జీవితమా నీకు కృతజ్ఞతలు
నువ్వు నా కొసగిన కానుకల మూటను భద్రంగా మోసుకుని వెళ్లాను
ఎంతటి బరువైనదో అది ఇక మోయడం వల్లకావడం లేదని
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నానో
నీకు మాత్రం నా మాటలు వినపడలేదు ఎన్నడూ
కాసిన్ని నవ్వులను, దుఃఖాల్ని, దిగులు దిగులు ఏకాకితనపు రెక్కలను
హృదయపు లోలోతులలో ఎడతెగని ఒక సన్నటి నొప్పిని
ఇన్నేళ్ళుగా మోసుకు తిరుగుతున్నాను
ఇక ఇప్పుడీ ముగింపు వేళ
ఒక్క సారి వెనక్కి తిరిగి చూసినప్పుడు
నడిచిన వచ్చిన దారి నాకేసి వెక్కిరింతగా నవ్వింది
ఆ నాడే తెలుసు నాకు
నా తొట్టతొలి జ్ఞాపకాల వెలుగు చీకట్ల
మాయామోహ ప్రపంచపు నీలి నీడే
నా జీవితం పొడుగునా పరివ్యాప్తించి
నన్ను నడిపే చుక్కాని అవుతుందని
ఆకాశమంతటా కమ్ముకున్న
లేత నారింజ వర్ణపు సూర్యాస్తమయం
మబ్బుల మధ్య దోబూచులాడే చందమామే
నన్ను వదలక నా వెంట చివరి వరకూ వచ్చు ప్రియ మిత్రులని
పచ్చదనాల సముద్రాల్లో, పక్షుల పాటల మధ్య
తూనీగ రెక్కలపై ఊయలూగిన వసివాడని బాల్యపు జ్ఞాపకాలు
మొగలి పొత్తుల పరిమళాలై ఇంకా నా లోనుంది వీడలేదు
తొలి యవ్వనోద్రేకాల ధర్మాగ్రాహాల భూతమేదో
నన్ను పట్టి పల్లార్చిన వేళ
గుండెల నిండా ఎగిన ఎర్రజెండా రెపరెపలు
నన్నొదలని ఉస్వాస నిశ్వాసలై ఇంకా నా లోనే నిద్రిస్తాయి
మృతులైన నా సహచరుల నీడలు నాతో ఇంకా సంభాషిస్తాయి
జీవితం ఎంతో నిర్దయగా నా నుండి
లాక్కుని వెళ్లిన నా ప్రేమల గురించి కూడా
కొంచెం మాట్లాడాలి ఇప్పుడు
ఎందుకట్లా మధ్యలోనే వెళ్లిపోయావ్?
నా తేన రంగు కళ్ల ప్రియమైన వాడా!
నా అరచేతిలో పుట్టుమచ్చను ముద్దుపెట్టుకున్న వాడా
రెప్పపాటులోనే, చాచిన నా చేతుల నుండి నీ స్పర్శ
సీతాకోకచిలుకై ఏటో ఎగిరి పోయింది
ఏం చేయాలో దిక్కుతోచక భయం భయంగా
నా శూన్య హస్తాలను చూసినప్పుడల్లా
నల్లటి పుట్టుమచ్చ నాకేసి జాలిగా చూసి ఏదో చెప్పబోతుంది
అప్పుడు లేకపోవడం అంటే ఏమిటో
వినదలుచుకోని దానిలా నటిస్తాను
ఎంత మృదువైన వాళ్ళు పసిపిల్లలు
నిన్ను మొదటి సారి సుకుమారపు పూవులా నా చేతుల్లోకి తీసుకున్న
అద్భుత, అపురూపమై క్షణం ఇంకా పదిలంగానే ఉంది హృదయంలో
రెప్పన్నా ఆర్పక నీకోసం నిద్రగాచిన రాత్రులు
ఎందుకో అప్పుడప్పుడూ గుచ్చుకుని చటుక్కున మేల్కొంటాను
లోకంలోకి తెచ్చిన నేను తప్ప నీకు ఎవరూ లేరని తెలిసి, తెలిసీ
అట్లా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లగలిగిన నిందితురాలినో , సాహసినో
ఎన్నటికీ కలవని తడి ఇంకిపోయిన
రెండు సమాంతర ప్రవాహాలమై పోయి
అంతా ముగిసిపోయాక ఇప్పుడు ఎవరు తేల్చగలరు ?
ఊపిరాడని అంతులేని దుఃఖ సముద్రాల సుడిగుండంలో
మునిగిపోతూ ఆసరాకై గడ్డిపరక కోసం చాచిన నా చేతిని
నా కోసమే వేచి చూస్తున్నఅదృశ్య హస్తం ఒకటి ప్రేమగా అందుకున్నాకే కదా
నేను మళ్ళీ బతికింది
మరణించిన మనసు మళ్ళీ సమాధులపై పూచిన పేరులేని పూల తీగలా అల్లుకుని
కన్నీళ్ళని పూస్తూ మెల్లిగా నవ్వింది , ప్రేమించడం మళ్ళీ నేర్చుకుంది
జీవితం పట్ల ప్రేమ నా లోలోన ఒక్కోమారు సడిచేయని మలయమారుతమై హాయిగొలిపి
మరొక్కమారు ప్రచండ అగ్ని వర్ష విలయతాండవమై చెలరేగి
నన్ను నన్ను కాకుండా ఎక్కడెక్కడికో విసిరేసి వికటాట్టహాసం చేసినప్పుడు
పక్కనే వున్నా దాటలేని అగాధాల అగడ్తలు, వేల యోజనాల దూరం భరించలేక
పట్టపగలే కనపడని కటిక చీకటి దారులలో దారి తప్పి వెర్రిగా నా నీడకై వెతుకులాడుతాను
నా నిద్రాజాగ్రత్తవస్థలలో మనుష్యులను మళ్ళీ, మళ్ళీ పోగొట్టుకోవడం అన్న భయం
నన్ను కాలసర్పమై చుట్టుకుని నన్ను నాలా మిగలనివ్వదు ఎన్నడూ
నాకు తెలుసు జీవితపు పొడవునా నా వెన్నంటి నిలిచిన
నా ప్రియమైన నీలి నీడ నన్నొదలక నాలోనే నిదురిస్తుందని
హేతు రహిత సుఖ దుఃఖాల ముళ్ల కంచెలపై జీవితాన్ని అట్లా ఆరేసుకుని
వదలని దిగుళ్ల ఏకాకితనపు సాలెగుళ్ల మధ్యా చిక్కుకొని అల్లాడి
చివరకు నేనొక పొగమేఘమై తేలిపోయే ఈ చివరి వేళ
వెంటవచ్చునది ఏదీ లేదన్న ఎరుక హఠాత్తుగా పరమ ప్రశాంత
మహా సముద్రమై ఇన్నాళ్లకు నా లోపల ఆనందమై నిదురించింది
ఏమి చూసాను ?
ఎన్నెన్ని వాసంత సమీరాల గ్రీష్మ తాపాల సుడిగాలుల మధ్య
నేను ఏమి చూసాను?
నేల విచ్చుకుని నిలువునా కూలిపోయే భూకంపాలను
ఇసుక తుపానుల వడగాల్పుల ధూళి మేఘాలను
కుంగిన ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రాలను చూసాను
కొన్ని ప్రేమలను , అనేక వెక్కిరింతలను చూసాను
గాయపడి, ఇతరులను గాయపరిచి
గాయల జాడలు మాత్రమే చివరకు మిగిలిన జీవితాన్ని చూసాను
ఓడినప్పుడల్లా పడిలేచే కెరటమై లేవాలన్న సత్యమే కదా
నన్ను మళ్ళీ, మళ్ళీ నిలబెట్టేది
గాయాలు మాని మచ్చలైనా , మనుషుల్ని ప్రేమించగలటమే
బతుకు పరమార్ధమని మరువక పోవడమే కదా
మళ్ళీ మళ్ళీ గాయపడేందుకు నన్ను సిద్ధపడేలా చేస్తున్నది
పక్షులు వాలిన పచ్చటి అరణ్యాలను
జలపాతల్లా పరవళ్లు తొక్కే కొత్త ఆశల ప్రవాహల్లో
ఈదులాడే కళ్ళనిండా దయగల పిల్లలను
వాళ్ళ నవ్వులు చూసినప్పుడు ఈ ముని మాపు వేళ
నా యవ్వనం నాలోకి తిరిగి వచ్చినట్లుగా కల గంటాను
మనుష్యులపట్ల , ప్రేమల పట్ల నమ్మకాల్ని నిల బెట్టే
కొడిగడుతున్న మాయ లాంతరును పట్టుకుని వెతుకుతాను
నేను నడచి వచ్చిన దారులలో
వెనక్కి తిరిగి చూసుకుంటే ఇహ ఇప్పుడు
ద్వేషాలు, కోపాలు, ఆశాభంగాలు ఏమీ లేవుకానీ
సన్నటి నొప్పిమాత్రం ఆగి ఆగి సలుపుతుంది
నీళ్లు ఆవిరైపోయిన శిధిల తటాకం ఒకటి
అప్పుడెప్పుడో వెలిగిన జీవితపు పురాస్వప్నంలా
ఆ ఊడల మఱ్ఱిచెట్ల మధ్య అస్పష్టంగా అగపడుతుంది
ఆ వడ్డున కాసిన్ని గడ్డిపూలు, లిల్లీలు విరబూసాయి
అదిగో ఒక సీతాకోకచిలుక రెక్కలార్పుతూ
అరవై ఏళ్ళ నా జీవితం కేసి వింతగా చూసి ఎగిరిపోయింది ఎటో
*
షష్టిపూర్తి కి ఇంకా 11 సంవత్సరాల దూరంలో మాత్రమే ఉన్న వాడిని అక్కా 👍👍 అన్నింటిలో కాకపోయినా కొన్నింటిలో అయినా , అన్నీచేతకాకపోయినా చేతనైనన్నిటిలో మీతోనే అక్కా.
కవిత చాలా బావుంది. కాటిసీను పద్యంలా నిండుగా వుంది. కొన్ని కవితల్ని ప్రపంచానికి పంచి పెట్టి, చెప్పుకోలేని అనేక కవితల్ని మరణానంతర జీవిత సౌందర్యం కోసం మోసుకుంటూ చివరి వరకు కవులకు వెంట వచ్చునది కవిత్వమే. నిజమైన కవి విమలకు కృతజ్ఞతలు.
సన్నని నొప్పి మాత్రం ఆగి ఆగి సలుపుతుంది..జీవిత పరమార్ధాన్ని బాగా చెప్పావు అక్కా! కవిత చాలా బాగుంది ఒక జీవితం చదివినట్లుగా..హృదయాన్ని మేలుకొల్పుతున్నట్లుగా…అభినందనలు మీకు
చాలా బాగా చెప్పావు విమలా జీవితం గురించి . ముఖ్యంగా:
ఓడినప్పుడల్లా పడిలేచే కెరటమై లేవాలన్న సత్యమే కదా
నన్ను మళ్ళీ, మళ్ళీ నిలబెట్టేది
గాయాలు మాని మచ్చలైనా , మనుషుల్ని ప్రేమించగలటమే
బతుకు పరమార్ధమని మరువక పోవడమే కదా
మళ్ళీ మళ్ళీ గాయపడేందుకు నన్ను సిద్ధపడేలా చేస్తున్నది …….
నీళ్లు ఆవిరైపోయిన శిధిల తటాకం ఒకటి
అప్పుడెప్పుడో వెలిగిన జీవితపు పురాస్వప్నంలా
ఆ ఊడల మఱ్ఱిచెట్ల మధ్య అస్పష్టంగా అగపడుతుంది
ఆ వడ్డున కాసిన్ని గడ్డిపూలు, లిల్లీలు విరబూసాయి
అదిగో ఒక సీతాకోకచిలుక రెక్కలార్పుతూ
అరవై ఏళ్ళ నా జీవితం కేసి వింతగా చూసి ఎగిరిపోయింది ఎటో
Who can write like this?
చాలా బాగుంది. ఇంకా ఎక్కువగా ఈ క్రింది లైన్లు.
ఎందుకట్లా మధ్యలోనే వెళ్లిపోయావ్?
నా తేన రంగు కళ్ల ప్రియమైన వాడా!
నా అరచేతిలో పుట్టుమచ్చను ముద్దుపెట్టుకున్న వాడా
రెప్పపాటులోనే, చాచిన నా చేతుల నుండి నీ స్పర్శ
సీతాకోకచిలుకై ఏటో ఎగిరి పోయింది
ఏం చేయాలో దిక్కుతోచక భయం భయంగా
నా శూన్య హస్తాలను చూసినప్పుడల్లా
నల్లటి పుట్టుమచ్చ నాకేసి జాలిగా చూసి ఏదో చెప్పబోతుంది
అప్పుడు లేకపోవడం అంటే ఏమిటో
వినదలుచుకోని దానిలా నటిస్తాను
అక్కా…..
ఇది కవిత కాదు నీ జీవిత సంతకం. చూస్తూ చూస్తూ…..
మన పరిచయమే నాలుగు పదులు దాటింది. యెన్నో వంకలు, ఒర్రెలు, దారులు, గిరులు,శిఖరాలు, లొయలు దాటాం. చిరికి మిగిలింది “సన్నటి నొప్పి”….
నీ అరవై వసంతాల లో లెనన్ని బరువులను ఇశ్టంగానొ క శ్టంగానొ మోస్తూనె వున్నావు.
చెరువంత దుఖాన్ని నింపుకుని కన్నీటి మత్తడి దుంక కుండా జాగ్రత పడ్డావు…….
నిలువునా అల్లుకున్న శిబ్బితీగా ఆర్టాంతరంగా వాలిపోయీ ఎండిపొయి రాలిన కాలాన్ని…..కుహూరపు చీకటిలో నక్షత్రాలు ఎందుకు రాలాయో తెలియని కాలాల ఙ్ఞాపాకాలను ముల్లెకట్టుకున్నావు.
నీడే శత్రువైన చోట యెవరిని నమ్మాలి….. రాలిన నక్షత్రాల్ని యెవరూ హత్తుకుంటారు….యేరుకుంటారిప్పడు?
అక్కా…..
అయినా నీవెత్తిన పిడికీళ్ళు….. ప్రశ్నల కొడవల్లు….కవితా బాణాలు…..కదా ….మా దోసిళ్ళలొ నింపిన కాసిన్ని సంతోషాలు…..
అక్కా….
ఈ కాశాయీకారణ కాలంలో టైటానిక్ షిప్ నాయకగా మిగిలావు. రాలిన ఎర్ర గు
లాభి రెకులను ఒక్కొక్కటి ఏరి పోగుచేసి నీకందిస్తాము….. నీవు ఒంటరివి కాదు నీ వెనకే మేమున్నామని…….. ఎన్ని గాయాలైనా…. తిరిగి తిరిగి పడి లేస్తూ…… నీలో నిద్రిస్తున్న ఎర్ర జెండా రెప రెపలను తిరిగి అవనతం చేద్దాం…..
చదువుతున్నంతసేపు నేపథ్యంలో బలగంగాధర్ తిలక్ గేయాలు, శ్రీశ్రీ కవితా ఓ కవితా కదులుతూనే ఉన్నాయి. అద్భుతమైన క్లాసికల్ పోయెమ్. జీవితాన్ని ఇన్ని గుప్పిళ్ల పదాలతో నడిచి వచ్చిన దారిని ఎగిరిన సీతాకోకచిలుకలతో, కనుమరుగైన పోరాట సఖుడి జ్ఞాపకాలతో ఎంత బాగా నిర్వచించేరు విమలా, మీకు అభినందనలు
వెంటవచ్చునది వెంటవచ్చు నది, ముందు సైతం ఇంకొక నది. దాటవలసిన వైతరణి,
నేల విచ్చుకుని నిలువునా కూలిపోయే భూకంపాలు
ఇసుక తుపానుల వడగాల్పుల ధూళి మేఘాలు
కుంగిన ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రాలు
మాయ లాంతరు దారి చూపుతుందా?
చదువుతూ, చదువుతూ కన్నీళ్ల మధ్య, ఏమని చెప్పాలి విమలా?
“ఇదిగో ఇక్కడొక పొడవాటి, నిశ్శబ్ద వీధి
నేనా నల్లటి చీకటిలో నడుస్తూ, తూలి పడిపోతాను
లేస్తాను, గుడ్డిగా నడుస్తూ వుంటాను, నా పాదాలు
ఆ మౌనంగా మాట్లాడని రాళ్ళనీ, ఎండిన ఆకులనీ తొక్కుకుంటూ నడుస్తాయి
నా వెనకాల ఎవరో నాలాగే రాళ్ళనీ, ఆకులనీ తొక్కుకుంటూ నడుస్తున్నారు
నేను వేగం తగ్గించి నడుస్తాను, తానూ నాలాగే నెమ్మదిగా
నేను పరుగెత్తుతాను, తనూ పరుగెత్తుతాడు
వెనక్కి తిరిగి చూస్తాను
ఎవరూ లేరక్కడ “
(పాజ్ కవిత ‘ది స్ట్రీట్’ నుంచి)
అద్భుతమైన కవిత .కండ్ల నిండా నీళ్లు .. జ్ఞాపకాల సుడులు తిరిగే దుఃఖారణ్యాల చిక్కుపడిన దారులు. మొహాన్ని చరచికొట్టే గతకాలపు క్షణాలు … ఇంత దుఃఖాన్ని ఎట్లా ఒడిసిపట్టుకుని మోస్తున్నావు తల్లీ ఇంత విషాద మధుర గరళాన్ని ఎట్లా కంఠాన పట్టావు కవీ – నీకు కొన్ని వేల జీవితాల గతాల్ని మింగిన భవిష్యత్తు బాకీ ఉన్నదీ చరిత్ర … నీ కంటి నీరు తుడిచేందుకు రెండు చేతులూ సరిపోక తానే ఓ మేఘమైంది కాలం .. నీ నుదిటిమీద ఎన్నడూ ఆరని ఓ కలైంది ఆకాశం – నీ మెడ నిండా జ్ఞాపకాల గవ్వల హారమైంది నీవు చీలుస్తూ నడిచిన బతుకు సముద్రం – నీ అరచేతుల్లో ప్రతిబింబమైనది వెక్కి వెక్కి ఎగసిపడే కెరటాలతో నీ పాదాలను చుట్టుకు పోతూ
జీవన మజిలీలు కవిత్వ పాదాలైన చివర మీ సంతకం
నిశ్చల కాంతి
వండర్ఫుల్ జీవనాలాపన🙏🙏….
అద్భుతంగా స్వగతంలా చెప్పుకొచ్చిన గతం👌👌
కవిత చదివిన, స్పందించిన మిత్రులందరికి కృతజ్ఞతలు
విమల