“Nothing has changed since ages when it comes to caste in India”– నూట యాబై ఏళ్ల కింద భారతీయార్ అన్న మాట ఇది”
‘కులానికి మతానికీ మానవత్వం ఉండదు’ అంటాడు పెరియారుం పెరుమాళ్. మన తెలంగాణ సమాజంతో పోల్చుకుంటే చిందు లేదా డక్కలి కుటుంబ కథ. ఆకలి అవమానం, వెనకబాటుతనం, జన్మజన్మల కలబోతగా కష్టం కన్నీళ్లు కావడికుండల్లా జీవితాల్లో పెనవేసుకున్న బ్రతుకులు. ఈ దేశం అంతరిక్షం దాటి ఇంకో వంద పాలపుంతల్లోకి దూరి సంసారం పెట్టినా నుదుటిపై విభూతిలా, కులం కవచకుండలాల వెంటేసుకుని తిరిగే ఆధునికత దశలో ఉన్నాం మనం. ఇంకో వెయ్యేళ్ళ అభివృద్ధి తెచ్చి ఆ వాడల్లో పోసినా శుద్ధి గాని చేతులు అవి. ఎముకలు తేలిన పెయ్యి, ఊడి ఊసి పోయిన జుట్టు, ఎంత తోమినా ఏసుకున్నా ఎలిసిపోని రంగుల ముఖాలు. పెచ్చులూడిన గచ్చులు, కొంపల్లో గాబులు, గ్లాసు అనేది తెలియకుండా బిందెలో కుక్కలా నోరు పెట్టి నీళ్ళు తాగే బ్రతుకులు. వాటికి తోడు పక్కన ఒక కర్రి కుక్క. ఈ బ్రతుకులు మారాలి అని ఒక్కొక్క నెత్తురు బొట్టు ఒక్కొక్క అక్షరం ముక్కగా మట్టి పలకమీద రాసుకున్న యాది. ఒక డక్కలోడు లేదా చిందోడు నగరానికి వచ్చి నేను లాయర్ ని కావాలి అంబేద్కర్ లా డాక్టర్ ని కావాలి అనుకోవడం అంతే తేలిక కాదు.
తన అవ్వలు అయ్యలు ముఖానికి రంగేసుకొని బహురూపుల వేషాలు వేసుకుంటూ దేశ దిమ్మరుల్లా బ్రతుకు భుజాన వేసుకుని తిరుగుతుంటే ఆ కొంపలో పుట్టిన పెరుమాళ్ ‘అన్యాయమైన’ న్యాయవిద్య చదవాలి అని బ్రతుకు మీద గంపెడు ఆశతో నగరానికి వచ్చాడు. అక్కడ చేరిన ఒక అమాయక బ్రతుకు తన తోటి ఆధిపత్య కులాల కట్టు బొట్టు ముందు న్యూనతతో మొదలైన అడుగడుగునా అవమాన పడిన ఒన న్యాయ విద్యార్ధి వెత ఇది .
A అంటే ఆపిల్ మాత్రమే కాదనీ అది ఆనంద్ కూడా అని చెప్పబోయిన ఊరోన్ని అవమానించిన బడి బందీఖాన. “అరె బాబు ‘C’ తో మొదలయ్యే నాలుగు పదాలు చెప్పు” అని పంతులు అంటే చిన్న “c” నా పెద్ద “C” నా అడిగే అమాయక బ్రతుకుల్ని హేళన చేసిన తరగతి గదులు యావత్ భారత దేశంలో అడుగు అడుగు కీ ఒకటి ఉంది. UKG లో ఉండాల్సిన వాడు లా కాలేజీలో పనేంటిరా పందులు కాసుకోక పంతులుతో పద్యాలు చెబుతావా అని కంటి చూపుతో మసి చేసే పంతుళ్ళున్న లోకంలో మనం ఉన్నాం. అది తిరునల్వేలి కావొచ్చు, ఎఫ్లూ కావొచ్చు , హైదరాబాదు నడిబొడ్డున ఉన్న వెలివాడ కావొచ్చు. దేశ రాజధాని కావొచ్చు.
