విమర్శల మొనాటనీ నుండి ఆటవిడుపు!

[సాహితీ సేతువు:  శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి అముద్రితం. వెల : అమూల్యం]

సాహిత్య విమర్శలు చదువుతున్నప్పుడల్లా నాకు మయూరుడి సూర్యశతకంలో ఈ శ్లోకం గుర్తుకు వస్తుంది. కొన్ని శతాబ్దాల క్రిందటి సంప్రదాయబద్ధమైన నమ్మకాలు ఆధారంగా, ఇది సూర్యుడికి వర్తిస్తూ వ్రాసినా, సాహిత్య విమర్శకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది:

భాసామాసన్నభావా- దధికతరపటో శ్చక్రవాలస్య తాపాత్

ఛేదాదచ్ఛిన్నగచ్ఛ త్తురగఖురపుట న్యాసనిశ్శంకటంకై

నిస్సంగస్యందనాంగ భ్రమణనికషణాత్పాతు వ స్త్రిప్రకారం

తప్తాంశు స్తత్పరీక్షా పర ఇవ పరితః పర్యటన్హాటకాద్రిమ్.

తాత్పర్యం:

వేడికిరణాలు గలిగిన సూర్యుడు బంగారుకొండ మేరువుచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇది నిజంగా బంగారమా కాదా అని తెలుసుకుందికి మూడు విధాలుగా పరీక్షిస్తున్నాడట: తన తీక్ష్ణములైన కిరణాలచే కరిగించీ, తన గుర్రపు గిట్టలచే ఖండిస్తూ, రథచక్రపునేమి అనే గీటురాయి అంచులు దానికీ తగిలీ తగలకుండా పరిగెత్తిస్తూ. కరిగించి చూడటం ద్వారా ఉపరితలాన్నీ, ముక్కలు ముక్కలుగా కోయడం ద్వారా అది కేవలం పైమెరుగేనా లేక లోతుల్లోకూడా అలాగే ఉందాలేదా అనీ, గీటురాయి మీద పరీక్షించడం ద్వారా అది బంగారమా కాదా (అది బంగారమే అయితే దాని నాణ్యత ఎంతో తెలుసుకోవచ్చు) అనీ పరీక్షిస్తున్నాట్ట. ఇది కవితా చమత్కారం.

పద్యాన్ని పక్కనబెట్టి భావాన్ని ‘విమర్శ’కి అన్వయించి చూద్దాం. మనకి ఎదురుగా ఉన్న సాహిత్య వస్తువును విమర్శించేటపుడు ముందు దానిలోని వస్తువు నాణ్యమైనదా అని స్థూలపరీక్షద్వారా చూడాలి. తర్వాత మరింత లోతుకు పోయి, కావ్యం పై పైనే ఇలా ఉందా (అంటే బంగారు పూతేనా), దానిలో లోతైన భావనలు ఉన్నాయా అని మరింత తరచి, విశ్లేషించి చూడాలి. అలా పై పైన చూడడానికీ, తరచి చూసిన తర్వాతా బాగున్నట్టు అనిపించినా, అది నిజమైన బంగారమో కాదో తెలుసుకోవాలంటే, గీటురాయి మీద పట్టి పరీక్షించాలి. అంటే, సాహిత్యంలో ఎన్నదగిన పూర్వ కావ్యాలతో, రచనలతో సరిపోల్చి దాని విలువని నిర్ణయించాలి.

సాహితీసేతువు-కాపీ

సూరపురాజు రాధాకృష్ణమూర్తిగారి  ‘సాహితీ సేతువు’ అలా మూడు రకాల పరీక్షలు చేసి, కవిత్రయం,  కాళిదాసు, డాంటే, టాల్ స్టాయ్, మొహంతి, కారా ల సాహిత్యకృషిలో కొన్నిభాగాల నిగ్గుతేల్చిన సాహిత్య వ్యాసాల సంకలనం. ఎవరు చదివినా చదవకపోయినా, సాహిత్యాన్నీ, సాహిత్య అధ్యయనాన్నీ గంభీరమైన విషయంగా భావించే విద్యార్థులందరూ చదివి తీరవలసిన పుస్తకం.

సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులన్నది తెలుగులో ఏమాత్రం సాహిత్య పరిచయం ఉన్నవారికైనా విదితమే. ఉపనిషత్తులలోనూ, భగవద్గీత, వేదాంత విషయాలలో, ప్రాచీన సాహిత్యంలో, పాశ్చాత్య సాహిత్యంలో వారికి ఎంతో లోతైన అవగాహనా, సమాన, సమాంతర విషయాలను ప్రస్తావవశంగా ఆసువుగా చెప్పగల పాండిత్యమూ ఉన్నాయి.  నిజానికి ప్రాక్పశ్చిమ సాహిత్యాలకి ఆయన ఒక నిజమైన వారధి.

పరిచయంలోనే చెప్పుకున్నట్టు ఈ వ్యాసాలని వారు వీధి అరుగుమీద ముచ్చటించుకునే ముచ్చట్లు తీరులో వ్రాసేరు. దాని వల్ల ఒక లాభం ఉంది. ఇందులో విమర్శనా గ్రంధాలలో కనిపించే పరిభాష (Jargon) కనిపించదు. కొత్త సాహిత్య విద్యార్థులని విమర్శకు దూరంగా ఉంచే విషయాలలో ముందుండేది ఆ పరిభాషే. ఆ పరిభాష లేకపోవడం వల్ల, విమర్శకూడా కథ చెప్పినట్టు సాగిపోతుంది. తెలుగులో సాహిత్య విమర్శ పై పై పరిశీలనలకు పరిమితం అయింది తప్ప, పాశ్చాత్య విమర్శనా రీతులలా లోతుగా లేదన్నది సత్యం.  తెలుగు సాహిత్యం మీద వచ్చిన మంచి విమర్శలూ వ్యాసాలూ కూడా ఇంగ్లీషులోనే తప్ప తెలుగులో తక్కువ. ఈ వ్యాస సంపుటి అటువంటి ప్రయత్నాలకి తెర తీస్తుందని ఆశిద్దాం.

మనం ఇప్పుడు అనుసరించే విశ్వాసాలు ఎంత భిన్నమైనప్పటికీ, మన అందరి వారసత్వమూ ఒకటే. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. అన్నీ అందులోనే ఉన్నాయని వెర్రిగా తలకెత్తుకున్న వారూ, అందులో ఏమీ లేదని ఈసడించి నిరసించే వారూ, ఈ రెండు వర్గాల వారూ దానిని అసలు చదవని వారే. కేవలం ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మి తమ అభిప్రాయాలను ఏర్పరచుకున్న వారే. గంభీరమైన సాహిత్య విద్యార్థులు సుమతీ శతక కారుడు చెప్పినట్టు, ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నమాటకు విధేయతతో ఇతరులు చెప్పిన విషయాలు వింటూనే, ‘వినినంతనె వేగపడక,’ తమ పరిశీలనా, అవగాహనా, వివేచనాత్మక విశ్లేషణల ద్వారా, ‘కని, కల్ల నిజము’ ఏవో తెలుసుకో గోరుతారు. లోతైన సాహిత్య అధ్యయనం మన వారసత్వంపట్ల గౌరవాన్నీ, లోతైన అవగాహననీ, విశ్వాసాలపట్ల నమ్మకాన్నీ, విశ్వవిజ్ఞానకోశంలో వాటి విలువనీ  తెలియజేస్తుంది. అటువంటి అధ్యయనం లేని నాడు విశ్వాసాలతోపాటు, భాషకూడా క్రమంగా కనుమరుగవుతుంది. తెలుగు భాష అస్తిత్వానికే సందేహాలు తలెత్తుతున్న రోజుల్లో, సాహిత్య అధ్యయనం సమాధానం ఎండమావి కాకుండా ఉండటానికి ఇటువంటి మార్గదర్శక వ్యాసాలు తోడ్పడతా యనడంలో నాకు సందేహం లేదు.

పైన చెప్పిన దానికి అనుగుణంగానే, విమర్శకులు కూడా కేవలం పైపైన తరచి విమర్శించేవారు, స్థాలీపులాకన్యాయంగా అక్కడక్కడ లోతులకి పోయి పరిచయం చేసే వారు, తమతోపాటు మనల్నికూడా హిమాలయాలకంటే మిన్నయైన ఎత్తులకి తీసుకుపోయి, కావ్యాన్నీ, దాని నైసర్గికంతో పాటు, దిగంత పరీవ్యాప్తమైన విశ్వాన్నీ ఒక విహంగ వీక్షణం చేయించేవారూ ఉంటారు. రాధాకృష్ణమూర్తిగారు మూడవకోవకు చెందిన వారు.

రచయిత ఒక సత్యాన్ని తన కావ్యంలో ఆవిష్కరిస్తే, రసగ్రహణ పారీణుడైన పాఠకుడు దానిని గ్రహించవచ్చునేమో గాని సామాన్య పాఠకుడికి అందకపోవచ్చు. అటువంటి పాఠకుడికి  కావ్యసౌందర్యాన్ని అందించటంతో పాటు, కావ్యపు ప్రామాణికతని, దాని విలువను అంచనా వెయ్యగలిగిందీ, అంచనా వెయ్యవలసినదీ, విమర్శకుడే. దానితోపాటు, పాఠకుడి అవగాహన స్థాయి కూడా ఒక మెట్టు పైకి ఎదగడానికి సద్విమర్శ తోడ్పడుతుంది. విమర్శ వ్యక్తుల్ని కాకుండా వస్తువుని మాత్రమే బేరీజు వేస్తుంది. అలా బేరీజు వెయ్యగలిగినదే విమర్శ. కవిత్వాన్ని విమర్శించేటపుడు, విమర్శకుడు స్వయంగా కవి కాకపోయినా ఫర్వాలేదు, కానీ రసికత (Poetic Sensibility) కలిగినవాడై ఉండాలి. మహాకావ్యాలను, తాత్త్విక విషయాలను సమీక్షించి, విమర్శించే టపుడు ఖచ్చితంగా విమర్శకుడు తాత్త్వికుడూ పండితుడూ అయి ఉండాలి. పండితులకే సమ్యక్ దృష్టి ఉంటుంది. సమ్యక్ దృష్టిగల విమర్శకుడే విశ్వశ్రేయానికి కావ్యం ఎలా దోహద పడుతుందో ఆవిష్కరించి కావ్య ప్రయోజనాన్నీ, రచన ప్రయోజనాన్నీ నెరవేర్చగలడు.

పూర్వ రచనలు చదివే అలవాటు తగ్గి నపుడు, ప్రస్తుత రచనల ప్రామాణికతను నిర్ణయించగల గీటురాళ్ళు తగ్గిపోతాయి. ఎవరికి వారు ప్రమాణాలు ఏర్పరచుకున్నపుడు, ఇప్పటి ప్రమాణాలు ప్రశ్నార్థకాలు అవుతాయి. భక్తి భావనలో ఉండే వ్యక్తి ఆరాధన, సాహిత్యంలోకి దిగుమతి కావడంతో, మన కొలమానాలన్నీ ఉత్తమసాహిత్య- కేంద్రకాలు కాకుండా, వ్యక్తి-కేంద్రకాలుగా తయారయినాయి.  ఈ నేపధ్యంలో చూసినపుడు  రాధాకృష్ణమూర్తి గారి రచన ఆ మొనాటనీ నుండి ఆటవిడుపు.

