ లు మోగాయి. అదేమీ పట్టించుకోకుండా వెంటనే హజార్డ్ లైట్స్ వేసుకొని షోల్డర్ పై ఆపాడు. వాడి కోసం అక్కడ అందరూ కంగారు పడుతుంటే వీడు మాత్రం ఇక్కడ ఇలా! చాలా కోపం వచ్చింది. కారు దిగి నడుస్తుంటే ప్రసాద్ ని చూసి గుర్తుపట్టి ఊహించని ఈ పరిణామానికి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ ప్రసాద్ పరుగెత్తి బలవంతంగా పట్టుకున్నాడు. “యువర్ మమ్మీ టోల్డ్ ఎవ్రీథింగ్, అల్లరి చేస్తే పోలీసులని పిలుస్తా” అని ప్రసాద్ అనడంతో సైలెంట్ గా వచ్చి కార్లో వెనుక సీట్లో కూర్చున్నాడు.
” ఎక్కడికి వెళ్తున్నావ్ అని” కార్ డోర్స్ అన్ని లాక్ చేసి కారు స్టార్ట్ చేసి అడిగాడు. సమాధానం రాక పోయేసరికి వెనక్కి తిరిగి చూసాడు, తనంతలో తానే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చాలా బాధ కలిగింది, వెంటనే వాడిపై జాలి కలిగింది. వెంటనే కారును సైడ్ లో ఆపి, వెనుక వరుణ్ పక్క సీట్లో కూర్చుండి దగ్గరికి తీసుకున్నాడు.
“వరుణ్ ఇట్స్ ఓకే, డోన్ట్ వర్రీ! వేర్ అర్ యు గోయింగ్?” ఓదార్చినట్టు అడుగుతున్నాడు ప్రసాద్ వరుణ్ వీపుపై నెమరుతూ!
” ఐ డోంట్ నో అంకుల్ ” ఏడుపు ను కంట్రోల్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది కంట్రోల్ కావడం లేదు.
తల్లితండ్రులు వాడి సామర్థ్యానికి మించి పెంచుకున్నఆశలు, ఆ వత్తిడిని తట్టుకోలేని, వాళ్లకు చెప్పలేక, ఎవరికీ చెప్పుకోవాలో కూడా తెలియక వాడుపడ్డ మానసిక ఘర్షణ, వేదన అంతా ఒక్క సారి ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది. గట్టిగా ప్రసాద్ ని పట్టుకుని ఏడ్చేశాడు.
ప్రసాద్ చలించి పోయాడు వాడి ఏడుపును చూడలేక. ఏమిటో ఈ బంధం? పెద్దగా కలిసింది లేదు, వాడితో అంత పరిచయం లేదు, వాడితో ఎలాంటి అనుబంధం లేదు. తమ ఆనందాన్ని, సంతోషాన్ని అంతా చంపుకొని పిల్లవాడే లోకంగా జీవిస్తూ, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఆ తల్లి తండ్రులకన్నా తను ఈ రోజు ఎక్కువ అయిపోయాడు వాడికి. “విధి ఆడే వింత నాటకం” అని చాలా సార్లు విన్నాడు కానీ అది ప్రత్యక్షంగా ఈ రోజు చూస్తున్నాడు. ఆ చిన్నారి మానసిక వేదన తీర్చుకోవడానికి ఈ రోజు తన భుజం అండగా నిల్చింది, అంటే ఆ విధి ఈ విధంగా నా పై ఒక కొత్త బాధ్యత మోపిందన్న మాట. ఎన్నో ప్రశ్నలు తన మనసులో సుడులు తిరుగుతున్నాయి, వరుణ్ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. అసలు పొద్దటి నుండీ ఏమీ తిన్నట్లు లేడు. విషయం పూర్తిగా అర్థం అయ్యింది ప్రసాద్ కి. వెంటనే రాధికకి ఫోన్ చేసాడు, జరిగిన విషయం చెప్పి వరుణ్ తల్లి తండ్రులకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు.
కాంపిటిషన్ పేరు మీద, పక్కోడి పిల్లలకన్నా తమ పిల్లలకే ఎక్కువ మార్కులు రావాలి అనే అనవసరపు స్వార్థం. సో కాల్డ్ సొసైటీ స్టేటస్, అక్కరకురాని పోటీల వల్ల పిల్లల పై ఆ ప్రభావం ఎంత పడుతుందో, దాని వల్ల ఆ పసిహృదయాలు ఎంత గాయపడుతున్నాయో తెలుసుకోలేని తల్లి తండ్రుల అజ్ఞానం ముందు, చిదిమి వేయబడుతున్న బాల్యం! పిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా, వారి సామర్థ్యాలను అంచనావేయకుండా, వ్యక్తిత్వ వికాసం అనేది లేకుండా, ఎంత సేపు ఆ చిన్ని మెదడు అంత పెద్ద భారాన్ని మోస్తుంది? ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది, పిల్లలపై అనవసరపు వత్తిడి పెడితే అది ఎక్కడికి దారి తీస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. రాధిక అనుకున్నట్టుగా ఆకాష్ ని ఏవేవో క్లాసులకి పంపలేదు అనే గిల్టీ ఫీలింగ్ కి సమాధానం దొరికింది అనిపించింది.
