ఎన్నెన్ని జీవ నిర్జీవ రూపాల్లో
నిర్మలంగా వెలిగే రంగులివి?
ఏయే మార్మిక కణాల శాశ్వత విడిది ఇది?
ఒంటరిదంటూ ఏదీ లేని విశ్వంలో
ఇద్దరు మిత్రులు యిద్దులాడునట్టు
అటు ఇటు ఈదులాడే
ఈ చీకటి వెలుగులు అవిభాజ్యాలే కదా!
జీవం తనను గూర్చి తాను
ఎరుక తెలుసుకుంది ఎప్పుడు?
లక్షల ఏళ్లు గడిచి ఎన్నెన్నో రూపావతారాలు దాటి
మనిషిగా పరిణమించిన తరువాతే కదా!
అవిచ్ఛిన్న దృశ్య ప్రపంచాన్ని
అక్షరాల్లో చిత్రించడం ఎలా మొదలైంది?
చూపులకు ఆనే చిత్రమైన ఒడుపులతో
సిద్ధుడైన చిత్రకారుడెవరో
వణుకు లేకుండా తెంపు లేకుండా
కుడ్యాల మీద శిలల మీద నిబ్బరంగా
గీతలెన్నో గీసిన అభ్యాసంతోనే కదా!
రంగుల పళ్ళెం లాంటి జీవితం
చుక్కల ముగ్గులాంటి నేల చుట్టూ
హరివిల్లయి చుట్టుకుంది ఎందుకు?
సృజనోద్వేగానికి సుందర సంయోజనంతో
వర్ణ తాపడం చేయడానికే కదా!
గతితార్కిక అన్వేషణకు అందేవాటి కోసమో
ఇంద్రియాల గవేషణకు అందనివాటి కోసమో
ఇంత లోతైన శోధన ఎందుకని?
ప్రకృతి తన రహస్యాలెన్నిటినో
ఏ తెలియని అడ్డుతెరల చాటున ఎలా
దాచుకుంటుందో తెలుసుకోవడానికీ..
కన్నదీ విన్నదీ కలగన్నదీ కనుగొన్నదీ
హృదయాంతరాళాల్లోకి తర్జుమా చేసి
కాలం కనబోయే కొత్త బంధాల చేతికి
అందించడానికే కదా!
నిసర్గ జీవితానుభవం కోసం
ఏ విహార యాత్ర సాయపడుతుంది?
సుదూర యానానికి తగినంత సత్తువ
ఏ జీవి ఆయుః ప్రమాణంలోనూ లేదు
లోపలి నుండి చేయందించనిదే
స్థల కాలాలకు బయటి బలం ఏదీ చాలదు కదా!
ఆత్మావలోకనమే అనుభావ కేంద్రకం!
మతాల సరిహద్దు రేఖల నిర్జల జలధి దాటి
అంతః సీమల సర్పిలం లోపలికి చూస్తే
ప్రకాశమానమైన ఒక దారి ఎదురవుతుంది
అక్కడే ఆ వెలుతురు తెర మీద
మనిషి విశ్వరూపం స్పష్టంగా కనబడుతుంది.
*
Add comment