ఒక ముందస్తు హెచ్చరిక: ఈ కథా రచయిత జర్నలిస్టు. అది కూడ ఒక బిజినెస్ జర్నలిస్టు. దాదాపు ఇరవై సంవత్సరాల కింద ఒక వార్తా పత్రిక వాణిజ్యవార్తల విభాగంలో మేమిద్దరం సహోద్యోగులం. బిజినెస్ వార్తా రచనలో వాలంటరీ డిస్ క్లోజర్ (స్వచ్ఛంద ప్రకటన) అనే సంప్రదాయం ఒకటుంది. వాణిజ్య వార్తా రచయితలం ఏదైనా ఒక కంపెనీ గురించి రాస్తున్నప్పుడు ఆ కంపెనీతో తమకు ఎటువంటి సంబంధం ఉన్నదో తప్పనిసరిగా వార్తలోనే చెప్పుకోవాలి. ఆ వార్తారచన పూర్తిగా వస్తుగతమేనని, స్వీయమానసిక అభిప్రాయాలో స్వప్రయోజనాలో కంపెనీ ప్రయోజనాల ప్రభావమో చొరబడలేదని చెప్పుకోవడానికి అది ఒక సూచిక. ఈ ముందుమాటకు నేను కూడ అటువంటి డిస్ క్లోజర్ ఒకటి చేయాలి. కూర్మనాథ్ నా కుటుంబ సభ్యుడు. నేను చాల ప్రేమించే మా చిన్ని సహచరుడు. ఒకటి రెండు సంవత్సరాలు నాకు సహోద్యోగి. కాని అవేవీ తన కథల మీద నా అభిప్రాయాన్ని ప్రభావితం చేయలేదు.
ఇది కథా ప్రక్రియలో కూర్మనాథ్ మూడో పుస్తకం. మొదట 2001లో ‘ఒక జననం గురించి…’ అనే ఒక్క కథనే ఒక పుస్తకంగా తెచ్చాడు. తర్వాత నాలుగేళ్లకు 2005లో ‘ఇ-కుక్క – మరికొన్ని కథలు’ పేరుతో పన్నెండు కథలతో రెండో పుస్తకం తెచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్ల తర్వాత పదిహేడు కథలతో ఈ ‘వెన్నెల పడవ – మరికొన్ని కథలు’. ఈ పుస్తకానికి లాగే గత రెండు పుస్తకాలనూ పాఠకులకు పరిచయం చేస్తూ వెనుకమాట, ముందుమాట రాసే అవకాశం నాకు కలిగింది.
“సన్నని సరిహద్దు రేఖ మీద మరణానంతర జీవిత సత్యాన్ని, ఆమరణాంత మృత్యుభయాన్ని ప్రకటించిన కథ” అనీ, “మరణంలా కనబడే జననాన్ని, విజయంలా కనబడే వైఫల్యాన్ని చిత్రించిన కథ” అనీ మొదటి పుస్తకం సందర్భంలో అన్నాను. రెండో పుస్తకం సందర్భంలో “ఎన్ కౌంటర్లు, రెండు ప్రపంచాల మధ్య అంతరం, ఉద్యమాలను అణచివేసే కుట్రలు, ఉద్యమ వార్తలు, ప్రస్తుత వ్యవస్థలో సాగుతున్న అమానవీకరణ నిజానికి కొత్త వస్తువులేమీ కావు. కాని ఇక్కడ వాటిని దర్శించిన, ప్రదర్శించిన పద్ధతి అసాధారణమైనది. ఇందులో ప్రతీకలను ఉపయోగించడం, ధ్వని, వ్యంగ్యం వంటి ఇప్పటికే తెలిసిన కథన పద్ధతులతో పాటు వాస్తవం – కల్పనల మధ్య, రిపోర్తాజ్ – కళల మధ్య, యథార్థం – ఊహల మధ్య, వర్తమానం – భవిష్యత్తుల మధ్య అటూ ఇటూ ప్రవహించిన చలనశీల శైలీ శిల్పాలున్నాయి. ఈ కథలను ప్రత్యేకంగా గుర్తించడానికి కారణం ఆ శైలీ శిల్పాలే…” అన్నాను. (కథకుడి) “వ్యక్తిత్వం, స్వభావం ఒక పట్టకంగా నిలబడి ఒక అపసవ్య వాస్తవికతను ఇక్కడ సప్తవర్ణాల దృశ్యమాలికగా ప్రతిఫలించాయి” అంటూ, “ఇటువంటి ప్రయోజనకర ప్రయోగాలనూ ప్రతిఫలనాలనూ” విరివిగా చేయాలని ఆశించాను.
ఆ రెండు పుస్తకాల ఇతివృత్తాల సారాంశం సమకాలీన సమాజపు వైరుధ్యాల చిత్రణ. ఆ వైరుధ్యాలనే వాటి సంపూర్ణ వైవిధ్యంతో, విభిన్న తలాల్లో, విభిన్న తలాల నుంచి చూసిన, చూపిన, ఇప్పుడిక్కడ సంకలితమైన పదిహేడు కథలూ కూర్మనాథ్ గత పుస్తకాల్లో వాగ్దానం చేసిన సామర్థ్యంలో మరింత పరిణతి సాధించాడని, ప్రయోజనకర ప్రయోగాల దిశలో మరొక ముందడుగు వేస్తున్నాడని చూపుతున్నాయి. ప్రస్తుత కథల్లో కొన్ని గతంలో తాను చేపట్టిన వస్తువులూ ఉన్నాయి, ఆ వస్తువులనే కొత్తగా సంభావించినవీ ఉన్నాయి, పూర్తిగా కొత్తవైన వస్తువులూ ఉన్నాయి. అలా ఈ పుస్తకంలో తన వస్తువుల ఎంపికలోని వైవిధ్యం, నవ్యత, మరోచూపు కనబడుతున్నాయి. శిల్పపరంగా ఇ-కుక్కలో ఎక్కువగా ఐంద్రజాలిక వాస్తవికతా శిల్పమూ, వ్యంగ్యమూ, వైచిత్రీ ఉండగా ఈ సంపుటంలో ఆ గత శిల్పరీతులన్నీ ఉంటూనే, పరిపుష్టమవుతూనే, కొత్తగా ప్రతీకవాదాన్ని ప్రతిభావంతంగా వినియోగించినట్టు అనిపిస్తున్నది.
ఒకరకంగా చూస్తే కథా ప్రక్రియకు ప్రతీకవాదం కొత్తది కాదు. కథకులు తాము చిత్రించదలచిన వ్యక్తిత్వాలను, స్వభావాలను, ధోరణులను, హావభావాలను ప్రతీకల సహాయంతో పాఠకుల కళ్లకు కట్టడం బహుశా కథలు ప్రారంభమైన ప్రాచీన కాలం నుంచీ కూడ ఉన్నదే. నిజానికి కథల్లో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు నిజజీవితంలోని ఎందరో మనుషులను, ఎన్నో స్వభావాలను, ఎన్నో సన్నివేశాలను, ఎన్నో సంభాషణలను రంగరించి ప్రతీకలుగా మార్చినప్పుడే అవి నిర్దిష్టత నుంచి సార్వజనీనతకు ఎదిగి ప్రభావశీలంగా మారగలుగుతాయి. పంచతంత్ర కథలు, ఈసప్ కథలు వంటి నీతికథలుగా పేరుపడినవన్నీ కూడ ప్రతీక కథలే. అక్కడ చెప్పదలచినదీ చెపుతున్నదీ మానవ సమాజ నీతి గురించే అయినప్పటికీ, ఆ కథలన్నీ ఆ మానవ సమాజ నీతిని జంతువులకు ఆపాదించి జంతు ప్రతీకలతో చెప్పాయి. మనిషి కథనే మనిషి లేకుండా చెప్పవలసి రావడం ఒక సామాజిక స్థితి కావచ్చు.
బహుశా ఇవాళ కూడ అటువంటి సామాజిక స్థితిలోనే ఉన్నామేమో. అందువల్ల సమకాలీన మానవ జీవిత వృత్తాంతాన్నే అసలు మనిషి ఊసే లేకుండా, లేదా అతి తక్కువగా ఉంచి, జంతువుల ప్రతీకలు, ప్రకృతి ప్రతీకలు, ఊహా ప్రతీకలు తీసుకుని చెప్పడం ఒక పాత కథన పద్ధతిని పునర్నవీకరించిన ప్రక్రియ. దీనికిదిగా ఇది ఒక రూప ప్రయోగంగా, వస్తుదర్శనానికి ప్రత్యామ్నాయ రూపంగా గుర్తించవచ్చు. ఈ పదిహేడు కథల్లో కనీసం పది ఈ ప్రతీకవాద ప్రయోగాలుగా సాగి విజయం కూడ సాధించాయని నాకనిపిస్తుంది.
ప్రతీకలను వాడడంలో రచయిత సమర్థంగా నిర్వహిస్తే అవి పొరలుపొరలుగా వేరు వేరు అర్థాలను సూచించి చదువరులకు గొప్ప ఆలోచనకూ అవగాహనకూ వీలు కల్పిస్తాయి. అసలు ప్రతీకల ద్వారా చెప్పడం చదువరుల వైపు నుంచి చూస్తే ఒక సౌలభ్యం. అది వారికి బాగా పరిచయం ఉన్న ప్రతీక దగ్గర మొదలై, ఆ ప్రతీక దేన్ని సూచిస్తున్నదో అనే ఊహలకు వీలు కల్పిస్తుంది. తద్వారా ప్రతీకవాద రచనల పఠనం పాఠకుల ఊహాశక్తి వికసించడానికి చాల అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు ‘రాజుగారి పులిస్వారీ’ చూడండి. ఆ శీర్షికలోని రెండు పదాలూ పాఠకులకు తెలిసినవే. రాజుగారు అన్నప్పుడు ఒక రాచరికపు రాజు అనే అర్థం పాఠకులకు మొదట స్ఫురిస్తుంది. కథకుడు కూడ దాదాపు ఒక పేజీ ఆ స్ఫురణకు భంగం కలిగించకుండా కథ నడుపుతాడు. హఠాత్తుగా ఈ రాజు అనే మాట మనకు తెలిసిన పాలకుడు అనే అర్థాన్ని సూచించడం లేదని, ఈ రాజు వేరని కథకుడు చెప్పేస్తాడు. ఈ రాజు ప్రతీక కానూ వచ్చు, కాకనూ పోవచ్చు. నిజజీవితంలోని రామలింగరాజు అనే ఒక వంచనాశిల్పి కావచ్చు. లేదా ఇరవై, ఇరవై ఐదు ఏళ్ల వెనుక విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి ప్రజలను భ్రమల్లో ముంచిన ఒకానొక భ్రమావిన్యాసపు ప్రతినిధి కావచ్చు. అలాగే పులిస్వారీ అనేది కూడ తెలిసిన మాటే. కాని కథ గడిచిన కొద్దీ అది ఐటి అనే కొత్త దేముడి (మరొక ప్రతీక) మీద భ్రమలకు, పాలక విధానానికి, ప్రజలను వంచించడానికి ప్రతీకగా మారిపోతుంది.
అలాగే, ‘కోరల సింహంగా మారిన కుందేలు కథ’ చూడండి, లేదా, ‘వెన్నెల పడవ’, ‘నదిని నిర్మిస్తున్న వాళ్లు’, ‘కొత్త సందర్భాలు’, ‘వేట మానేసిన రాజు’, ‘గుడ్డివాడి వర్ణచిత్రాలు’, ‘మా హైదరాబాద్ ప్రయాణం’ – వీటిలో ఏ కథయినా చూడండి. అవి నేరుగా ఒక కథగా ఉన్నట్టనిపిస్తాయి. వాటిలో ప్రధాన పాత్రో, ప్రధాన సన్నివేశమో, అసలు మొత్తం ఇతివృత్తమేనో రచయిత చెప్పదలచుకున్న మరొక అంశానికి ప్రతీకగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో అది ఒకే ఒక్క ప్రతీక కూడ కాకపోవచ్చు, ఒక్కొక్క పొరలో ఒక ప్రతీక కావచ్చు, మొత్తంగా ఒక ప్రతీకల గుచ్ఛం కావచ్చు.
ఇలా కథను ప్రతీకాత్మకం చేయడం పాఠకుల పఠనానుభవాన్ని సుసంపన్నం చేస్తుందని నాకనిపిస్తుంది. అసలది ప్రతీకాత్మకమని కూడ గుర్తించకుండా చదవడం ప్రారంభించిన పాఠకులు, అది ప్రతీక అని గుర్తించడం, ఆ ప్రతీక వేరు వేరు జీవనతలాలకు, వేరు వేరు కోణాలకు అన్వయిస్తుందని గుర్తించడం, అంతిమంగా అది రచయిత కలిగించ దలచుకున్న ఒక అవగాహనకు, తెలివిడికి, విశ్లేషణకు చేరుతుందని గుర్తించడం అనే మెట్టుమెట్టుగా ఉన్నతీకరించే ఒక తార్కిక క్రీడలా ఉంటుంది. ఉదాహరణకు ‘గుడ్డివాడి వర్ణచిత్రాలు’ పాఠకుల్లో చాలమంది చూసి ఉండగలిగే అవకాశం ఉన్న ఒక చిత్రకళా నైపుణ్య ప్రదర్శన దగ్గర ప్రారంభమవుతుంది. వేరువేరు వ్యక్తుల స్వభావాలను చిత్రిస్తుంది. జర్నలిస్టునూ ప్రవేశపెడుతుంది. “నాదగ్గరికొచ్చిన వాళ్ల గొంతుల్లోని సంతోషం, ఉత్సాహం, దుఃఖం, కోపమూ, భయమూ నన్నావహిస్తున్నాయి. అవి పలికించే కవిత్వం నన్ను కుదిపి వేస్తుంది. ఆ తర్వాత బొమ్మ వెయ్యడం పెద్ద కష్టమనిపించదు” అనే కళాకారుడి మాటలతో ఆ గుడ్డివాడు ఒక మామూలు గుడ్డివాడు కాదని, రచయిత సృష్టించిన ఒక ప్రతీక అని స్ఫురిస్తుంది. ఇక ఆ ప్రధాన పాత్ర ఒక మనిషి స్థానం నుంచి ఒక ప్రతీక స్థానానికి ఎదిగిన తర్వాత ఇంకా ఇంకా విస్తరిస్తుంది.
ఆ విస్తరణ ఎంత దూరం సాగుతుందంటే, “…బొమ్మ వేసిన వెంటనే ఉన్నది ఉన్నట్టుగా వేసేనో లేదో చూస్తారు. ‘అచ్చు గుద్దినట్టు’ వేసేనని అన్నవాళ్లున్నారు. సరిగ్గా రాలేదని, అసలు పోలికలే లేవని అన్నవాళ్లున్నారు” అని మామూలుగా ఆ గుడ్డివాడు మాట్లాడినట్టే మాట్లాడిన పాత్ర, హఠాత్తుగా ప్రతీకగా మారి, పతంజలి పాత్ర లాగ, “కాని ఉన్నది ఉన్నట్టు చూపించాల్సిన బాధ్యత ఆర్టిస్టులదేనా? న్యాయమూర్తి న్యాయం గురించి, మంత్రి ప్రజాస్వామ్యం గురించి, పోలీసాఫీసరు హింస గురించి తలకిందులుగా మాట్లాడితే ఎవరూ ఎందుకు మాట్లాడరు? సరిగ్గా లేదని ఎందుకు అనరు?” అనడంతో కథ ఒక ఉన్నత తలం లోకి వెళుతుంది. ఈ ప్రతీకాత్మకత ఇక్కడితో కూడ ఆగదు. “మాతో డీల్ చెయ్యడమంటే అల్లాటప్పా వ్యవహారమనుకున్నావా” అని అతిశయం ప్రదర్శించే మేధావులు, లైవ్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడ కథలో ప్రవేశించి, చివరికి చిత్రకారుడి చేత ‘నేటి ప్రజాస్వామ్యం’ చిత్రం గీయిస్తాయి.
“ఎడమవైపు కూచున్నవాళ్లకి ఆ బొమ్మ గాడిద బొమ్మలా కనిపించింది. కాని తోక నక్కదిలా ఉన్నది. అక్కడక్కడా చర్మం పెళుసుబారి గజ్జిపట్టి ఉంది. కుడివైపు కూచున్నవాళ్లకది పిల్లకోళ్లనెత్తుకుపోతున్న గద్దలా కనిపించింది. మరికొందరికి నక్క కళ్లున్న డ్రాగన్ తలలా, ఇంకొందరికి రెండు తలల జెర్రిగొడ్డులా కనిపించింది. కొందరికది దాహంతో ఎండిపోయిన నేల వలె తోచింది. కన్నబిడ్డల్ని కాటేస్తున్న వికృత జంతువు వలె ఉంది” అని ముగుస్తుంది కథ. అందరికీ తెలిసిన రోడ్డు పక్క దృశ్యం దగ్గర ప్రారంభించి, ఆ దృశ్యాన్ని ప్రతీక చేసి, ఆ ప్రతీక పట్ల సమాజంలోని వేరువేరు వర్గాల స్పందనను చిత్రించి, చివరికి దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం వాస్తవ స్థితిని చెప్పడం దాకా ఎంచుకున్న కథనపద్ధతి ఈ కథను ప్రతీకాత్మకతలోనూ, కథావస్తువు ఎంపిక లోనూ, కథనశైలిలోనూ ఎంతో విశ్లేషణకు అవకాశం ఇచ్చే పాఠ్యపుస్తకంలా తయారుచేసింది.
అలాగే 1642లో గోల్కొండనూ హైదరాబాదునూ సందర్శించి యాత్రాకథనం రాసిన టావెర్నియర్ మునిమనవడు 2642లో అదే హైదరాబాదు వీథుల్లో తిరుగుతున్నాడనే ఒక సైన్స్ ఫిక్షన్ వంటి వస్తువును తీసుకుని, మొదటి యాత్ర తర్వాత నాలుగు వందల ఏళ్లకు, అంటే మన వర్తమానంలో హైదరాబాదు స్థితి మీద వ్యాఖ్యానించే ‘మా హైదరాబాద్ ప్రయాణం’ కూడ ప్రతీకాత్మకమైనదే. ఒకటి చెపుతున్నట్టు కనిపిస్తూ మరొకటి, మరింత లోతైనది చెప్పినదే.
అలాగే ఈసప్ కథల, పంచతంత్ర కథల ప్రతీకాత్మకత పద్ధతిలో ‘వేట మానేసిన రాజు’ ఒక ముఖ్యమంత్రి దుర్మార్గం మీద రాసిన కథ. మార్క్వెజ్ నవల ప్రేరణతో అని చెప్పుకుని మరీ రాసిన ‘కొత్త సందర్భాలు’ ఒక వృద్ధ దంపతుల రోజువారీ దినచర్యగా ప్రారంభమై, ఆ గ్రామంలో సహజ మరణాలు లేవనీ, లేకలేక జరిగిన సహజ మరణాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనీ, సమకాలీన చరిత్రను ప్రతీకాత్మకంగా, ఐంద్రజాలిక వాస్తవికతా శిల్పంలో వ్యక్తీకరిస్తుంది.
ప్రతీకలతో, వర్ణనలతో, దృశ్యాలతో, కవిత్వంతో పరిపూర్ణమైన ‘వెన్నెల పడవ’ మన సమాజంలో చిన్నారి పిల్లల శైశవగీతాల ఊహాశక్తిమీద, స్వేచ్ఛ మీద, సృజనాత్మకత మీద తల్లిదండ్రులు, పెద్దలు అమలుచేస్తున్న నియంతృత్వాన్ని, హింసను అత్యంత సుకుమారమైన భాషలో ముఖం మీద గుద్దినట్టు చెప్పిన కథ.
కూర్మనాథ్ కథల్లో కవిత్వ వచనం గురించి కూడ కొంత చెప్పాలి. వచనం నిరలంకారంగా ఉండాలనీ, కవిత్వం అసలు ఉండగూడదనీ చేరా అనేవారు గాని ఇతర భాషల్లోనైనా, తెలుగులోనైనా మంచి కథకులు చాలమంది తమ కథల్లో కవిత్వ వచనమే రాశారు. అది తెచ్చిపెట్టుకున్నదీ కృత్రిమమైనదీ ఆడంబరమైనదీ కూడ కాకపోవచ్చు. బహుశా పాత్రల భావోద్వేగాలు సాంద్రంగా ఉన్నప్పుడు, సన్నివేశాలు బరువుగా ఉన్నప్పుడు, లేదా రచయిత ఆ సందర్భాన్ని భావోద్వేగంతో చిత్రించదలచుకున్నప్పుడు ఉన్నతీకరించిన భాష, కవిత్వ భాష తప్పదేమో. కూర్మనాథ్ కథల్లో కూడ అటువంటి కవితామయ భాగాలు విరివిగా ఉన్నాయి.
‘నదిని నిర్మిస్తున్నవాళ్లు’ అనే కథ నది మీద, నీళ్ల మీద సాగినట్టు కనిపిస్తూనే నదినీ, నీళ్లనూ ప్రజలకూ ఉద్యమానికీ నిర్మాణానికీ ప్రతీకగా అద్భుతంగా నిర్వహిస్తుంది. “లలితంగా, సరళంగా, అమాయకంగా ఉండే నీళ్లు, జీవనాధారమైన నీళ్లు, కోపమొస్తే వందల ఏళ్ల మర్రిచెట్లను కూకటివేళ్లతో పెకలించి వెయ్యగలవని తెలుసుకున్నారు. కొండలను కదిలించి, కరిగించి కొత్తమట్టిని, ఎర్రమట్టిని తీసుకువచ్చి మైదానాలను సుసంపన్నం చేస్తుందని తెలుసుకున్నారు. కొందరికది కదిలే కార్చిచ్చులా కనిపించి వణికించింది. కానీ చాలా మందికి ఊతమిచ్చింది” అనే కవితామయ, ప్రతీకాత్మక వచనంతో అక్షరాలా రాసినదానికన్న ఎక్కువ విస్తారమైన భావాన్ని స్ఫురింపజేస్తాడు కూర్మనాథ్.
‘పాడని పాట’ అయితే పూర్తిగా కవిత్వమే. కథ పొడవునా ఒక గీతం వాచ్యంగానూ ప్రవహిస్తుంది. కథలో అంతర్లీనంగా ఒక విషాద పశ్చాత్తాప గీతం సాగుతుంటుంది. “ఏళ్లు గడుస్తాయి జీవితంలో భారంగానూ, సులభంగానూ. కానీ ఆ తోవల వెంబడి గుచ్చుకున్న ముళ్లు కొన్ని సలుపుతూ ఉంటాయి ఎన్నటికీ. ఆ తలపుల బరువు మౌనంగానే మోస్తూ ఉండాలి ఎవరైనా. మోసేవాళ్లకి తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు” అనే గొప్ప వేదనామయ జీవితసత్యం పాఠకులలో కూడ తమ సొంత పురాస్మృతులను కదిలిస్తుంది.
‘వెన్నెల పడవ’లో చంద్రుడు “ఒకరికి వెండి బంతిలాగా, మరొకరికి ఆకాశానికి పెట్టిన బొట్టులాగా, తియ్యటి పాలకోవా లాగా, అందమైన ఆల్చిప్ప లాగా, బుడగలాగా కనిపించేవాడు. పున్నమి రోజుల్లో అయితే అలాగ. మిగతారోజుల్లో అయితే మంచు జారుడుబండ లాగా, అద్దం ముక్క లాగా, పక్షి ఈక లాగా, వెన్నెల ఊయల లాగా, మెరుపు ముక్క లాగా…” కనిపిస్తున్నాడట. అలాగే, ఆకాశంలోకి వెళ్లాక చుట్టూ మూగిన మేఘాలు “ఏనుగుల మందల వలె, చెట్ల వలె, మంచునదుల వలె, వెన్నముద్దల వలె, వెండి పరుపుల వలె” ఉన్నాయట. ఈ అన్ని కవితామయ ప్రతీకలు, ముఖ్యంగా మొదటి ఉటంకింపులోని ప్రతీకలు, అక్కడ వీక్షకులైన చిన్నారి పిల్లల భావనా ప్రపంచానికి చెందినవి మాత్రమే కావడం కథకుడి శ్రద్ధకూ, జాగ్రత్తకూ నిదర్శనం. అలా తన వస్తువుకు సంబంధించిన మాటలనూ భావనలనూ ఏరుకోవడంలో కూర్మనాథ్ ఎంత జాగ్రత్త వహిస్తాడో చూపడానికి, ఈ కథలోనే “దెబ్బల నెప్పి కంటె నేను కొట్టేనన్న విషయం వాడిని ఎక్కువ బాధ పెట్టినట్లుంది” అని పిల్లల మనోప్రపంచంలోని ఒక సర్వసాధారణ సత్యాన్ని అలవోకగా చెప్పడమే బలమైన ఉదాహరణ. నిజానికి చిన్నారి పిల్లల శరీరం దెబ్బలను పట్టించుకోని స్థితిలో ఉంటుంది. దెబ్బ తగిలించుకోకుండా ఒకరోజు గడవని స్థితి ఉంటుంది. దెబ్బలు తగలడమైనా, అవి మానడమైనా, దెబ్బలు తగులుతాయని తెలిసీ ఆటలు మానకపోవడమైనా శైశవంలో, బాల్యంలో అతి సహజమైన విషయాలు. కాని అంత పెద్ద దెబ్బలు కూడ కానక్కరలేదు, తల్లో తండ్రో అన్నో అక్కో చేయి తాకించినా సరే, అది పూర్తి స్థాయి దెబ్బ కాకపోయినా సరే, దెబ్బలాంటిదని అనిపించినా సరే, పిల్లలు పడే అవమానానికి, బాధకు అంతు ఉండదు.
అయితే ఈ కథల్లో ప్రతీకవాదమంతా, ప్రతీకల ప్రయోగమంతా ఎందుకోసం? అది కేవలం కథకుడి సామర్థ్యాన్ని తెలిపేందుకేనా, ఒక అభివ్యక్తి వైచిత్రిని పాఠకుల కళ్ల ముందర పరిచి వారిని సమ్మోహితులను చేయడం కోసమేనా? ఏ సృజన అయినా, ఏ వ్యక్తీకరణ అయినా, ఒక ప్రాకృతిక, ప్రాపంచిక విషయాన్ని కళారూపంలోకి అనువాదం చేయడమైనా దాని ప్రయోజనం ఏమిటి? అది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో అక్కడికి, ఏ ప్రజల నుంచి, ఏ సమాజం నుంచి పెల్లుబికిందో ఆ ప్రజలకూ ఆ సమాజానికీ ఒక అవగాహనను ఒక దృక్పథం నుంచి బట్వాడా చేయడానికి గదా. అంతకు ముందున్న అవగాహనను ఉన్నతీకరించడానికి మాత్రమే గదా. అలా అనుకునే భావజాలంలో విశ్వాసం ఉన్నవాడు కూర్మనాథ్. అందువల్లనే ఈ ప్రతీకవాద కథలేవీ కేవలం ప్రతీకల దగ్గరో, ప్రతీకవాదం దగ్గరో ఆగిపోలేదు. పాఠకుల ఆలోచనను, ఊహను, ఆచరణను విప్లవీకరించడానికి ప్రయత్నించాయి.
‘పొదగని గుడ్లు’ కథ చదవండి. పావురాల కథగా, పావురాలను ప్రేమించిన, పావురాలతో విసుగు చెందిన ఒక మధ్యతరగతి ఇబ్బందుల కథగా పైకి కనిపించే ఈ కథ క్రమక్రమంగా గొప్ప జీవిత సత్యాలను విప్పిచెప్పేలా వికసిస్తుంది. నగరీకరణ, పావురాల ఇళ్లను కూల్చి మనుషుల ఇళ్లు కట్టినందువల్ల ఆ నిర్వాసిత పక్షులు తమ గడిచిన దినాల తలపోత బరువుల స్థలాలను వదలలేకపోవడం, మధ్యతరగతి ఊగిసలాటలు వంటి ఎన్నో కోణాల పరిశీలనలు దాటి, చివరికి “పచ్చటి గాలీ, చెట్ల చల్లటి అండా దొరకక గుడ్లు భీతిల్లాయా… కాంక్రీటు స్పర్శ నాగుపాము సవ్వడి వలె అనిపించిందా… బెంగటిల్లిన గుడ్లిక పొదగవని పావురాలకు తెలిసిపోయిందా…” అంటూ కథ నిరాశలో ముగుస్తుంది. కాని ఒక ఆశావహమైన ముగింపు కన్న ఎక్కువ ప్రభావశీలంగా ఎగుస్తుంది. వాన మీద, ప్రకృతి వైపరీత్యాల మీద రాసినట్టనిపించే ‘ముసురు’ అనే ఆర్ద్రమైన కథ కూడ ఇలాగే పొరలుపొరలుగా పాఠకుల అవగాహనను ఉన్నతీకరిస్తుంది.
కూర్మనాథ్ కథారచన ప్రారంభించినప్పటి నుంచీ తన కథల్లో వదలకుండా ప్రవేశపెడుతున్న అంశం ఒకటుంది. అది తన జర్నలిస్టు జీవితానుభవాల నుంచి జీవితసత్యాలను చెప్పడానికి ప్రయత్నించడం. అది తలకిందుల లోకాన్ని నివేదించే పని, అబద్ధాలను నిజాలుగా నమ్మకంగా చెప్పి ప్రజలను మాయలో ముంచడానికి వేతనాలు అందుకుంటున్న పని గనుక ఆ పని మీద కూర్మనాథ్ కు ఉండవలసినంత కంటెంప్ట్ ఉంది. అది కొన్ని కథల్లో మొత్తంగానూ, ప్రతి కథలోనూ ఎక్కడో ఒకచోటా కనబడుతుంది. ఈ సంపుటంలో ‘నగరంలో ఇంకొకరోజు’, ‘భూతల స్వర్గం’ పూర్తిగా జర్నలిస్టు కథలు కాగా కనీసం మరొక నాలుగు కథల్లో జర్నలిస్టుల ప్రస్తావన ఉంది.
ఇలా చెపుతూ పోతే ప్రతికథ గురించీ చెప్పాలని ఉంది గాని, ముందుమాటలో అన్నీ చెప్పడం కుదరదు. వ్యంగ్యంతో కథ నిర్వహించిన ‘రాజుగారి బట్టలు’, చెప్పవలసింది చాల మిగిల్చి, పాఠకుల ఊహకు వదిలి క్లుప్తంగా రాసిన ‘మా క్లాస్ మేట్ పద్మ’, విప్లవోద్యమ అమరుల స్మృతిని హృద్యంగా, ఆర్ద్రంగా, సున్నితంగా చిత్రించిన ‘పూల గుర్తులు’, ‘మందు’ మరింత వివరమైన విశ్లేషణ అవసరమైనవి. వాటిని మీ విశ్లేషణకే వదులుతున్నాను. భావుకతా, సున్నితత్వమూ, ప్రయోగదృష్టీ, విప్లవనిబద్ధతా ఒక అద్భుతమైన రసాయనిక సంయోగంలో కలగలిసి తయారైన ఈ కథలను మీకు పరిచయం చేయగలిగే అవకాశం వచ్చినందుకు సగర్వంగా ఉంది. ఉత్తరాంధ్ర కథకుల సంప్రదాయంలోని, విప్లవ కథకుల నిబద్ధతలోని, కొత్త కథకుల ప్రయోగశీలతలోని మేలుకలయికగా వికసిస్తున్న కూర్మనాథ్ కు అభినందనలు. ప్రేమపూర్వక ప్రశంసాలింగనం.
*
అభినందనలు కూర్మనాథ్ సార్. ఇన్నేళ్ళకు మరల మీ కథల పుస్తకం రావడం అదీ నేడున్న నిర్బంధ కాలంలో.
సర్ ఎప్పటిలాగే గొప్ప విశ్లేషణ సర్. కూర్మనాథ్ గొప్ప కథకుడు. కొత్త సంకలనానికి ఆహ్వానం.
2642 badulu 2042 undaalemO.. best wishes to kurmanath