కారు నడుపుతున్నాడే కానీ మనసు మాత్రం అంతకన్నా వేగంగా పరుగెడుతుంది. వరుణ్ తల్లి తండ్రులపై చాల కోపం వచ్చింది. అణచి వేయబడుతున్న బాల్యం, ఈ రోజు తన కార్లో ఒక జడ పదార్థంగా! ఏమి చేస్తున్నాడో తెలుసుకోలేని పరిస్థితిలో, ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో! తన కంటికి వాడు కనపడకుంటే ఈరోజు వాడి పరిస్థితి ఏంటి? దురదృష్ట వశాత్తు వాడికి ఏదన్నా జరగరానిది జరిగితే? అసలు ఏం చేసుకోబోతున్నాడు ఆ బ్రిడ్జి పైన? ఏ సంఘ విద్రోహ శక్తి చేతికి దొరికినా, పిల్లవాడే లోకంగా ఉన్న ఆ తల్లి తండ్రుల వేదన ఎలా ఉండేది? ఒళ్ళు గగుర్పొడిచింది ఆలోచిస్తుంటే!
ఎంత అడిగినా వాడి ఉద్దేశం ఏమిటో ఒక్క మాట కూడా చెప్పలేక పోయాడు ఏడ్వడం తప్ప! ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది, “ఓం” అన్న పదానికి ఎన్ని అర్థాలున్నాయో తెలియదు కానీ, ఈ రోజూ ఆ పిల్లవాడి ఏడుపుకి ఎన్నో అర్థాలు తెలిసాయి. అది గమ్యం లేని పయనం, దశా దిశా లేకుండా… కనీసం వీకెండ్ ఒక్క రోజు అయినా కంటినిండా నిద్ర కోసం! ఆడు కోవడానికి ఒక తోడుకోసం! అలుపెరుగని మస్తిష్కానికి కొంత విశ్రాంతిని వెతుకుతూ…ఎక్కడికో పారిపోవాలి.. ఇష్టం లేని కోర్సులనుండి దూరంగా…తల్లి తండ్రులకి దూరంగా, చివరికి…. ఈ మనుషులకి దూరంగా!
చాలా బాగుంది వేణు గారు. ఈ కథ ఇండియాలో వున్న పేరెంట్స్ కి కూడా వర్తిస్తుంది
మూర్తి గారు, కథ నచ్చినందుకు ధన్యవాదములు. కథలో పేర్లు , ప్రదేశాలు అన్ని కల్పితాలు, ఇండియా లోనా , అమెరికాలోనా అని కాదండీ , ముందు పేరెంట్స్ మారాలి ఈ గ్లోబ్ పైన ఎక్కడున్నా!
ఈ పరిస్థితి ఇండియాలోనే అధికంగా ఉంది. తల్లిదండ్రులు తమ కన్నా తమ పిల్లల కేరీర్ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
అక్కడా అదే పరిస్థితి ఉందన్నమాట.
కథ పెద్దగా ఉన్నా ఓ మంచి చర్చను ముందుంచారు. వేణు అన్నా …. అభినందనలు
చందు, కథ చదివి విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు! కనీసం ఒక్క పేరెంట్ అయినా మారక పోతాడా అన్న ఆశ !
తల్లిదండ్రుల అత్యాశ, పిల్లల జీవితాలని ఎలా నరకప్రాయం చేస్తున్నదో బాగా వివరించారు.
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా … అన్నట్లు ఈ రోగం మన భారతీయుల్లోనేనా లేక అందరి వలసవాసుల్లోనూనా అనేది ప్రశ్న.
ప్రసాద్ గారు, కథ చదివి విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు!
ఇది సెప్టెంబర్ 25, 2013 నవ్య వారపత్రికలో వఛ్చిన నా కథ “ఇట్ టేక్స్ ఏ విలేజ్” కథని గుర్తుకు తెచ్చింది. ఆ కథ “విదేశ గమనే” సంకలనంలో చేర్చబడింది. అమెరికా నేపధ్యమే అయినా, పాత్రలు, సందేశము వేరు.
శర్మగారు , మీ కథ బాగుంది.. స్టోరీ థీమ్ ఒకటే అయినా ఎగ్జిక్యూషన్ లో చాలా తేడా ఉంది. వనజ తాతినేని గారు అన్నట్లు ముగింపు ఇంతకన్నా వేరే విధంగా చెప్పలేము. కథ నాతో పంచుకున్నందుకు ధన్యవాదములు.
Excellent article sir.
Excellent article sir…
గుడ్ story వేణు గారు.