తరతరాల సామాజిక జాడ్యాల నుండి, అణచివేత నుండి అణచుకున్న ఆవేదనల నుండి, ఆవేశాల నుండి తమ హక్కుల్ని తమ స్థానాల్ని ఎలుగెత్తి ప్రశ్నిస్తూ ఎదురు తిరిగిన నూతన చైతన్యమే దళితవాదానికి చారిత్రక భూమిక అంటారు ఎండ్లూరి సుధాకర్. దళితుల జీవితాల్లో బానిస స్వభావం అంతరించిపోడానికి, దళితుల్లో చైతన్యం రగిలించడానికి, దళితులు సమాజంలో ఉన్నతంగా ఎదగాలని, ఈ భూమ్మీద ఆర్థిక అసమానతలే కాకుండా సామాజిక అంతరాలు, అంతరించిపోవాలని ప్రగతిశీలకవులు ఎన్నో కలలుగన్నారు. కారం చేడు, చుండూరు, పాదిరికుప్పం ఘటనల తర్వాత దళిత చైతన్యం పెరిగి, దళిత సాహిత్యం విస్తృతంగా వచ్చింది. ఈ క్రమంలో దాడులను, అత్యాచారాలను మారణకాండల్ని కథలుగా, కవిత్వంగా, నవలలుగా రాసిన కవులు దళిత సాహిత్య సమాజంలోకి సునామీలా వచ్చారు.
దళితుల్లో భద్రతా రాహిత్యం వల్ల ఏర్పడ్డ బానిస స్వభావం వల్ల, సమాజంలో దళిత చైతన్యం కాస్త వెనకబాటుకు లోనైన బతుకులనుండి, చదువులేనితనం నుండి ఇప్పుడిప్పుడే బయటపడి ఉన్నతస్థితుల్లోకి వెళ్లడం ప్రారంభమైంది. ఐతే ఇంకా అసమానతలు, అవమానాలు అక్కడక్కడా ఉండనే ఉన్నాయి. అడపాదడపా అరాచకాలు, అత్యాచారాలు, దళితులపై దాడులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో దళితులపై దాడులు, అత్యాచారాలు నిత్యకృత్యం. అంతేకాకుండా దళితుల్లో చైతన్యం కొరవడి రాజకీయనాయకులకు పావులుగా దళితులు వాడబడుతున్న స్థితికూడా సమాంతరంగా ఉంది. ఇందుకే తరతరాలుగా అంటరానితనం, అస్పృశ్యత, సాంఘిక అణచివేత ఇంకా కొనసాగడం మనం చూస్తున్నాం. అయితే వర్తమాన సమాజంలో దాని రూపం, స్వభావం మారింది. ఇటీవల కాలంలో అంటే దాదాపు మూడు నాలుగు దశాబ్దాల క్రితం నుండి అంబేద్కరిస్టు భావజాలం వైపు దళిత కవులు ప్రయాణం చేస్తున్నారు. అంబేడ్కర్ తత్వం దళితసమాజానికి మార్గనిర్దేశనం చేసి నడిపించడం లో సఫలమైంది. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్ నినాదం దళిత సాహిత్య తాత్విక భూమికగా దళిత కవులు, దళితేతర కవులు కూడా స్వీకరించడం తెలుగు సాహిత్యం సాధించిన గొప్ప విజయం. ఈ నేపథ్యంలో దళితులు కథ, కవిత్వం, నవల ఏది రాసినా ఆ తాత్వికభూమిక నుండి రాస్తున్నారు. తరతరాల బానిసత్వం, అంటరానితనం వర్తమాన సాహిత్య సమాజంలో ఈ తరహా దళిత స్పృహ కొనసాగుతున్నది.
కథాసాహిత్యంలో దళితస్పృహ నేపథ్యంలో అంబేడ్కర్ కాలం నాటికే దళిత కథలొచ్చాయి. ఇందులో దళితేతర కవులే మొదట దళిత సృహతో రాశారు. అలా రాసిన కథలను పరిశీలించినపుడు శ్రీపాద సుబ్రహ్మణ్యం పుల్లం రాజు కథ 1925 జూన్ లో ప్రబుద్దాంధ్ర పత్రికలో వచ్చింది. ఆనాటి సమాజంలోని వివక్షను కథకులు ఆధునికంగా రాశారు. ఇక తదనంతరం కొడవటిగంటి కుటుంబరావు 1977లో ఉద్దరింపు కథ, రాణిశివశంకర శర్మ అవధాని మరణం, కాట్రగడ్డ దయానంద్ నరసడు, గంటేడు గౌరినాయుడు ఏటిపాట, కెమెరా విజయకుమార్ పెద్దరోగం, బొంగువేణుగోపాల్ ఆత్మహత్య, తుల్లి రాజగోపాల్ ఒక్క పిడికిలి చాలు, బి. దామోదర్‌రావు ఎట్టి, రవికృష్ణ దీపం పురుగులు కథలు మనకు కనబడతాయి. చాలా కొద్దిమందిగా దళిత ఇతర కవులు దళిత కథలు రాసినట్లు మనకు కనబడ్డా, సమగ్రంగా పరిశోధిస్తే మరికొంతమంది దళితేతర కథకులు కథలు రాసినట్లు ఆధారాలు లభించవచ్చు.
ఇక రాయలసీమ ప్రాంతంలో వివక్షభిన్నంగా కనబడుతుంది. ఈ ప్రాంతంలో దళిత, దళిత ఉపకులాలు మినహ పై కులాలన్నీ ఇక్కడి దళితుల్ని అంటరానివాళ్ళుగానే చూస్తాయి. అంటే ఇందులో ఉన్న బీసి కులాలు కూడా దళితులపట్ల వివక్ష చూపిస్తాయి. ఈ నేపథ్యంలోనే దళితేతరులైన కథకులు రాయలసీమలో గొప్ప దళితకథలను అందించి దళిత ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. కథకుల్లో చాలా మంది ఒకటి, రెండు కథలు లేదంటే మూడు కథలు రాసిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఎక్కువ దళితకథలు రాసిన వాళ్ళలో ముందు వరసలో ఉన్నది మాత్రం రాయలసీమ ప్రాంతంలో పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథ రెడ్డి. ఈ కోవలోనే శాంతి నారాయణ, జి. వెంకటకృష్ణలు కూడా దాదాపు ఐదు దళితకథలు రాశారు. దళిత కథాసాహిత్యంలో రాయలసీమ నుండి విశేషంగా కృషి చేసిన వారి జాబితాలో మాత్రం పులికంటి కృష్ణారెడ్డి కనబడ్తారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన దాదాపు రెండువందల కథలు రాశారు. ఇందులో దళితచైతన్యాన్ని కాంక్షిస్తూ, వివక్షను ఎండగడుతూ ఆనాటి సమాజంలో దళితులపై జరిగిన దాడుల నేపథ్యంలోనూ కథలు రాశారు. దీన్ని దళిత సానుభూతి కథలు అన్నా పర్వాలేదు. కానీ గొప్ప దళిత కథలను దళిత కథా సాహిత్యానికి అందించారు. ఇందులో దళిత అంత:కలహాల నేపథ్యంలో కొమ్ములు కథ, వర్ణవివక్ష నేపథ్యంలో పులిగుండు, కాణిపాకం వినాయకుడి సాక్షిగా కథలు దళిత కథాసాహిత్య చరిత్రను మలుపు తిప్పాయి. ఇంకా కేశవరెడ్డి ది రోడ్‌కథ, పి.రామకృష్ణారెడ్డి రాసిన ఎలిగే పెద్దోళ్ళు నలిగే సిన్నోళ్ళు, కర్రోడు, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి రాసిన సెప్పుకింద పూలు, సడ్లపల్లి చిదంబర రెడ్డి రాసిన అడవి కథ, యస్ జయ రాసిన ఇంకానా ఇకపై చెల్లదు, సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి చనుబాలు,అంటు కథలు, వై.సి.వి.రెడ్డి ‘ ఐదు రూపాయలు, ఇంటి మాదిగోడు కథలు, డా.సుభాషిణి రాసిన కరువెవ్వరికీ కథ బీసి సామాజిక వర్గం నుండి దళితస్పృహతో రాసిన కథకులు బండినారాయణ స్వామి రాసిన ఓ.హెచ్. సరస్వతి, ప్రశాంతం, తల్లివేరు కథలు, శాంతి నారాయణ రాసిన ఉక్కుపాదం, వెట్టి, జీవనాడులు, ఉంగటం తెగింది, ఏరు దాటిన తెప్పను కథలు, జి.వెంకటకృష్ణ రాసిన పడిలేచే కెరటం, రాజకీయ దేవుడు, పడగనీడ, దేవరగట్టు, పునరుత్థానం కథలు జి.ఉమామహేశ్వర్ రాసిన ఎర్రపాలు, సంభావన, మనిషి గెలిచాడు కథలు, సింగమనేని నారాయణ ఉచ్చు, మకరముఖం కథలు, వి.ఆర్ రాసాని రాసిన వీరజాటి కథ, మహేంద్ర పాడిఆవు కథ, యంహరికిషన్ రాసిన రాజమ్మ, బసివిరాలు బరితెగించింది కథలు, నాగమ్మ పూలే అరుంధతి పంతం కథ, అగ్రవర్ణాలకు చెందిన శ్రీనివాసమూర్తి తలమీద వేలాడే కత్తి కథ, జంధ్యాల రఘుబాబు రాసిన టూలెట్ కథ, మారుతీ పౌరోహితం రాసిన అస్మిత కథ, దళిత సాహిత్య చరిత్రలో మైలురాళ్లు. మైనార్టీ కథకుల్లో ఇనాయతుల్లా నిచ్చెన కథ, దాదాహయత్ ఎల్లువ, చెప్పుకోదగ్గ దళిత కథలుగా నిలిచాయి.
ఈ కథకులు వారి కథల్లో దళిత జీవిత నేపథ్యం నుంచీ దళిత పక్షపాతంతోనే రాశారు. కులం కారణంగా దళితులు ఎదుర్కొంటున్న అవమానాలు, అమానుషాలు, అత్యాచారాలు, అగ్రవర్ణాల దౌర్జన్యకాండను దళితేతరులైన ఈ కథకులు రాయగలిగారు. కాలరాయబడుతున్న దళితహక్కులు, దళిత స్పృహతో రాశారు. పై కథల్లో దళితుల బానిస మనస్తత్వం, మాల మాదిగల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు చెబుతూ ఐక్యంగా హక్కుల్ని కాపాడుకోవాలని బాధితులంతా ఏకమవ్వాలనే దళితస్పృహ కొన్ని కథల్లో కనబడుతుంది. దళితుల దౌర్భాగ్య జీవితాలు, సంపన్నులు దళితపేదల్ని దోచుకోవడం కూడా కొన్ని కథల్లో చెప్పారు. కథల్లో దళితజీవితాలను కళ్ళకు కట్టినట్లు కథకులు దృశ్యాలుగా రాయగలిగారు. ఈ కథల్లో దళిత అస్తిత్వ అన్వేషణ కొనసాగుతుంది.
ఆధునికంగా సమాజం ముందుకుసాగిపోతున్నా రాయలసీమ ప్రాంతం కులవివక్ష నుండి బయటకు రాలేదు. అధిపత్య బూర్జువా, భూస్వామ్య భావజాలం రాయలసీమలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఈనాటికీ తిష్టవేసుకుని కూర్చున్నది. అయితే నేటి దళితకథకులు మాత్రం దళిత సాహిత్యమంటే ఆత్మగౌరవాన్ని వ్యక్తపరిచే సాహిత్యమని నమ్ముతూ ఎప్పటికప్పుడు తమ రచనల్లో వాటిని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.
*
చదివి దాచుకోదగ్గ వ్యాసం!