ఎందుకు మళ్లీ తిరిగొస్తారు
కలల్లోకి?
కలల కలకలంలోకి?
చెరువు నీటిలో గులకరాయిలా
మునిగిపోయిన వాళ్లు
వాడిన పూలై జలజలా రాలిపోయిన వాళ్లు
కొండమీది సెలయేరులా
సరసరా కిందకి దూకి
చల్లగా ఇంకిపోయిన వాళ్లు
గోడమీద పటాలైన వాళ్లు
వదలని జ్ఞాపకంలా సెలేసే వాళ్లు
ఎందుకు మళ్లీ తిరిగొస్తారు
స్వప్నలోకంలోకి?
ఎప్పుడూ పలకరించే వాళ్లు
చిలిపి మాటల్నీ చిరునవ్వుల్నీ చిందించిన వాళ్లు
వాక్యాన్ని వడిసెల రాయిలా విసిరి కొట్టిన వాళ్లు
తమకంగా కావిలించుకొనే వాళ్లు
ఇప్పుడే వస్తానని మాయమైన వాళ్లు
కని పెంచిన వాళ్లు
అరిచేతిలో అన్నం ముద్ద తినిపించిన వాళ్లు
కంటికి రెప్పలా కాపాడిన వాళ్లు
మనసిచ్చి మరలిపోయిన వాళ్లు
మౌనంగా ఆరాధించిన వాళ్లు
మబ్బు మెట్ల మీదగా దిగుతున్నట్టు
మంచు మొయిళ్లై ఆవరించినట్టు
మల్లెతీగలా అల్లుకొన్నట్టు
పొన్నాయి పూతావిలా కమ్ముకొన్నట్టు
స్వరూపంగానో అరూపంగానో విరూపంగానో
ఎందుకు అడుగు పెడతారు
చేతనాచేతనంలోకి?
భూమ్మీద ఏ ముద్రా వెయ్యని వాళ్లు
చర్మాల్ని పాలరాతి గచ్చులా కాపాడుకొన్న వాళ్లు
తాకితే కందిపోయిన వాళ్లు
పొగడ్తల దండల్తో నిరంతరం ఊరేగిన వాళ్లు
పర్వత శిఖరంలా ప్రగల్భించిన వాళ్లు
పదఘట్టనతో నేలనీ నినాదంతో నింగినీ
దద్దరిల్లజేసిన వాళ్లు
ఎందుకు మళ్ళీ ఇలా?
తలపులూ వలపులూ ఇంకా తీరలేదని
చెప్పిపోటానికో
అదృశ్యలోకంలో సజీవంగానే ఉన్నామని చాటటానికో
మర్చిపోయిన వాళ్లని మర్చిపోవద్దని
గుర్తు చెయ్యటానికో
మనలో చెమ్మనీ వేడినీ ప్రోది చెయ్యటానికో
ఈ గట్టుకీ ఆ గట్టుకీ వంతెన వెయ్యటానికో
ఎందుకో
మరెందుకో
*
చిత్రం: బీబీజీ తిలక్
కవిత చాలా బాగుంది సర్.వైవిధ్యమైన వస్తవు.
చాలాకాలం తరువాత ఇలా మిమ్మల్ని చదవడం చాలా సంతోషం
వెళ్ళిపోయిన వాళ్ళు… మనం మర్చిపోయినా, మరువలేని పోయినా మళ్ళీ వస్తూనే వుంటారు – తలపుల్లోకి !
ఎంత భారాన్ని నింపుతోందీ కవిత!
శివశంకర్ కి అభినందనలు.
అద్భుతం 🙏