వృత్తి జీవితాల సంక్షోభ చిత్రం

తెలుగు కథా సాహిత్యంలో కుల వృత్తులను ఇంతగా పట్టించుకొని కథలు రాసిన వారు కనిపించరు. దాదాపు అన్ని  వృత్తుల పైనా కథలు రాశారు జాతశ్రీ!

 వృత్తి జీవితాల ఆరాట పోరాటాలను, వ్యధార్థ జీవుల కడగండ్లను కథీకరించడంలో అందెవేసిన చేయిగా పేరుపొందిన జాతశ్రీ 4 నవంబర్ 2018న కథాశేషులయ్యారు. వీరి అసలు పేరు చార్లెస్. జాతశ్రీ అనే కలం పేరుతో సుమారు 100కు పైగా కథలు రాసి  ‘చలివేంద్రం’, ‘కుట్ర’, ఆర్తారావం’, ‘పైరగాలి’ అనే కథా సంపుటాలను వెలువరించారు. ఇవన్నీ విశేష పాఠక ఆదరణను పొందినవే.  కొన్ని నవలలు కూడా రాసి పలు రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. పెద్దింటి అశోక్ కుమార్ తరువాత తెలుగు కథా సాహిత్యంలో కుల వృత్తులను ఇంతగా పట్టించుకొని కథలు రాసిన వారు కనిపించరు. దాదాపు అన్ని  వృత్తుల పైనా వీరు కథలు రాశారు. ఇందులో అంతర్ముఖం కథ ఒక వైపు గౌడ కుల వృత్తి సంక్షోభాన్ని, మరో వైపు నిరుద్యోగ యువకులను వలస వైపు నెట్టి వేయడాన్ని చాలా గాఢంగా చిత్రించిన కథ. ఈ కథ 23 మార్చి 2003లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది.

గౌడ కులస్తులైన మల్లేశం, భూదేవమ్మలకు ఒక కొడుకు, ఒక బిడ్డ, బిడ్డ పెండ్లి అయింది. కొడుకు నిరుద్యోగిగా ఊరు మీద తిరుగుతున్నాడు. ఊళ్ళో చేయడానికి పనేమీ లేదు కాబట్టి కువైట్ పోయి అయినా నాలుగు పైసలు సంపాదిద్దామని తనను కువైట్ పంపియ్యమని పోరు పెడుతుంటాడు. వీసా కోసం యాభై వేలు కావాలి ఎలాగైనా తెచ్చి తనను కువైట్ పంపిస్తే రెండు ఏండ్లలో మన కష్టాలన్నీ పోతాయని కొడుకు వాదన. కానీ ఇప్పటికిప్పుడు యాభై వేలు ఎవరిస్తారు? సొసైటీ లోన్ తీసుకుందామన్నా ఊళ్ళో చాలా మంది పాత బకాయీలు కట్టలేదని మళ్ళీ కొత్త లోన్లు ఇవ్వమన్నారు. భూమి అమ్మి అయినా తనను కువైట్ పంపియ్యిమని కొడుకు ఒకటే గొడవ. ఇదిలా ఉంటే వాయిదాల పద్ధతిలో తీసుకున్న టీవీ అప్పూ, బిడ్డ పెళ్లి నాడు ఇస్తానని ఒప్పుకున్న ఇరవై వేలు ఇంకా ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక తల్లీదండ్రీ తల్లడమల్లడం అవుతుంటారు.

మల్లేశం కేవలం కల్లు అమ్మకం మీదనే బతికేవాడు కాదు. కాలం మంచిగా అయి  వ్యవసాయం బాగా సాగితే  తిండికి సరిపడే ధాన్యంతో పాటు ఓ పాతిక వేలైనా చేతిలో మిగిలేవి. కానీ కాలం రోజుకింత  వెనక్కే పోతుంది. దీనికి తోడు దళారీల బెడద. రోజులను చూస్తుంటే మల్లేశంకు భయం వేస్తుంది. ఎంత సంపాదించినా లెక్కకు దొరకడం లేదు. ఎరువుల అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. చదివిస్తే తెలివితో బతుకుతాడనుకున్న కొడుక్కు ‘బతికే తెలివి’ తప్ప ‘అతి తెలివి’ ఎక్కువైంది. చదువుకుంటే కుల వృత్తి చేయకూడదా? నాగలి పట్టకూడదా? అని మల్లేశం చింతిస్తుంటాడు. ఇట్లా ఆలోచించుకుంటూనే తాళ్ళు ఎక్కడానికి తాళ్ళ వనంకు బయలుదేరి మూల మలుపు తిరగ్గానే తులిసమ్మ నురుగుతో ఉన్న కల్లు బింకిని తీసుకొచ్చి మురికి కాలువలో పారబోయడం కనిపిస్తుంది. మల్లేశం మనసు కలుక్కుమంటుంది.

కోకో కోలా ఒకవైపు, గుడుంబా మరో వైపూ పారుతుంటే ఇక నికాలస్ కల్లు ఎవడు తాగుతాడు? అని అంటూనే, అవ్ రా! తమ్ముడూ బండోళ్ళ ఎంకన్న పెళ్ళానికి డబ్బులొచ్చినయా? అని అడుగుతుంది తులిసమ్మ. తెల్వదని మల్లేశం చెప్పగానే నీ మొకం పైసలొచ్చి నాలుగు రోజులైందట అంటుంది. ఎన్ని పైసలొచ్చినా పోయిన ఎంకన్న తిరిగొస్తడా? అక్కా! అంటూ ముందుకు పోతాడు. మల్లేశంకు మనసులో ఎంకన్న మెదులుతాడు. ఎంకన్న వయసు చిన్నదైనా మంచి మనసు. ఓ రోజు తాటి మట్టల్లోంచి గెలను బయటకు తీస్తుంటే మండ్రగప్ప కాటేసి తాటి చెట్టు మీది నుండి పడి అక్కడికక్కడే చనిపోతాడు. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం డబ్బులే ఇందాకా తులిసమ్మ అడిగింది. నష్ట పరిహారంగా ఇచ్చే లక్ష రూపాయలు కోసమా కుల వృత్తులు? బతుకులు? ఆలోచనలతో మల్లేశం మనసు చిందరవందర అవుతుంది.

తాళ్ల వనం దాపు దగ్గరికొచ్చే సరికి కొర్ర రాములు ఎదురుగా వచ్చి “మామా కాలు జాగ్రత్త. కాళ్ళ గుది గట్టిగా జూసుకో. మంచుకు చెట్టు పురాగా తడిసి ఉంది” అంటాడు. “తాతకే దగ్గులు నేర్పుతావారా?” అని నవ్వుతాడు మల్లేశం.

“రేయ్ రామూ!  నీ సావాసగాడేగా… మావోడికి నువ్వన్నా జెప్పురాదురా! కుయిట్ కుయిట్ అని గోస పెడుతుండు” అన్నాడు మల్లేశం.

“ఇయాల్రేపూ డబ్బుదే లోకం. తల్లేగాని, చెల్లేగాని డబ్బుతో కొలుస్తుండ్రు. వాడదృష్టం ఎట్టుందో, ఎట్టనన్నజేసి పంపియ్యి మామా…. కాదంటే ఒరిగేదేవన్నా ఉందా?” అనుకుంటూ దాటి పోతాడు రాములు.

మల్లేశం మనసంతా ఎన్నో ఆలోచనలు చుట్టుముడుతాయి. ఏమన్నా కానీ కొడుకును కువైట్ పంపడానికే నిర్ణయించుకుంటాడు. కానీ డబ్బులెట్లా? అని ఆలోచనలో పడుతాడు. ఎట్లైనా నువ్వే ఈ గండం నుంచి గట్టెక్కించాలని కుల దైవం కాటమయ్యకు మొక్కుకుంటాడు. తాటి చెట్టు ఎక్కుతుంటే ఒకవైపు కొడుకు భవిష్యత్తు, మరోవైపు అప్పులు మనసంతా నిండుకుంటాయి. సగమెక్కేసరికి కళ్ళు తిరుగుతాయి. ఇయ్యాల గాకున్నా రేపైనా బూడిదగాక తప్పుద్దా? అనుకుంటాడు. ‘చెట్టు గీసేవోడి కంటే చెట్టు మీంచి పడినోడికే ఇలువ’ అనుకుంటూ గెలకు కట్టిన లొట్టి విప్పుతుంటే తలతిరిగినట్టవుతుంది. తనకేదో అవుతుందనుకుని చెట్టును పట్టుకుందామనుకునే లోపల్నే మోకు జారీ, కాళ్ళ గుది తప్పిపోయి  అంతెత్తు చెట్టు మీది నుంచి “పెద్దోడా.. కుయిట్ జగర్తరో” అనుకుంటూ కింద పడిపోతాడు.

కథంతా ఒక డాక్యుమెంటరీలా నిరాడంబర శైలిలో సాగిపోతుంది. భాష, జీవితం, సన్నివేశ కల్పన అన్నీ తెలంగాణ ప్రాంతీయతను పట్టి చూపుతాయి. తెలంగాణలో 1970ల నుండి పద్మసాలీల వలసలు ప్రారంభమైతే, 1990ల నుండి అన్ని వృత్తుల వారు వలస బాట పట్టడం కనిపిస్తుంది. 1969 నాటికే నిరుద్యోగం పెరిగి పోయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలవడం గమనార్హం. 90వ దశాబ్దమంతా కరువు విలయతాండవం చేయడంతో ఆత్మహత్యలు, వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకో వైపు ప్రపంచీకరణ వల్ల కూడా కుల వృత్తులు నాశనమైపోయి తెలంగాణ సమాజం కుతకుత ఉడికి పోయింది. ఈ ఉక్క పోత వాతావరణమంతా ఈ కథలో అంతర్లీనంగా తొంగి చూస్తుంది. కథలో ప్రస్తావనకు వచ్చిన అంశాలకన్నా రాని  విషయాలే సముద్రమంత ఉండి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ కథలో చెప్పిన గౌడ కులస్తుల జీవిత సంక్షోభమే కాదు ఇంచుమించు అన్ని కులాల్లో ఇలాంటి ఘర్షనే కనిపించేది ఒకప్పుడు. తాము బతికి ఎట్లాగూ పిల్లల్ని సుఖపెట్టలేక పోతున్నాం. కనీసం చచ్చి అయినా వాళ్ళకింత మంచి జీవితాన్నిద్దామనే ఆలోచనతో బలవంతంగా జీవితాన్ని చాలించడం చూస్తే కడుపులో కార్జాలు కదిలిపోతాయి. కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచి కుటుంబ పెద్ద జీవితాన్ని చాలిస్తుంటే, ఎక్స్ గ్రేషియా కోసమే రైతులు, నేత కార్మికులు, ఇతర వృత్తుల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాలు వ్యాఖ్యానించడం విడ్డూరమనిపించింది. కథంతా కొడుకు కోసమే నడుస్తుంది. కానీ కొడుకు ఎక్కడా తెర మీదికి రాడు. కథకుడు చూపించిన శిల్ప చమత్కారంలో భాగం ఇది.  తెలంగాణ సమాజమంతా ‘అంతర్ముఖం’లోకి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చిన కథ ఇది. కథ విషాదాంతమే అయినా రోగికి వైద్యుడు చేదు మందు ఇచ్చి చైతన్యం నింపినట్టుగా పాఠకుల రక్తంలోకి ఏదో ఆవేశాన్ని, ఆలోచననూ, కార్యోన్ముఖతను ఒంపి పోయే కథ. జాతశ్రీ కథన నైపుణ్యం, వాస్తవ జీవిత వర్ణనా కౌశలం నాలుగు కాలాలపాటు పాఠకుల హృదిలో నిలిచిపోయే కథ.

                                         (జాతశ్రీ గారికి అక్షర నివాళి)

 

 

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు