నువ్వు అట్లా పగిలిపోయినప్పుడు
ఆ విరిగిన ముక్కల్ని అతుక్కుని
మళ్లీ పక్షివై ఎగిరేందుకు నీకో ఆకాశం ఉందా?
వెళ్లేందుకు నీకో చోటుందా?
నువ్వు గుదిగుచ్చి ఒక హారంలా నిత్యం
నీ మెడన ధరించిన జ్ఞాపకాల మువ్వలను
ఇహ తెంపేసుకుని అట్లా దిగంబరమై తిరిగేందుకు ఒక చోటుందా?
నీ వెనుకో, ముందో
నీ బహిర్ అంతర్ లోకాలకు
సూదులు గుచ్చి, శల్య పరీక్ష చేసి
నువ్వు ఎటువంటి జీవివో తీర్పులు ప్రకటించని మనుషులు నీ కోసం ఉన్నారా?
వెళ్లేందుకు నీకో చోటుందా?
ఇంత అన్నం పెట్టి, నీ మానాన నిన్ను
వదిలేసే మనుషులు
నవ్వుతూ పలకరించే, నిజంగా మాట్లాడే,
నీ మాటల్ని వినే మనుష్యులున్నరా?
నువ్వు వాళ్ళ
లావాదేవీలకు పనికిరాకున్నా
ఎందుకొచ్చావ్ ?
ఎప్పుడు పోతావు? అని అడగని ఒక తెరిచిన తలుపుల ఇల్లుందా?
ఎందుకింత దుఃఖం అని నిలదీసి
నిన్నే దోషిని చేయకుండా కన్నీళ్లు తుడిచే చేతులున్నాయా?
అరచేతుల గాయాలకి ఇంత లేపనం రాసి మృదువుగా నీ చేతుల్ని
తమ చేతుల్లోకి తీసుకునే వాళ్ళు
తలుపుల భారంతో కల్లోలమైన శిరస్సును కాసేపు వాల్చేందుకు ఏమీ ఆశించకుండా
తమ భుజం ఇచ్చే వాళ్ళు ఉన్నారా?
వెళ్లేందుకు ఒక చోటుందా?
నీ పరాజయ గాధల్ని నీతో పాటూ
కలిసి పాడేందుకు, ఆడేందుకు
నీకో అలల సంగీతపు సముద్రం ఉందా?
నీ అంతరాంతర లోకాల్లో
నువ్వు ఎన్నడూ వెల్లడించని
పొరలు పొరలుగా గడ్డకట్టి మంచు ఫలకాలై ఘనీభవించి నిన్ను కుంగదీసిన
సమస్త సంగతులన్నీ
అట్లా కరిగిపోయేలా చేసి
నువ్వు మళ్లీ నదివై ప్రవహించేందుకు
నీకో ఎడారి ఉందా?
వెళ్లేందుకు నీకో చోటుందా?
రాలిన ఎండుటాకులపై నడుస్తున్నప్పుడు
నీ పాదాలు చెప్పే ఆఖరి ప్రయాణ గాధలను
తెగనరికిన మహావృక్షాల నుండి
మళ్లీ మారాకు వేసి నవ్వే
చిగురుటాకులు చెప్పే జీవరహస్యాన్ని తెలుసుకునేందుకు
వెళ్లేందుకు నీకో అరణ్యం ఉందా?
మనసు చెదిరి, గాయపడ్డ సమయాల్లోనో
ఆగ్రహం, అసహనం ఆవరించిన వేళల్లోనో
ఎప్పుడో ఒకప్పుడు
గాలి ఎటైనా వీస్తుందన్న సత్యం
మరిచి నువ్వు మాట్లాడిన మాటలు
గాలి మాటలలై నీ పై స్వారీ చేసినప్పుడు
మలయ మారుతాల స్వాంతననిచ్చే చోటు ఒకటి ఎక్కడైనా ఉందా?
వెళ్లేందుకు ఒక చోటు
వేల సార్లు మనం మరణించినా
వేల సార్లు మనం ముక్కలైనా
వేల సార్లు మన కలలు భగ్నమైనా
వేల సార్లు మనిషి పై విశ్వాసాన్ని కోల్పోయినా
మళ్లీ మనల్ని మనం కూడాదీసుకుని
పునర్జననం పొందే చోటు ఒకటి ఉందా?
ఒక కెరటాల కడలో
ఒక ప్రవహించే నదో
ఒక వెన్నెలాకాశమో
ఒక సతతారణ్యమో
ఒక రెల్లుపూల మైదానమో
ఒక మనిషో…
వెళ్లేందుకు ఒకచోటు ఉందా ?
*
Excellent
చోటు వున్నా దొరకని సంఘం
ఒక కెరటాల కడలో
ఒక ప్రవహించే నదో
ఒక వెన్నెలాకాశమో
ఒక సతతారణ్యమో
ఒక రెల్లుపూల మైదానమో
ఒక మనిషో…
వెళ్లేందుకు ఒకచోటు ఉందా ?
చాలా అర్ధవంతం గా రసారు
*
అద్భుతమైన కవిత. విమలక్క మాత్రమే రాయగలిగిన కవిత.