విలాసాల పెళ్ళిళ్ళు!

మొన్నామధ్య సూరత్ దగ్గర ఏదో పట్టణంలో పెళ్ళి జరిగాక మొత్తం ఊరంతా కంపు కంపు చేసారట బాణసంచాతో, ఆహారపదార్ధాలతో.  ఇదేనా ప్రజాస్వామ్యమంటే? 

ది పెళ్ళి అవసరమా అనవసరమా అనే తాత్విక మీమాంస, దాని తర్క వితర్కాల గురించి కాదు. జీవితమన్నాక పెళ్ళి చేసుకోక తప్పని వేడుక అని భావించే వారి కోసమే ఈ చర్చ.

ఇద్దరు మనుషుల్ని ఒక కొత్త కుటుంబంగా ముడిపెట్టే వివాహాన్ని క్రతువులతో కూడిన ఒక సాంఘీక వేడుకగా, ఒక పవిత్ర కార్యక్రమంగా భావిస్తుంటాం.  కానీ ఆర్ధిక శాస్త్రం మాత్రం దాన్ని ఇప్పుడో  పరిశ్రమగానే గుర్తిస్తుంది.  సంవత్సరానికి నాలుగు నుండి ఆరు లక్షల కోట్ల రూపాయిలు డబ్బు పంప్ అవుతున్న భారతీయ వివాహ కార్యక్రమాన్ని పరిశ్రమ అనకుండా ఎలా వుంటాం?  వివాహ పరిశ్రమ ప్రతి ఏటా ఇరవై శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్నది కూడా.  వైవాహిక జీవితాల కన్నా వివాహ పరిశ్రమే బలంగా వున్నది.  ఇంకా ఈ పరిశ్రమకి రెసిషన్ అనే రిస్క్ లేనే లేదు.  రేపు ఏ అంబానీనో ఏ “జియో లింక్స్” పేరుతో వివాహాలు నిర్వహించే ఒక కార్పొరేట్ సంస్థని ప్రారంభిస్తే బహుశః బ్రాండెడ్ పెళ్ళిళ్ళు జరుగుతాయేమో.

****

గత దశాబ్ద కాలం నుండి పెళ్ళిళ్ళు జరిగే తీరులో ఆశ్చర్యకరమైన మార్పులొచ్చాయి.  ఇదివరకటి పెళ్ళిళ్ళు బేరాలతో కూడుకున్నవైతే ఇప్పటి పెళ్ళిళ్ళు డబ్బులు వెదజల్లేవి.  విపరీతమైన డాబు, దర్పం, సంపద ప్రదర్శన కోసం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా అని పిస్తున్నది.  ఖరీదైన హాళ్ళు, కొన్ని పదుల రకాల ఫుడ్ కౌంటర్లతో కేటరింగ్, లక్షలు ఖర్చుపెట్టే వీడియో కెమెరాలతో చిత్రీకరణ, ధగధగలాడే వస్త్రధారనలు, ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్, సంగీత గాన కచేరీలులేనిదే పెళ్ళిళ్ళు అవటం లేదు.  పెళ్ళికి ముందే కాబొయే జంట ఒక సినిమా పాట స్థాయిలో వీడియో షూటింగ్ జరుగుతుంది.  పెళ్ళి ఒక్క రోజుతో అయిపోయే శుభకార్యం కావటం లేదు.  మన తాతల కాలంలో అయిదు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి అని వినేవాళ్ళం.  ఇప్పుడు సెలబ్రిటీలు, ధనవంతుల పెళ్ళిళ్ళు అలా రోజుల తరబడి జరుగుతున్నాయి.  ఒకరోజు సంగీత్, ఇంకో రోజు బాచిలర్స్ పార్టీ, మరో రోజు మెహెందీ, ఆ తరువాత రోజు ఇంకోటేదో పేరు, చివరాఖరికి రోజు పెళ్ళి జరుగుతుంది.  ఈ ట్రెండుని మధ్య తరగతి వారు కూడా ఫాలో అవుతున్నారు.  యువతుల ఆర్ధిక స్వావలంబన కారణంగా వరకట్నాలు తగ్గినా ప్రెస్టీజ్ కోసం వివాహ వ్యయం మాత్రం ఎన్నో రెట్లు పెరిగింది.

****

ప్రస్తుతం వివాహం మీద ఆధారపడిన వ్యాపారాలకు ఎదగటానికి వున్నంత అవకాశం మరే రంగంలోనూ లేదు.  అనేక రకాలుగా పెళ్ళిళ్ళు ఖరీదైపోవటంతో మొత్తం మార్కెట్లన్నీ పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాయి.  ఎందుకంటే ఒక పేదవాడింట్లో పెళ్ళి కూడా లక్షల్లోనే లెక్క తేలుతున్నది.  ఒక డొమెస్టిక్ మెయిడ్ తన ఇంట్లో పెళ్ళికి అప్పో సొప్పో చేసైనా సరే మూడు లక్షల రూపాయిలు ఖర్చు చేస్తున్నది.  ఒక అటెండర్ తన కూతురు పెళ్ళికి ఏడెనిమిది లక్షలు ఖర్చు చేస్తున్నాడు.  ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం పది లక్షలు సునాయాసంగా ఖర్చు చేస్తున్నది.  ఒక మధ్య తరగతి కుటుంబం సుమారు 20 నుండి 30 లక్షలు ఒక్కో పెళ్ళికి ధార పోస్తున్నది. ప్రతి మనిషి తన జీవితంలో కూడబెట్టిన దానిలో నుండి ఇరవై శాతం పెళ్ళిళ్ళ మీదనే ఖర్చు పెడుతున్నాడు.  ఇప్పుడు పెళ్ళి వేదికలు రాష్ట్రాలు దాటి గోవా, రాజస్థాన్ వంటి ప్రదేశాలకు చేరుతున్నాయి.  మరీ బాలీవుడ్ ధనవంతులు, కార్పొరేట్ రారాజుల పెళ్ళిళ్ళైతే దేశం, ఖండం సరిహద్దులు దాటి ఏ ఇటలీలోనో జరుగుతున్నాయి.  వీటన్నింటికి తోడు సెలబ్రిటీల పెళ్ళిళ్ళ గురించి మీడియా ఊరించి ఊరించి వర్ణించి చంపుతుంది.

ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ఏటా ఒక కోటి వివాహాలు జరుగుతున్నాయి.  ప్రతి సీజన్లో వివాహంతో అనుబంధమైన  మ్యారేజి బ్యూరోలు, బ్రోకర్లు, బంగారం మార్కెట్, వివాహ దుస్తులు, పెట్టుపోతల దుస్తులు సారెగా ఇచ్చే ఫర్నిచర్, హోటల్స్, కళ్యాణమండపాలు, వేదిక, హాల్ అలంకరణ, పెళ్ళి కార్డులు, మెహెంది బ్రైడల్ అలంకరణ, వీడియోగ్రఫీ, కెమెరా, కేటరింగ్, ఏసీ కళ్యాణమండపాలు, ట్రాన్స్పోర్టేషన్  క్యాబులు, హానీమూన్ టూరిజం, మేకప్, పురోహితులు, ఈవెంట్ మేనేజ్మెంట్, పువ్వుల అలంకరణ, ఎలక్ట్రికల్ వర్క్స్, మేళతాళాలు, రిటర్న్ గిఫ్ట్స్…ఇలా చెప్పుకుపోతుంటే చాంతాడంత లిస్టు కోసం అయ్యే ఖర్చు లక్షల కోట్లల్లోనే వుంటున్నది.  హాజరయ్యే వారు కూడా ప్రతి పెళ్ళికి ఒక కొత్త డ్రెస్ తో హాజరవ్వాలనే నియమం పెట్టుకుంటారు. అంతే కాక వారిచ్చే బహుమతులు కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రతి పెళ్ళికి హాజరయ్యే ప్రతి కుటుంబానికి వేలాది రూపాయిలు ఖర్చవుతుంది.  ఆ రకంగా అతిథులు ఇచ్చే మార్కెట్ కూడా చిన్నది కాదు.

ఒక పక్క రైతులు వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా వందల కోట్ల రూపాయిలతో పెళ్ళిళ్ళు చేసుకునే డబ్బు మద పిచ్చిగాళ్ళ విలాసపూర్వక రోత చేష్టల్ని మనం అసహ్యించుకోవాలి.  సాటి మనుషులు సంక్షోభంలో చస్తుంటే డబ్బుని, వనరుల్ని విచ్చలవిడిగా వృధా చేయటం చట్ట వ్యతిరేకం కాకపోవచ్చు కానీ అభ్యంతరకరమైనదే. మొన్నామధ్య సూరత్ దగ్గర ఏదో పట్టణంలో పెళ్ళి జరిగాక మొత్తం ఊరంతా కంపు కంపు చేసారట బాణసంచాతో, ఆహారపదార్ధాలతో.  ఇదేనా ప్రజాస్వామ్యమంటే?

****

క్రతువులతో కూడిన పెళ్ళి, అందులోని పవిత్రత, పెళ్ళి లేకపోతే విశృంఖలత్వాలు, బహు భార్యత్వాలు, బహు భర్తృత్వాలు సంభవిస్తాయన్న శంకల గురించి, భయాల గురించి ఇప్పుడు చర్చకి పెట్టడం లేదు కానీ నిజంగా పెళ్ళి కోసం ఇంతటి ఆడంబర ప్రదర్శన అవసరమా?  ఈ ప్రదర్శన నిజంగా దంపతుల అన్యోన్యతకి, వారి మధ్యన జెండర్ సెన్సిటివిటీ తో కూడిన ప్రజస్వామిక సంబంధానికి దోహద పడుతుందా?  ఇవి నా సందేహాలు.  వివాహం అనేది ఒక పరిశ్రమ స్థాయికి ఎదగటం వల్ల అనేకమందికి ఉపాధి కలుగుతుంది, మార్కెట్ కళకళలాడి ఎకానమీ వృద్ధి చెందుతుందనే వారికి ఒక ప్రశ్న ఏమిటంటే కేవలం దేశ ఎకానమీ కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారా?   చేతిలో వున్న డబ్బు ఒక రకంగా కాకపోతే మరో రకంగా ఖర్చు అవుతుంది.  ఖర్చు పెట్టిన ప్రతి పైసా మార్కెట్ కి దోహద పడేదే.  ఒకవేళ బాంకుల్లో దాచుకుంటే ప్రభుత్వం కొత్త పరిశ్రమలు స్థాపించటానికి ఉపయోగిస్తుంది.  ధనం తన లాజికల్ ఎండ్ తాను చూసుకోగలదు.

సరే ఏం క్రతువులు పాటిస్తారో పాటించండి కానీ ఆడంబర ప్రదర్శనలకి బదులుగా నా ప్రత్యామ్నాయ ఆలోచనలు మీతో పంచుకుంటున్నా.  కొంచెం పరిశీలించి, చర్చించండి.

1. పెళ్ళి సందర్భంగా జరిగే క్రతువులన్నీ దంపతీ సంబంధం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే పవిత్ర క్రతువులుగా భావిస్తుంటారు. నిజానికి మనిషికి కావలిసింది సంతోషం, ఆత్మగౌరవం, తృప్తి.  ఇందుకు వైవాహిక జీవితం పూచీ పడాలి.  ఇవి సాధ్యమైనప్పుడే ప్రేమ అంకురిస్తుంది.  ఇవేవీ లేకుండా కేవలం సెంటిమెంట్ ఎక్కువకాలం బతకదు.     కానీ పెళ్ళి తంతులో ఏవో కొన్ని మంత్రాలు, వాటికి చిన్న చిన్న వివరణలు తప్ప ఈ అంశాల మీద ఫోకస్ వుండదు.  వధూవరులు పురోహితుడు చెప్పినట్లు “మమ” చెబుతారు.  ఫోటోగ్రాఫర్ అడిగినట్లు పోజులిస్తారు. వీటికి బదులుగా వైవాహిక జీవితం సరిగ్గా వుండాలంటే ఆధునిక కాలానికనుగుణంగా ఇద్దరూ ఎలా మసలుకోవాలో తెలియచెప్పే ప్రి-మారిటల్ కౌన్సిలింగ్ ఒక రోజు నిర్వహించాలి.  ఇందులో రెండు కుటుంబాల పెద్దలూ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొనాలి.  జెండర్ సెన్సిటివిటీ, మారుతున్న కాలంలో మారుతున్న జీవన సహచరుల పాత్రలు, పాత భావాలను మార్చుకోక తప్పని పరిస్థితి, రాబోయే కాలంలో పిల్లల పెంపకం, ఒకరి ప్రైవసీని మరొకరు గౌరవించుకోవటం, ప్రేమ సంబంధం కోసం వుండాల్సిన ప్రజాస్వామిక సంస్కారం వగైరాల గురించి నిపుణులచే ఒక ప్రభావవంతమైన కౌన్సెలింగ్ వుండాలి.  యువజంటకి సెక్స్ సైకాలజిస్టు తో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలి.  ఇవి ఖచ్చితంగా సంగీత్ కార్యక్రమం కంటే అవసరం.  మంత్రాల కన్నా ఎక్కువ మేలే చేస్తాయి.

2. రెండో రోజు వివాహానంతర కుటుంబ జీవితంలో బాడ్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ గురించిన అనుభవాల షేరింగ్ లేదా కౌన్సెలింగ్ వుండాలి.  ఇందులో నిపుణులతో పాటుగా బంధు మిత్రుల అనుభవాల షేరింగ్ వుంటుంది.   ట్రబుల్ షూటింగ్ ఇందులో ముఖ్యం.  దీనికి నిపుణుల హాజరు అవసరం.  ఇది బాచెలర్స్ పార్టీ కంటే అవసరమైన అంశం.  మద్యంతో సంబరాల కంటే ముఖ్యమైనది.

3. మొన్నామధ్య బెంగుళూరులో ఒక యువ జంట కనీస ఖర్చులతో నిరాడంబరంగా పెళ్ళి చేసుకొని తాము పెట్టగలిగిన బడ్జెట్ని ఏదో చారిటీ సంస్థకి ఇచ్చేసారు.  వచ్చినవాళ్ళకి ఏవో బిస్కట్స్, స్నాక్స్ పెట్టారు. అంతే.  ఇటీవలనే విశాఖలో ఒక ఉన్నతాధికారి కుమారుడి వివాహం కూడా కొన్ని వేల రూపాయిల ఖర్చులోనే అయిపోయింది. అలాంటి విధానం అమలు చేయొచ్చు. పెళ్ళి జరగటమనేది ఒక ఉదాత్త కార్యక్రమంగా వుంటే వారి మధ్య బంధం కూడా ఉదాత్తంగా కొనసాగే అవకాశం వుంటుంది.

  1. ఎంగేజ్మెంట్ కి ముందే ఇద్దరూ హెచ్.ఐ.వి. వంటి టెస్టుల రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి.  వ్యక్తిగతంగా తెలియకపోతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఉద్యోగం చేస్తున్న ప్రూఫ్ చూపించాలి.  ఎందుకంటే ఇవాళ్రేపు మోసం చాలా సునాయాసమై పోయింది.

****

దేశంలో అనాధ బాల్యం తీవ్రంగా ఉన్నప్పుడు, అవిద్య అజ్ఞానం, ఆర్ధిక దారిద్ర్యం సమాజాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఇలా “వల్గర్ డిస్ప్లే ఆఫ్ రిచ్నెస్” ఎంతవరకు సమంజసం?  అసలు అన్నింటికీ మించి కుటుంబ వ్యవస్థ మెల్లగా బీటలు వారుతున్నప్పుడు, స్త్రీలు తమ ఉనికి, దేహం, లైంగికత పట్ల స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు, వివాహాలు విఫలమవటం పెరిగిపోతున్నప్పుడు ఇంతటి దుబారా అవసరమా?  ఆ డబ్బుని మరో రకంగా అర్ధవంతంగా ఖర్చు చేయలేమా?

