ఈ సమస్య ఎలా తీరుతుంది! అని బాగా ఆలోచిస్తే శాంత కి గుర్తొచ్చిన పేరు సుశీలమ్మ. ఆ పేరు తలచుకోగానే ఎక్కడో చిన్న జంకు.
తన కన్నా చాలా పెద్దావిడే. ఏళ్లుగా చూస్తునే ఉన్నా ఆమెతో పెద్దగా మాట్లాడింది లేదు. నల్లగా జీవంలేని ముఖం, అంత ఆస్తి ఉన్నా పాత చీరతో ఎప్పుడూ ఆకాశంవైపు చూసే ఆమె తనకో మిస్టరీ. రెండిళ్ల అవతల ఉన్న ఆ ఇంటికి నెమ్మదిగా వెళ్లి బయట నుంచి తొంగి చూసింది. ఆమె లోపల చీకటి వంటగదిలో గోడ వైపు తిరిగి మాట్లాడుతోంది. బైట పిల్లలు అది చూసి పరిగెత్తారు.
‘ఈ సారి ఎవరి ఆత్మతో మాట్లాడుతుందో!’ అనుకుంది శాంత.
“చూడు, కళ్ళల్లో వత్తులు వేసుకుని, ఎటో చూస్తూ ఉంటివి, ఏదో కల కంటూ ఉంటివి. నువ్వు అడిగింది ఇస్తారా ఎవరైనా, ఆశ కాదు.. దురాశ కాదూ!”
మాటకు మాటకు పొంతన లేకుండా సాగుతుంది ఆమె ప్రేలాపన. చేతిమీద ఆమె తల్లిదండ్రుల పేర్లు, ఒక శిలువ గుర్తుతో పచ్చబొట్టు. అక్కడక్కడా తెల్లబడ్డా ఎర్రగా కనిపించే జుట్టు. సన్నగా సాదాగా ఉన్నా, కళ్లద్దాలు తీస్తే ఆమె కళ్ళు తీక్షణంగా ఉంటాయి.
కళ్ళు గట్టిగా మూసుకుని ఉన్న ఆమెని కదిలించింది శాంత “చిన్నమ్మా నీకేదో శక్తులున్నాయట కదా, మా వాడి వీసా పోయింది, ఎంత వెతికినా దొరకడం లేదు, కాస్త కనిపెట్టవూ?”
ఆమె నవ్వులో వైరాగ్యం వినపడింది. తిన్నగా శాంతతో నాలుగు ఇళ్ల అవతల ఉన్న ఆ ఇంటికి బయలుదేరింది.
“నిన్న ఆత్మలతో మీ మంతనాలు వల్ల ఇంట్లో బల్బులు పగిలిపోయాయట, నిజమేనా?” శాంత.
“అవన్నీ నాకు తెలేకుండానే జరుగుతాయి, ఐనా నీకెలా తెలుసు?” లో గొంతులో సుశీలమ్మ. ఆ మాట బావిలోంచి వినబడినట్టుంది.
“అదే ఎలక్ట్రిషన్ చెప్పాడు, వర్షం వల్ల షార్టేజ్ వచ్చిందన్నాడు. అతనికి తెలియదు కదా మీ సంగతి” శాంత నాలుక కరుచుకుంది.
“ఏం తెలీదూ?” గుర్రుమంది శబ్దం.
మాట ఆగింది. శాంత ఆరిన పెదవి మూసేసింది, తేమకోసం. ఇద్దరూ గేటు తీసి లోపలికి వెళ్లారు.
**************
ఇల్లంతా మాటలతో నిండిపోయింది. కాలనీలో అందరూ అక్కడే గుమికూడారు మరి. వాళ్ళల్లో చాలా మంది సుశీలమ్మ పుణ్యాన దెయ్యం వదిలించుకున్నోళ్ళు. కత్తెర మంత్రం వేయించి పోయిన సొమ్ము దొంగ నుంచి రాబట్టుకున్న వాళ్ళు. కొబ్బరినూనె ప్రార్థనలతో జ్వరాలు, తలనొప్పులు తగ్గించుకున్న వాళ్ళు. అంతా ఆమె చేసే మరో మిరాకిల్ కి సాక్షం గా నిలవడానికి వచ్చారు.
ఎవరు ఏ సమయంలో వెళ్లి పిలిచినా పలికే మనిషి సుశీలమ్మ, ఏ విషయానికైనా ముందుండే మనిషి, ఎప్పుడూ ఎవరో ఒకరు ఎదురుగా ఉంటారామెకి, ఆ నోరు టీవీలా మోగుతూనే ఉంటుంది. అంతమందిని ఎలా ఆకర్షిస్తోంది ఆమె, అని అబ్బురపడేది శాంత.
చాలా ఏళ్ళ క్రితం కొడుకు జస్వంత్ జ్వరానికి దిష్టి తీయిద్దామని వెళ్ళింది శాంత. అస్పష్టమైన అరుపులు గణ గణ మోగాయి. టీవీ లో బ్రదర్ అధ్బుత కుమార్ స్వస్థత కేకలు వినిపిస్తున్నాయి.
చుట్టూ వందలాది జనం మైకం. ఒంటరిగా చీకటిలో కేకలు పెట్టే ఆమెని చూసి గబుక్కున వెనక్కి తిరిగింది. పిలుస్తున్నా పలకకుండా వెళ్లిపోయింది. ఇక ఎప్పుడు ఆమెని కదిలించలేదు.
“ఏంటదీ” ధ్యానం నుంచి సుశీలమ్మ.
“వీసా”
“ఆ, ఏందీ?” జనం క్యాప్సికమ్ ఆకారం లా మొహం పెట్టారు.
“అదే… పాస్ బుక్కు లాగా ఉంటది, అమెరికా పోడానికి అది ఉండాలి” శాంత.
“అమెరికానా…!” చెవులు కొరుక్కుటున్నారు.
“పిల్లాడికి అమెరికా లో జాబు వచ్చింది. ఆ ఊరిపేరూ…”
“న్యూయార్క్” వెనకనుంచి అరిచాడు జస్వంత్. కాస్త మందం ఉన్నా అతను అమ్మ పోలికే. మొహం మాడ్చుకోని కూర్చున్నాడు.
“మరి ఈ సంగతి చెప్పనే లేదే, కృతజ్ఞత కూడిక పెట్టీ అందరికీ బోజనాలు పెట్టియ్యకా” పక్కింటి మార్తమ్మ.
“అసలే మన కాలనీ లో అమెరికా వెళ్లే తొలి మనిషి, ఎంత ఘనంగా ఉండాల, నీ తెలివి తక్కువతనం తో వాడి పాస్ బుక్కు పోగొట్టావా వదినా” ఎదురింటామే.
కొడుకు వింటున్నాడేమో అని మెల్లగా చూసింది, వింటాడుగా. కళ్ళు ఎర్రగా మారాయి.
“బుక్కు ఎక్కడ పెట్టావు?” సుశీలమ్మ.
“ఈ గూట్లో, కవర్లో పెట్టీ.. అ..క్క..డ పె..ట్టా” ఎడమ వైపు చెయ్యి చూపించింది. వాలూమ్ మెల్లిగా మ్యూట్ అయింది.
“బైబిల్ తీసుకురా”
“ఎందుకూ?” శాంత టక్కున తలెత్తి అంది.
“ఎందుకేందే, దేవుడి సాచ్చెం లేకుండా ఏ పని అయితది” సోఫా నుంచి లేచి చాప మీద కూర్చుంది సుశీలమ్మ.
“నేను ప్రార్థన చేసుకుంటాలే, నువ్వు ఎలాగో కానివ్వు,” శాంత.
“ఏంది? మా ఇంటికి వచ్చేవాల్లేవరూ లేరు. ఇది తేలాకే వెళ్తా, పో… తేపో” కిందకి మీదకి చూసి కసిరింది.
బైబిల్ టేబుల్ మీద పెట్టిందామె.
“కత్తెర?”
ఆమె కదల్లేదు, దాదాపు ఇరవై గొంతులు “కదలవమ్మా” కసిరాయి.
ఉలిక్కి పడింది, చెమటలు తుడుచుకుంటూ వెళ్లి కుట్టు మిషన్ కి ఉన్న కత్తెర తీసి అక్కడ పెట్టింది.
సుశీలమ్మ తల మీద కొంగు కప్పుకుంది.
కత్తెర మీద చెయ్యి పెట్టి అందరి మొహాల్లోకి పట్టి పట్టి చూసింది. అచ్చం లై డిటెక్టర్ లా. దొంగ మొహం తెలిసిపోతుంది ఆమెకి. ఈసారి తెలీలా.
సుశీలమ్మ మంద్రం గా ఏదో అంటోంది. తన గుండె చప్పుడు తప్ప శాంతకి ఇంకేం వినపడ లేదు.
కత్తెర బైబిల్ మీద పెట్టి ప్రార్థన చేస్తోంది, ఆ కత్తెర గిర్రున తిరిగి వస్తువు ఎక్కడ పోయిందొ అటువైపు కొన చూపిస్తుంది.
కాసేపు ప్రయత్నించింది, లాభంలేదు, తొలిసారి సుశీలమ్మ మంత్రం ఫెయిలవ్వడం, జస్వంత్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.
అందరి మొహాలు చూసి కళ్లు మూసుకుంది. జనానికీ షాక్, ఇంకా తేరుకోలేదు.
కాసేపు ఆలోచించి శాంతను కూర్చోమంది. ఆమెతో పాటు అందరూ కూర్చున్నారు. అది శనివారం ఉపవాస కూడిక లా ఉంది. జస్వంత్ విసుగ్గా మధ్యకి వచ్చి నిలబడ్డాడు. ఆ ప్రయత్నాలు అతను నమ్మకున్నా అవసరం కాబట్టి ఓ ఆశ.
“అసలు మీ ఇంట్లో ఇంత గందరగోళం ఎప్పుడూ చూళ్లేదే… నీ తీరు చూశాక నీకు ఈ పేరు పెట్టినట్టు ఉన్నారు. ఈరోజు చూసిన కోపం, విసుగు, చిరాకు నీలో ఎప్పుడూ చూళ్ళేదు” మాటల్లో పెట్టింది సుశీలమ్మ.
ఆ మాటకి అందరూ కొత్తగా పరికించి చూసారు శాంతను, ఆ పసుపు ఛాయ మాసిపోయినది అని చూస్తే తెలిసిపోతుంది. లోన వెలితి మాట్లాడితే తెలిసిపోతుంది. నిజమే కదా అనుకున్నా రు.
“జస్వంతు కూడా నీలా మౌనంగానే ఉంటాడు” సుశీలమ్మ
“మౌనంలోనూ రకాలుంటాయి, దానికి రంగులుంటాయి. వాడివి వయసుకు మించిన తెలివితేటలు?”
“ఏందే నేనొకటి మాట్లాడితే నువ్వొకటి మాట్లాడుతావు, అబ్బాయి బానే సంపాదిస్తున్నాడుగా, పాత ఇల్లు పడేసి త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాడుగా”
“ఆ.. నాకు ఆ ఇల్లే నచ్చింది, వాడిది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కదా, నచ్చింది చేస్తాడు, ఈ లోన్ ఇరవై ఏళ్ళు.. అంటే పోయేదాకా”
అమ్మ ఈమధ్య తన పనులు ఏమీ నచ్చలేదు, మారిపోయింది అని గ్రహింపు కొస్తున్నాడు జస్వంత్.
“నువ్వు అదృష్ట వంతురాలివి” జనం.
వాళ్ళ మాటలకి చిరాకు పోయి ఛాతీ ఉబ్బి నిలుచున్నాడు జస్వంత్.
సుశీలమ్మ “నువ్వు కొప్పడితే చూద్దామని నాకు ఎప్పటినుంచో ఆశ శాంతా..హా..హా..” అంతా నవ్వారు.
“ఇప్పుడు ప్రేమకీ కోపానికి ప్రతిఫలం ఒక్కటేలే”
ఆమెని నిమిషం పాటు చూసి”మళ్లీ వస్తా…” మొహం మాడ్చుకొని హడావుడిగా వెళ్లిపోయింది సుశీలమ్మ. అంతా ఆమె తీరుకి బిత్తరపోయి చూసారు.
ఒక్కొక్కరే ఇంటి దారి పట్టారు.
ఇంక తనకి తప్పదుగా “వీసా.. వీసా” జపం మొదలెట్టింది. ఇల్లంతా ఏడాది బిడ్డలా మోకాళ్ళమీద పాకుతుంది శాంత. నిమిష నిమిషానికీ కొడుకు మొహం కందిపోయింది. నడుము మీద చెయ్యి , కండరాలు జివ్వున లాగుతున్నాయి,
అమ్మ చెమట తుడుచుకొని బీరువాలో, మంచం కిందా, అటకమీదా చూసింది. పాత సామాన్ల మూటలో గాలిస్తోంది. అక్కడుండదని తెలిసినా, ఇల్లంతా పీకి పందిరి వేస్తోంది. ‘వీసా పిల్లాడి భవిష్యత్తు, దొరక్కపోతే ఏమిటి పరిస్తితి? ‘ ఆ చెమటలు మనసుని గడ్డ కట్టించాయి.
***************
“ఎక్కడికి పోతుందీ, ఇంట్లోనే ఉంటుంది సరిగ్గా చూడు శాంత” మర్నాడు పొద్దున అందరిదీ అదే మాట. అయినా నువ్వెప్పుడూ ఇంతే లే” పక్కింటి మార్తమ్మ.
“ఊరుకోవే నువ్వూ నీ పెడ సరం మాటలూ” సుశీలమ్మ ఎంట్రీ. అందరూ వందనాలు చెప్పి దారి ఇచ్చారు.
ఎదురుగా శాంత, జుట్టు రేగిపోయి ఉంది, కాస్త చెమట వాసన, ఇంటికి సూట్ కానీ పాత చీరతో.
“వాల్లన్నది నిజమే చిన్నమ్మా,
జస్వంత్ మూడో తరగతిలో అనుకుంటా బాంబే బజార్లో వాళ్ళ నాన్న తెచ్చిన ఎలక్ట్రానిక్ హెలికాప్టర్.. బటన్ నొక్కగానే రివ్వున ఎగురుతుంది, పిల్లమూక చప్పట్లలో. తిండీ తిప్పలు మానేసి రోజంతా ఆటపాటలే. ఒకరోజు ఆ హెలికాప్టర్ కనపడలేదు. రోజంతా వెదికి అలసిపోయి అప్పడు దొరికాడు నాకు, ఆరోజు స్నానం చేయించి, టైంకి తిండిపెట్టి నిద్రపుచ్చగలిగా. మర్నాడు హెలికాప్టర్ ని బీరువాలోని చీరలు మధ్యలో నుంచి తీసి టేబుల్ మీద పెట్టా. అది చూసి జశ్వంత్ కళ్లు జిగేల్మన్నాయని వేరే చెప్పాలా”
“భలే దానివే” అందరూ నవ్వుకున్నారు.
ఇదో నోస్టాల్జిక్ డ్రామా.
ఇబ్బందిగా కొడుకుని చూసింది, కొరకొరమన్నడు కానీ, బయటపడలేక ఇదై పోతున్నాడు.
“ఎంత గారాబం వాడికి, అదంతా ఉన్నట్టుండి మాయమైపోతుందని మేము అనుకోలేదు!” నిట్టూర్పు గా సుశీలమ్మ.
“అవును, వాళ్ళ నాన్న కారు తోలుతుంటే దాని అద్దాలలో నుంచి ప్రపంచాన్ని చూడటం జశ్వంత్ కి భలే మజా, అలా ఊర్లో అంబేడ్కర్ బొమ్మ సెంటర్ నీ, బొంబాయి బజారు బిజీ నీ చూడటం ప్రపంచ యాత్ర. ఆ ఇన్నోవా కారు వాళ్ళ నాన్నదే అనుకునేవాడు. ఒకరోజు రాత్రి బండికి వెళ్లాడాయన, మర్నాడు ఆస్పత్రి నుంచి పిలుపు, వెళ్ళాము, కారు ధ్వంసమైంది, ఆయన శరీరం లాగే. ఆ ఆస్పత్రిలోనే ఆయన్ని చివరి సారి చూడటం”
“దేవుడి చిత్తం ఎలా ఉంటే ఎలా అయితది,” సుశీలమ్మ.
ఆమెతో పాటు మిగతా వాళ్ళు కూడా కళ్లు తుడుచుకొన్నారు.
కాలంతో పాటు మనుషులు ఖాళీ అయ్యాక తనూ, తన బిడ్డ మిగిలారు. యువతరం ఉద్యోగాల కోసం హైదరాబాదో, బెంగుళూరో వెళుతుంటే ఇళ్ల మధ్య దూరం పెరిగింది. ఇళ్ల మధ్య మాత్రమేనా.
“ఇన్నాళ్లూ బానే ఉంది, నీవల్ల ఈరోజు పిల్లాడికి సమస్య వచ్చి పడింది” ఏదో ధ్యాసలో అంది సుశీలమ్మ.
జస్వంత్ టీ కప్పు అక్కడ పెట్టి-
“ఎక్కడ బాగుంది, నేను స్కూల్ లో ఉన్నప్పుడు చెకుముకి విజ్ఞాన పోటీల్లో వచ్చిన మెడల్ చూపిద్దాం అని ఫ్రెండ్స్ ని పిలిచా, నా దరిద్రం ఆరోజు అది కనపడలేదు” జస్వంత్ ఉక్రోషం.
అందరూ తలలు అటు తిప్పారు.
అతను కంటిన్యూ చేశాడు “అమ్మకి చెప్పేశా, ఇక నా వస్తువులు ముట్టుకోకు, అన్ని నేనే సర్దుకుంటా, అయినా ఇంత తెలివితక్కువగా ఎలా ఉంటావు? ప్రతిదీ నీ పెత్తనంలోనే జరగాలని ఆరాటం కాకపోతే, నీకసలు బాధ్యత లేదు.. ఛ.. అని తేల్చేశా”
“అది కాదు నాన్నా, ఏం చేద్దాం.. నాకేమో కాస్త మతిమరుపు” అప్పుడు పెగలని మాట ఇప్పుడొచ్చింది, తల గోక్కుంటూ అంది. అలిసిపోయిన పక్షి గొంతులా కీచుగా ఉంది.
నిజానికి ఆ మెడల్స్, కప్పులు, ప్రైజులు పట్టుకొని బీరువాలో దాచడంలేదు, మనసులో గుర్తులుగా పెడుతున్నాను’ అనుకుంటుంది ఆమె. ఇక ఆ అవకాశం లేనట్టే.
“ఆరోజు దానికోసం వెతుకుతుండగా కనిపించిన ఆల్బమ్ తీసి, కాసేపు చూస్తూ ఉంటారు ఇది వాళ్ళకి ఇవ్వు, అని ఇచ్చింది. సరే అని వెళ్తే,
“మరోసారి వస్తాంలే” అని లోన నవ్వుకుంటూ పోయారు వాళ్ళు. ఎంత షేమ్ అమ్మమ్మా”
సుశీలమ్మ కళ్ళు ఇంత చేసి చూసింది.
తర్వాత తేలిగ్గా నవ్వింది పాస్టర్ అధ్బుత కుమార్ లా.
ఆ నవ్వు ఏంటో అర్థం కాలేదతనికి
“నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇంతే, ఒక వారం జ్వరం అన్నది, డాక్టర్ కి చూపిస్తే లేదన్నాడు, చీటింగ్ కాదూ, ఇంకో వారం నాకు పెళ్లి చూపుల పేరుతో హడావుడి చేసింది, ఏంటో? ఎలాగో తప్పించుకొని వెళ్ళా, ఏదోక పని అని పిలిపిస్తుంది, వచ్చేదాకా ఊపిరాడనివ్వదు, ఇంక ఆ అవకాశం లేదులే”
“ఆరోజు తలుపుని తన్ని వెళ్ళిపోయాడు. అంతే ఇక” ఏదో బరువు మీద పడ్డట్టు మూలిగింది శాంత.
“సర్లే, టూ డేస్ లో బెంగళూరులో బోర్డింగ్” అరిచాడు.
నిశ్శబ్దం ఉరుములా పడిందక్కడ.
భోజనం టైం కావడంతో అంజనం వేసి వెతికే కార్యక్రమం జరగకుండానే పోయారు. శాంత ఊపిరి పీల్చుకుంది. కొడుకు ఊపిరి ఆడలేదు.
*****************
ఆదివారం కావడంతో కోలాహలం గా ఉంది, ఇల్లంతా అతని మొహం మీది మేఘంలా నల్లగా ఉంది.
వంట సామాగ్రి తెచ్చి ఇంట్లో పెడుతున్నారు కూలీలు, ఏమి అర్ధం కాక చూస్తున్నారు తల్లీ కొడుకు.
సుశీలమ్మ, మార్తమ్మా ,అందరూ వచ్చి వంట సామాగ్రి వంటకి సిద్దం చేయడం మొదలుపెట్టారు.
ఆమె మొహంలో ప్రశ్నలు పసిగట్టిన సుశీలమ్మ “ఏం లేదే, స్తుతి కూడిక చేస్తే అన్నా పాస్ బుక్కు దొరుకుతుందని, ఆదివారం కదా చర్చిలో బోజనాలు పెట్టిచ్చి అబ్బాయి అమెరికా పోతున్నాడు అని మైకులో చెప్పిద్దాం”
తల పట్టుకుంది శాంత,
“పెళ్లి చెడినాక బంతి పెట్టినట్టుంది” గొణిగాడు కొడుకు.
“నువ్వు ఉండురా, దేవుడి చిత్తం అయితే నీ పాస్ బుక్కు దొరికి తీరుతుంది, హల్లెలూయ” సుశీలమ్మ.
“హల్లెలూయ” అంతా కేక పెట్టారు. అతను ఆశలు లేని ఎర్రటి కళ్ళతో చూసాడు.
శాంత “మన ప్రాప్తం, ఇంకేం చేస్తాంలే” పిండి దులిపేస్తు అంది.
“తీరుద్దాం, అన్ని సమస్య లో తీరుద్దాము” తీక్షణంగా చూసింది ముసలామె.
శాంత ఉలిక్కిపడి “మధ్యాహ్నం రండి, అసలే ఆదివారం, చాలా పని ఉంది, ఇల్లు దులుపుకోవాలి”
చిత్రంగా ఉందే అన్నట్టు చూసారు అందరూ.
“రాత్రంతా మీ టీవీ మోగుతూనే ఉందే” మార్తమ్మ.
“ఆ… నిద్ర పట్టలేదు, నాలుగు మాటలు వినబడతాయనీ” శాంత. అవును, నిశ్శబ్దాన్ని వినడం మహా కష్టం.
“నువ్వు రాత్రంతా ఆ ప్రైజులు తుడవడం, ఫోటోలు తుడవడం నాకు తెలుసే” మెరిసే వాటిని చూస్తూ అంది సుశీలమ్మ.
ఏదో మహిమ ను దర్శించినట్లు బెరుగ్గా చూసింది శాంత.
ఫ్యాన్ గాలి వినబడెంత నిశ్శబ్దం.
అల్లం వెల్లుల్లి ఒలవడానికి కిచెన్ లో చెంచాలు వెతికే గలాటా. అటు చూసి “ఏంది మీరూ, వేళాపాళా లేకుండా వచ్చి పడ్డారు, ఇల్లు సర్దుకోవాలి, ఇంక మీరు పొండి” కయ్యిమనింది.
ఆమెలో ఇప్పటిదాకా చూడని అశాంతి ఇప్పుడు చూడగలిగారు. నొచ్చుకున్న ఆ ఇద్దరూ వెళ్లిపోయారు.
జస్వంత్ అమ్మను కన్నార్పకుండా చూస్తున్నాడు. సుశీలమ్మ కోరిక తీరిందనేమో సన్నగా నవ్వింది.
ఏ అంతరం కనిపెట్టిందొ అని గుటకలు మింగి “ఆ మంత్రం ఏదో చెప్పి ఏదన్నా చెయ్యి” నేలని చూస్తూ అంది.
“మీరంతా పదండి” సుశీలమ్మ ఆజ్ఞ, పాటించారు జనం. వెళ్లి తలుపులు వేసింది.
ఇప్పుడా ఇంట్లో ముగ్గురే, సుశీలమ్మ శాంత వైపు తిరిగి “హా..హా.. శాంతా నాకే మంత్రం రాదే”
బిత్తరపోయి చూసిందామే, జశ్వంత్ లో మిణుకు మినుకుమనే ఆశ చప్పున ఆరిపోయింది.
“మరి ఆ స్వస్థతలు ఎలా చేశావు?” శాంత.
“తప్పు చేసిన వాళ్ళ భయమే వాళ్ళని పట్టిస్తుంది. కాస్త దైర్యం ఇస్తే ఉత్తుత్త రోగాలు మటుమాయం, కొన్ని శరీరానికి ఎండా వానల్లా వచ్చిపోతాయి, అసలు దెయ్యాలు, ఆత్మలు ఎవరు చూసారు? మనుషులు తీర్పు దినం దాకా నిద్రలో ఉంటారని బైబిల్ చెప్పటంలేదూ”
“మరి అందర్నీ మోసం చేస్తున్నావా చిన్నమ్మా?”
“అవునే, ఒకరకంగా మోసమే, నాకోసం చేసుకున్న మోసం, పలికే మనిషి కోసం మోసం”
“అంటే?”
“మా చిన్నోడు రియల్ ఎస్టేట్ అని తెలుసుగా, అందులోనే జీవితం గడుపుతున్నాడు, హైదరాబాద్ ని కొనేదాకా వచ్చేటట్టు లేడు. ఇక మా పెద్దోడు ఇల్లు మారినాక ఇటు వచ్చి ఎరుగడు, మనుషులు దూరం కావాలంటే పక్క దేశంలో ఉండాలా, పక్క వీధికి పోయినా చాలు”
మనవళ్లయితే ఆణిముత్యాలు, నా చెయ్యి వదలరు.”
“అవునా? ఎప్పుడూ చూల్లేదే” శాంత.
సూటిగా చూసిందామే.
“సరే, సరే… రోజూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?, మీ తాత ముత్తాతలతోనా? ఏమంటారు వాళ్ళు? ఇదంతా మీ ఇంట్లో వాళ్లకు తెలుసా? జనం నీకు పిచ్చి అని కూడా…” శాంత.
“అలాగా… అందుకేనా చిన్నప్పుడు నీ బిడ్డను ముద్దు చేద్దామంటే పంపే దానివి కాదు”
తలొంచుకుంది శాంత.
సుశీలమ్మ కొనసాగించింది “నా మాటలు వినేది ఆ గాలీ, గోడలు. అందులోనే కనిపిస్తాయి సమస్త జీవుల ముఖాలూ, హావభావాలు. ఖాళీ ఇంట్లో నాతో ఎవరు మాట్లాడతారు. దాన్నుంచి… అదే దెయ్యం లాంటి ఒంటరితనం నుంచి బైట పడటానికి ఈ ఎత్తు, నలుగురూ పలకరించి, మాటామంతీ ఉంటాయని, ఒకచోట పోయినది ఇంకోచోట వెతుక్కొడం మనకి దేవుడు పెట్టిన విద్య ఏమో”
“ఎంత దాచుకున్నావు చిన్నమ్మా, ఇంక పరిస్థితులు మార్చే ప్రయత్నం చెయ్యలేదా”
“లేదే, ఎవరి జీవితం వాళ్ళకి ముఖ్యం, తల్లిగా ఎవరి ఆశలూ కాదనకూడదు,”
రెండు ముక్కలు తనకి తెలిసిన ప్రార్థన చేసి “ఆమెన్” అని వెళ్ళిపోయింది.
మరో గంటపాటు అక్కడే కూలిన చెట్టులా ఉండిపోయింది శాంత.
సాయంత్రం విందు తర్వాత జస్వంత్ చర్చ్ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టబోతే గడప దగ్గర ఠీవిగా కొలువుదీరింది వీసా.
“యాహూ…!” అతని కేక ఆకాశాన్ని తాకింది. అతనెక్కిన విమానంలా, అంతే ప్రయాణం ఒక కలలా జరిగిపోయింది.
కాలనీలో అదో పండగ అయింది. అంతా గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా గొప్పల తిప్పలు ఆ అణగారిన కాలనీకీ పాకాయి. ఇది అంకురం.
దీనికి ఏదో శక్తి పని చేసిందన్నారు కొందరు. అంతా సుశీలమ్మ పుణ్యమే అన్నారు మరికొందరు.
****************
ఒక పొద్దున్నే ఏవో మాటలు వీధిలోకి వినిపిస్తున్నాయి. సుశీలమ్మ అటు వెళుతూ ఆలకించింది. అది తను తీసిన రాగమే, మెల్లగా వెళ్లి గడపలోనించే తొంగి చూసింది.
శాంత బీరువా ఎదురుగా నిలబడి ఉంది. తలుపులు ఆమె రెప్పల్లా తెరుచుకున్నాయి. దిగులు కమ్మిన నీడ ఆమె మీదకి పాకింది.
బీరువా వెక్కిరించింది “నేను ఆ వీసా బద్రంగా చూసుకునేదాన్నిగా, ఎందుకు తిరిగిచ్చావు?” అని.
ఆమె నిర్వికారంగా నవ్వి బీరువా తలుపులు మూసేసింది, తన తలపులలాగే.
‘నిజమే కదా, ఎందుకు తిరిగిచ్చాను! ఆ వెతుకులాట ఇంకా సాగించాల్సింది’ చూస్తున్న సుశీలమ్మ గుండె జళ్ళుమంది.
‘తను నన్ను అడిగిన ప్రశ్న కి తనే సమాధానంగా మారింది’ అని తలపోసి తన నిశీధి ప్రపంచానికి వెళ్లిపోయింది.
శాంత మాటలు ఖాళీ గడితో కొనసాగుతున్నాయి, దానికీ అంతా ఏదో శక్తి అనుకున్నారు. అదేమిటో సుశీలమ్మ కి తెలుసు!
****************
అద్భుతమైన కథ చరణ్! సుశీలమ్మలా గోడలతోటి గాలి తోటి మాటలు చెప్పే ఆవిడను మా దగ్గర్లోనూ చూశాను. ప్రతి అక్షరం పర్ఫెక్ట్ గా వొదిగింది.
థాంక్యూ మేడమ్. నేను కూడా అలాంటి వాళ్ళని మా దగ్గర చూసాను. వాళ్లలో వెలితిని పట్టుకునే ప్రయత్నమే ఇది.
చరణ్ గారు…మీ కథలెప్పుడూ అద్భుతంగా ఉంటాయి. శాంతమ్మె విసా దాచి ఉంటుంది అని కథ మొదట్లోనే అర్థం అయ్యింది. కానీ సుశీలమ్మ జీవితంతో దాన్ని ముడిపెట్టి శాంత ఇచ్చేలా చేయడం నిజంగా చాలా బాగా కుదిరింది. మీ పడ విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలకు ఒక నూతన అందాన్ని ఇస్తాయి. “కారు ధ్వంసమైంది, ఆయన శరీరం లాగే.”
“ఆమె నిర్వికారంగా నవ్వి బీరువా తలుపులు మూసేసింది, తన తలపులలాగే.”
“నిశ్శబ్దం ఉరుములా పడిందక్కడ.”
……ఇలా ఎన్నని చెప్పను. అసలు మీరు ఇలా ఒక కథ రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఇలా రాయాలని ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకోవాలి అని ఉంది అండి.
థాంక్యూ సో మచ్ అండి. మీరు కథ తో పాటు నా రైటింగ్ ని కూడా విశ్లేషించారు. రచన గురించిన అంశాలన్నీ ఇక్కడ చెప్పలేను గాని, ఒక వ్యాసం రాసే ప్రయత్నం చేస్తాను.