పెరియారుం పెరుమాళ్ అంటే గుర్రం మీద ఊరేగే ఒక దేవుడు అని అర్ధం. సినిమా మొదలు అవడమే కొద్దిమంది యువకులు తమ బ్రతుకులో భాగం అయిన కుక్కలను ఒక మురికి నీటి గుంటలో చుట్టూ కూర్చొని కడగడం. ఒక నిముషం తర్వాత అందులో ఒక కుక్కను (కరిపి) రైలు పట్టాల మీద కట్టేసి చంపడం ఎంత పైశాచికం ?
ఊరు ఊరంతా ఆ కుక్కను పెద్ద ఊరేగింపుగా అంతిమ యాత్ర చేయడంతో మొదలౌతుంది. ఆ కుక్కను ప్రాణంగా పెంచుకున్న ఆ తిరునల్వేలి కుర్రాడు లా చదవడానికి నగరానికి రావడం, అక్కడ కుల రక్కసితో బ్రతుకు యుద్ధం చేయడం పెరుమాళ్ళు కథ.
లా కాలేజిలోకి వెళ్ళిన మొదటి రోజే అక్కడి ప్రిన్సిపాల్ తో ‘నేను డాక్టర్ కావాలి అనుకుంటున్నా’ అనడం పక్కనే ఉన్న పంతుళ్ళు ఫక్కున నవ్వడం ‘లేదు నేను అంబేద్కర్ లా డాక్టర్ ని కావాలి అనుకుంటున్నా’ అనడం ద్వారా దర్శకుడు మారి సెల్వరాజ్ తాను ఏం చెప్పాలి అనుకుంటున్నడో అర్ధం అవుతుంది.
పల్లె దాటి పట్నానికి వచ్చిన పోరడి పట్ల సహజంగానే ఒక పెద్దింటి పిల్ల ఆకర్షితురాలు అవడం, ఆంగ్లంలో బాగా వెనకబడి ఉన్న అతనికి ఆంగ్లం నేర్పడం, అతని గురించి ఇంట్లో చెప్పడం. ఆ ఇంటి మారుతీరావు బిడ్డను సందేహపడడం ఏకకాలంలో జరుగుతాయి. ఆ పిల్ల తన ఇంట్లో పెళ్లి ఉంది అని కార్డు ఇవ్వడం, పెళ్ళికి సరైన బట్టలు లేకపోతే పక్కింటి వాడి దండెం మీద ఒక చొక్కా పాంటు అడిగి ఇస్తిరి చేసి చేతిలో చిన్న గిఫ్ట్ పట్టుకొని బిక్కుబిక్కుమంటూ పెళ్ళికి వచ్చిన పల్లెటూరి పోరడి మీద ఒక పక్క పెళ్లి భజంత్రీలు మరోపక్క ఆ అమాయకుణ్ణి గదిలో బంధించి, పది మంది చేసినదాడి చూస్తే ఒక్క సారి ఒళ్ళు జలదరిస్తాది. కొట్టి కొట్టి సొమ్మసిల్లిన అతని మీద ఉచ్చ పోస్తూ మారుతీరావులు పొందిన పైశాచికత్వం నిన్నా మొన్నా ఇక్కడే మన పక్కింట్లోనే జరిగినట్లు ఉంటది. ఆ హింస, ఆ జలదరింపు నుండి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఒక దశలో పిచ్చి పట్టి సైకోలా మారుస్తుంది.
తన తండ్రి ఏం చేస్తాడు అని అడిగిన ప్రతి ప్రశ్ననూ వదిలేసిన పెరుమాళ్ ఒకరోజు కళాశాలలో జరిగిన గొడవల్లో ప్రిన్సిపాల్ మందలించి మీ నాన్నను తీసుకొని రమ్మంటే తండ్రి వికారంగా ఉండు అని ఇంకొకతన్ని ప్రిన్సిపాల్ దగ్గరకు పంపడం. మరో సారి జరిగిన గొడవకు సొంత తండ్రిని తీసుకొని రావడం. ఆ ప్రిన్సిపాల్ అవమాన పరచడం చూస్తే, నేను బడిలో మా అయ్య పేరు లచ్చయ్య అయితే బాలేదు అని లక్ష్మయ్య అని చేసిన పిచ్చి పని యాదికొచ్చింది.
జన్మ జన్మలుగా ముఖానికి రంగేసి, రెండు మూరెడు పొడవు జుట్టు జడలా కట్టి, ఊసబెండు లాంటి కాళ్ళు చేతులు, ఎక్కడున్నాయో తెలియని కండ్లు, ఉల్లి పొరకన్నా పల్చని పంచె, ఏనాటిదో తెలియని చొక్కా ఆహార్యంగా వాడ నుండి వచ్చిన తండ్రిని అదే కళాశాలలో తనతో చదివే పిల్లలు జుట్టు పీకి, చొక్కా చించి,పంచె లాగేస్తే బరిబాతన ఉరుకుతున్న ఆ ముసలి తండ్రిని ఊరకుక్కల్లా కళాశాల నుండి ఊరంతా ఉరికించిన ఒక్క సన్నివేశం చాలు ఈ వ్యవస్థ క్రూరత్వం అర్ధం కావడానికి, ఇక చాలు ఇంటికి రావొచ్చు. నాగరికత పేరుతో మరొక అమాయక బక్క జీవి మీద చూపిన క్రౌర్యం చాలు. వ్యవస్థీకృత హింస తీవ్రత ఒక సంచార బ్రతుకుని చినిగిన విస్తరిలా చేసే పైశాచికత్వం పొందిన ఆధునిక మనువు వికృతం సెల్వరాజ్ మాత్రమె చూపగలడు కేవలం ఒక్క తమిళ సమాజం మాత్రమే ఆదరించ గలదు. దానెనక స్వాభిమాన ఆత్మ గౌరవ దారి ఉంది.
ఇది సినిమా కాదు వర్తమాన కులాంకలి. చుట్టూ జరుగుతున్న కిరాయి హంతకులు ‘పరువు’హత్యలు, కుల హత్యలు, ఒక తాపీ పని చేసేవాడు ఊరిలో పరువు హత్యల కోసం తలారిలా తిరుగుతూ ఉంటాడు. బస్సు లో నీ పక్కనే కూర్చొని నీకు తెలియకుండానే అదే బస్సు కింద పడేసి చంపగలడు, చెరువులో ఈత కొడుతున్న ఒక బాలున్ని అదే చెరువులో మునిగి పోతున్నట్టు నటించి కాపాడడానికి వచ్చిన వాణ్ని తొక్కేసి కర్కశంగా చంపగలడు. ప్రేమ పెళ్లి చేసుకుంది అని చంపి దూలానికి ఉరేసి గడియ పెట్టి కన్నం నుంచి బయటకు వచ్చి తలుపులు పగలగొట్టి ఆత్మహత్య అని ముద్దుగా పెరుపెట్టగలడు.
అదే తలారి ఒకసారి హీరో తండ్రిగా వచ్చి పెరుమాళ్ ను కాపాడి, వాడే పెరుమాళ్ కిరాయి హత్యకు డబ్బులు తీసుకొని చంపడానికి రావడంతో సినిమా ముగింపులోకి వస్తుంది. పదిహేను ఏళ్ల కింద ఈ సినిమా దర్శకుడు తిరునల్వేలి ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదువుకునేటప్పుడు జరిగిన ఒక యదార్ధ గాధను తెరమీదకు తెచ్చాడు. తాను స్వయంగా మంచి కవి రచయిత. వెలివాడ బ్రతుకులు క్షణ క్షణానికీ ఎలా మాడి మసి అవుతాయో తెలియాలి అంటే చాలు. ఇది నిజంగా ఒక గొప్ప దృశ్య కావ్యం.
ఒక్క బక్కోడు వందమందిని బంతుల్లా ఆడుతూ కత్తులతో నరికే పైశాచానికి అలవాటు పడ్డవాడు ఈ సినిమాకి పోవద్దు. బొచ్చు కుక్కను ఒళ్లో వేసుకొని దాని ఎంగిలి నువ్వూ, నీ ఎంగిలి అదీ నాకే వాళ్ళు, ఈ ఊర పందులు, విశ్వాసంగా ఉండే ఊరకుక్కల విన్యాసాల మీద, ఇంటి మీద లేని కప్పులు, వంటి మీద లేని ఆచ్చాదనలూ, సింగపూర్ చల్లదనాలలో వీరోయిన్ మూరెడు ఎత్తుల చెప్పులు, అదనపు ఎత్తులతో పెంచిన ఎదలను ఎరగా వేసే క్యాట్వాక్ లకు అలవాటుపడ్డ కళ్ళకు ఈ బండపెదాలు, ఎండిన ఎదలూ భావప్రాప్తిని ఇవ్వవు. కనుక మీరూ ఈ సినిమాకు వద్దు. బాబుగారి డాబుసరికి అలవాటు పడ్డ మల్టీ ఫ్లెక్స్ లు చిందు, డక్కలి ముఖాలకి కట్ అవుట్లు కట్టి సినిమా హాళ్ళను అంటు చేయడమే అనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొద్దు. మొత్తంగా సినిమాను మా కులాలు మాత్రమే ఉద్దరించడానికి పెట్టి పుట్టాయి అనేవాళ్ళకు, ముఖ్యంగా మారుతీరావుకు జై అంటూ బారులుతీరిన గుంపులో ఉన్న వాళ్ళకూ ఈ సినిమా వద్దు.
తిరునల్వేలి న్యాయ విద్యార్ధిగా తాను అనుభవించిన మానసిక క్షోభ అందునా మొదటి తరం దళిత బహుజన లోకం తన లేమితో, భాష,‘సాంస్కృతిక’ వెనక బాటుతో నడిచిన తడ బడిన అడుగుల వ్యధ ఈ సినిమా.
న్యాయ కళాశాలలో పనిచేస్తూ ‘ఓహో అదా రిజర్వు బాచ్ వాళ్ళు అంతే చదవరు. తాగుడు తినుడు గొడవలు ఇవి తప్ప వాళ్లకు ఏమీ రాదు’ అనే పంతుల్ల ఈసడింపుల మధ్య ఒక బడుగు జీవి పట్టా కోసం చేసిన యుద్ధం ఈ సినిమా. ఇదొక కాలబైరవుడి కన్నీటి కథ , ఇదొక కర్రి కుక్క స్మృతి, ఇదొక వొక్కి బుగ్గల బోసినవ్వు. ఆనందం కోసమో ఆహ్లాదం కోసం రెండుగంటల ఆటవిడుపు కోసమో ఈ సినిమా తలపే వద్దు. నల్లటి ముఖాల్లో దాగున్న ఇంద్రధనుస్సు, ఆరుబయట జాలారి బండ మీద అవ్వ కూకోబెట్టి కుంకుడు కాయల రసాన్ని నెత్తిన రుద్దిన ప్పుడు కళ్ళలోకి జారిన రసం ఎరుపెక్కిన కళ్ళు కావు, అవి కన్నీటివరదలు. ధైర్యం ఉంటె చూడండి.
మన విముక్తి అనే కల ఇంకో వెయ్యేళ్ళు అయినా నెరవేరదు కానీ ఇప్పటికి ‘పెరియారుం పెరుమాళ్’తో సరిపెట్టుకుందాం. ‘బ్లూ మూన్’ పా.రంజిత్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ తొలి సినిమా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కథిర్, ఆనందితో బాటు అనేక మంది సాంప్రదాయ ప్రజాకళాకారులు వాళ్ళ సంస్కృతులు కలబోసిన అరుదైన సినిమా ఇది. అంతకు మించి నిన్ను ఉద్రేక పరిచే ఒక్క అంశమూ లేదు. నేనైతే ఇంకా దుఃఖం నుండి ఇంకా బయటకు రాలేదు.
*
థాంక్స్ సారంగ.
చూసిన సినిమాని గుండె పట్టి లాక్కొచ్చి గుంపు ముందుంచడం గుర్రం సీతారాములికే చెల్లింది. అనుభవించిన కష్టాన్ని కధనం గా మార్చి కుళ్ళిన సమాజాన్ని చాకిరేవు పెట్టడం తమిళ కళాకారులకి తెల్సినంతగా ఇంకెవరికి తెలీదు.
డాక్టర్ సీతారాములుగారు! మీరింత బాగా రాసిన ఇంత మంచి సమీక్ష చదివాక ఈ సినిమా చూడకూడదనే అనుకుంటున్నానండి- ఎంత గొప్పగా తీసినా సరే! మార్చలేని బ్రతుకుని, తీర్చలేని బాధని వెతికి చూసి మరీ – ఏమీ చేయలేక – ఊరికే బాధో, సిగ్గో పడడం కూడా తప్పనిపిస్తుంది కాబట్టి!
అద్భుతమైన సినిమా. బాగా రాశారు సీతారాములు గారూ!
సన్నివేశాలు, మాటలు, పాటలలో పొరలు, పొరలుగా కనిపించే అర్ధాలని తరచి చూడాలంటే, మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా.
పోతే, చిన్న సవరణ. సినిమా పేరు ‘పరియేరుం పెరుమాళ్’ అని చదువుకోవాలి.
థాంక్స్ కిరణ్ సర్
సినిమా రెండు సార్లు చూసినా అర్ధం కాలేదు. సమీక్షలు ఇతర ప్రసంగాలు చూసాక ధైర్యం వచ్చింది. తమిళ్ లో న్యూ వేవ్ కొత్త కాదు కానీ, పా రంజిత్ ప్రవేశం తో ఇదొక షిఫ్ట్ అనుకోవచ్చు. ప్రయోగాలు సినిమా ప్రయోజనం పెట్టుబడికి బడ్డ శత్రువులు అయినా ఈ సినిమా ప్రయోగం పెట్టుబడి కూడా వచ్చింది. నిజాయితీ గా తీస్తే ఏదయినా నిలబడుద్ది, తెలుగు నాట సినిమా నిజాయితీ ని నమ్ముకోలా కులాన్ని,నుడికారాన్ని, ద్వేషాన్ని నమ్ముకుంది అరవింద సమేత ఆ క్రమానికి పరాకాష్ఠ. సినిమా తెరకు జబ్బు చేసింది. గడిచిన దశాబ్దాలుగా సినిమా అసమ వికువలను అసంబద్ద డాంబికాన్నీ ప్రోది చేసింది. దానికి విరుగుడు డెమి గాడ్స్ గా తిష్ట వేసిన తెర కింద విగ్రహాలను ద్వశం చేయడం మినహా మనం ముందుకు పోలేము..
ఇంతకంటే అద్భుతమైన సమీక్ష రాయడం ఎవ్వరి వల్లా కాదు…ఈ సినిమాని సరైన కోణంలో ఆవిష్కరించారు మీ సమీక్షలో…పేదరికపు కష్టాలు చదువుపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో చక్కటి వివరణ, అడుగడుగునా ఎదురయ్యే ఎగతాళి,చిన్నచూపు, వీడికి చదువులు అవసరమా అనే మాటలని పలికించే కళ్ళు సమాజానికి అత్యంత హానికరం.
ఒక నిజాయితీ సమీక్షని చదివాను.
అద్భుతమైన విశ్లేషణ అన్న. మీ మార్క్ అనాలిసిస్. ఆద్యాంతం కట్టిపడేశావు.
ఇలాంటి సినిమాల స్థాయికి చేరుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ర్టీకి ఇంకా అనేక సంవత్సరాలు పట్టొచ్చు.
అంటరాని వాళ్ల జీవితాలను అద్భుతంగా తెరకెక్కించడం తమిళులకే సాధ్యమైంది.
ఈ వ్యాసం గురించి ఆ మధ్య మామిడి హరి క్రిష్ణన్న, దర్శకుడు వేణు ఊడ్గుల గుర్తు చేశారు. దాంతో నాకూ చదవాలని ఇంట్రెస్ట్ కలిగింది.
మిమ్మల్నే అడిగి తీసుకుందాం అనుకున్న.
ఇంత మంచి వ్యాసాన్ని రాసినందుకు డా.సీతన్నకు, ప్రచురించినందుకు సారంగకు ధన్యవాదాలు.
జైభీం
థాంక్స్ రవీ.
నేను ఏదయినా రాయడానికి రోజులు రోజులు ఆలోచిస్తా,ఈ సినిమా చూడగానే అయ్యో ఇది నా బ్రతుకే కదా అనిపించింది.వెండితెర మీద మొదటి తరం అయిన నీకథా, నాకథ మన చిన్నప్పటి నుండి బడిలో కళాశాల లో యూనివర్సిటీలో మనం నడిచిన అవమానపు మెట్ల ను గాయపు జ్ఞాపకాలను మళ్ళీ తడుము కోవడమే అనిపించింది. ఊరు బడినుండి మొదటి సారి ఎఫ్లూ లాంటి మల్టీ కల్చరల్, అల్ట్రా మోడ్రెన్ లాంట పాష్ సెంటర్ లో ముతక గుడ్డలు,మాసిన జుట్టు,వాడ నుడి ని వెంటేసుకుని తిరిగిన ఒక ఊరోడు బ్రతుకే మద్రాస్ లో ఇరవై ఏళ్ళ కింద తెరమీద చూడడం నచ్చింది. ముఖ్యంగా నా పరిశోధన చిందు డక్కలి సాంస్కృతిక అంశం మీద . మూడు నాలుగేళ్ళు వాళ్ళ ఇండ్లల్లో నేను చూసిన జీవితం తెర మీద చూసా. నాకయితే డక్కలి గోపాల్ మాత్రమె యాదికి వచ్చాడు. ఇది మన కథ మన బ్రతుకు
నైస్ ఎనాలసిస్ but టైటిల్ ఈజ్ నాట్ మ్యాచ్.
Great one sir
బాగుంది. కానీ ఈ సినిమా పేరు: పరియేఱుమ్ పెరుమాళ్ (பரியேறும் பெருமாள்). సరిచేయండి, ప్లీజ్!
మీ విశ్లేషణ చాలా అద్భుత్జంగా వుంది చాలా బాగా రాసారు .ఇది చదివేంతవరకు ఈ సినిమా గురించి తెలియదు వెంటనే చూడాలనిపిస్తుంది కానీ తెలుగులో రాలేదనుకుంటాను యుట్యూబ్ లో ట్రై చేస్తాను .మంచిరివ్యూ రాసిన మీకు అభినందనలు
అద్భుతం సీతారాములూ
తాగుడు తినుడు గొడవలు ఇవి తప్ప వాళ్లకు ఏమీ రాదు’ అనే పంతుల్ల ఈసడింపుల మధ్య ఒక బడుగు జీవి పట్టా కోసం చేసిన యుద్ధం ఈ సినిమా. ఇదొక కాలబైరవుడి కన్నీటి కథ , ఇదొక కర్రి కుక్క స్మృతి, ఇదొక వొక్కి బుగ్గల బోసినవ్వు. ఆనందం కోసమో ఆహ్లాదం కోసం రెండుగంటల ఆటవిడుపు కోసమో ఈ సినిమా తలపే వద్దు. నల్లటి ముఖాల్లో దాగున్న ఇంద్రధనుస్సు, ఆరుబయట జాలారి బండ మీద అవ్వ కూకోబెట్టి కుంకుడు కాయల రసాన్ని నెత్తిన రుద్దిన ప్పుడు కళ్ళలోకి జారిన రసం ఎరుపెక్కిన కళ్ళు కావు, అవి కన్నీటివరదలు. ధైర్యం ఉంటె చూడండి.
great view anna .