పీఎస్: ఇలా రాసే హక్కు నాకున్నది.  28 సంవత్సరాల క్రితం ‘గాంధర్వ వివాహం’ (లివింగ్ టుగెదర్) ద్వారా సహచరితో జీవితం మొదలు పెట్టినవాడిని కదా!  ఆ తరువాత చాలా కాలానికి అఫీషియల్ కారణాల వల్ల రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకున్నాం.  అందుకు ఖర్చైన వంద రూపాయిల గురించి ఇప్పటికీ బాధ పడుతుంటా మరి! (డెబ్భై రూపాయిల ఫీజు + ముప్ఫైరూపాయిల పూల దండ. విశాఖ సబ్ రిజిస్ట్రార్ దండ లేదంటే ఒప్పుకోలేదు.)  

అరణ్య కృష్ణ

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రస్తుత పరిస్థితుల గురించి మంచి విశ్లేషణతో కూడిన వ్యాసం. విలువైనది. ఇప్పటి ఈ పరులకోసం అనే వ్యసనం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారని?
    వాళ్ళ ఆదర్శాలు పిల్లలకు పంచే వారెంతమందని? ఏదేమైనా మంచి వ్యాసం అందించారు. ప్రతీ point ఆలోచించదగ్గదిగా ఉంది. Thank you sir.

  • ఇప్పటి పెళ్లిళ్లలో ఫీల్ ఏది ? Relations కమర్షియల్ అయ్యాయి …ఇకసామాజికంగా చూస్తే..మహాకవి జాషువా చెప్పినట్లు ప్రతిమల పెళ్లిళ్లు సేయ వేలకు వేలు వ్వెయింతురుగాని కడు హీనుఁల కంచమందు మెతుకు విదల్చరీ భరత వేదినన్.,అని …అరణ్యకృష్ణమీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం …మీరు చెప్పినవన్నీ ..అమలుజరగాల్సినవే excellent artical..

  • Dear sir
    A good and correct analysis on marriage experience. Middle and poor families going in a trap that what society feels about their marriage ceremony.If amounts are in their pockets let them what they want.but taking loans from near and dear they are spending.
    వివాహం తర్వాత కూతురి కాపురం కంటే అప్పుల తో కాపురం అంటే సరి పోయెలా అనవసరపు ఆచారాలు పాటిస్తారు.ఆడపడుచు కట్నం వియ్యపురాలి లాంఛనం మొదలైనవి.
    తక్కువ ఖర్చుతో పెళ్ళి జరిగేలా ఒక విధానాన్ని ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.
    మీ రచన కొంతమంది ఆలోచన ను మారుస్తుంది .గుడ్.

  • ఈ విధంగా పెళ్ళి చేసుకునే వాళ్ళు వింటారా? అబ్యుదయవాదుల పిల్లలే ఇలాంటి వేడుకలు చేసుకుంటున్నారు.కుటుంబ పెద్దల కన్నా పిల్లల పై బయటి సమాజం ప్రభావం ఎక్కువగా వుంది.జండర్ సమానత్వం గూర్చి అలోచించే వాళ్ళెవరు?ఇంకా మెరుగైన అంశాలు ఆడ పిల్ల పుట్టుక ,పిల్లలపెంపకం ,కట్నాలు . మార్పు సమాజమ్ లో వస్తేనే వీరు ఆలోచిస్తారు.వీళ్ళలో మార్పు సాద్యమని నమ్మకం కలగడం లేదు.అలాగని చర్చని కాదనడం లేదు.ఇది సరైన వేదిక కాదేమోననేది.

    • ధన్యవాదాలు సార్ మీ ప్రతిస్పందనకి. “అబ్యుదయవాదుల పిల్లలే ఇలాంటి వేడుకలు చేసుకుంటున్నారు.” అన్నారు. ఇది కొంతవరకు అతిశయోక్తి ఏమో. ఇలా నాలుగు రోజుల పాటు విలాసాల పెళ్ళిళ్ళు అభ్యుదయవాదుల పిల్లలు చేసుకుంటున్నారా? నాలుగు రోజులు కాకపోయినా ఒక్క రోజైనా, ఎవరైనా అలా చేసుకుంటే శోచనీయమే. మీరన్నది నిజమే మన పిల్లల మీద మన కంటే సమాజ పోకడలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇంక వేదికది ఏముంది సార్! ఎక్కడైనా డిబేట్ నిర్వహించొచ్చు. మీరు సరైన వేదిక మీదకి ఈ చర్చని తీసుకెళ్ళండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు