“సర్ర్… ర్ర్… ర్ర్…’మంటూ పక్క నుంచి కారు దూసుకు పోవడంతో చేతిలో మునకాలకర్ర తుప్పల్లో పడిపోయింది. గతుక్కుమన్నాడు గుంపన్న పడాల్. తూలి పడబోయేడు ముందుకు. “ఒరే! నీ…” ఒక బూతు వదిలి నిలబడేలోగ కారు కొండెక్కిపోయింది.
ఎదురుగా విశాలమైన తార్రోడ్డు… మలుపు తీసుకుని కొండ మీద కి మాయమైపోతూ. మలుపులో మామిడి చెట్టు. చెట్టు కింద పాటేదో పాడుకుంటూ పారుతోంది గెడ్డ.
రోడ్డు కానుకుని సేఫ్టీ వాల్… నడిచి వెళ్ళగల వెడల్పుతో సిమెంట్ దారిలా. దాని మీద నిల్చొని సెల్ఫీ లు తీసుకుంటున్నారు కొందరు యువతీ యువకులు. ఆ పక్కనే నీడలో వాళ్ళ కార్లు. అక్కడి నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఆకాశాన్నందుకోవచ్చన్నట్టనిపిస్
తుప్పల్లో పడిపోయిన మునకాల కర్రని తీసుకుని రోడ్డు ఎక్కేడు గుంపన్న పడాల్.
రోడ్డు…!
అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు పోయేంత వెడల్పుగా!
నల్లగా… విశాలంగా!
రోడ్డు…!
కొండని అల్లుకున్న అనకొండలా!
ఒకప్పుడీ రోడ్డు ఇంత వెడల్పుగా లేదు, సన్నని గోర్జి!. పక్కనే తన పోడు. పోడు మధ్యలో కొమ్మల మీద అరప (మంచె) … తన కలల కుందిరి! దాని కింద చలిమంట… రాత్రి చీకటితోనూ, పగలు పొగతోనూ దోబూచులాడుతూ. ఏ వెన్నల వేళకోగాని అలుపు తీర్చుకోని తుడుం కుండ… మంచె రాటకి వేలాడుతూ. పెణక్కి దోపిన పిన్ల కర్ర కొత్త పాటని తలచుకుంటూ!
మనసు మూలిగింది మౌనంగా.
గతం కదలాడింది నిశ్శబ్దంగా!
తుడుం కుండ మోగుతోంది… లయబద్ధంగా! అది పోడు (కొండ మీద వ్యవసాయం) మీద మనుషులున్నారనడానికి సంకేతం. జంతువులకు ఒక హెచ్చరిక పంటకి కాపలా తానున్నాని.
దరువులు… వరస మారి మారి పలుకుతున్నాయి. పక్కనే చలి మంట ఏదో మాట్లాడుతోంది.
అది నాన్న నరికిన పోడు. ఇవ్వేళ తాను నిలబడ్డాడు దాని మీద. మరి రేపో?
అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టా ఇచ్చినోళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి కాదన్నారు. కొన్నాళ్ళు అది బాక్సైట్ తవ్వకాల తగువుల్లో నలిగి నలిగి ఆఖరికి తనది కానే కాదని తీర్మానించేరు. ఇప్పుడది… మైనింగ్ తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన రోడ్డు కింద నలిగిపోయింది… తన బతుకులా.
“ఈ నేల మాది…!
కొండ మాది!
అడవి మాది…
తవ్వొద్దు… తవ్వొద్దు… గనుల కొండని తవ్వొద్దు!
వదలండి… వదలండి మా బతుకులు మాకొదలండి!” నినాదాలు మిన్నంటుతున్నపుడు అల్లుడు ఇంటికి రాడం తగ్గించేసేడు. “ఎక్కాడికి పోయినాడు అల్లుడు?” అనడిగితే మౌనమే సమాధానమయ్యీది కొడలునుంచి.
ఎప్పుడడిగినా అటే చూపించేది. అటు చూస్తే జనం!
జనం!
ఎటు చూసినా జనం.
