వెతుక్కొంటూ–

వెతుక్కొంటూ పోతుంటాం

జీవితాన్ని ఖాళీ చేసి వెళ్లిన వాటికోసం

 

పొలిమేర దాటి పొలాలు దాటి

గాలివాటుగా కొట్టుకుపోతుంటాం

ప్రహరీలు దాటి పట్టణాలు దాటి

నీటికయ్యలా ప్రవహిస్తూ పోతుంటాం

 

దారి పొడుగూతా

బ్రహ్మాస్మి మంత్రోచ్చారణ

సరికొత్త కొలమానాల కొలువు

ఒడ్డూ పొడుగూ లెక్కింపు జాతర

సంఖ్యామానంలో అగ్రాసనాల యోగా

రాగి తాపడాల్ని దాచలేని రాజముద్ర

 

శరీరం గాల్లో తేలుతుంటుంది

కళ్లు కలలపల్లకీలో ఊరేగుతుంటాయి

కాళ్లు ఆబగా ఆకాశాన్ని ఆక్రమిస్తుంటాయి

తల నిప్పుకోడిలా నేలబొరియలోకి దూసుకుపోతూ-

 

ఇంతకీ శిథిలమవుతున్న దేమిటి

ఇంటాబయటా జారవిడుచుకుంటున్న దేమిటి

రాత్రింబవళ్లూ నిరంతరాయంగా కోల్పోతున్న దేమిటి

అర్ధరాత్రుల్లోనూ భుజకీర్తుల ప్రాభవమేమిటి

 

వెతుక్కొంటూ పోతూ

ఎదురొచ్చిన ప్రతి అపరిచితుడి ముందూ

ప్రశ్నల తివాచీ పరచి భిక్షాటన చేస్తుంటాం

జవాబుల కరచాలనాలను

జేబులకు జెండాలుగా అలంకరించుకుంటాం

తారసపడిన ప్రతి గుండెలోకీ చొచ్చుకుపోయి

తాత్త్విక శ్వాస కోసం అన్వేషిస్తుంటాం

సంకోచ వ్యాకోచాల సంగీత ధాతువుల్లోంచి

స్పష్టాస్పష్ట మూర్తిమత్వాలను కలగంటూ ఉంటాం

 

వెతుక్కొంటూ పోతూనే ఉంటాం

ఖాళీ చేసి వెళ్లిన సజీవసౌరభాలను అన్వేషిస్తూ-

*

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు