1
నా నడక ఉత్తరాన మొదలై
పడమటి నుండి తూర్పు దిక్కుగా
రాలే చినుకు ఉత్ప్రేరకంగా
నాలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపి
నా వేగాన్ని పెంచుతుంది
చిన్నా చితకా నాతో కలిసి వస్తుంటే
చెట్టాపట్టాలేసుకుని పరిగిడుతుంటే
నాలో పులకరింత
కొండలూ కోనలూ దారెంట పలకరిస్తుంటే
స్వచ్ఛంగా పరచబడింది నా అంతరంగం ఆ నేలన
అటూ ఇటూ చెట్ల నీడన నా పయనం విరామమెరుగక
నేను పయనిస్తున్న దారి చుట్టూత
నాగరికత పరిఢవిల్లి జనబాహుళ్య
సామాజికార్థిక వికాసం తరాలుగా
నేను మైదానంలోకి అడుగిడగానే
నా మెడలో దండలేసి
నాకు పసుపు కుంకుమలు పూసి
నాకు పవిత్రత అంటగట్టాక
నన్ను నేను కోల్పోయా
మలినాలు పూసుకున్న శక్తులు
నా చుట్టూ కథలు అల్లుతూ
కల్లబొల్లి కబుర్లతో బురిడీ కొట్టిస్తూ
నా దరులన్నిటినీ అశుద్ధమయం గావిస్తూ
లేని సుఖాల కోసం నాలో మునిగి తరించమని
నన్ను కీర్తిస్తూ విషాన్ని నాలో ఒంపేస్తూ
నన్నో అంగడి సరుకుని చేసారు !
నా చుట్టూ ఓ వ్యాపార సామ్రాజ్య వలయం
మత్తు మందు చల్లబడి భయపెట్టి
చెమట రూకలతో
కోట్ల కొద్దీ ద్రవ్య మారకం నా దరిన
నేనూ ఆమె ఒకే రీతిన వేదనాభరిత గుండెలతో సాగిపోతున్నాం!
నేను గంగా నది ని!!
ఆమె తరాల చట్రంలో నిత్యం ఘర్షణలతో!!
2
అడవికి మరణం లేదు
అడవి నిండా మోదుగులు పూచే వేళ
ఎరుపు అలుముకుంటుంది
ఒక్కో తూటా ఒక్కో గుండెను చీల్చుకుంటూ పోతుంటే
చిందిన రక్తం తో ఎరుపు గాఢత పెరుగుతుంది !
ఆకు కొసల రాలుతున్న రుధిర బిందువులు
రేపటి మహోదయ దిక్సూచులు
అడవి నిండా లోహ నిక్షేపాలే
అడవి పై డేగ కళ్ళు
నాగరికత ను గన్న తల్లి ని చెరబట్టి గర్భ విచ్ఛిత్తి చేసి,
విప్పారిన రెక్కల కత్తులతో దూసుకొస్తుంటే
ప్రశ్నించే తుపాకుల కవాతు రాజ్యం గుండెల్లో బల్లెంలా!
రాజ్యం అండదండలతో
మైదానమంతా శ్మశానం గావించిన కండకావరం తో
పెట్టుబడి గోండులేలిన ముప్పై ఆరు కోటల నేలన
విరుచుకుపడుతుంటే సిద్ధాంత భూమిక
పదునెక్కి తిరగబడుతుంది!
అడవికి మరణం లేదు
ఎరుపు కి మరణం లేదు
ఎవడెన్ని కారు కూతలు కూసినా అదొక నిరంతర అధ్యయనం తో
పదునెక్కే సిద్ధాంతం!
మత్తెక్కించే మత మౌఢ్యం కేం తెలుసు?!
వండి వార్చే అబద్ధాలు తప్ప!!
మనిషి పోయినంత మాత్రాన
ఉద్యమం ఆగదనే చరిత్ర తెలీని నిరక్షర కుక్షి రాజ్యం!
ఉదంతి సీతా నదుల్లో పారుతున్న
దరుల్లో ఒండ్రు మట్టి తో కలిసి కొత్త బీజాలు మొలకెత్తుతున్నాయి
కన్నీటితో గడ్డ కట్టిన నీలం సరై
జలపాతం దూకనని మారాం చేస్తుంది!
నేలకొరిగిన వీరుల యాదిలో సల్ఫీ చెట్టు నాటబడుతుంది
పుట్టుకకే కాదు!
కూతురి కే కాదు!
చావుకి సైతం సల్ఫీ
ఓ స్మారక స్థూపంగా నలభై అడుగులు దాకా!
భావి సెంట్రీ లైట్ హౌస్ గా మారాలే!!
ఎద్దు మూపరం కొండ పై నుండి ఎక్కుపెట్టిన సామ్యవాదం
ఇంద్రావతి మోసుకుపోతూ పంచుకుంటూ
భావి సౌథం పునాదులు నిర్మిస్తుంది
అమ్ముల పొదుల్లో అస్త్రాలు కోల్పోతున్నా
ఆత్మ స్థైర్యాన్నిచ్చే అడవి దీవెనలు పుష్కలం!!
*
Add comment