ఎక్కడ చూసినా జనం.
కొండ మీద జనం…! కొండ కింద జనం!
దారుల నిండా జనం! ఊరుల నిండా జనం!
అంతా ఒక నినాదమై.
అంతా ఒక లక్ష్యంలా!
నినాదాలు మిన్నంటినా… జనం సమూహమై రోడ్ల మీదకొచ్చినా… తవ్వకాలు ఆగలేదు. బాక్సైట్ కాదు లేటరైట్ అని… తవ్వుకు పోతూనే ఉన్నారు.
“ఎక్కాడికి పోయినాడు బాబు?” ఆ రోజు అడిగితే మౌనమే ఎదురయ్యింది గుంపయ్యకి కోడలి నుంచి. అది మొదలు… ఎక్కడున్నాడో తెలీక కొండల మీదే తిరిగాల్సి వచ్చింది.
అతడు జనమయ్యేడు. జనం అతని నినాదమయ్యేరు.
ఇప్పుడంతా నిశ్శబ్దం అలముకొని ఉంది.
ఈ నిశ్శబ్దం ఏ విస్పోటనానికి సంకేతమో!?
కొండ దిగి, ఊరు చేరేసరికి ఆ రోజు…!? ఎవరో తెల్లబట్టల్లో వచ్చిన కొత్త మనుషులు…! కూడా కొందరు అధికారులు కనిపించేరు. పక్కనే వాళ్ళు దిగొచ్చిన కారు కూడా తెల్లగా. కారుని చూడ్డం అదే మొదటి సారి. వీధి మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఊరి పెద్దలు మర్యాద చేస్తున్నారు. ఊరు ఊరంతా చుట్టూ నిలబడి ఉన్నారు.
”ఇక్కడ ఒక రిసార్ట్ కడుతున్నాం. గ్రామ సభ ఆమోదం కావాలి. మీరందరూ సంతకం చేస్తే…” ఆగేడు తెల్ల బట్టల్లో ఉన్న వ్యక్తి. అందరి వైపు మౌనంగా చూసేడు. మొదట్లో ఊరోళ్ళందరికీ ఏమీ అర్ధం కాలేదు. ఆ తర్వాత అర్ధమైంది ఊరు పక్కకి ఏదో నిర్మాణం కొత్తగా రాబోతోందని.
అందరూ ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. కళ్ళెగరేసి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అందరి ముఖాల్లో ఏమీ తెలియనితనం. సంతకాలు అడిగితే వేలిముద్రలేసేరు.
ఆ రోజు…? సంతకాలు చేసిన రోజు… చేతిలో రెండొందలు పెట్టేరు. అంతే. ఆ తర్వాత తెలిసింది… ఆ నిర్మాణం తన పేరునే ఉందని. నడుపుతున్నది మాత్రం వాళ్ళు.
వాళ్ళు! ఎవరో కొత్త మనుషులు! మన వాళ్ళు కాని పరాయి వాళ్ళు!
వెదురు బద్దలతోనూ, దబ్బ గడ్డితోనూ పూర్తయింది నిర్మాణం. రోడ్డు మీద పోతున్న వాహనాలు ఆగడం మొదలయ్యింది. అక్కడే భోజనాలు చేయడం కూడా మొదలయ్యింది. అప్పుడే ఆ చుట్టుపక్కల మసాలా వాసనలు తేలియాడేవి. కొన్నాళ్ళకి దుర్వాసన మొదలయ్యింది అప్పుడే.
మరి కొన్నేళ్ళకి అది సిమెంట్ కట్టడంగా మారింది. విశాలమైన పార్కింగ్ ప్లేస్… ఖరీదైన ఫర్నిచర్ తో…! దుర్వాసన దరిచేరకుండా గదుల్లో పెర్ఫ్యూమ్ లు చల్లుకోవడం చూసింది అప్పుడే. కొత్త వాసన… కొండ మీద కొత్త సెంటు వాసన! దుర్వాసనలని దాచిపెట్టే కొత్త సుగంధం.
మాదనుకున్న కొండ క్రమక్రమంగా పరాయిదైపోయింది.
పోడు కొండ …!?
కంది చేనుతోబాటు అరటి, పశుపు, దుంపలు అంతరపంటగా పండించుకుంటున్న కొండ. నిత్యం తనకు తిండిపెట్టిన తల్లి. ఆ కొండ మీదే తన మంచె. పొద్దల్లా కొండ తుప్ప నరకడంలోనో, విత్తనమొయ్యడంలోనో, మొలకెత్తిన పంట కాపలా కాయడంలోనో గడిచిపోతే… రాత్రి మాత్రం తన తుడుం కుండ సాయముండేది. పిన్లకర్ర పెదాలమీద చేరితే తన తాత గుర్తొచ్చేవాడు, చలిమంట రూపంలో నిరంతరమూ మాట్లాడుతూ ఉండేవాడు.
చలిమంట ముందు తుడుం కొడుతుంటే ఆ దరువులకు అనుమంతులు (కోతులు) దూరంగా జరిగేవి. పిన్లకర్ర పాడుతుంటే జంతుభయముండేది కాదు.
కొండ మీద చీకటి చలిమంటకి చుట్టం.
నులివెచ్చని మంట ఎత్తురుతుంటే వెలుతురుతోబాటు చీకటి దూరం జరిగేది. పొగ కమ్మి మంట కునుకుతీస్తే… దొంగ కుందేలుపిల్లలా దరికొచ్చేది చీకటి. నల్ల చీకటి చలిలో జంతువులూ దోబూచులాడేవి. మంట అలికిడికి దూరం జరిగి నిశ్శబ్దం కోసం అనగాసీవి (ఎదురు చూసేవి). తుడుం పలికితే పారిపోయేవి కొండవతలకి. మంట నిదురపోతే పంట మీద పడీవి.
మంటకి మాట… కొండకి పాట… అద్దిన రోజులవి.
కొండ మీద నిశ్శబ్దం నిషేదం. నిదుర అర్ధ రహితం.
ఆదమరిస్తే పంట పాడైపోతుంది. నిదురపోతే కొండ కానిదైపోతుంది… ఆ యేడాది తిండి గగనమైపోతుంది. అది తనకీ జంతువులకీ మధ్య జరుగే బతుకు పోరాటం. కొండ వాటి హక్కు… శ్రమే తనకు దిక్కు! పోరు ఎలా సాగినా తనకీ… జంతుజాతికీ, చీకటికీ చలిమంటకీ, కొండకీ పచ్చదనానికీ… నింగికీ నేలకీ మధ్య ఏదో కనిపించని బంధం కొనసాగేది.
***
ఇప్పుడా కొండ లేదు. ఉన్నా తనది కాదు.
పోడు లేదు…
పోడు మీద పంట లేదు!
పంట కాపుకి చలిమంట లేదు. మంట వేడికి మాట్లాడే తుడుంకుండా లేదు.
పిన్లగర్రా లేదు…పెదాల ఊద పాటా లేదు.
”హేయ్! మామా! ఒక్కసారిట్లస్తవా?” అని వినపడితే అటు చూసేడు గుంపన్న. కారు జనం తమతో నిలబడమంటున్నారు సెల్ఫీ తీసుకోడానికి. గట్టు మీద కొన్ని కోతులు నిలబడి ఉన్నాయి. కార్లలో వచ్చిన వాళ్ళు వాటికి అరటి పళ్ళూ, తొక్కలు, సగం తిన్న తినుబండారాలు పెడుతున్నారు.
అవొకప్పుడు కొండ మీద పండిన పంటని హక్కుగా తినేవి. ఇప్పుడు… తిండి కోసం పర్యాటకుల కార్ల ముందు ఎంగిలి పళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయి.
గుండెల నిండా చీకటి!… నల్లని చీకటి!!
***
రోడ్డు మీంచి కార్లు వేగంగా మలుపు తిరిగి కొండ మీదకి సులభంగా చేరిపోతున్నాయి. పొద్దు నడి నెత్తికి చేరినా చెమట పట్టడం లేదు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించి అటునుంచటే వెళ్ళిపోతున్న మేఘాలు గాలిని వీయనివ్వడం లేదు.
ఉన్నట్టుండీ… గాలి స్వచ్చతను కోల్పోయి ఏదో దుర్వాసన! ముక్కుకి తువ్వలు గుడ్డ అడ్డం పెట్టుకుని ముందుకు నడిచేడు.
కుళ్ళిన వాసన…
చాపరాయి మీంచి …
పారుతున్న నీళ్ళ పక్కన…
ప్లాష్టిక్ వ్యర్ధాలు…
మద్యం సీసాలు…
సగం తిని పారేసిన బిర్యానీ పేకెట్లు!
అన్నీ కలిసి… కుళ్ళిన వాసన! రోడ్దు పక్కన తుప్పల లోపలి పొదల్లోంచి ఎక్కడ బడితే అక్కడ వాడేసిన కండోమ్ తొడుగులు!
గుండె దడ పెరిగింది. ఎందుకో భయమేసింది. వాటి వైపు చూడలేక ముఖం తిప్పేసుకున్నాడు గుంపన్న పడాల్.
దూరంగా సినిమా షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుంది… జనం పోగై ఉన్నారు. వొలిసి సేని రంగులో జనం మరకల్లా కనపడుతున్నారు ఇక్కడి నుంచి. అందం పేరుతో అందాన్ని పాడుచేయడం. లేనిదాన్ని ఉన్నట్టు చూపించడం…! ఉన్నదాన్ని కొత్తరంగు పూయడం…! అడవికి ఆకుపచ్చ రంగేస్తామనడం!!!
***
”ఇక్కడ నుంచి ‘వ్యూపాయింట్’ బాగుంది” అన్నాడారోజు తెల్లబట్టలేసుకుని వచ్చిన అధికారి. వూర్లో పెద్ద మనుషుల్ని కలవాలి అంటే తానూ అందరితో కలిసి ఇక్కడికొచ్చేడు.
ఆ రోజు…!
”బ్యూటిఫుల్! డెఫినెట్లీ ఇది ఊటీని మించిపోతుంది” అన్నాడు ’అయితే కొన్ని మార్పులు చెయ్యాలి’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు. అటూ ఇటు తిరిగి రాళ్ళ మీద కూర్చున్నాడు.
ఆ రాళ్ళు… తాను పేర్చినవి. వాటి మీద కూర్చుని పిట్టల్ని తోలేవాడు. అక్కడ కూర్చొనే తాను పోడు కాపలా కాసేవాడు. దిగువు చలిమంట పక్కన కూర్చొని పిన్లకర్ర పాటలతో రాత్రిని దాటేవాడు. తన మనవరాలు అప్పటికి ఐదేళ్ళ పిల్ల. కొత్తగా హాష్టల్ వచ్చిందని పక్క ఊర్లో చేర్పించేడు. హష్టల్ నుంచి ఇంటికొచ్చిన ప్రతిసారీ ఇక్కడికొచ్చేది. ఆకు డొప్పలు కుట్టి తల మీద టోపీలా పెట్టుకునేది. చిన్న చిన్న రాళ్ళను పేర్చి తన బడి భవనాలను తయారు చేసేది. తండ్రిలా ఆ రాళ్ళ మీద కూర్చొని పిట్టల్ని తోలడానికి కూర్చునేది. కానీ అవెన్ని కబుర్లు చెప్పేయో పిల్లతో..?!
ఈ రోజు?
రాళ్ళ స్థానంలో సిమెంట్ బెంచీ ఉంది. ఎదురుగా ఇనప రెయిలింగ్ ఏర్పాటు వుంది. దాని పక్కనే ”మోదుకొండమ్మ వ్యూపాయింట్” అనే బోర్డు ఉంది.
”తాతా! ఇవి ఏం పిక్కలు?” అడుగుతున్నారు కారు మనుషులు.
మనవరాలు చదువుకుని ఏదో ఉద్యోగంలో స్థిరపడుతుందని ఆశ. చదువు పూర్తి చేసింది గానీ “ఇప్పుడు ఉజ్జోగమంతే అంత సులువు కాదు తాతా’ అంది. ఎంత కష్టపడాలో ఉజ్జోగానికి? ఏం చేస్తుందో బతకడానికి?
“తాతా! నీకే” అని కేకేసిన వాళ్ళు పక్కనే ఉన్న కూల్ డ్రింకుల వైపు వెళ్ళిపోయేరు. అక్కడి నుంచి ఐస్ క్రీమ్ వైపు కదిలిపోయేరు. అడవిలోకి ఐస్ క్రీమొచ్చాక అడ్డపిక్కలు అసలు రుచిని కోల్పోయి చేదెక్కడం మొదలెట్టేయి.
”అడ్డ పిక్కలు… బాగుంతాయి తీసుకొండి సార్!” తాత కేక గాల్లో కలిసిపోయింది. రంగురంగుల ఐస్ క్రీమ్ బండి మీద అందమైన హీరోయిన్ నవ్వుతోంది ’రా రమ్మని’. ఆమె నవ్వు పక్కన తన అడ్డపిక్కలెవరు కొంటారు?
ఉదయం నుంచి అక్కడే కూర్చొని అమ్ముకుంటున్నాడు గుంపన్నపడాల్ అడ్డపిక్కల్ని. సొంత నేల మీద బతుకు లేకపోవడం… ఉన్న సరుకుల్ని అమ్మలేకపోవడం. షావుకారి తన సరుకుల్ని అమ్మడానికి ఎక్కడలేని కబుర్లూ చెప్పడం గుర్తొచ్చింది. తానలా మాట్లాడలేడు. తనకు తెలిసిందల్లా కష్టపడ్డం. మొక్క మొలిపించడం. దొరికింది తినడం. అంతే. వ్యాపారం చేయడం అంత సులువు కాదు. ఈ విషయం అర్ధమయ్యేసరికి అతని వయసు పడమటి కొండ మీదకి వాలిపోయింది… పొద్దు ములిగిపోయే సమయం ఆసన్నమైపోయింది.
ఒకప్పుడు మంచె మీద కూర్చొని రాజులా పంట కలలు కనేవాడు.
ఆ రోజు… తన కల, పంట చేతికందడం.
ఈ రోజు?
గుప్పెడు గింజలు అమ్ముడుపోవడం.
అప్పుడు తన వయసు… చెమట చిందిస్తూ కలలు కనడం.
ఇప్పుడు?
చితికిన కలల్ని రోడ్డు పక్కన ఆకు డొప్పల్లో గింజలు గింజలుగా అమ్ముకోవడం.
ఆనాటి తన కలల్ని చిదిమేసిందెవరు?
తననిలా రోడ్డుపక్కకి నెట్టేసిందెవరు?
కొండ మీద కుళ్ళుని నింపిందెవరు?
”ఇక్కడి నుండి బృందావన్ గార్డెన్, ఆదివాసీ మ్యూజియం ఎంత దూరముంటుంది?” పర్యాటకులెవరో ఆరా తీస్తున్నారు.
మ్యూజియం…!
తమ తాతల నాటి వస్తువులు, బట్టలూ, పని ముట్లూ… భద్రపరిచేరు.
తాతనీ, తండ్రినీ బొమ్మల్ని చేసి నిలబెట్టేరక్కడ.
రేపో మాపో… తననూ అక్కడ…!!???
”అక్కడ…” ఏదో చెప్పబోయేడు పడాల్. చెప్పేలోగానే దారి అడిగిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేరు.
చూపుడు వేలితో అటు చూపించిన గుంపయ్య వేలికి వేలాడుతూ ఒక వ్యర్ధ దారమేదో చుట్టుకుని కనపడింది. అక్కడ శుభ్రం చేస్తుండగా చేతుల్లో ఏదో చెత్త చేతికంటింది.
చేతుల నిండా దుర్వాసన!
దుర్వాసన!
ఇది ఎక్కడిది? ఎప్పుడు మొదలయ్యింది?
అది ఇక… ఊపిరి తీసుకోనిస్తుందా?
కొండ దారిలోంచి దిగి తార్రోడ్డెక్కిన డోలీ ఎదురయ్యింది. డోలీలో పిల్ల పురిటి నొప్పులు పడుతోంది. డోలీ దిగొచ్చిన దారి కొండ చెక్కిలి మీద తరాల దు:ఖానికి ఆనవాళ్ళ కన్నీటి దారలా… సన్నగా కనపడుతోంది.
అది…
రాళ్ళు నిండిన దారి…!
ఒక ప్రాణి నేల మీద పడుతుందో… నేల రాలుతుందో నిర్ణయించే రాళ్ళ దారి!
ఇది…
పోడు మింగిన దారి! బతుకు కూల్చిన దారి!
ఏ దారి ఎవరి కోసం? ఏది అవసరమైన దారి?
***
రోడ్డు పక్కన హోటల్ లో తన కోడలు పిల్ల గ్లాసులు కడిగి శుభ్రం చేస్తోంది. భుజమ్మీద ముడి కట్టుకున్న చీర తో రావద్దన్నాడు ఓనరు ఓ రోజు.
”ఏమి సారూ?” అనడిగింది.
”మన హోటల్ కి ఎలాంటోళ్ళొస్తరో తెల్సు గదా! ఇలాంటి చీరతో రావద్దు” అన్నాడు. ఇంటికొచ్చి ”ఈ పని కూడా లేకపోతే పిల్ల చదువెల్లా?” అని గడపలో ముంజూరు కింద కూర్చుండిపోయింది కోడలు.
ఆ రాత్రి… ఏడ్చింది.
హోటల్లో పని పోతున్నదని కాదు!
ఓనరడిగిన చీరకట్టు తనకు రాదని!!
ఆ రాతిరేళ కురిసింది వాన కాదు. ఆమె కళ్ళలోంచి జారింది కన్నీరూ కాదు.
చీకటి చినుకులతో… దిగులు వాన!
తన నేల మీద నుంచి తనను దూరం చేసిందెవరు?
తన ఒంటి మీద బట్టని మార్చినదెవరు?
తన నుంచి తనను మాయం చేసిందెవరు?
నల్లని వానేదో మీద కురుస్తున్నట్టనిపించింది గుంపన్న పడాల్ కి.
***
దూరంగా…
కొండ కింద … కొత్త రిసార్ట్ లో…
కొమ్ము బూర పలుకుతోంది. పర్యాటకులెవరో పెళ్ళి చేసుకుంటున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో. ఆమె కాటన్ చీరలో… అతడు చిలకట్టు బనియన్ తో.
థింసా బృందం ఒక చివర అడుగులేస్తోంది. మధ్యలో పర్యాటకుల చుట్టాలు చేతులు కలిపి ఆడుతున్నారు. ఆ జట్టులో తన మనవరాలుంది. రోజు కూలీ లెక్కన అక్కడ పని చేస్తోంది. అది ఐటీడీయే చేసిన ఏర్పాటు. అక్కడ అలా పని చేయడాన్ని ఉద్యోగ కల్పనలా చూపెడుతోంది సంస్థ.
పెళ్ళి… సంప్రదాయం… పర్యాటక ఈవెంట్ గా.
ఇప్పుడు తమలో లేని పెళ్ళి సంప్రదాయాన్ని ఇతరులకు చూపెట్టడం. ఇటీవలే ఐటీడీయే కొత్త రిసార్ట్ ని ఆరంభించింది. అందులో పర్యాటకులకు కొత్త అనుభవాన్ని పరిచయం చేయడానికి ఒక రోజు ప్రోగ్రామ్ గా ఈవెంట్ గా డిజైన్ చేసేరు. అదీ పోటీ తట్టుకోవడానికి. ముందుగా బుక్ చేసుకున్న పర్యాటకులకు గిరిజన సంప్రదాయ పద్ధతిలో అలంకరించి… గిరిజన ఆచారాన్ని పరిచయం చేయడానికి ఆరోజు గిరిజన సంప్రదాయ వివాహం చేస్తారు రిసార్ట్ లో. తుడుము డప్పుల వాద్యాలతో థింసా ఆడి అడవిలో పండిన గింజలతోనే వండిన భోజనాన్ని ఆ రోజు పర్యాటకులకు పెడతారు. ఒక రోజు ఆతిధ్యం… ఆదివాసీ పెళ్ళి జీవితం.
దీసరి కట్టిన ముహూర్తానికి ఎజ్జోడెదురుగా (ఎజ్జోడు = ఆదివాసీ గ్రామ పూజారి) కొండ దేవతల సాక్షిగా ఎత్తుకొచ్చిన అమ్మాయిని వివాహమాడడం… అదీ అమ్మాయి ఇష్టపడేంత వరకు ఆగి. ఇంటి ముంజూరు కింద… రోలు మీద అడుగేసి, రోకలి నిలబెట్టి దానికి కట్టిన పశువు కొమ్ముని పెళ్లి కూతురి మెడలో కట్టడం. ఒక రుపాయిని అమ్మాయి తరుపు వాళ్ళకి కన్యాశుల్కం గా చెల్లించి అందరి ఎదుట ప్రమాణం చేసి తాడు కట్టడం. మాట తప్పితే తప్పు కట్టడం.
ఇదంతా ఒకప్పటి వివాహ వేడుక! అదిప్పుడు వ్యాపారమై రిసార్టుల్లో ఈవెంట్ గా బతుకుతోంది. పెళ్ళి ప్రదర్శనా వస్తువు. తన ఆచారం వ్యాపారం ఇప్పుడు. వ్యాపారం చేస్తున్నదెవరు? అమ్ముడు పోతున్నదేది? లాభాలెవరికి పోతున్నట్టు?
ఆ పెళ్ళి పద్ధతి తమలో కూడా జరుపుకోవడం లేదిప్పుడు. అయినా ఆ పేరున బయటి వారికి పరిచయం చేసి డబ్బులు రాబట్టడం. ఆ రోజు మధ్యాహ్నం పెళ్ళి భోజనాలు ఆదివాసీ సంప్రదాయ ఆహార పంటలతో. నిజం చెప్పాలంటే ఆ పంటలేవీ? ఆ తిండి ఎవరు తింటున్నారు? చోళ్ళు, కొర్రలు, సామలు… ఏవి? ఎక్కడున్నాయా గింజలు?
తమ జీవితాల్లోంచి సంప్రదాయామనే సన్నివేశాల్ని తొలగించి ఇప్పుడు వాటినే ఈవెంట్ లు గానూ, ప్రదర్శనా వస్తువులుగానూ చూపించి డబ్బు చేసుకుంటున్నదెవరు?
చీకటి పడితే కొండ దిగి ఇల్లు చేరాడు పడాల్.
***
“ఎక్కాడికి వెళ్తివి?”
“ఈవెంట్ కి వెళ్ళి వస్తిని.”
కూతురు కూతురుతో మాట్లాడుతోంది. దీపం గోడ తో మాట్లాడుతున్నట్టుంది వాళ్ళిద్దరి సంభాషణ. దీపం వెలుగుతోంది కానీ సరిపడినంత వెలుగు లేదు గదిలో. గోడకి ఆనుకొని కట్టెల పొయ్యి. పక్కనే గేస్ సిలెండర్, స్టవ్వు నిశ్శబ్దంగా… మౌనంగా… మంటలేకుండా. మండుతున్న కట్టెల పొయ్యి మీద మాత్రం ఏదో ఉడుకుతోంది. పొయ్యి వెలుతురే గదిలో విస్తరిస్తోంది ఉడుకుతున్న అన్నం వాసనతో కలిసి. అక్కడే కూర్చున్న గుంపన్న చీకటితో మాట్లాడుతున్నట్టు మౌనంగా ఉన్నాడు.
అప్పుడే కరెంట్ ఆరింది. నాలుగిళ్ళకవతల సాగుతున్న సీరియల్ తెగిపోయింది. పైన మబ్బులేవో కమ్ముకున్నాయేమో… వీధిలో రాలుతున్న వెన్నెల రంగు మార్చుకుంది.
“రోజూ ఉంటదా ఈవెంటు?” తల్లి అడుగుతోంది… ఉడుకుతున్న అన్నాన్ని గరిటెతో కలుపుతూ.
“ఉండదా మరి?” సెల్ ఫోనులో ఏదో చూసుకుంటు సమాధానం చెప్తోంది సంధ్య. ఆమె ముఖం సెల్ ఫోన్ వెలుగులో స్పష్టంగా కనపడుతోంది.
“నిజ్జమేనా?” ముఖం తిప్పకుండానే అడిగింది కుసుమ తన కూతురుని.
“ఏటీవేళ కొత్తాగ అడుగుతుంటివి?” ముఖం పైకి ఎత్తకుండానే సమాధానం చెప్పింది.
బయట గుంపన్న నిశ్శబ్దంగ వింటున్నాడు. వీధిలో పిల్లలాడుకుంటున్న అలికిడి మాత్రమే వినపడుతోంది. ఇంత నిశ్శబ్దాన్ని ఎన్నాళ్ళ నుంచో అనుభవిస్తున్నాడు. అది గతంలో లేనిది.
తల్లి ఎందుకలా అడుగుతుందో… కూతురలా ఎందుకు సమాధానం చెబుతోందో తల్లీకూతుళ్ళకు తెలుసు, గుంపన్న పడాల్ కీ తెలుసు.
చీకటి…
ఇల్లంతా చీకటి.
చీకటి…వీధంతా.
చీకటి…ఊరంతా.
అడవి నిండా… చిక్కటి చీకటి!
నల్లటి చీకటి. కాటుకలా.
చీకటిని చీలుస్తూ మనవరాలి చేతిలో ఫోన్ మోగింది. సంధ్య ఎత్తడం లేదు. ఆ కాల్ ఎవరు చేస్తున్నారో తెలుసినట్టే ఉంది. సైలెంట్ చెయ్యడంతో అది చీకట్లో వెలుగుతూ పిలుస్తూనే ఉంది.
చాలాసేపయ్యాక ఫోన్ ఎత్తింది.
ఈ మధ్యనే కాలేజీ చదువులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చింది. ఈవెంట్ లలో ధింసా ఆటలో అడుగులేస్తోంది. రోజు కూలీ సంపాదించుకుంటోంది.
చీకట్లో మాట్లాడింది.
మొన్నటి సంత రోజున… చింత బొట్టలమ్మకానికి బుట్ట మొసుకుని వెళ్ళింది. చీపుళ్ళు కట్టింది. అమ్మకి నోరు తెరిచి అడిగిందేమో! లేవని చెప్పింది తల్లి.
ఈ చీకటి వెళ… ఆ ఫోన్ ఎత్తింది.
ఒక అనివార్య స్థితిలో కొండ మీద వెన్నెల తూరింది. సంధ్య బయటకు అడుగేసింది.
ఆమె నడిచిన దారిలో గుమ్మం బయట ఏదో పడినట్టైంది. లేచి చూసేడు గుంపన్న పడాల్. అది మెరుస్తోంది చీకట్లో. పచ్చని కొండమీద దుర్వాసన కనపడిన స్థలంలో కనపడిన పేకెట్ అది.
కొండ మీద చందమామ తూరింది గానీ అడవి మీద రాలుతున్నది మాత్రం చీకటే!
చీకటి అంటిన వెన్నల వెలుగుతూనే ఉన్నది కొండ మీద.
*** *** ***
Mitrama nice
ధన్యవాదాలు! మాష్టారూ!
చాలా అద్భుతం గా ఉంది సర్. మారిపొతున్న జీవితాలని,పక్కదారిపట్టిన జీవిత పోకడలని, మర్చిపొతున్న జీవిత ములాలని….అసలు పాడైపొయిన మనిషి జీవితాన్ని ఈ కథతొ కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ధన్యవాదాలు వెంకట్ గారూ!