చక్కటి వచనం రాసే రచయితగా సుస్మితని నేను ఇవ్వాళ్ళ కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆమె బ్లాగు (కొత్తావకాయ) తెలిసినవాళ్ళు, ఆమె రాసిన ఎన్నో కథలని చదివిన వాళ్ళు, ఆ మధ్యన వెలువరించిన మంచి వెన్నెల వేళ అనే మధురమైన తిరుప్పావై పాశురాల కథల పుస్తకం చదివిన వాళ్ళు – వీరందరికీ సుస్మిత వచనం రుచి తెలుసు. కొంచెం భావుకత, కాసింత గడుసుదనం, ఏదీ పూర్తిగా విప్పి చెప్పెయ్యకుండా కాస్త పాఠకుల మెదళ్ళని కదిలించడం, అన్నిటికీ మించి చక్కటి తెలుగు నుడికారం – ఇవన్నీ ఆమె సొంతం.
ఈ నా చిన్న రాత సమీక్ష కాదు, విమర్శ కాదు, దానికింకా సమయం ఉంది. ప్రస్తుతానికిది నవలకి చిన్న పరిచయం మాత్రమే. ఈ వలస నవలలో పూర్తిగా మరో పార్శ్వాన్ని చూస్తారు మీరు ఈ రచయితలో. సునిశితమైన సమాజ పరిశీలన, మసి బూసి మారేడు కాయ చెయ్యకుండా విషయాన్ని ఉన్నదున్నట్టు సూటిగా చెప్పడం ఈ నవలని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సజీవమైన పాత్రలు సహజంగా ఉండే పాత్రలు కథను నడిపించాయి. అంతే కాకుండా రియలిస్టిక్ దృక్పథంతో రాసిన సమకాలీన సాంఘిక నవల కావడంతో ఈ పాత్రల్లో కనీసం ఒకరిద్దరైనా మనకి తెలిసిన వాళ్ళు అనిపిస్తారు.
60లలో అమెరికా వలస వచ్చిన తొలితరం భారతీయులు, వారి సంతానం ఎదుర్కొన్న సమస్యలు కొన్ని. ఆ తరవాత తరవాత వచ్చే తరాలు ఎదుర్కొంటూ వస్తున్న సమస్యలు వేరు. ఎందుకంటే, అమెరికా సంఘంలో మానవ సంబంధాల పరిస్థితి అనూహ్యమైన వేగంతో మారిపోతోంది. ఉదాహరణకి నేను అమెరికా వచ్చిన కొత్తల్లో మా విశ్వవిద్యాలయంలో గే హక్కుల కోసం ఒక ధర్నా జరిగితే పోలీసులు వచ్చి చెదరగొట్టేశారు. అదే ఇప్పుడు అనేక రాష్ట్రాలలో గే పెళ్ళి చట్టబద్ధంగా అనుమతించ బడింది. ఇరవై ఏళ్ళ కిందట ఊహించను కూడా సాధ్యం కాని పరిస్థితి – రో వెర్సస్ వేడ్ అనే అబార్షన్ హక్కుల న్యాయసూత్రాన్ని సుప్రీం కోర్టు తిరగదోసింది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఈ సమాజం మీద విపరీతమైన వత్తిడిని తీసుకు వస్తున్నాయి.
అమెరికా వలస వచ్చి, ఇక్కడ నివాసం గడుపుతున్న వారి జీవితానుభవాలు ప్రత్యేకమైనవి. ఆ కథనాలను వాళ్ళే రాసుకోవాలి, అప్పుడే ఆ సామూహిక అనుభవాలకి ఒక స్పష్టమైన సాధికారికత ఏర్పడుతుంది అని బలంగా నమ్మిన వాణ్ణి. ఆ నమ్మకంతోనే నేను రాసిన నాలుగు కథలూ రాశాను. ఇవ్వాళ్ళ ఈ ఇరవయ్యొకటో శతాబ్దం ఇప్పటికే మొదటి భాగం దాటి రెండో భాగంలోకి అడుగు పెడుతున్న సంధి సమయంలో … ఆమెరికాలో భారతీయ వలస జీవితాన్ని సమగ్రంగా చిత్రిస్తూ ఈ నవల మీ ముందుకు వచ్చింది.








Add comment