‘ఓం శ్రీ శ్రీనివాసాయ నమ: ఓం లక్ష్మీపతయే నమ:’
ఎప్పుడు చూసినా పీక్ ట్రాఫిక్‌తో, కాలుష్యపు పొరల్లో చుట్టిన పూతరేకులా ఉండే లక్డీకాపూల్ చౌరస్తా నడిమధ్యన మల్లెవనం విరిసినట్టు ఉంటుంది బిర్లా టెంపుల్. నల్లటి తార్రోడ్డు మీద నిండు పాల క్యాన్ ఒలికినట్టుగా అనిపిస్తుంది. అమావాస్య మబ్బుల్లోంచి చందమామ భళ్ళున నవ్వినట్లుగా కనిపిస్తుంది.
గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఏదేదో ఆలోచిస్తున్నాను.
ఆటో ఎక్కే అవసరం లేకుండా నడిచి వెళ్ళేంత దూరంలో, జీరో బడ్జెట్‌లో ఒక మంచి టెంపుల్ విత్ సిటీ బెస్ట్ వ్యూ దొరకటం నా నిర్భాగ్య జీవితానికి దొరికిన గొప్పభాగ్యం. ఆ గుడి నా ఇష్టదైవం వెంకటేశ్వరస్వామిది అవ్వడం మహాభాగ్యం.
అవునూ, వెంకటేశ్వరస్వామి గుడిని పట్టుకుని అందరూ బిర్లా టెంపుల్ అంటున్నారే…!
‘ఓం బిర్లాయ నమ: ఛీ’చ్చీ వినీతా… కంట్రోల్ కంట్రోల్’ ఓం గోవిందాయ నమ:’
డబ్బు మహిమ.
డబ్బుంటే మనిషి కూడా దేవుడు కావచ్చన్నమాట. రోడ్లన్నీ వెళ్ళేది రోమ్‌కేనా? అన్ని సమస్యలకు తల్లివేరు డబ్బేనా? మొదట్లో సమస్యల నుండి పారిపోవడానికి ఎప్పుడో ఓసారి గుడికి వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రాబ్లమ్స్ పెరిగాయి. గుడికి రావడమూ పెరిగింది. కరెంట్ బిల్ ఓవర్ డ్యూ అయ్యి రెండు నెలలైంది. లైన్‌మెన్ కాళ్ళావేళ్ళా పడితే కరెంట్ కట్చేయకుండా, నా మొహం చూసి ఒక డెడ్‌లైన్ ఇచ్చాడు. రెండుమూడు రోజుల్లో అదీ అయిపోతుంది. కట్టకపోతే వాడి ముందు పరువు పోతుంది.
అది ఎన్నిసార్లు పోయిందో ఎలా లెక్కేయడం. ఎప్పుడో ఓసారి పోతే గుర్తుంటుంది. రోజూ అరడజనుసార్లు పోతే? తినడానికి తిండిలేకపోయినా ఇజ్జతుండాలే అంటాడు మా ఆయన. తను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. పెళ్ళయ్యాకైనా నా జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. పెళ్ళికి ముందు పెనంలాంటి బతుకు. పెళ్ళయ్యాక ఓవర్ టు పొయ్యి. రాజేష్ మంచోడే. ఇద్దరు పిల్లలు. ఎదుగుతున్న పిల్లల చిన్నచిన్న కోరికలు తీర్చడం కూడా కష్టంగా ఉంది. నేనూ ఫ్రంట్ ఆఫీస్ లో చేసేదాన్ని. కరోనా పుణ్యమా అని ఆ ఉద్యోగం పోయింది. రెండు మూడు జాబులు మారాను. ఎక్కడా మూణ్ణెల్లకు మించి ఉండలేకపోయాను. కొన్నిసార్లు నా పనితో అవసరం పడక తీసేసేవారు. కొన్నిసార్లు డబ్బులేని స్త్రీకి ఇజ్జత్ ఉండదని అక్కడ డబ్బున్న మగవాళ్ళు అనుకోవడంతో నేను మానేయాల్సి వచ్చింది. చాలాసార్లు కసిగా అనిపిస్తది, ఎలాగయినా డబ్బు సంపాదించాలి అని. కానీ అదెంత కష్టమో తెలిసాక లోపల అసహనం, చిరాకు, విసుగు.
ఇలాంటప్పుడే అమ్మ మీదా, అక్క మీదా పిచ్చి కోపం వస్తుంది నాకు. వాళ్ళిద్దరు కళ్ళ ముందుంటే పీక పిసికి చంపేసేదాన్నేమో రోజుకి అరడజను సార్లు! అమ్మ మమ్మల్ని వదిలి ఈ లోకం నుండి వెళ్లిపోయింది. అక్క చిన్నప్పుడే ఎటో పోయింది.
ఆలోచనలు అదుపుచేసుకోవడానికి లైన్లో ఉన్న భక్తుల్ని చూడటం మొదలుపెట్టాను. గుడి ఎంట్రెన్స్‌కూ, నాకూ మధ్య పాతికమంది ఉన్నారు. ఒక్కొక్కర్నీ గమనిస్తున్నాను.
ఈ రోజు ఆమె వచ్చిందా? రాలేదా? వచ్చి వెళ్ళిపోయుంటుందా?
నా ముందు లైన్లో ఓ పదిహేనుమంది తర్వాత కనిపించింది ఆమె. ఇక్కడ ఆమెని చూడడం మూడోసార్లో నాలుగుసార్లో. రెణ్ణెళ్ళ కిందట మొదటిసారి చూసాను. ఎందుకో తెలీదు, తదేకంగా ఆమెనే చూస్తుండిపోయాను. చూడాలనిపించేంత సూదంటురాయి గుణమేదో ఆమెలో ఉంది. ఇన్నేళ్లలో గుళ్ళో వేలమందిని చూసుంటాను. ఈమె మాత్రమే ఇంటికి వెళ్ళాక కూడా గుర్తుంటుంది.
ఇంచుమించు నా వయసే ఉంటుంది. రెగ్యులర్‌గా వస్తుందంటే నాలాగే ఏవైనా సమస్యలున్నాయేమో. నా అంత దరిద్రమైన సమస్యలుండే ఛాన్సే లేదని చూస్తేనే తెలుస్తుంది. డబ్బుగల్ల మనిషిలానే ఉంది. అబ్బా, మళ్ళీ డబ్బు గోలేనా. దైవం డబ్బు రూపేణా.
క్యూ కొంచం ముందుకు కదిలింది. ఇప్పుడామె ఇంకొంచెం స్పష్టంగా కనిపిస్తుంది.
నడుం వరకు వేలాడుతూ నాట్యం చేస్తున్న నల్ల త్రాచులాంటి ఆరుపాయల ఎల్లిపాయ జడ. మంచిమంచి ఖరీదైన షాంపూలు వాడుతుందేమో. వారానికోసారి రూపాయి పెట్టి కొనే చిక్ షాంపూతో తలంటుకుంటే నాలాగే ఎలుక తోకలా అయ్యేదేమో. జడ మొదట్లో తురుముకున్న పసుపు దేవగన్నేరు పువ్వు. నిమ్మ పండు, చిగురాకు పచ్చ కాంబినేషన్ తో దొనేకల్ పెద్ద బార్డర్ బెంగాలీ సిల్క్ చీర.
పూజారి శఠగోపం పెట్టగానే దండం పెట్టుకుని క్యూలో నుంచి పక్కకి వచ్చి బయటకి వెళ్ళిపోతూ నన్ను క్రాస్ చేయబోతూ ఆగిందామె.
నా వైపు చూసి పలకరింపుగా నవ్వింది.
నవ్వే పరిస్థితి కాదు నాది. బాగోదని బలవంతంగా నవ్వాను. ఎప్పుడూ దూరం నుండి చూడడమే తప్ప ఇంత దగ్గరగా ఆమెను ఎప్పుడూ చూడలేదు. ఒక్కక్షణం ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి తలతిప్పి ఆమెను చూశాను. అప్పటికే నన్ను దాటేసింది. తల తిప్పుకుని క్యూలో కదిలాను. రెండు నిమిషాల్లో దేవుడి ముందు నిలబడ్డాను.
చెక్కిన వాడికి మొక్కాలి అనిపించేలా ఉంది పదకొండు అడుగుల సుందరమైన వెంకటేశ్వరస్వామి విగ్రహం. దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాను.
‘ఏం కోరుకోవాలి స్వామీ నిన్ను? కోరుకునీ కోరుకునీ కోరుకున్నవేవీ జరగవని తెలుసుకునీ, కోరికలే చచ్చిపోయిన బుద్దుడిలాగా మారిపోయాను.
బుద్దుడు గుర్తురాగానే మళ్ళీ ఆమె కళ్ళు గుర్తొచ్చాయి. బిర్లా టెంపుల్ కుడ్య చిత్రాల్లో బుద్దుడి కళ్ళల్లో కనిపించే నిర్వికార ప్రశాంతతే ఆమె కళ్ళల్లోనూ కనిపించింది. ఆమె గుర్తురాగానే అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసాను. ఇంకా మెట్ల దగ్గరే ఆగిపోయి నావైపే తదేకంగా చూస్తోంది- అచ్చంగా నేను ఇందాక ఆమెని చూసినట్టే! నేను చూడగానే తల తిప్పుకొని వెళ్ళిపోయింది. ఎందుకలా చూసిందో. నేను తననే గమనిస్తున్న విషయం ఆమె కనిపెట్టిందా? ఏమనుకుందో ఏంటో!
దండం పెట్టుకుని, పూజారి ప్రసాదంతో పాటు ఇచ్చిన కొబ్బరిచిప్ప చేతిలో పట్టుకుని, గుడి మెట్లు దిగాను. నేనెప్పుడూ అలవాటుగా కూర్చునే గోడకి ఆనుకుని కూర్చున్నాను.
పాతిక అడుగుల దూరంలో ఆమె. అక్కడున్న బిచ్చగాళ్ళకు ఒక్కొక్కరికీ పది రూపాయల నోటు ఇస్తూ వెళుతోంది. వెనకనించి చూస్తే ఇంచుమించు నా హైటే. ఇంచు ఎక్కువే అనుకుంటా.
చూపులు తాకుతాయంటారు కదా. సడెన్‌గా వెనక్కి తిరిగి సూటిగా నన్నే చూసింది. దిష్టి తగులుతుంది అనుకుంటుందేమో పాడు. తల తిప్పేసుకుని కొబ్బరి చిప్పని పగలగొట్టే పనిలో పడి, ఆమె గురించే ఆలోచిస్తున్నాను.
ఎక్కడో చూసిన గుర్తు. బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావడం లేదు. ఇంకోసారి పరీక్షగా చూడనా!
తల అటువైపు తిప్పాను. నాలుగడుగుల దూరంలో నా ఎదురుగా నిలుచుని, నా కోసమే వచ్చినట్టు నన్నే సూటిగా చూస్తోంది. నోరు తెరవబోతుంటే తనే నవ్వుతూ అడిగింది;
‘మీరీ గుడికి రెగ్యులర్ గా వస్తారా?’
‘అవును. మీరు?’
‘నేనూ అంతే. ఇంతకుముందు మనసు బాగోలేనప్పుడు వచ్చేదాన్ని. ఈ మధ్య మరీ ఎక్కువసార్లు బావుండట్లేదు’ అంటూ అరవిరిసిన బొండు మల్లెపువ్వులా అందంగా నవ్వింది.
నా మనసు చదివినట్టే మాట్లాడిందేంటి అనుకుంటూ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాను.
‘ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఒకట్రెండు సార్లు చూసాను ఇక్కడ. ఎందుకో బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తేనూ పలకరిద్దామని వచ్చాను. ఏం అనుకోకండి….’ అంది పక్కన కూర్చుంటూ.
అల్ల నేరేడుపండులాంటి కళ్ళు, కోటేరేసిన ముక్కు, ముక్కుకి ఎడమవైపు రవ్వల ముక్కుపుడక, చీరకి కాంట్రాస్ట్ బార్డర్ ఉన్న ఆకుపచ్చరంగు బొట్టు బిళ్ళ. చెవులకి ఒక మాదిరి సైజు ఉన్న డైమండ్ స్టడ్స్, చేతులకి కూడా డైమండ్ గాజులే. మెడలో సన్నటి బంగారు గొలుసుకి నక్షత్రాకారపు తళుకులీనే పెండెంట్. పండిన పైనాపిల్ పొట్టు తీశాక లోపలుండే బంగారు మేనిచ్చాయ ఆమెది. నిజం చెప్పాలంటే కొంచెం ఈర్ష్య కలిగింది. నేను ఎలా బతకాలని కలలుకన్నానో, అలా బతికేస్తోంది ఈవిడ. దేనికైనా పెట్టి పుట్టాలి.
నన్ను నేను చూసుకున్నాను. కోఠీలో కొన్న సాదా జార్జెట్ చీర, బేగంబజార్‌లో కొన్న వన్‌గ్రామ్ బుట్టలు, అక్కడే కొన్న సన్నటి నల్లపూసల గొలుసు. డజనులోంచి పగిలిపోగా మిగిలిన అరడజను సీసం గాజులు. దిగులు మొగులు కమ్మిన నల్లటి ఒంటిరంగు. అసలు బంగారం కాదు గదా, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలనే ఆలోచన రావడానికి కూడా అవకాశం లేని జీవితం.
‘నేను మిమ్మల్ని చూడటం ఇది నాలుగోసారి అనుకుంటా. నాక్కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే అనిపిస్తోంది.’ అంటూ కొబ్బరి చిప్ప పగలగొట్టి చిన్న ముక్క తనకిచ్చాను.
‘ఎక్కడుంటారు?’ అంది కొబ్బరి కొరుకుతూ.
‘ఇక్కడే, పక్కన బస్తీలో. మీరు?’
‘జూబ్లీహిల్స్, పెద్దమ్మగుడి వెనకాల.”
‘ఓహ్…’
“వస్తుంటారా ఎప్పుడైనా’
‘లేదు…’ గుడి బావుంటుంది కదా.?’
‘ఇప్పటివరకూ ఏదన్నా పనిమీద కూడా జూబ్లీహిల్స్ వైపు వెళ్ళే అవకాశం రాలేదు నాకు. ఇక గుడి చూసే అవకాశం కూడానా. మీరు ఏకంగా అక్కడే ఉంటున్నారు. అదృష్టవంతులు.’ అన్నాను నిష్టూరంగా.
ఆమె నొచ్చుకోలేదు. నవ్వింది. మౌనంగా ఉండిపోయింది.
‘మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ?’ నేనే కదిలించాను.
ఒక్క సెకను ఆగి ఆమె ఊరి పేరు చెప్పింది.
వినగానే చిన్న జర్క్ నాలో.
‘ఎగ్జాక్ట్‌గా చెప్పండి, ఊళ్ళో ఎక్కడుండేవాళ్ళు?’ నా గొంతులో ఆత్రం.
‘మార్కెట్లో. అంబేద్కర్ విగ్రహం పక్కన నాలుగో ఇల్లు.’
ఏదో బాగా అర్థమవుతున్న ఫీలింగ్. కాదు వణుకు.
‘మీ అమ్మ పేరు సరళా?’ అన్నాను టక్కున.
ఆమె విభ్రమంగా చూసింది.
‘అవునూ. నాన్నపేరు బ్రహ్మయ్య, చెల్లి పేరు….’
‘వినీత’ అన్నాం ఇద్దరం ఒకేసారి.
ఈసారి షాక్ అవడం ఆమె వంతు అయింది.
‘హే, నువ్వూ… విన్నీ…!’
‘అక్కా…’
నాలుగడుగుల దూరాన్ని ఒక్క అంగలో చెరిపేసి నన్ను గట్టిగా పట్టేసుకుంది.
భోరున ఏడ్చేస్తున్నాను.
ఎనిమిదేళ్లు కలిసి పెరిగిన అక్కచెల్లెళ్లం, పాతికేళ్ల ఎడబాటు తర్వాత దగ్గరైన స్పర్శ.
సాగర్ గాలి సాగర సమీరంలా తగులుతూ ఓదార్చి ఓదార్చి అలసిపోయి ఆగిపోయేంత వరకూ ఏడూస్తూనే ఉన్నాం. తేరుకున్నాక ఈసారి ఆమె ప్రశ్నల వర్షమై తడిపేసింది.
ఆఖరి ప్రశ్న, అడిగిన ఆమె గొంతుకూ, చెప్పిన నా గొంతుకు అడ్డం పడింది.
‘అమ్మ ఎలా ఉంది విన్నీ?’
‘ఐదేళ్ళయ్యిందక్కా… అమ్మ చనిపోయి.’
*
గుడి మెట్లు దిగి కిందికి రాగానే డ్రైవర్ పెద్దకారుతో రెడీగా ఉన్నాడు.
విన్నీ, మా ఇంటికి వెళ్దామా?
బస్సు తప్ప ఇంతవరకూ కారు ఎక్కలేదు. ఆటో ఎక్కినా అది షేర్ ఆటోనే గానీ సోలోగా బుక్ చేసుకుంది కాదు. హైద్రాబాద్‌లో బతకడం వల్ల అలాంటి ఖరీదైన కారుని చూసే అదృష్టం పట్టింది కానీ, కనీసం ఇలాంటి బొమ్మ కారు కూడా నా పిల్లలకి కొనిచ్చే స్థోమత లేదు నాకు.
ఎక్కి కూచున్నాను. మాటల్లో వర్ణించలేనంత సుఖంగా ఉంది. కారు బయలు దేరింది.
దారిలో రాజేష్ కి కాల్ చేసి ‘నేను కొంచెం లేట్ గా వస్తాను’ అని చెప్పాను.
పోష్ కాలనీలో లంకంత కొంప ముందు ఆగింది.
చుట్టుపక్కల ఉన్న రకరకాల పూల మొక్కలు, లతలు, కాస్ట్లీ క్రోటన్స్ చూస్తూ లోపలికి నడిచాను.
నాకంటే ఖరీదైన చీర కట్టుకుని, కళ గల మొహంతో ఒకామె వచ్చింది. ఎవరూ అన్నట్టుగా అక్క మొహం చూసాను. ‘వంటావిడ, పేరు సరిత! సరితా ఏం కావాలో చూసుకో. రెండు నిమిషాల్లో వస్తా!’ అని చెప్పి లోపలికి వెళ్ళింది అక్క.
‘కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం కావాలి మేడమ్?’
‘కాఫీ’ అని చెప్పి సోఫాలో కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న అందమైన ఖరీదైన వాల్ పెయింటింగ్స్ చూస్తున్నాను.
అక్క జీవితం ఎంత బాగుంది, బావ గారు ఏం చేస్తారో? పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో?’
నా ఆలోచనలకు అడ్డం పడుతూ నవ్వుతూ ఎదురుగా ఉన్న రిక్లైనర్ లో కూర్చుంది అక్క.
నా మెడమీద ఒంటి పేట నల్లపూసలు చూస్తూ ‘మీ ఆయన ఏం చేస్తాడు? పిల్లలెంతమంది? నువ్వేం చేస్తున్నావు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
అన్నింటికీ పొడిపొడిగా సమాధానం చెబుతున్నాను.
‘అక్కా, బావగారు, పిల్లలు ఎక్కడ?
‘పరిచయం చేయడానికి నీకు బావగారు నాకు భర్తగారూ అంటూ ఎవరూ లేరు.’
ఎలా పోయాడు అనడగబోయి ‘మరి పిల్లలు?’ అని నసిగాను.
‘బావగారే లేకపోతే ఇంక పిల్లలు ఎక్కడనించి వస్తారే.’
నవ్వుతోంది, కాదు విరగబడి నవ్వుతోంది. సెలయేరు పారినట్టు, జలపాతం దూకినట్టు, నదీ ప్రవాహం ఉరకలెత్తినట్టు, సముద్రపు అలలు ఘోషించినట్టు రకరకాలుగా నవ్వింది చాలాసేపు. తన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయని గమనించాకే నవ్వడం ఆపేసింది. నవ్వు ఎన్నిరకాలుగా ఉన్నా కన్నీళ్ళది మాత్రం ఒకే రంగు, ఒకే రుచి.
చిటికెన వేలి చివరి కొనతో కన్నీళ్ళు తుడుచుకుంటూ చెబుతోంది.
‘నాకంటే మూడేళ్లు చిన్నదానివి కదా. బహుశా నీకేమీ గుర్తుండి ఉండదు. నాకప్పుడు పదేళ్ళు. నీకు కామెర్లు వచ్చాయి. హాస్పిటల్లో చూపించడానికి ఎక్కడా రూపాయి అప్పు పుట్టలేదు. నాన్నపోయినప్పటికంటే ఎక్కువ ఏడ్చింది అమ్మ. చాలాసేపు ఏడ్చాక చెప్పింది; కులాలు మతాలు దాటి మీ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బంధువులందరూ దూరమయ్యారు. ఆణిముత్యాలు పుట్టారని ఆనందించేలోపే యాక్సిడెంట్లో ఆయన దూరమయ్యారు. చితికిపోయిన ఆర్థిక స్థితి, ఒంటరి ఆడదాన్ని. వెకిలి చూపులు, వెధవల ఆగడాలు. చచ్చిపోదాం అని చాలా సార్లు అనుకున్నానే. మీ ఇద్దరికోసం ఎన్నో భరించాను. ఇజ్జత్ చంపుకుని బతికాను. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే చెల్లి చచ్చిపోతుంది. నేను పనిచేసే షాపు ఓనర్ బంధువుకి పిల్లలు పుట్టరట. దత్తత కోసం మనింటికి వచ్చారు. వాళ్ళు నిన్నే కావాలంటున్నారు. నీకోసం, చెల్లికోసం నువ్వు వెళ్ళిపోవాలి తల్లీ అని ఏడుస్తూనే నన్ను వాళ్ళకి దత్తతకి ఇచ్చేసింది. ఊరికే కాదనుకో. డబ్బులిచ్చి కొనుక్కున్నారు. నేనెప్పటికీ మరచిపోలేని రోజది.’
చిన్నప్పటి అక్క రూపం మసక మసకగా మనసులో మెదులుతోంది.
‘రెండేళ్ళు బానే చూసుకున్నారు వాళ్ళు. స్కూల్లో చేర్పించారు. మెచ్యూర్ అవ్వగానే వాళ్ళ అసలు రంగు బయటపడింది. అయిదువేలకి అమ్మ దగ్గర కొనుక్కుని యాభైవేలకి నన్ను అమ్మేసారు, ఒక బ్రోతల్ హౌస్ కి.’
నా ఒళ్ళు సన్నగా వణుకుతోంది. మసక మసకగా ఉన్న ఆలోచనలేవో స్పష్టమవుతున్నాయి.
‘ఆ తరువాత నరకాన్ని నేను చెప్పలేను. నువ్వు వినలేవు విన్నీ. నువ్వూ, అమ్మా బాగా గుర్తొచ్చినప్పుడల్లా మీ మీద తెగ కోపం వచ్చేది. మరీ ముఖ్యంగా నీ మీద. అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. అందుకే నన్ను నరకానికి ఇచ్చేసి నిన్ను తన దగ్గరే ఉంచుకుందని కుళ్ళికుళ్ళి ఏడ్చేదాన్ని. నీ కంటే ఒకరవ్వ రంగు ఎక్కువ ఉండటమే నా పాలిట శాపం అయిందని నిన్ను తిట్టుకునేదాన్ని. మొదట్లో వాళ్ళని ఎదిరించాను. ఎంత ఎదురు తిరిగితే అంత నరకం చూపించేవాళ్ళు. పోరాడి పోరాడి ఓడిపోయాను. ఒళ్ళప్పగించేసాను.’
అప్పటిదాకా సుఖంగా మెత్తగా అనిపించిన సోఫా, ఇప్పుడు తుమ్మకంప మీద కూర్చున్నట్టు గుచ్చుకుంది.
‘ఇరవై రెండేళ్లప్పుడు ఓ పెద్ద ఎమ్మెల్యే నా మీద మోజుపడి, వడ్డీకి చక్రవడ్డీ కలిపి వాళ్ళకిచ్చి నన్ను కొనుక్కున్నాడు. తెచ్చి ఈ ఇంట్లో పెట్టుకున్నాడు. అతని దృష్టిలో ఈ ఇంట్లో అన్నిటికంటే కాస్ట్లీ ఐటం నేనే. నాకు సంబంధించినంత వరకూ ఇది కొంచెం బెటర్ నరకం.’
అక్కా అంటూ ఏడుస్తూ ఆమెని అలుముకున్నాను. వెక్కివెక్కి ఏడుస్తున్నాను. ఇందాక అక్క నవ్విన దానికంటే గట్టిగా ఏడుస్తున్నాను.
‘పిచ్చిపిల్లా’ఏడవకు!’ అంటూ గట్టిగా హత్తుకుంది.
నన్ను ఏడవకు అంది కానీ ఆమె ఆపుకోలేకపోతోంది. నా ఏడుపుకి తన దుఖం కూడా కలిపింది. కాసేపటికి ఇద్దరం తేరుకున్నాం.
‘ఇల్లు నా పేరు మీద రాశాడు. కారు, నౌకర్లు, ఇద్దరు డ్రైవర్లు, బ్యాంకులో కావలసినంత డబ్బు, ఒంటిమీద మోయలేని బరువైన నగలు అన్నీ ఉన్నాయి. చిన్న కనుసైగతోనో, ఒక ఫోన్‌కాల్‌తోనో పెద్దపెద్ద పనులు కూడా జరిగిపోతాయి. హోదా పెరిగింది. బాధా పెరిగింది. అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒక్కటి తప్ప….’
‘ఏంటక్కా…?’
అక్క ఏదో చెప్పబోతుంటే ఫోన్ రింగైంది. ఫుల్ వాల్యూమ్‌లో ఉన్నట్టుంది. అవతలవేపు నుంచి మాటలు కొద్దిగా వినిపిస్తున్నాయి.
‘ఏంటి, ఇంకా బయల్దేరలేదా…!’
అక్క నావైపు చూసి వాల్యూమ్ బటన్ తగ్గించింది.
‘అరగంటలో రెడీ అవుతాను… ప్లీజ్… సారీ… అలాగే.’ అని ఫోన్ పెట్టేసింది.
సోఫాలో ఆరాంగా ఒరిగి, గొంతు జీరబోతుండగా అంది;
‘ఇదే, నా దగ్గర లేనిది.’
ఆశ్చర్యంగా అక్క వైపు చూస్తున్నాను.
‘ఇజ్జత్.’
మనసు కూడా జీరబోయినట్టు వినిపించింది అక్క చెప్పిన మాట.
జీవితానికి అవతలి వైపు చూసింది అక్క. నేను ఇంతకాలం ఇవతలి వైపే చూసాను. ఏదో గుర్తొచ్చినట్టు, ఈసారి నేను పగలబడి నవ్వాను. అలలు అలలుగా తెరలు తెరలుగా నవ్వుతూనే ఉన్నాను.
కాస్త అయోమయంగా, కొంచెం ఆశ్చర్యంగా నన్ను చూస్తూ, ‘ఏమైందే నీకు’? అంది అక్క.
నవ్వు ఆపుకుంటూ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అన్నాను. ‘ఏ ఇజ్జత్ లేదనుకుని నువ్వు బాధ పడుతున్నావో అది డబ్బు వల్ల మాత్రమే వస్తుందని, అది నా దగ్గర లేదని, దానికోసం జీవితం అంతా వెతుకుతూనే ఉన్నానక్కా.!’
అక్క నా చేయి పట్టుకుని మెల్లగా నిమిరింది.
‘బహుశా అమ్మకి నువ్వంటేనే ప్రేమేమో. అందుకే నిన్ను డబ్బున్నవాళ్ళకి ఇచ్చేసి నన్ను తన దగ్గరే ఆ దరిద్రంలో పెట్టుకుంది అనుకుని ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా…!’
బతుకును పంచుకోలేకపోయాం. బాధను పంచుకోలేకపోయాం. ఏడుపును పంచుకునే అవకాశం ఇన్నేళ్ళకు దొరికింది. అందుకే మాట్లాడుకుంటూనే ఏడుస్తూన్నాం. ఏడుస్తూనే మాట్లాడుకుంటున్నాం. అక్క నన్ను అలుముకుని బావురుమంది.
కాసేపటికి తేరుకుని, పెద్దరికం ఆపాదించుకుంటూ నేనే మొదలు పెట్టాను.
‘అమ్మ ఎప్పుడూ నీ గురించే ఏడ్చేది అక్కా. నిన్ను వాళ్లకి ఇచ్చినపుడే సగం గుండెని కోసి ఇచ్చినట్టు అయ్యింది అనేది. ఒకరోజు కోపంతో నన్ను ఎందుకు దత్తతకివ్వలేదని అమ్మని పిచ్చి తిట్లు తిట్టాను. సగం ప్రాణమైనా సంతోషంగా ఉంటుంది కదా అనుకుని ఒప్పుకున్నా అని ఏడ్చింది. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఒకరంటే ఇష్టం, ఇంకొకరంటే కష్టం అని కాదు. పెద్దది నా అవసరం లేకున్నా బతుకుతుంది. నువ్వు మరీ చిన్నదానివని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇద్దరిలో ఎవరు వెళ్లినా తల్లిగా నా బాధ ఒకటే కదా అని అందక్కా. అమ్మ చెప్పింది అప్పుడు అర్థం కాలేదు.’
‘అమ్మ దగ్గర నువ్వు ఆనందంగా ఉన్నావని నేనూ, డబ్బున్న వాళ్ళింట్లో నేను సుఖంగా బతుకుతున్నా అని నువ్వూ, ఇద్దరు పిల్లల్లో ఒక్కరైనా సంతోషంగా ఉంటారు అనుకుని అమ్మా…!
విధి మన ముగ్గురితో ఓకే ఆట విడివిడిగా ఆడుకుంది విన్నీ!’
అమ్మని ఎంత తిట్టుకున్నాను. ఎన్నిసార్లు కసురుకున్నాను. రాజేష్ మీద, పిల్లల మీద ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాను. సమస్యలున్నాయని ఉద్యోగం మానేయకూడదు. ఎదుర్కోవాలి. అక్క పిలుపుతో ఆలోచన తెగింది.
‘విన్నీ.. ఏం ఆలోచిస్తున్నావు..’
‘సారీ అక్కా… ఫర్ ఎవ్రీథింగ్…’
నన్ను తేలిక చేయడానికి అన్నట్టుగా అక్క చిరునవ్వు నవ్వి అడిగింది;
‘ఇప్పుడు చెప్పు, అమ్మకి ఎవరంటే ఎక్కువిష్టం, నువ్వా, నేనా?’
ఇద్దరికీ ఏదో అర్థమైనట్టుగా గట్టిగా చేతులు పట్టుకొని పొట్ట పగిలేటట్టు నవ్వడం మొదలుపెట్టాం.
కిచెన్ లో నుంచి వచ్చిన వంట మనిషి, డస్టింగ్ చేస్తున్న మెయిడ్, అటుగా వెళుతున్న డ్రైవర్ మా నవ్వులు అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు.
– స్వర్ణ కిలారి
Add comment