రేగిపళ్ళ పరిమళం తాకగానే పొలిమేర తోటలో బంతిపూలు నిద్రలేచాయి. పైరు పొలాల్లో విహ్వలంగా ఊగిపోతూ వరికంకులు. పెరటి గుమ్మంలో మసక మసక మాటలు చలిమంటలేస్తున్నాయి. మోహంతో అగ్నికీలల్లో దూకి ఆవిరైపోయే మంచుపూలు. చిట్టచివరి వెన్నెలరేఖ గడ్డివాము పైనుంచి జారిపడి ఝాము సేపు గడిచిపోయింది. నేను మాత్రం తెరిచి ఉన్న తూర్పు వాకిట్లో ఇంకా కళ్ళు నులుముకుంటూనే ఉన్నాను. వెళ్లిపోవాలి నన్ను దాటుకుని నేను, ఈ ఎదురుచూపుని దాటి, విడిచీ విడవని ఈ చిక్కటి తమస్సు నీడలని దాటి…
****
ఇత్తడి తాపడపు గోడలు, నునుపు తేలిన రాతి స్తంభపు మొనలు. ఈ ప్రదేశం నా పూర్వీకుల కథల్లో పురాగానం చెయ్యబడ్డ జ్ఞాపకం నాతోపాటే నడుస్తుంది. ఎక్కడ పాదం మోపినా, అరచేయి ఏ చోటుని తాకినా నన్ను నేనే ఆక్రమించుకుంటున్న ఏకత్వ భావన. నా తోటి మనుషులు ఎందరెందరో వేడుకుని, మొక్కుకుని ముడుపులు కట్టుకుని, వేరే దారిలేదని శరణుకోరి, ఇదొక్కటే దారని స్థిరచిత్తంతో నమ్ముకుని, ఒక్క ఘంటానాదంలో ఇహాన్ని అర్పించుకున్న స్థలంలో ప్రవాసినై సంచరిస్తూ నేను. ఈరోజుకి ఈకొన్ని క్షణాలైనా నాకంటే మహత్తరమైనది మరేదో ఉందనో, ఉంటే బాగుండుననో ఊహ.
***
పచ్చిపాలమీద కుంకుమ చల్లినట్టు సాయంత్రపు ఆకాశం.
శూన్యంలో విచ్చుకుని పదార్థం లోకి ముడుచుకుని సుప్త చైతన్యంలోకి అంతమయ్యే సృష్టి సంగీతం. రావిచెట్ల ఆకుల మీద మునివేళ్లతో దరువేసే సందెగాలి నేపథ్యం.
ముగ్గులో రంగులు దిద్దే లేత ఈడు పిల్ల చెంపల్లో రాత్రి పగిలి రంగులు చిప్పిల్లుతుంది. నానుంచి నీకు ఒక్క చూపు చేరేలోపు కాంతియుగాలకి అర్థం మారిపోయింది.
***
నిద్రకి ఉపక్రమిస్తూ ఒక్కో మట్టిగాజునీ తీసి అగరొత్తుల పొడి రాలిన బల్లమీద పేర్చాను. నేతి దీపపు కాంతిలో వాటి మిలమిలలు దిక్కులని చీల్చేశాయి. ఉత్తరం దిశగా నీ రథం ప్రయాణమై పోతుందనే కబురు మంచుపల్లకీలో నన్ను చేరింది.
**
ప్రతి పదం, వాక్యం ముఖ్యం గా ప్రతి సారూప్యం కళ్ళ ముందు సాక్షాత్కరించిన అత్యద్భుత దృశ్య కావ్యం . మళ్ళీ మళ్ళీ చదవాలనే తనివి తీరని హాయి. వేసవితాపం లో దక్షిణం నుంచి వీచే చల్ల గాలి భావన కలిగింది.
చదువుతుంటే ఏన్నో మంచి అనుభూతులు మీ అక్షరాలతో..చాలాబాగుంది.. ధన్యవాదాలు
సంక్రాతి పండగ అవుతూ ఉంటె రధం ముగ్గు పెడుతున్నప్పుడు నా జీవన రధాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించు స్వామి అనిపిస్తుంది..మీరు అలాంటి భావాల కంటే ఉన్నతమైన “నన్ను నేనే దాటడం’ గురించి ముగ్ధం గా చెప్పారు. నిజమే నాకు నేనే కదా అడ్డు!
మధురమనోహరం.