చీకటిలోనే ఉన్నావా
అవుననే అనిపిస్తోంది
ఎటు చూసినా నలుపు తప్ప ఏముందని
స్పష్టత లేని ప్రతికోణమూ చీకటేగా
గూడుకట్టుకున్న భారాల నుంచి
మనసుకు తాత్కాలిక ముక్తిని రుచి చూపేందుకు
కోశిష్ చేస్తావా
వెనువెంటే ఎన్నో ప్రశ్నలు నీపై వేలెత్తుతాయి
జవాబులు తయార్ గా ఉండాలి
నచ్చని ఏ ఒక్క నోరు మెటికలు విరిచినా
అక్కడికక్కడే
హత్యకు గురవుతుంది నీ కోరిక
అందరి ఒప్పుకోళ్ళ మధ్య
నీ చిటికెన వేలు పట్టుకు నడిచే రక్షకుడితో
విహారానికి బయలుదేరినంతనే
ఆఖరు తమ్ముడి ఆంక్షలు
చెవుల్లో మార్మోగుతుండగా
ఆనందం ఆవిరి అయిపోతుంది
సాంత్వన కోసం పాకులాడిన మనసు
నిశ్శబ్దంగా ఉరేసుకుంటుంది
చితికిన ఆశలు వీధుల గుండా
సజీవంగా నడిచి వెళ్తున్నప్పుడు
కోల్పోయిన ఆనందపు తాలూకు
పశ్చాత్తాపం కళ్ళలోంచి ఉబికి వస్తుంటుంది
పోగొట్టుకున్నదేదో
జీన్స్ టీ షర్టుల దేహంతో విశ్వాసంగా
కదిలిపోతున్నప్పుడు
మనసు మూలల్లో మౌనంగా దాగిన ఆశ నిను ప్రశ్నిస్తుంది
ఈ వీధులేగా నీ వెన్ను నిటారు చేసేది అని
రంగురంగుల సీతాకోకచిలుకలు గుంపులుగా తుళ్ళుతూ
తారసపడి కనువిందు చేస్తున్నప్పుడు
నువ్వూ తప్పిపోయిన అదే సమూహపు
సీతాకోకవే కదా అని దిగులు వెంటాడుతుంటుంది
ఆనందపు అన్వేషణ
వెలుతురు వైపుకు తరుముతుంటే
పేరుకుపోయిన నియంత్రణలన్నింటినీ
ఒక్కసారిగా తెంపిపారేయాలనిపిస్తుంది కదూ
ఇప్పటికే ఆలస్యమైంది.
*
చిత్రం: పఠాన్ మస్తాన్ ఖాన్
Nice poem congratulations
Samajam pai visirina chernakola
బాగుంది