ప్రాక్-పశ్చిమ సాహిత్యాలలోని పోలికలూ, వాటి వెనుక ఆలోచనలనూ కాళిదాసు, డాంటే, బోదిలేర్, కవిత్రయము, టాల్స్టాయ్, కా.రా ల కొన్ని రచనలను ఆలంబనగా చేసుకుని “నానృషిః కురుతే కావ్యమ్” అన్న మాటలవెనుక అంతరార్థాన్ని, వారి ఋషిత్వాన్నీ ఆవిష్కరించారు. ఇక్కడ ఋషి మనుషుల మధ్యలో ఉంటూనే, మానవుల మాటలను బట్టి ఆలోచనలనీ, ఆలోచనలనుబట్టి చేష్టలనీ, చేష్టలనుబట్టి ఆంతర్యాన్నీ, అవగాహన చేసుకుని, సమాజ హితవుకి ఉపకరించే సత్యాలని తన కావ్యంలో, సలహాలుగా అందించేవాడు, ఆవిష్కరించేవాడు. అతనికి తను సృష్టించిన పాత్రలపట్ల మమకారం ఉండదు. పాత్రల దృష్టిలోంచి ప్రపంచాన్ని చూపిస్తూ, స్వభావాలు సంఘటనలకు దారితీస్తూ, పాత్రల ఆలోచనల విశ్లేషణ, వాటి భవిష్యత్తుకి అవి ఎలా  దారి తీస్తాయో నిర్లిప్తంగా చేసే చిత్రణ ఉంటుంది. రచన ముగింపుని పాత్రలు తమ స్వభావాల ద్వారా శాసిస్తాయి తప్ప రచయిత ముందుగా నిర్దేశించిన లక్ష్యంకోసం కథనం సాగదు.  కల్పనకీ, మానవ స్వభావాలు ఆధారంగా సృష్టించే మహాకావ్యాలకీ తేడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గొప్ప రచయితలు సత్యాన్ని వాచ్యం చేయక సూచ్యంగా విడిచిపెడతారు.  వ్యక్తులు తమకు తాముగా తెలుసుకుని, అర్థం చేసుకున్న సత్యాన్ని అనుసరిస్తారు తప్ప, కేవలం బోధనల వల్ల ప్రభావితం అయ్యేది చాలా తక్కువ.

యుద్ధం స్త్రీల జీవితాలని ఎలా శోకమయం చేస్తాయో బోదిలేర్ తన కవిత హంస (Le Cygne) లో ఆంద్రొమాక్ పాత్రద్వారా ఆవిష్కరించిన తీరూ; మహాభారతంలో స్త్రీపర్వాన్ని తిక్కన నిర్వహించిన తీరూ; శోకతప్తలైన స్త్రీలు ఎంతటి గొప్పవారినైనా ఎలా క్షమించరో గాంధారిపాత్రద్వారా పలికించిన తీరూ; వీరరసానికి అనుబంధంగా శృంగారాన్ని నిర్వహించడం వెనుక ఆంతర్యం; వివాహవ్యవస్థని అహంకారంతో పురుషుడు ఛిన్నాభిన్నం చేసిన తీరూ; సామాజిక అవ్యవస్థకు బ్రాహ్మణుడు ఎందుకు బాధ్యత వహించాలో; డాంటే డివైన్ కామెడీలా, మహాభారతం వంటి సుదీర్ఘమైన కావ్యాన్ని ఎలా చదవాలో; రామాయణ మహాభారతాలలో, ఆదిమరూపమైన కామాన్ని కవులు ఎలా నిర్వహించారో; కామానికి ఉన్న బహురూపాలు ఏమిటో; ఎర్రన మహాభారతాన్ని అనువదించిన తీరూ; వందల సంవత్సరాల వ్యవధి ఉన్నా, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే,  నన్నయగారి శైలికి ఎంత సరళంగా కలిసిపోయిందో; ఒధెల్లో – మహాభారత ఘట్టాలలోని కొన్ని సామ్యాలూ; మహాభారత అనువాదంలో కవిత్రయం తమ పాత్రలను నిశితపరిశీలనతో నిర్వహించిన తీరూ;  వారి వారి శైలీవ్యక్తిత్వాలూ; మలార్మే కీ- కాళిదాసు కుమారసంభవంలోని శ్లోకాలలోని ఊహలమధ్య పోలికలూ; డాంటే డీవైన్ కామెడీలో, ఆల్బెర్ట్ కామ్యూ ‘అతిథి ‘కథలో, షేక్స్ పియర్ The Tempest, Pericles- the prince of Tyre, As You Like it మొదలైన నాటకాలలో, బోదిలేర్ కవిత le Cygneలో, విక్టర్ హ్యూగో నవల Les Miserablesలో  ప్రవాస జీవిత చిత్రణలోని సారూప్యాలూ; టాల్ స్టాయ్ నవల The Resurrection రానున్న బోల్షెవిక్ విప్లవానికి సమాజంలో అప్పటికే పడిన బీజాలను సంకేతించిన తీరూ; ప్రేమ- త్యాగం- పరివర్తన – ఉదాత్తవ్యక్తిత్వాలే కాదు, పతితులనుకూడా ఎలా ఉదాత్తులుగా చేస్తాయో మలచిన తీరూ; గోపీనాధ్ మొహంతి ఒడియాలో వ్రాసిన నవల( తెలుగుసేత: శ్రీపురిపండా అప్పలస్వామిగారు) లో రచయిత ప్రదర్శించిన రాజ్యము- మనిషి-ప్రకృతి అన్న మూడు కోణాలూ, ముగింపులో రామాయణంతో గల పోలికలూ; జీవితంలో తర్కానికీ, భ్రమలకీ ఉన్న సున్నితమైన భేదాన్ని చెహోవ్ తన కథ The Home లొ ఆవిష్కరించిన తీరూ; ఆర్తి, భయం, యజ్ఞం, చావు, కుట్ర… కథలలో కాళీపట్నం రామారావు గారు ఐదు ప్రధాన సమస్యలని ఐదు విధాలుగా చెప్పిన తీరూ; కాఫ్కా తన నవల The Trial ద్వారా జీవితం-భయం- స్వేచ్ఛ వీటి అస్తిత్వాల మధ్య, మనకి తెలిసి ఋజువుకాబడని, శిక్షింపబడని అపరాధాలు మనం అనునిత్యం ఎన్ని చేస్తున్నప్పటికీ వాటి అపరాధభావంలో బ్రతకటంలేదో, సార్త్ర్ చెప్పినట్టు ఆ స్వేచ్ఛే మనిషికి శిక్షగా ఎలా పరిణమిస్తుందో,  ‘భయం నిత్యాస్తిత్వసత్యమే అయినా ప్రాపంచికాలలో మునిగిన మనిషి నిత్యమూ ఆ భయంలో బతకడం లేదు’ అన్నHeidegger వాక్యానికీ, ఆత్మను ‘సదసత్’ అని పిలిచే అద్వైత భావనకీ మధ్య పోలికలూ, ‘నీ అపరాధాన్ని శంకించవద్ద’న్న కాఫ్కా మాటకీ, ‘మనిషి పాపంలో పుట్టా’డన్న క్రైస్తవ విశ్వాసానికీ, ‘పాపోహం, పాపకర్మాణాం, పాపాత్మా,  పాప సంభవః’ అన్న వైదిక విశ్వాసానికీ మధ్య పోలికలు… ఇలా విద్వత్సంబంధమైన అనేక విషయాలను  రాధాకృష్ణమూర్తిగారు చాలా సున్నితంగా నిర్వహించారు.

సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు సంకుచిత ఆధ్యాత్మిక చింతనా పరులు కాదు, విస్తృతమైన అధ్యయనం వల్ల, ఆత్మానుభూతి వలన ప్రకృతిలో భగవత్తత్త్వాన్ని దర్శించిన దార్శనికులు. వారి ఆధ్యాత్మిక దృష్టితో ఏకీభవించలేని వారుకూడా, నిస్సందేహంగా వారి సునిశితమైన పరిశీలనలతో చాలా చోట్ల ఏకీభవిస్తారు.

ఈ వ్యాసాలు సాహిత్య విద్యార్థులకి నిశ్చయంగా ఒక రసానుభూతి.

*

నౌడూరి మూర్తి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి పరిచయం. కాపీలు ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తే బాగుండేది. అమూల్యమన్నారు కాబట్టి షాపుల్లో పెట్టారో లేదో సందేహం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు