వెండితీగల వేళ

కాంతంగా మిగిలిన ఇంట్లో
వాళ్ళిద్దరూ
ఒకరి కళ్ళలో ఒకరు
ఎన్నో ప్రపంచాలను
దర్శించుకుంటారుఅతడి నడకకు
ఆమె పాదమై
ఆమె చూపుకు
అతడు కళ్ళయ్యాడుఆమె
అతడి దోసిట్లో
కొన్ని దుఃఖాలను పోసింది
అతడు
ఆమెను అరక్షణంలో
చిరునవ్వుల చెరువుగా చెక్కాడు

అరుదుగా వాళ్ళిద్దరూ
ఈదిన సముద్రాలనో
గుచ్చుకున్న ముళ్ళనో
లెక్కగట్టుకుంటారు

ఆమె చెంపలపై
వాలిన వెండితీగలతో
అతడు పసిపిల్లాడై
మురిపెంగా ఆడతాడు
ఆమె చిలిపిగా
అతడిపై చూపులను
గురి పెడుతుంది

గాలి మోసుకొచ్చే
రెక్కలొచ్చి ఎగిరిపోయిన
పిట్టల వార్తలను
ఆనందంగా తడుముకుంటూ
ఇద్ధరూ  కాసేపు
వసపిట్టలవుతారు

రెండు పొరపాటున లెక్కతప్పి
ఒకటి అవుతుందేమో
అనే దిగులును
వాళ్ళు దరి చేరనీయరు

ప్రస్తుతాన్నే ఆరాధిస్తూ
అపురూప క్షణాలను
సాగు చేసుకుంటూ
ఖాళీ సమయాలను
పూలతోటగా మలచుకుంటారు

మనం అనుకుంటాం కానీ
వాళ్ళిద్దరని
అక్కడున్నది
మృదుమధుర జీవనసంగీతమై
ఒకరే!

*

పద్మావతి రాంభక్త

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు