వివాహేతరం

ఆమెకు షేక్ హాండిస్తూ ‘నన్ను అధఃపాతాళానికి జారిపోకుండా కాపాడిన చేయి ఇది,’ అని మనసులోనే అనుకున్నాడు.

 ఉదయం తొమ్మిదీ నలభై కావడంతో ఆఫీసులో చంద్రహాస్ ఒక్కడే ఉన్నాడు.  అతనికి ఇరవై ఎనిమిదేళ్లు నిండినా కౌమారపు సౌకుమార్యం ఇంకా వదిలిపోలేదు. కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. వాటిల్లో ఒక మెయిల్, ప్రాజెక్ట్ డైరక్టరు నుంచి వచ్చింది. తమ సంస్థ పని తీరుతో  సెక్స్ వర్కర్ల జీవితాల్లో వచ్చిన మార్పులను తెలియజేసే కోర్ ఇండికేటర్లను తయారుచేసి రేపటికల్లా పంపమని ఆ మెయిల్ సారాంశం.

నువ్వేం పని చేస్తున్నావని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి చంద్రహాస్ చాలా ఇబ్బంది పడుతుంటాడు. అతడు కో-ఆర్డినేటర్ గా పని చేసేది ‘అంకుర్’ అనే ఓ నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో. అది సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం పని చేసే సంస్థ. ఆ విషయం చెప్పగానే-‘ఓ…అదే కదా…బస్టాండ్ల దగ్గరా, రైల్వే స్టేషన్ల దగ్గరా తచ్చాడే వేశ్యలకి నిరోధ్ లు పంచే పనేగా?’ అని ఎవరైనా తీసి పారేస్తే అతనెంతో బాధపడుతుంటాడు.

నిజానికి తమ సంస్థ సెక్స్ వర్కర్ల కోసం పని చేస్తున్నా, అందులో మొత్తం సమాజం యొక్క సంక్షేమం ఇమిడి ఉందని వివరించాలనుకుంటాడు. తమ సంస్థ కండోమ్స్ పంచడం ఒక్కటే చెయ్యదనీ; సెక్స్ వర్కర్లను రౌడీలనుండీ, పోలీసులనుండీ కాపాడటం, బాధిత వర్కర్లకు కౌన్సిలింగ్ చేయడం, హెల్త్ చెకప్పులు చేయించడం, హాట్ స్పాట్ లు విజిట్ చేయడం, భద్రతతో కూడిన శృంగారం గురించి వివరించడంలాంటి అనేక పనులు చేస్తుందని చెప్పాలని అనుకుంటాడు. కానీ, అంత ఓపిగ్గా వినేదెవరూ?!

మెసేజ్ వచ్చిన శబ్దం రావడంతో చంద్రహాస్ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసేడు. రవి అనే కార్యకర్త దగ్గర్నుంచి వచ్చిన మెసేజ్ అది. తన మేనమామ హఠాత్తుగా చనిపోవడం వల్ల అర్జెంటుగా స్వగ్రామానికి బయల్దేరాననీ, ఈ రోజు తన డ్యూటీ వేరే ఎవరితోనైనా చేయించమన్నదే అందులోని విషయం.

రవి ఈ రోజు డ్యూటీ ఎక్కడ చెయ్యాలో చంద్రహాస్ కి గుర్తుంది. తాము క్రమం తప్పకుండా విజిట్ చేయాల్సిన క్రూజింగ్ స్పాట్స్ లో అదొకటి. ఇంత సడెన్ గా వేరొకళ్లని అక్కడకి పంపడం అంత సులభం కాదు. అలా అని రవి డ్యూటీ చెయ్యాల్సిన చోటికి ఎవర్నీ పంపించకుండా ఉండనూ లేడు.  ఒక్క నిమిషం  పాటు ప్రశాంతంగా ఆలోచించాడు. ఆఖరికి అక్కడికి తానే వెళ్లాలని అనుకుంటుండగా సూర్యకుమారి వచ్చింది.

“గుడ్ మార్నింగ్ బాసూ!” అంటూ ఆమె ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.

“హాయ్ సూర్యా!” అంటూ చంద్రహాస్ ఆదరంగా పలకరింఛాడు.

వేరే ఎవరూ లేకపోతే చంద్రహాస్ ని బాస్ అనీ, ఎవరైనా ఉంటే సార్ అనీ సంబోధించటం సూర్యకుమారికి అలవాటే. దానికి తగ్గట్టే చంద్రహాస్ ఆమెని సూర్యా అనీ, సూర్యకుమారి అనీ సందర్భానుసారంగా పిలుస్తుంటాడు.

ఆమెను చూడగానే చంద్రహాస్ లో ఉత్సాహం ఉరకలెత్తింది. బురదలో పుట్టి పెరిగినా, స్వచ్ఛంగా ఉండే కలువ పువ్వులా-వేశ్యావృత్తిలో జీవిస్తున్నా అందులోని మురికి అంటకుండా, సూర్యకుమారి ముత్యంలా మెరిసిపోతుంటుంది. అందుకే సూర్యకుమారి అంటే అతనికి అంత గౌరవం, ఇష్టం.

 

ఎంతమందిలో ఉన్నా, అయస్కాంతంలా తనవైపు అందరినీ లాక్కునే అందం ఆమె సొంతం. అంతే కాదు, ఒక్కసారి ఆమెని చూసినవాళ్లు అంత తొందరగా ఆమెను మర్చిపోలేరు.

విశాలమైన కళ్లు, చిరునవ్వుకు చిరునామాలాంటి పెదాలు,  గంధపు చాయతో వెలిగే దేహం, పొడవైన జడ. ఆమె సౌందర్యాన్ని అంతరంగంలోనే ఆరాధించేవాళ్లలో చంద్రహాస్ ఒకడు. ఆమె బాహ్యసౌందర్యాన్నే కాక ఆంతరంగిక సౌందర్యాన్ని, వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని గుర్తించింది మాత్రం అతడొక్కడే.

సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పని చేసే ఇతర సంస్థలతో కూడా సూర్యకుమారి సంబంధాలను కలిగి ఉంది. టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఆమె ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి కాబట్టి, చాలామంది ఆమెను సులువుగానే గుర్తుపడతారు.

సూర్యకుమారి రాత్రుళ్లు సెక్స్ వర్కరుగా జీవిక కొనసాగిస్తున్నా, పగలు మాత్రం అంకుర్ లో కార్యకర్తగా పని చేస్తుంటుంది. సెక్స్ వర్కర్లని పోలీసులు అరెస్ట్ చేసినపుడు-లాయర్లనూ, పోలీసులనూ కలిసి; తమవాళ్లను జామీనుపై విడుదల చేయించడంలో సూర్యకుమారి, చంద్రహాస్ కు సహాయపడుతూ ఉంటుంది.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తెలుగు మీడియం లో బి.ఏ. ఫైనల్ ఇయర్ చేస్తోంది. వృత్తి ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని తన చదువుకు ఉపయోగిస్తోంది. సెక్స్ వర్కర్ల పిల్లల కోసం ఒక సంస్థను నడపాలన్న ఉద్దేశంతో ఉంది.

కోర్ ఇండికేటర్లను తయారు చెయ్యడానికే సమయం సరిపోదనుకుంటుంటే, రవి డ్యూటీకూడా అదనంగా చేయాల్సి రావడం గుర్తుకు వచ్చి చంద్రహాస్ కి నిరుత్సాహం ఎక్కువైంది.

“ఏంటి బాస్! అంత డల్ గా ఉన్నారు?” అంది సూర్యకుమారి.

“రవి లాస్ట్ మినిట్ లో మెసేజ్ ఇచ్చాడు. ఇవ్వాళ డ్యూటీకి రావటం లేదని, తన డ్యూటీ ఇంకెవరికైనా అప్పచెప్పమనీ. అతని బదులు ఇంకెవర్నీ పంపే అవకాశం లేదు. అందుకని, అతని డ్యూటీ నేనే చేద్దామనుకుంటున్నాను,” అంటూ చంద్రహాస్ ఆమెను పరిశీలనగా చూశాడు.

వెంటనే సూర్యకుమారి, “రవికి ఇచ్చిన ఏరియా మియాపూర్ దగ్గర నాగమల్లికోన. చాలా పెద్ద హాట్ స్పాట్ అది.  మీతో కాదు కానీ, అక్కడికి నేను వెళ్తాను లెండి. అదీ కాక, మీ పెళ్లి రోజు ఎల్లుండేనని చెప్పేరు. గుర్తుందా? మీ మిసెస్ తో కలిసి షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మీరా పని చూసుకోండి,” అంది.

“ఏం పెళ్లిరోజులే సూర్యా!”

“అదేంటి బాస్, పెళ్లయిన మూడేళ్లలోనే ఇంత నిరాశా?”

“ఈ మధ్యకాలంలో నా భార్య రమ, చీటికీ మాటికీ నాతో గొడవపడుతూ ఉంది. నేనీ ఉద్యోగం చేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. రోజూ ఇలాంటి వాతావరణంలో ఉంటే, ఎలాంటి మగాడైనా చెడిపోతాడని ఆమె అనవసరంగా భయపడుతోంది,”

“ఆమె భయం అనవసరమైనది కాకపోవచ్చు లెండి!”

“అంటే…నీక్కూడా నా కేరక్టరుపైన నమ్మకం లేదా?” అన్నాడు నిరాశగా.

సూర్య చిలిపిగా నవ్వి, “ఎలాంటి సందర్భాలలోనైనా ఒక మనిషి ఇలానే ప్రవర్తిస్తాడని ఎవరి విషయంలోనూ కచ్చితంగా చెప్పలేం…ఇంతకీ మీ ఆవిడకి పెళ్లిరోజు గిఫ్ట్ ఎప్పుడు కొంటారు,” అంది.

“మన ఆఫీసులోని పని ఒత్తిడి గురించి నీకు తెలియనిదేముందీ. నాతో కాదని తెలిసే, మా ఇంటి ఓనరుగారి భార్యతో షాప్ కి వెళ్లి చీర కొనుక్కోమని నిన్ననే మా ఆవిడకి డబ్బులిచ్చాను,” అన్నాడు.

“మన చర్చలకు అంతం ఎప్పుడూ ఉండదులే బాస్. అసలు విషయానికి వద్దాం. ఈ రోజు రవి డ్యూటీ నేను చేస్తాను,”

“ఈ పనికి నిన్ను పంపటం నాకిష్టం లేదు.  అదీ కాక, మన డైరక్టర్ ఎప్పుడూ నాతో అంటుంటాడు-హాట్ స్పాట్స్ ని రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటేనే, మన ప్రాజెక్ట్- టార్గెటెడ్ గ్రూప్ ని రీచ్ అవుతున్నదో లేదో తెలుస్తుందీ అని. ఒకసారి వెళ్లొస్తే ఆయన చెప్పిన పని కూడా చేసినట్లుంటుంది,” అన్నాడు.

“అలా అనడమే కానీ, ఆయనెప్పుడైనా వచ్చేడా? ఆయన మాటలకేం కానీ-కనీసం ఈ సాయంకాలం మీతో నన్ను అక్కడికి రానివ్వండి”

ఆ మాటకు అతను మనసులో సంతోషించినా, పైకి మాత్రం, “నాకెలానూ తప్పదు, నీక్కూడా…” అని, ఆ తర్వాత మాటలు చెప్పటం భావ్యం కాదన్నట్లు సగంలోనే ఆగిపోయేడు.

“ఆ ఏరియా మీకు కొత్త కానీ, మాకు కాదు. చీకటి పడిందంటే చాలు-మేం రోజూ తిరిగేది అక్కడే కదండీ,” అంది.

“సూర్యా! నీలాంటి తెలివైన అమ్మాయిలు కూడా  ఇలాంటి లైఫ్ స్టయిల్ని ఎన్నుకోడం బాగోలేదు”

“బాస్! కావాలని ఎవరూ ఇటువంటి జీవితాన్ని కోరుకోరు. ఒక్కోసారి తమ ప్రమేయం లేకుండానే ఇందులోకి నెట్టబడతారు. బయటపడటానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో, తిరిగి పాత  గూటికే చేరుకుంటారు. గతాన్ని తవ్వుకోటం వల్ల బాధ పెరగడమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఆ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్యండి. సాయంకాలం ఏ టైమ్ కి ఎక్కడ కలుద్దామో చెప్తే, నేను రెడీగా ఉంటాను,” అంది సూర్య.

“ఎర్రగడ్డ బస్ స్టాప్ కి సాయంకాలం ఏడింటికల్లా వచ్చెయ్యి,” అన్నాడు చంద్రహాస్.

“అలాగే! రేపటి మెడికల్ కేంప్ కి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఆ పని చూసుకుని వస్తా బాస్!” అని లేచి నిలబడింది సూర్యకుమారి. వెళ్తానన్నట్లు చూసి, వెనక్కి తిరిగింది. గ్రేస్ ఫుల్ గా నడుస్తున్న ఆమె వంక చూస్తూ అలానే ఉండిపోయాడు చంద్రహాస్.

***

సాయంకాలం ఆరు గంటల ఏభై నిమిషాలయింది. చంద్రహాస్ తన షోల్డర్ బాగ్ తో ఎర్రగడ్డ బస్ స్టాప్ కి   చేరుకున్నాడు. అప్పటికే సూర్యకుమారి అక్కడికి వచ్చి అతడి కోసం ఎదురు చూస్తోంది.

ట్రాన్స్పరెంట్ చీర కట్టుకుని, లో నెక్ బ్లౌజు వేసుకొని ఉంది.  పెదాలకు ముదురు గులాబీ రంగు లిప్ స్టిక్ రాసుకుని ఉంది. ఆమె దగ్గరకు రాగానే స్ట్రాంగ్ పెర్ ఫ్యూమ్ గుప్పుమంది. చుట్టూ ఒకసారి చూసేడు చంద్రహాస్. ఆమె వంక కొంతమంది మగాళ్లు ఆబగా చూస్తున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతున్నారు.

చంద్రహాస్ ఇబ్బందిగా నడుచుకుంటూ వెళ్లి ఆమె ప్రక్కన నిలబడ్డాడు.

“సూర్యకుమారీ! నీలాంటి ఎడ్యుకేటెడ్ కూడా ఇంత ఓవర్ గా తయారవడం దేనికీ?” అన్నాడు చంద్రహాస్ లోగొంతుకతో.

“బాస్! అమ్మకానికి సిద్ధం చేసిన మిఠాయీలను ఏ వ్యాపారీ ఇనప్పెట్టెలో దాచడు. అందరికీ కనపడేలా, చూసేవాళ్లకి నోరూరేలా గ్లాసు షో కేసుల్లో పెడతాడు. మేమూ అంతే! మడి కట్టుకోవడం పడుపువృత్తికి సరిపడదు బాస్!” అంది.

ఆ మాటలకు చంద్రహాస్ మనసు చివుక్కుమంది.

అంతలో మియాపూర్ వైపు వెళ్లే బస్ రావడంతో ఇద్దరూ చెరోవైపునుంచి అందులోకి ఎక్కేసారు.

***

మియాపూర్ లో బస్ దిగి కొద్ది దూరం నడవగానే, చెట్లతోనూ, పొదలతోనూ గుబురుగా ఉన్న చోటొకటి కనపడింది. అక్కడ ఆగి, దాన్ని చూపించి “ఇదే నాగమల్లికోన,” అంది సూర్యకుమారి. ముంబాయ్ హై వే కి ప్రక్కనే ఉందది.

అప్పటికే మసక చీకటి కమ్ముకుంది. పలచటి మబ్బుతెరలు కమ్మడంతో ఎనిమిక్ అయినట్లు చంద్రుడు తెల్లగా పాలిపోయేడు. ఆకాశంలో కదలకుండా, మెదలకుండా మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలకు; పొదలపై ఎగురుతున్న నక్షత్రాలు సవాలు విసురుతున్నాయి.

హై వే పైన లారీలు వెళ్తున్నపుడల్లా పొదల్లోనుండి టార్చిలైట్ల కాంతిపుంజాలు ఖడ్గాల్లా మిరిమిట్లు గొలుపుతున్నాయి. అదేమిటో అర్థం కాక చూస్తున్న చంద్రహాస్ తో “ ఈ రూట్లో తిరిగే విటులకు ఆ లైట్ల వెలుగు చూడగానే ఆ పొదల్లో సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా అర్థమై పోతుంది, ” అంది సూర్యకుమారి.

“వీళ్లందరూ మన ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే ట్రైనింగ్ క్లాసులకు వస్తుంటారా?” అడిగాడు చంద్రహాస్.

“ఈ ఏరియాలో సుమారుగా పాతికమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. అందులో పద్దెనిమిది మంది మన ‘అంకుర్’ లో మెంబర్లుగా చేరారు. వీళ్లకి సేఫ్ సెక్స్ గురించి అవగాహన బాగానే ఉంది,” జవాబిచ్చింది సూర్య.

ముందు సూర్యకుమారి, వెనుక చంద్రహాస్ తమ మొబైల్ టార్చ్ లు ఆన్ చేసుకుని నడుస్తున్నారు. కొద్ది దూరం నడవగానే, మధ్యలో మొక్కలేమీ లేకుండా చదునుగా ఉన్న ఇసుక తిన్నె ఒకటి కనిపించింది. మధ్యలో పెద్ద సైజు  తాటాకు పాకలు రెండున్నాయి. ఆ పాకల్లోని కోలాహలం చూస్తుంటే, అప్పటికే కొంతమంది వాళ్ల కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నట్లనిపించింది. వాడేసిన కండోమ్ లతోనూ, తాగి పారేసిన మందు సీసాలతోనూ, నూనె-మషాలాలు అంటుకున్న న్యూస్ పేపర్లతోనూ ఆ ప్రాంతమంతా చిందరవందరగా ఉంది. పోరాటం ముగియడంతో సైనికులు ఆయుధాలన్నిటినీ నేలపై చెల్లాచెదరుగా వొదిలేసి వెళ్లిపోయిన యుద్ధభూమిని తలపిస్తోంది అది.

చిత్రంగా ఆ వాతావరణం అతనిలో అసహ్యాన్ని కలిగించకపోగా, కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది.

“వావ్! జనం ఏం ఎంజాయ్ చేస్తున్నారు! తప్పనుకునే నా బోటి ఛాందసులు కొందరు తప్ప,” అని మనసులోనే అనుకున్నాడు. మరో క్షణంలోనే అతడి దృష్టి తానొచ్చిన పని వైపు మళ్లింది. అక్కడ పడున్న ఖాళీ కండోమ్ పాకెట్లను చూస్తుంటే, తమ సంస్థ ఉచితంగా సప్లయి చేస్తున్న కండోమ్ లు సద్వినియోగం అవుతున్నట్లు అతనికి అర్థమయింది. తృప్తిగా అనిపించింది. నేలమీద పడున్న ఖాళీ కండోమ్ పాకెట్లను క్లోజప్ లో వచ్చేట్లుగా కొన్ని స్నాప్ లు తీసుకున్నాడు. ఈరోజు తాను తయారుచేసిన కోర్ ఇండికేటర్లకు ఈ ఫోటోలు జతచేస్తే రిపోర్ట్ బాగా వస్తుందనుకున్నాడు.

అక్కడున్న చెట్లకు ‘అంకుర్’ స్టిక్కర్లు అతికించిన పింక్ కలర్ ప్లాస్టిక్ డబ్బాలు కట్టి ఉన్నాయి. అంతకు ముందు రోజు ఆ డబ్బాల్లో ఉంచిన కండోమ్స్ ఎండ వేడికి పాడైపోయి ఉంటాయి. కాబట్టి చంద్రహాస్-సూర్యా, వాటిని బయటకు తీసి ఒక పేపర్ కవర్లో వేసుకున్నారు. చంద్రహాస్ తన షోల్డర్ బాగ్ లో ఉన్న కొత్త కండోమ్ లను ఆ డబ్బాలలో ఉంచేడు.

ఇంతలో ప్రక్కనే ఉన్న పాకలోనుండి “ఓర్నాయనో…సచ్చిపోయేన్రోయ్…” అంటూ ఓ స్త్రీ ఆర్తనాదం వినిపించింది. సూర్యకుమారి అటుగా పరిగెత్తడంతో చంద్రహాస్ ఆమెను అనుసరించేడు.

“ఏమైందేమైంది?!” అంటూ గాబరాగా ఓ మగగొంతు అడుగుతోంది.

చంద్రహాస్, సూర్యకుమారిల చేతుల్లోని టార్చిలైట్ల వెలుతురు పాక వైపు పడటంతో, అందులోంచి ఒక ఆడామే, మగ అతనూ భయం భయంగా బట్టలు సర్దుకుంటూ బయటకు వచ్చేరు.

సూర్యకుమారి ఆ ఆడమనిషిని గుర్తు పట్టి, “ఓ సుబ్బలక్ష్మీ, నువ్వా! ఏమైందీ?” అని అడిగింది.

“సూర్యా! ఎవరో పిలిచినట్లు దేవతలా వచ్చేవు. అరికాల్లో గాజు పెంకు దిగబడింది,” అంది. అప్పటికే ఆమె కుడి కాలినుండి బొట్లుబొట్లుగా రక్తం కారుతోంది. నెమ్మదిగా ఆమె నేలపై కూర్చుంది.

చంద్రహాస్ తన షోల్డర్ బాగ్ లోంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసేడు. బాండేజ్ క్లాత్ తో మడమ పై భాగంలో గట్టిగా కట్టేడు. ఒక్క నిమిషం ఆగి చూసేడు. రక్తస్రావం కొంచెం తగ్గింది. ఇప్పుడు అసలు గాయానికి చికిత్స చేయాలి. కట్టు కట్టడానికి వీలైనంత ఎత్తుపై గాయమైన పాదాన్ని ఉంచడానికి చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందాని వెతికేడు. అతడి ఉద్దేశ్యం అర్థమైనట్లు, సూర్య క్రింద కూర్చుంది. సుబ్బలక్ష్మి కుడి కాలుని లేపి, తన ఒడిలో  పెట్టుకుంది. వెంటనే చంద్రహాస్ దూదిపైన టింక్చర్ అయోడిన్ వేసి గాయమైన చోట కట్టు కట్టేడు.

తోటి సెక్స్ వర్కర్ పట్ల సూర్యకుమారి చూపెట్టిన కన్సర్న్ అతడ్ని ముగ్ధుడ్ని చేసింది. సుబ్బలక్ష్మికి కట్టు కట్టడం పూర్తయిన తర్వాత కూడా, సూర్యకుమారి వైపే రెప్పార్పకుండా చూస్తుండిపోయేడు.

కొన్ని సెకండ్ల తర్వాత తేరుకున్నాడు. సుబ్బలక్ష్మి వైపు తిరిగి “ఇది తాత్కాలిక వైద్యం మాత్రమే. నువ్వు రేపు అంకుర్ కి వస్తే, డాక్టరుకు చూపించి, ఇంజక్షన్ చేయిద్దాం. అవసరం అయితే కుట్లు కూడా వేయిద్దాం,” అన్నాడు.

కుంటుకుంటూ సుబ్బలక్ష్మీ, ఆమె వెనకనే మగ అతనూ నెమ్మదిగా అక్కణ్ణుంచి వెళ్లిపోయారు.

నిదానంగా నడుస్తూ కొంతసేపటికి చంద్రహాస్, సూర్యకుమారి హై వే మీదకు చేరుకున్నారు. బస్ కోసం చూస్తూ నిలబడ్డారు. మబ్బుతెరలు తొలగిపోవడంతో ఎనర్జిటిక్ అయ్యి చంద్రుడు వెండివెన్నెలను కుమ్మరిస్తున్నాడు.

ఇంతలో ఎర్రగడ్డ వైపు వెళ్లే బస్సు రావడంతో ఇద్దరూ బస్సు ఎక్కేరు. బస్సంతా ఖాళీగా ఉండటంతో ఇద్దరూ ఒకే సీట్లో కూర్చున్నారు.

***

బస్ నెమ్మదిగా కదుల్తోంది.

“బాస్! నాకు ఫైనలీర్ ఎక్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఒక్క ఇంగ్లీష్ సబ్జక్టే కష్టంగా ఉంది. మీరు కాస్త హెల్ప్ చేస్తే గట్టెక్కేస్తాను,” అంది.

“ఈ ఆదివారం మన ఆఫీసుకి నువ్వోసారి రా. నెమ్మదిగా చదూతూ ఆ పాఠాలన్నిటికి తెలుగులో అర్థం చెప్తాను. కానీ…దానికి నేనడిగిన గురుదక్షిణ నువ్వు చెల్లించాల్సొస్తుంది,” అంటూ చంద్రహాస్ ఆమె వైపు అదోలా చూసేడు.

“ఇంతా చేసి మీరు వాటికి తెలుగులో అర్థం చెప్పినా, గ్రహించే శక్తి నాకు లేకపోవచ్చు ఇక గురుదక్షిణ సంగతంటారా? అంత స్థోమత నాకు లేదు లెండి. ఆ ఉద్దేశం కూడా లేదు,” అంది సూర్యకుమారి.

విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, అసలు విషయాన్ని డైరక్టుగానే అడిగేయాలనుకున్నాడు.

“సూర్యా! నువ్వన్నీ డైరక్టుగానే మాట్లాడతావు కాబట్టి, నేను నిన్నొక కోరిక కోరదల్చుకున్నా. నన్నర్థం చేసుకొని నువ్వొప్పుకుంటే ఒక్కసారి…” అంటూ ఆమె ముఖం చూడలేక చంద్రహాస్ తల దించుకొన్నాడు.

“అంత డైరక్టుగా మాట్లాడతానని నాకు కితాబు ఇచ్చేరు కాబట్టి, దీనిక్కూడా సమాధానం అంత డైరక్టుగానే చెబుతాను…మీరంటే నాకు చాలా గౌరవం. ఎంతంటే నా కష్టమర్లలో ఒకరిగా మిమ్మల్ని అంగీకరించలేనంత,” అంది.

“అలాంటప్పుడు-నేనంటే ఎందుకంత ఇష్టం చూపేవు?”

“మీరంటే ఇప్పటికీ ఇష్టమే. అది శరీరంలోంచి పుట్టింది కాదు. మనసులోంచి పుట్టింది. అందుకే అది మీ పట్ల గౌరవంగా మారింది. అంతకు మించి, అందులోంచి ముందుకు పోవడానికి అవకాశం లేదు. మీరేమనుకోనంటే చిన్న మాట. వెన్నెలంటే ఇష్టమని చెప్పి, చంద్రున్ని సొంతం చేసుకోవాలనుకోకూడదు కదా!”

ఆ మాటలకు చంద్రహాస్ కంగు తిన్నాడు. అనూహ్యంగా ఆమె దగ్గర్నుంచి వ్యతిరేకత వ్యక్తమయేసరికి అతడి అహం దెబ్బతింది. ఆమెను తన మాటల్తో మరింత హర్ట్ చేయాలనిపించింది.

“నేను డబ్బులు ఇవ్వననిగానీ భయపడుతున్నావా? అందరికంటే ఎక్కువే ఇస్తానులే!” అన్నాడు.

ఆమె ఒక్కసారిగా అతనివంక చూసింది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగేయి.

జరిగింది తలుచుకుని అతను సిగ్గుతో కృంగిపోయేడు. ఎంత పొరపాటుగా మాట్లాడేడు! తనని కాసేపు ఏ దెయ్యమో ఆవహించలేదు కదా! అనవసరంగా నోరు జారేడు.

ఆ షాక్ నుండి సూర్యకుమారి నెమ్మదిగా కోలుకుని, “బాస్!…ఒళ్లు అమ్ముకోడంలో కూడా నాక్కొన్ని నీతీ, నియమాలూ ఉన్నాయి. ఈ వేశ్యావృత్తిలో ఎంతో కాలంగా ఉన్నాను కాబట్టి, నా దగ్గరకు వచ్చిన వాళ్ల బాడీ లాంగ్వేజ్ బట్టి మొట్టమొదటిసారిగా వేశ్య దగ్గరకు వచ్చినవాళ్లని ఇట్టే గుర్తు పట్టేయగలను. అటువంటి వాళ్లను పొరపాటున కూడా దగ్గరకు చేరనివ్వను. వాళ్లు చేయాలనుకుంటున్నది మంచి పని కాదని చెప్పి పంపించేస్తాను,” అంది.

“నువ్వు పంపించేస్తే వాళ్లు వేరే వాళ్ల దగ్గరకు పోరని గ్యారంటీ ఏమిటీ?”

“అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. వాళ్లకి కావాల్సింది ఇచ్చే ఇంకొకళ్ల దగ్గరకి పోవచ్చు. అది వాళ్ల ఇష్టం. దాన్ని నేనాపలేను. నేను కోరుకునేదొకటే. ఓ మంచి మగాడు నావల్ల చెడిపోకుండా ఉంటే చాలు,”

అతనేమీ మాట్లాడకపోవటం చూసి, సూర్యకుమారే, “బాస్! మీలాంటి విద్యావంతులకు చెప్పతగినదాన్ని కాదు. మీ భార్యాభర్తల అన్యోన్యదాంపత్యం గురించి  మీరెన్నో సార్లు ఎంతో గొప్పగా చెప్పడం విన్నాను. నాకు తెలిసి నాపై మీకు కలిగిన మోహం, మీ మనసులో కలిగిన కోరిక కాదు, మీ మెదడులో మెదిలిన చిన్న కదలిక. కలగగూడని ఒక అలజడి. దాన్ని పట్టించుకోకండి. ఇక ముందు కూడా ఇంతకుముందులానే మీరు ఉండండి. మీ పవిత్రతను అలానే కాపాడుకోండి.

“బయటి స్త్రీలతో గడపాలనే కోరిక కలగడానికీ, అది తీర్చుకోవాలనుకోడానికీ మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. ఆ సున్నితమైన హద్దును దాటకుండా ఉంటేనే, మీరు మీ భార్య ముఖంలోకి సూటిగా చూడగలుగుతారు. లేకపోతే, శారీరకంగా ఆమెకు దగ్గరైనా మానసికంగా దూరమవుతారు. చివరగా ఒక్క మాట.  మగాళ్లలో కూడా మంచి మగాళ్లుంటారని చెప్పడానికైనా మీలాంటి భర్త, భార్యపట్ల విశ్వసనీయంగా ఉండాలి బాస్!” అంది.

చంద్రహాస్ లో ఉద్రేకం తగ్గి, దాని స్థానంలో విచక్షణ క్రమంగా చోటు చేసుకుంది.

ఆమెకు షేక్ హాండిస్తూ ‘నన్ను అధఃపాతాళానికి జారిపోకుండా కాపాడిన చేయి ఇది,’ అని మనసులోనే అనుకున్నాడు.

చంద్రహాస్, సూర్యా ఎర్రగడ్డలో బస్ దిగేసరికి తొమ్మిదిన్నర అయింది.

“అన్నట్లు రేపటి మెడికల్ కేంప్ కి ఎంతమంది డాక్టర్లు వస్తున్నారు?” అన్నాడు.

“ముగ్గురు డాక్టర్లయితే తప్పకుండా వస్తారు. స్కిన్ స్పెషలిస్ట్ రావడం మాత్రం డౌటే,” అంది సూర్య.

అంతలో మరో బస్ వచ్చి ఆగింది. అందులోంచి, చంద్రహాస్ భార్య రమా, వాళ్ల ఇంటి ఓనర్ గారి భార్యా దిగారు.

ఈ హఠాత్ పరిణామంతో చంద్రహాస్ నిర్ఘాంతపోయాడు.

చంద్రహాస్ పక్కనే నిలబడి ఉన్న ఆమె వాలకం చూసి రమ్య “ఇదేనా ఆఫీసులో పని?” అంటూ గట్టిగా అరిచింది. ఇంటి ఓనర్ గారి భార్య ఇబ్బందిగా చూస్తూ ప్రక్కకి జరిగింది.

సూర్యకుమారికి గుండె ఆగినంత పనయింది. చంద్రహాస్ కి ముచ్చెమటలు పోశాయి.

“రమా! ఉద్యోగధర్మం క్రింద ఏదో…” అంటూ చెప్పబోయేడు.

“అర్ధరాత్రి ఓ బజారు ఆడదాన్ని వెంటేసుకుని తిరగడమేనా మీ ఉద్యోగం? సిగ్గు లేకపోతే సరి!” అని సూర్యకుమారి వైపు తిరిగి, “ఏమే…పెళ్లయిన మగాళ్లని కూడా వదిలిపెట్టవా? నిన్నని ఏం ప్రయోజనంలే! మన బంగారం మంచిదైతేగా!” అంటూ ఖాళీగా వెడుతున్న ఆటోని పిలిచి-ఇంటి ఓనరు గారి భార్యను ఎక్కమని చెప్పి, ప్రక్కనే తానూ కూలబడింది.

చంద్రహాస్ అవమానంతో కృంగిపోయేడు. “సారీ సూర్యా! నా భార్య ప్రవర్తనకి నేను సారీ చెబుతున్నాను,” అన్నాడు.

“ఇందులో సారీ చెప్పడానికేముంది లెండి. ఆక్యుపేషనల్ హజార్డ్. కర్మ కాలి మనిద్దరి ఆక్యుపేషన్స్ వివాహేతర రంగానికి చెందినవే!” అంది.

“మనిద్దరం ఇంతకాలంగా కలిసి పని చేస్తున్నా, ఎప్పుడూ హద్దు మీరలేదు. అయినా, మా ఆవిడ అంతలేసి మాటలంది!” అన్నాడు చంద్రహాస్.

“ఈ సంఘటనతో నాకు ఒకటి బాగా అర్థమైంది. తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేయలేదు అన్న నమ్మకం మనవాళ్లకి కలిగేలా కూడా మన ప్రవర్తన ఉండాలి,” అంది సూర్య.

దట్టమైన మేఘాలు క్రమ్మడంతో వెన్నెల మసకబారింది. అయినా చంద్రహాస్ గుండెలో కొత్త వెలుగు రేఖలు విచ్చుకున్నాయి.

***

 

 

యాళ్ల అచ్యుతరామయ్య

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి కధ. ముఖ్యంగా సూర్య పాత్రను బాగా చూపించారు. ఆవిడ చెప్పిన ఈ మాటలను మగవారందరికి మంచి సలహా .”“ఈ సంఘటనతో నాకు ఒకటి బాగా అర్థమైంది. తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేయలేదు అన్న నమ్మకం మనవాళ్లకి కలిగేలా కూడా మన ప్రవర్తన ఉండాలి,” అంది సూర్య.”

  • సూర్య పాత్రని చక్కగా మలిచారు. ఆమె ఆ వృత్తిని ఎందుకని ఎంచుకున్నదో?
    చంద్రహాస్ ‘మోహం’ కి కారణమేమిటో?
    కధనం బాగుంది.

  • పాఠకుడిగా కొన్ని అభిప్రాయాలు, సందేహాలు…

    -కథలో కొత్త నేపధ్యాన్ని ఎంచుకొన్నారు కానీ విషయం పాత పద్దతిలోనే చిత్రించారు.

    -కథ మొదలు నించీ ఈ కింది వాక్యం దాకా నాలుగు వాక్యాలలో విషయాన్ని చెప్పొచ్చు.

    “ఏంటి బాస్! అంత డల్ గా ఉన్నారు?” అంది సూర్యకుమారి.

    అనవసరమయిన చిత్రణ ఎక్కువ అయింది చాలా చోట్ల.

    – “ఈ మధ్యకాలంలో నా భార్య రమ, చీటికీ మాటికీ నాతో గొడవపడుతూ ఉంది” వాక్యంలో …’నా భార్య రమ’ అంటాడా అంతకు ముందే బాగా పరిచయం ఉన్న సూర్యకుమారి తో? ‘నా భార్య ‘ అనో , ‘రమ ‘ అనో అంటాడు కానీ.

    – “రమా! ఉద్యోగధర్మం క్రింద ఏదో…” అంటూ చెప్పబోయేడు.
    ఉద్యోగధర్మం పదం ఇక్కడ అతకలేదు.

    – చంద్రహాస్ గుండెలో కొత్త వెలుగు రేఖలు విచ్చుకున్నాయి.

    ఎందుకూ?

  • Nice story dear sirgau . really Surya kurmari is a dynamic person. Chandrahas is example for all married males.

    You are explained very poetic justice to Surya kurmari.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు