ఎంత తాజాగా వచ్చావో
అంతే తాజాగా వెళ్ళాలి
రావడానికి వెళ్ళడానికీ మధ్య
ఆ తాజాదనాన్ని కాపాడుకోడానికి
సాగించే యత్నమే జీవితం
ఆర్ఫలీస్ ని వదిలి
ఆల్ ముస్తఫా వెళ్ళినట్టు వెళ్ళాలి
పక్షులు..పువ్వులు..కుక్కపిల్లలు
నీ కాళ్ళు చుట్టుకుని భోరుమంటాయి
నీ కన్నీళ్ళతో
చివరిసారి వాటికి స్నానం చేయించి
తృప్తిగా ఊపిరి పీల్చుకోవాలి
పర్వాలేదు
వెళ్ళడానికి నేను అర్హుడనే అనుకుంటూ
ఎదురుపడ్డ పర్వతాలను..నదులనూ
చేతులతో తడిమి పలకరిస్తూ
హాయిగా నీ పడవో రైలో విమానమో ఎక్కేయాలి
నీ ఇష్టమొచ్చినట్టు వెళ్ళిపోతానంటే కాదు
నీకు అశ్రుపూలతో అభిషేకం చేయించి
నిన్ను ఈ సమస్త ప్రకృతి నెత్తిమీద పెట్టుకుని
నీ వాహనం దగ్గరకు ఉత్సవంగా మోసుకుని వెళ్ళాలి
ఈ కడసారి వేడుక కోసమే
కడదాకా వేడుకగా బతకాలి
అప్పుడు అనంతమైన నీ మౌనం
భూమికీ ఆకాశానికీ మధ్య
ఎన్నటికీ కరగని మంచు బిందువై ఎర్రగా వేలాడుతుంది
*
2
ఎందుకు ?
ఈ నిద్ర అంత భద్రంగా లేదు
ఇది నిద్రలాంటి జీవితం వంటి చిట్లిన చీకటిలోంచి
బొట్లు బొట్లు నిశ్శబ్దం
చూస్తుండగానే సూర్యుడు భుజాల మీంచి జారిపోతాడు
గోడ మీంచి జలపాతం రాలిపోయినట్టు-
ఎక్కడో అడవిలో చావు కేక-
నేనొక్కడినే కదా కొడుకుని
మరి ఊళ్లో అమ్మకెందుకు పీడకల?
నాకేం సంబంధం ?
రాత్రి సెలయేటిలో మునిగిపోయిన పడవతో
అంతయెత్తునుంచి లోకాన్ని కళ్ళారా చూసి
లోయల్లోకి దూకేసిన చందమామతో
చుక్కల్ని కక్కుతూ తల వాల్చిన పాటతో?
ఒక దృశ్యం ముక్కలై ఐసు ముక్కలవుతోందే
ఒక ఖాళీ గ్లాసు..నేను-
తాడు పట్టుకు వేలాడుతూ నా టేబుల్ మీదకి దిగిన ఆకాశం-
నా ఎదురుగా కుర్చీలో తూలుతున్న కల-
మరి నా మత్తిల్లిన అరికాలి కింద
అడవి ఎందుకు పిల్లి పిల్లలా చల్లగా ?
ఏమోరా కన్నా
ఈ నిరపేక్ష నిరామయ క్షణాలు కూడా అంత హాయిగా లేవు
నాకూ ఈ దు:ఖానికీ మధ్య
ఈ విరామం లేని యుద్ధం ఎందుకో?
*
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
మంచి కవితలు సార్,మాములు మాటలను శక్తి వంతం చేయడం మీ కవితా రహస్యం.
మంచి కవితలు సార్,మాములు మాటలను శక్తి వంతం చేయడం మీ కవితా రహస్యం
నా కూ దుఖానికీ మధ్య ఈ విరామం లే నీ యుద్ధం ఎందుకో….ఈ నిద్ర అంతా భద్రంగా లేదు….
‘ఈ కడసారి వేడుక కోసమే
కడదాకా వేడుకగా బతకాలి..’
వ్యంగ్యంగా చాలా మంది బ్రతుకుల్ని quote చేసి మాట్లాడుతుంటారు…అట్లాంటి వాళ్లకు ఈ వాక్యాలు నిజజీవిత సత్యాన్ని బోధిస్తున్నట్లుంది సార్….
‘నాకూ ఈ దు:ఖానికీ మధ్య
ఈ విరామం లేని యుద్ధం ఎందుకో?’.
లైఫ్ ఈజ్ నో మోర్ ఛీజ్…ఇట్స్ బిట్టర్ మిలాన్
“ఈ కడసారి వేడుక కోసమే
కడదాకా వేడుకగా బతకాలి”
“నాకూ ఈ దుఃఖానికీ మధ్య
ఈ విరామం లేని యుద్ధం ఎందుకో.”
____రెండు వళ్లు జలదరించే కవితలు.
“మరి నా మత్తిల్లిన అరికాలి కింద అడవి ఎందుకు పిల్లి పిల్లలా చల్లగా ?” అద్భుతమైన మాటలు.