ఫండ్ లో పనిచేసిన దశాబ్ద కాలం కొత్త విషయాలను నేర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడింది. ఫండ్ సభ్యదేశాల్లో తలెత్తే ఫిస్కల్ అంశాలను పరిష్కరించడానికి నా టెక్నికల్ స్కిల్స్ ను ఉపయోగించే అవకాశం వాటిలో మొదటిది. అంతకు మించి, పబ్లిక్ ఫైనాన్సెస్ కు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు మధ్య చక్కని వారధులు నిర్మించే అవకాశమూ నాకా పనిలో కలిగింది.
ఫండ్ లో చేరినప్పుడు నాకు నేను మూడు ముఖాలుగా పనిచెయ్యాలని నిర్దేశించుకున్నాను. మొదటిది – ఫండ్ కార్యకలాపాల్లో, టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాముల్లో పూర్తిగా నిమగ్నమై వాటిని అవగాహన చేసుకోవడం. రెండోది – సభ్య దేశాల అధికారుల కోసం నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో భాగం కావడం, నిర్వహించడం. మూడోది – పరిశోధనను కొనసాగించడం, పత్రాలను ప్రచురిస్తూ ఉండటం.
మొదటి రెండూ బాగా చెయ్యగలిగానుగాని, విపరీతమైన పని, ప్రయాణాల మధ్య మూడో లక్ష్యాన్ని అంతగా చేరుకోలేకపోయాను. ‘ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్’ పేరిట, ‘డిపార్ట్మెంటల్ మెమొరాండా ఇన్ ద ఫండ్’ సిరీస్ లో భాగంగా ప్రచురించిన కొన్ని పేపర్లు తప్పిస్తే, సంతోషపడేందుకు మరేమీ లేవు. ఒక ఉన్నత స్థాయి సెమినార్ కోసం నేను పోగుచేసిన మెటీరియల్ బోలెడు ఉండేది, కాని అది ఒక పరిశోధనపత్రం రూపంలోకి రాలేదు.
ఫండ్ లో చేరి పదేళ్లయిన తర్వాత ఈ కొరతను ఎలాగైనా పూరించాలని నిర్ణయించుకున్నాను. అన్నేళ్లలో నేను బోలెడంత చదివాను, బోల్డంత నోట్సు రాసుకున్నాను, ప్రతి అంశం మీదా నాదైన అభిప్రాయాలను రూపొందించుకున్నాను. జి.సి. లీటెన్ బర్గ్ అనే మహాశయుడు ఒకచోట ఏం చెప్పాడంటే ‘నువ్వు చదువుతున్నావంటే అప్పు తీసుకుంటున్నట్టే, వాటిని ఉపయోగించి రచన చేసినప్పుడే నీ రుణం తీరుతుంది’ అని. నేను నా రుణాన్ని కొంతయినా తీర్చాలనుకున్నాను. ప్రభుత్వాల్లాగా మళ్లీ కొత్త అప్పు దొరుకుతుందని కాదు, నిజంగా తీర్చాలనే.
అప్పుడు జరిగిన ఉన్నతస్థాయి సెమినార్ కూడా కొన్ని అంశాలపై శ్రద్ధగా, సమగ్రంగా అధ్యయనం చెయ్యవలసిన అవసరాన్ని గట్టిగా గుర్తుచేసింది. ఫండ్ లో పనిచేసేవారికి కొత్త ఆలోచనల ప్రపంచాలు తెరుచుకుంటాయి, మారుతున్న ధోరణులు తెలుస్తాయి, కాని లోతైన అధ్యయనం చేసి రాతలో వాటినో కొలిక్కి తీసుకురావడానికి అవసరమైన సమయం మాత్రం చిక్కదు సాధారణంగా. నా విషయంలోనూ అదే జరిగింది.
అదిగాక, నాకు వయసు పైబడుతోంది, భవిష్యత్తులో సీరియస్ రైటింగ్ మీద దృష్టిపెట్టలేనేమో అనిపించేది. మొదటిసారి పుస్తకం రాసినప్పుడు పడిన కష్టమంతా నాకు గుర్తుంది, అంత కష్టం పోనుపోనూ పడలేనని అనిపిస్తూ ఉండేది. (కాని ఇది మాత్రం తప్పయింది, అనంతర కాలంలో నేను ఏడు పుస్తకాలు రాయగలిగాను, రిటైరయిన తర్వాత కూడా ఒకటి ప్రచురించాను.) అందువల్ల ఒంట్లో బలం తగ్గకుండా ఉన్నప్పుడే నా పరిశోధన ఫలాల్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
కుటుంబంలో సంభవించిన పరిణామాలు కూడా ఆ దిశలో నాక్కొంత వీలు కల్పించాయి. 1978లో మా పెద్దమ్మాయికి పెళ్లయ్యింది, 1980లో ఆమెకు తొలిసంతానంగా కొడుకు పుట్టాడు. కాన్పు సమయంలో ఆమెకు సాయం చెయ్యడానికి నా భార్య రమ తరచూ ఇండియాకు వెళ్లవలసి వచ్చేది. మా రెండో అమ్మాయి అప్పటికి ఎం.బి.యే మొదటి సెమిస్టర్ పూర్తి చేసింది, తర్వాత చదువుకు ముందు మూడు నెలల సెలవు తీసుకోవాలనుకుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను కూడా బయటికెళ్లి నా పరిశోధన పూర్తిచెయ్యవచ్చు అనుకున్నాను.
ఫండ్ లో పదేళ్ల పదవీకాలం పూర్తిచేసిన ఉద్యోగులు ఒక ఏడాదిపాటు సెలవుపెట్టి (సబాటికల్) తమకు నచ్చిన అంశంలో అధ్యయనం చేసే మంచి సంప్రదాయం ఉండేది. ఉన్నత చదువు చదవచ్చు లేదా పుస్తకాలు రాయొచ్చు. ఇది ఈనాటికీ కొనసాగుతోంది. (ప్రపంచబ్యాంకులోనూ అటువంటిది ఉండేదిగాని, వాళ్లు దాన్ని 1981లో ఆపేశారు) ఆ సమయంలో ఫండ్ పూర్తి జీతం ఇస్తుంది, వాళ్లు వెళ్లాలనుకున్నచోటికి కుటుంబంతో సహా రానూపోనూ ప్రయాణ సదుపాయాలు (టికెట్లు) ఇస్తుంది, ట్యూషన్ ఫీజు వంటివి ఉంటే కడుతుంది కూడా!
నేను నా ఆలోచనను గూడేతో పంచుకున్నాను. సబాటికల్ లీవ్ కమిటీకి కూడా ఆయనే ఛైర్మన్. ఆయన స్వయంగా విద్యావంతుడుగనక నా ఆలోచన ఆయనకు అర్థమైంది, నాకు కావలసిన సాయమంతా చేస్తానని ప్రోత్సహించారు. అయితే నేను అధ్యయనానికి, రచనకు ఎక్కడకు వెళ్లాలన్నదాని మీద భిన్నాభిప్రాయాలున్నాయి మా ఇద్దరికీ. నేను బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ కు వెళ్లాలని ఆయన ఉద్దేశం. అది ఫండ్ హెడ్ క్వార్టర్ కు ఆరు బ్లాకుల అవతలే ఉంటుంది, దానికప్పటికే మేధావి సంస్థగా పేరుంది. అదీగాక వాషింగ్టన్ లోనే ఉంటే అవసరమైన కొన్ని మిషన్లకు నా సాయం అందుతుందని కూడా ఆయన బుర్రలో ఉంది. కాని వాషింగ్టన్ నుంచి బయటకు, నిశ్శబ్దమైన ప్రాంతానికి వెళ్లి పనిచేసుకోవాలని నేను అనుకున్నాను. రోజువారీ డ్రైవింగ్, ఇతర ఒత్తిడులు లేకుండా ఉండాలని నా ఉద్దేశం.
ఆక్స్ ఫర్డ్ అటువంటి ప్రదేశమని నాకనిపించింది. నసుగుతూనే గూడే దానికి అంగీకరించారు. 1980 అక్టోబరులో మేం అక్కడికి మారాం. ప్రపంచ బ్యాంకులో పనిచేసే గురుతుల్యులు పాల్ స్ట్రీటెన్ దయవలన క్వీన్ ఎలిజబెత్ హౌస్ లోనూ, ప్రొఫెసర్ మౌరీస్ స్కాట్ స్పాన్సర్ షిప్ వల్ల న్యూఫీల్డ్ కాలేజ్ లోనూ – రెండు చోట్లా నన్ను విజిటింగ్ సీనియర్ ఫెలోగా అంగీకరించారు. సెయింట్ జాన్ కాలేజీ వెనక నాకు విడిగా ఓ కార్యాలయం కుదిరింది.
నార్త్ ఆక్స్ ఫర్డ్ లో సమ్మర్ టౌన్ అనే ప్రాంతంలో మేం మూడు పడగ్గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాం. హీత్రూ విమానాశ్రయంలో దిగి నేరుగా ఆ ఇంటికే వెళ్లిపోయాం. గదులు చిన్నవేగాని మేమిద్దరం ఒక ఏడాది గడపడానికి కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి. అమెరికాలో ఏది కావాలన్నా సూపర్ మార్కెట్లకు పోవాలి. ఇక్కడ రోజువారీ అవసరాలైన పాలు, బ్రెడ్, గుడ్లు వంటివి ఇంటికే వచ్చేసేవి. రోజూ నా ఆఫీసుకు వెళ్లాలంటే కాసేపు సిటీ బస్సులో ప్రయాణించాలి. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి సందర్భాల్లో సిటీ బస్సులుండవు. అటువంటప్పుడు నడిచి కూడా వెళ్లిపోవచ్చు.
ఆక్స్ ఫర్డ్ లోని కూలే అనే ప్రాంతంలో మాత్రం కొన్ని కార్ల ఉత్పత్తి కర్మాగారాలుంటాయి. అదితప్ప మిగిలిన టౌనంతా కాలేజీలతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల అక్కడ విద్యార్థులు, అధ్యాపకులు, నావంటి విదేశీ స్కాలర్లు ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. అధ్యయనం, పరిశోధనల కోసం అక్కడ ఉండేది కొద్దికాలమే. కనుక ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తలపుల్లో ఉండేవాళ్లే ఎక్కువమంది.
అక్కడ నేను కొందరు గొప్పవారిని చూడగలిగాను. సమ్మర్ టౌన్లోనే నీరద్ సి. చౌధురి ఉండేవారు. కూరగాయల మార్కెట్లో ఒక చేత్తో సంచి, మరోచేత్తో గొడుగు పట్టుకుని కనిపించేవారు. క్వీన్ ఎలిజబెత్ హౌస్ లో టీ తాగడానికి వెళ్లినప్పుడు ఇండియన్ సివిల్ సర్వెంట్లు కనిపించేవారు. బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో వారక్కడ ఏదో చదువుతూ ఉండేవారు. అందులో ఒక ఐ.పి.ఎస్. అధికారి ఉండేవారు, ఆయన చరణ్ సింగ్ అధీనంలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేవారు. అయితే ఆయన కవి కూడా. ఒక కవిత్వ పుస్తకం కూడా వెలువడింది. ఇక ఆర్థికవేత్తల్లో అర్జున్ సేన్ గుప్తా కనిపించేవారు. మూడో ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థల్లో రావలసిన మార్పుల గురించి ఆయన పరిశోధన చేస్తూ ఉండేవారు. ఎక్కడున్నా తనదైన కంచుకంఠం పదిమందిలో ఆయన ఉనికిని తెలియజేసేది. తర్వాత త్వరలోనే ఆయన ప్రధాని కార్యాలయంలో పనిచెయ్యడానికి భారత్ కు వెళ్లిపోయారు. ఆక్స్ ఫర్డ్ లో చదివి వచ్చిన అనేక ఆర్థికవేత్తల్లాగానే ఆయన కూడా వామపక్షాల్లో ఇంకా వామపక్షంగా నడుచుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నుంచి వచ్చిన ఎన్.ఎస్.సిద్ధార్థన్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ స్టడీలో ఉండేవారు. ఆయనదీ నాదీ ఆఫీసులో ఒకే భవనంలో ఉండేవి, మేం టీ తాగడానికి కలిసి వెళుతూ ఉండేవాళ్లం.
నాకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. ఏకాంతం కూడా. ఉన్న సమయం తక్కువ కనుక నేను ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. దానికి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే గడువు సమయానికల్లా నేను వ్రాతప్రతిని సిద్ధం చేసుకోగలుగుతాను.
అయితే ఈ పుస్తకం కాకుండా నా బుర్రమీద ఇంకో రెండు పనులుండేవి. నేను ఫండ్ నుంచి బయల్దేరడానికి ముందు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసులో పనిచేస్తున్న అలెన్ స్కిక్ ఒక జర్నల్ ను ప్రచురించాలని అభిలాషతో ఉండేవారు. దాని పేరు పబ్లిక్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్స్. దాని ప్రారంభ సంచికకు నన్నో వ్యాసం రాయమన్నారు. అంతేగాక, దాని ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉండమన్నారు. నేను రెండిటికీ సంతోషంగా ఒప్పుకున్నాను. (బోర్డు సభ్యుడిగా రెండు దశాబ్దాలుగా కొనసాగాను) అలాగే ప్రొఫెసర్ వి.వి.రామనాథంగారి గురించి తీసుకురావాలనుకున్న ఒక సంచికకు ఒక ఆర్టికల్ రాసిస్తానని కూడా ఒప్పుకున్నాను. ఆయన ఆంధ్రాయూనివర్సిటీలో నాకు గురువు, నేను ఆ డిపార్ట్ మెంటులోను, అక్కణ్నుంచి ఆయన ఐ.రా.స., నేను ఐ.ఎమ్.ఎఫ్ సంస్థల్లో చేరాక మంచి స్నేహితులయ్యారు.
ఈ సమయంలోనే మార్గరెట్ థాచర్ నేతృత్వంలోని న్యూ కన్సర్వేటివ్ గవర్నమెంట్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో వస్తున్న మార్పుల గురించి బ్రిటిష్ ట్రెజరీ (ఆర్థిక శాఖ) నుంచి కావాలసిన పత్రాలు తీసుకునే పని ఒకటి నాకుండేది. అక్టోబరు, డిసెంబరు రెండు నెలల్లో కావలసిన మెటీరియల్ ఇంకొంత పోగుచేసుకుని రెండు పేపర్లు రాసుకుని, నా పుస్తకం 1981 జనవరి, జూన్ మధ్యలో పూర్తి చేసుకోగలనని అనుకున్నాను. ట్రెజరీలో సెకెండ్ పెర్మనెంట్ సెక్రటరీ అయిన జాఫ్రీ లిట్లర్ నాకు కావలసిన డాక్యుమెంటేషన్ అంతా సాయం చేశారు.
ఈ సమయంలో నేను వంటలో కూడా కాస్త అప్రెంటిస్ షిప్ చెయ్యవలసి వచ్చింది. మా అమ్మాయికి సాయం చెయ్యడానికి నా భార్య ఇండియాకు వెళ్లినప్పుడు నేను ఇంట్లో వంట చేసుకోవలసి వచ్చింది. చెప్పొచ్చేదేమంటే – ఈ పనులన్నిటితో నాకు సమయం సరిపోయేదే కాదు. సబాటికల్ సెలవు అని పుచ్చుకున్నది కాస్తా వాషింగ్టన్ లో అసలు ఉద్యోగం చేస్తున్న రోజుల కన్న ఎక్కువ బిజీగా అయిపోయాను. క్షణం కూడా ఖాళీ ఉండేది కాదు. దీనికి నేనెవర్నీ నిందించలేను, అంతా స్వయంకృతమే మరి.
* * * * *
ఆక్స్ ఫర్డ్ లో కాస్త సెటిలవగానే ముందు చేసిన పనేంటంటే నేను రాయదలచుకున్న పుస్తక సారాంశాన్ని తయారుచెయ్యడం, దాన్ని యూనివర్సిటీలో స్కాలర్లకు చూపెట్టడం. వారి కామెంట్లు ముందుగానే తీసుకుంటే, వాటిని బట్టి రచనలో అవసరమైన మార్పుచేర్పులేమైనా చేసుకోవచ్చు. నేను ఎంచుకున్న అంశంలో స్కాలర్లెవరూ ఎక్కువ లేరు యూనివర్సిటీలో. ఉన్న వారివి విశాలమైన దృష్టి, ఇంకా అకడమిక్ వ్యక్తులు. అయినా వారి కామెంట్లు విలువైనవనే ఉద్దేశంతో నేను సినాప్సిస్ తయారుచేశాను.
ముందుగా లేడీ హిక్స్ కు – ఆమె పూర్తి పేరు ఉర్సులా కాథలీన్ వెబ్ హిక్స్. ఆమె భర్త జాన్ హిక్స్ – వారిద్దరూ పేరున్న ఆర్థికవేత్తలే. అప్పటికామె ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ లెక్చరర్గా పనిచేసేవారు. న్యూఫీల్డ్ కాలేజీలో పనిచేస్తున్న మౌరీస్ స్కాట్ కు, క్వీన్ ఎలిజబెత్ హౌస్ మాస్టర్ గా ఉన్న ఆర్థర్ హేజెల్ వుడ్ – వీరు ముగ్గురికీ అందజేశాను.
సారాంశం రాస్తున్నప్పుడే ఈ ప్రాజెక్టు నేను అనుకున్నదానికన్న పెద్దది అవుతోందనిపించింది. కాని వీలైనంత వరకు పూర్తి చెయ్యాలని అనుకున్నాను. నా రిఫరీలు ముగ్గురూ ఉపయుక్తమైన కామెంట్లు ఇచ్చారు, అదేసమయంలో పెద్ద ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నానని, అందులో సగభాగమే చేస్తే మంచిదేమోనని సూచించారు.
నా ధోరణి పట్ల వారు పూర్తిగా ఏకీభవించకపోయినప్పటికీ, నా ప్లాను ప్రకారం వెళ్లనివ్వాలనుకున్నారు.
ఆ సారాంశాన్ని ఒక ప్రణాళికగా మార్చడం తరువాయి మెట్టు. ఆక్స్ ఫర్డ్ లో సాధారణంగా ఉదయం వాన పడుతుంటుంది, చాలా చలిగా ఉంటుంది. ఎంత వాన అయినా ఉదయం ఎనిమిదింటికల్లా ఆఫీసుకు రావడం, మధ్యాహ్నం ఒంటిగంట దాకా పనిచెయ్యడం, మా ఆవిడ రమ ఉంటే మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లడం, లేదంటే ఉన్నచోటనే ఒక శాండ్విచ్, ఓ కప్పు పెరుగు తిని కాసింత రెస్టు తీసుకోవడం. మళ్లీ మూడింటి నుంచి ఆరింటి దాకా కదలకుండా కూర్చుని రాసుకోవడం తర్వాత ఇంటికి పోవడం, రమ లేకపోతేగనక స్పెన్సర్స్ నుంచి తెచ్చిన ఏవో వంటకాలను వెచ్చజేసుకోవడం, రాత్రి భోజనం కానిచ్చి నిద్రపోవడం – ఇదీ నా దినచర్య. వారాంతాలు కుటుంబానికి కేటాయించేవాణ్ని. అక్కడ ఓ నలభై ప్రఖ్యాత కాలేజీలుంటాయేమో, వీలు కుదిరినప్పుడల్లా వాటిని, పుస్తకాల దుకాణాలను సందర్శించడం నాకు ఆటవిడుపు.
* * * * *
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న కాలేజీలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొన్నయితే ఏకంగా ఐదు వందల ఏళ్ల నాటివి! వారి చరిత్ర, అంకితభావం, దేశ సామాజిక, రాజకీయ చరిత్రలో వారు పోషించిన పాత్ర – ఇటువంటి లక్షణాలు ఆ అసామాన్య ప్రతిష్టకి కారణాలు. నూటయాభయ్యేళ్ల క్రితం సందర్శించిన అమెరికన్ తత్వవేత్త ఎమర్సన్ ‘ఆ యూనివర్సిటీలోని ప్రతి భాగమూ సంపన్నంగా ఉంటుంది. ఒకవైపు వ్యవస్థాపకుల చిత్రపటాలు, మరోవైపు చెక్క పనితనమూ వెరసి ఆక్స్ ఫర్డ్ అటు పరిణతి, ఇటు జ్ఞానమూ కలబోసిన సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది..’ అని రాశాడు.
అంత ప్రాచీన చరిత్ర ఉండటం వల్ల విద్యార్థులు ఆ సంస్థను విపరీతంగా గౌరవిస్తారు. ఎమర్సన్ ఇలా కూడా రాశాడు…
“Oxford is a little aristrocracy in itself, numerous and dignified enough to rank with other estates in the realm; and where fame and secular promotion are to be had for study, and in a direction which has the unanimous respect of all cultivated nations”
ఆక్స్ ఫర్డ్ లో పూర్వ తరాలు నడిచిన దారులు, వారు చేరుకున్న ఉన్నత శిఖరాలు నవ్య తరాలకు ఒక సమున్నత లక్ష్యాలను నిర్దేశం చేస్తూ ఉంటాయి. పాతవారు ఎందరో దేశసేవలో, చక్రవర్తి సేవలో అసువులు బాసినట్టు అక్కడున్న దారుఫలకాలు నిత్యం గుర్తుచేస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమంటే – అత్యున్నత విద్యనభ్యసించినవారు, వారి ప్రతిభ అంత చిన్న ప్రదేశంలో అందుబాటులో ఉండటం విశిష్టమైన విషయంగా ఉంటుంది. అదే ఆక్స్ ఫర్డ్ అసలైన ఆస్తి. ఎమర్సన్ చెప్పినట్టుగా ‘ఉన్నత విద్యావంతులను, మేధావులను తరచూ కలిసే అలవాటు వల్ల మంచిని గ్రహించి చెత్తను వదిలేసే క్షీర-నీర న్యాయం అలవడుతుంది’.
నేను అటాచయిన రెండు సంస్థలు మిగిలినవాటితో పోలిస్తే అంత ఎక్కువ వయసున్నవి కాదు. కాని ఈ రెండిటిలోకీ గ్రాడ్యుయేట్లను నేరుగా తీసుకోరు. క్వీన్ ఎలిజబెత్ హౌస్ సాధారణంగా బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్లను, ఆసియా ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధికారులకు, ఫారిన్ సర్వీసు ఉన్నతాధికారుల శిక్షణకు ఉపయోగపడేది. న్యూఫీల్డ్ కాలేజీ కేవలం ఎమ్.ఫిల్, పి.హెచ్.డి. విద్యార్థులు ఉండేవారు. అక్కడ విద్యార్థులకన్న అధ్యాపకుల సంఖ్య ఎక్కువ. నేనున్నప్పుడు నలభై మంది విద్యార్థులు, 44మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండేవారు. ప్రతి విద్యార్థితో నేరుగా మాట్లాడి, గైడెన్స్ ఇచ్చే వీలుండేది.
* * * * *
అప్పటికి ఇంగ్లండ్ లో కన్సర్వేటివ్, లేబర్, లిబరల్ అనే మూడు పొలిటికల్ పార్టీలుండేవి. 1980లో నాలుగో పార్టీ స్థాపించే ప్రయత్నం జరిగింది. దాని పేరు సోషల్ డెమాక్రటిక్ పార్టీ. మూలకర్త లార్డ్ జెర్కిన్స్. అప్పటికి యూరోపియన్ కమిషన్ లో పని చేసేవారు. తర్వాత గొప్ప బయోగ్రఫర్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఎక్స్ చెకర్ కి మాజీ ఛాన్సలర్ ఆయన.
ట్రేడ్ యూనియన్లు ఎక్కువగా పెత్తనం చేసే లేబర్ పార్టీ వామపక్ష భావజాలంతో విసిగిపోయిన లార్డ్ జెర్కిన్స్, ఆయన అనుయాయులు కొత్త పార్టీ ఆలోచనలు చేశారు. వీరిది వాస్తవిక ధోరణి. దాన్ని లేబర్ పార్టీ అణచివేసేది. అదీగాక జాతీయీకరణ పెరగడం ఆయనకు నచ్చేది కాదు. అది విఫలమవడాన్ని వాళ్లు దగ్గర్నుంచి చూశారుగనక లేబర్ పార్టీని ఏ రకంగానూ సమర్థించలేకపోయారు. జెర్కిన్స్ బ్రసెల్స్ లో ఉంటే ఆయన అనుయాయులు న్యూఫీల్డ్ కాలేజీకి వచ్చి చర్చలు, డిబేట్లను నిర్వహించేవారు. అవి ఆవేశపూరితంగా ఉండేవి.
యాదృచ్ఛికంగా అప్పుడే అమెరికాలో నియో కన్సర్వేటివ్ ఉద్యమం ఊపందుకుంది. మెక్ గవర్న్ ధోరణులు నచ్చని మేధావులు, డెమాక్రటిక్ పాలసీల మీద తమ ముద్ర వెయ్యలేక దాన్నుంచి దూరం జరిగి రిపబ్లికన్ పార్టీకి దగ్గరవడం మొదలుపెట్టారు. ఈ నియో కన్సర్వేటివ్ లు రోనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బలం పుంజుకున్నారు. సోషల్ డెమాక్రాట్లు మాత్రం అనుకున్నంతగా రాణించలేక చతికిలపడ్డారు. ఆ వేదికను ఒక దశాబ్దం తర్వాత టోనీ బ్లెయిర్ సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు, లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడాయన.
* * * * *
ఆక్స్ ఫర్డ్ జీవితంలో ఆశ్చర్యానికి గురయ్యే సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతిదీ ఏదోక కొత్త ఆలోచననిస్తూనే ఉంటుంది. కాలేజీల్లో సైతం ఉన్నత – నిమ్న వర్గాల మధ్య అంతరం స్పష్టంగా ఉంటుంది. ఇది నాకు అక్కడకు వెళ్లకముందే, మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన తన ఆత్మకథ ద్వారా తెలుసు. నేనున్న తక్కువ సమయంలోకూడా ఈ తరహా సామాజిక అంతరాలను గమనించగలిగాను. ఇటువంటి దుష్ట సంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ సామాజిక ఉద్యమాలు పెద్దగా ఊపందుకోలేదు. ఉన్నతవర్గం క్షీణించిపోయినా, వారి భావజాలం మాత్రం సజీవ పరంపరగా ఉంటూనే వచ్చింది.
ఉదాహరణకు కొందరు పెద్దవాళ్లకు అక్కడి స్థానిక కిరాణా, కూరగాయల దుకాణాలు నెలవారీ ఖాతాల మీద సరుకులిచ్చేవి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కాలేజీ అధ్యాపకులకు మూడు నెలలకోసారి జీతాలు వచ్చేవట. దాంతో వారు స్థానిక దుకాణదారులతో ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. అది అన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలప్పుడు ఆ దేశం స్తంభించిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఆఖరుకు ట్రెయిన్లు కూడా నడవవు. సాంకేతికపరంగా చూసినా ఇంగ్లండ్ కాస్త వెనకబడినట్టే అనిపిస్తుంది. అంటే వేణ్నీళ్లకు విడిగా ఒక కొళాయి ఉంటుంది తప్ప, రెండూ కలిపి ఒకటే ట్యాప్ లోంచి వచ్చే పద్ధతి ఉండేది కాదు.
* * * * *
ఒక పుస్తకం రాయాలంటే గొప్ప పట్టుదల, ఓర్పు ఉండాలి. రోజుకు ఆరేడు గంటలపాటు, అలా ఆరు నెలలు కూర్చోగలగాలి. ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్టు అనిపిస్తుంది. ఆక్స్ ఫర్డ్ లో చలికాలాలు దుర్భరమైనవి. పని దినాల కన్నా సెలవులు ఎక్కువ, సెలవుల్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంటుంది. క్రిస్మస్, ఈస్టర్ సెలవులప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతారు, నాలాగా వచ్చిన విదేశీ స్కాలర్లు దక్షిణ యూరప్ లో వెచ్చని ప్రాంతాల్లో గడపడానికి వెళుతుంటారు. నేను అవన్నీ చూసేశానుగనక ఎక్కడికీ వెళ్లదలచుకోలేదు. చలిగాని, వానగాని ఏదైనా తదేక దీక్షతో రాయడమొక్కటే పనిగా పెట్టుకున్నాను. మే చివరకు పూర్తిచేశాను. ‘గవర్నమెంట్ బడ్జెటింగ్ అండ్ ఎక్స్ పెండిచర్ కంట్రోల్స్- థియరీ అండ్ ప్రాక్టీస్’ అనే శీర్షిక ఖరారు చేశాను.
ఇక ముద్రణ సంగతి చూడాలి. వ్రాతప్రతి ఆరొందల పేజీలు వచ్చింది. అంటే అచ్చు ఖర్చు భారీగా అవుతుంది. దానివల్లే ఎవరూ ముందుకు రాకపోవచ్చని భయపడ్డాను. నా తొలి పుస్తకం వేసిన అలెన్ అండ్ అన్విన్ పబ్లిషర్స్ ను సంప్రదించాను. అది మంచి పేరు సంపాదించుకుందిగనక ఈ పుస్తకం వెయ్యడానికి వెనకాడలేదు వాళ్లు. ఇక టైపింగ్, రిఫరీలకు పంపడం వంటి పనులున్నాయి. అక్కడితో మేం ఆక్స్ ఫర్డ్ ను వదిలి తిరిగి వాషింగ్టన్ కు వచ్చేశాం. ఏడాదిపాటు సబాటికల్ లీవులో ఉన్నప్పటికీ నేను ఆఫీసుతో పూర్తి దూరంగా ఏమీ లేను. ఆఫీసు పని మీద నైజీరియా వెళ్లాను, ఓ పేపర్ సమర్పించాను, లండన్ కు వచ్చిపోయే సహోద్యోగుల ఫోన్లు, ఉత్తరాలు, కలవడాలు – వీటితో హెడ్ క్వార్టర్ లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేది. అందువల్ల తిరిగి వచ్చి పనిలో కుదురుకోవడం కష్టం కాలేదు.
అప్పుడే ఐ.ఎమ్.ఎఫ్.కు కంప్యూటర్ సౌకర్యం వచ్చింది. దాంతో నా పుస్తకాన్ని టైప్ రైటర్ మీద గాకుండా కంప్యూటర్ లో టైప్ చెయ్యాలనుకున్నాం. అలాగే ఎడిటర్ ను వెతకాలి. ఫండ్ లో అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు. ఫండ్ జర్నల్స్, పేపర్ల ప్రచురణలో వాళ్లు పనిచేసేవారు. ఫండ్ చీఫ్ ఎడిటర్ నార్మన్ హంఫ్రీస్ ను కలిసి ఈ పనిలో అతని సాయం అడిగాను.
‘ఇందులో మాకేం వస్తుంది? మేమెందుకు మా సమయాన్ని, శక్తిని పెట్టాలి దీనికి?’ అని అడిగాడు అతను సూటిగా.
ఆ ప్రశ్నల ఉద్దేశం నాకు తర్వాత అర్థమైంది.
అప్పటికి ఫండ్ కు అంటూ ఒక పబ్లికేషన్ ప్రోగ్రామ్ లేదు. ఫండ్ లీగల్ కౌన్సెల్ గా పనిచేస్తున్న సర్ జోసెఫ్ గోల్డ్ రాసిన పుస్తకాలను ఫండ్ ప్రచురించింది. ఖర్చులే తప్ప వాళ్లకొరిగిన లాభమేం లేదు. మార్కెటింగ్ విభాగమూ లేదు. దీన్నంతా దృష్టిలో పెట్టుకుని నార్మన్ ఒక పబ్లికేషన్ ప్రోగ్రామ్ ఉండాలి, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉండాలి అని కోరుకునేవారు.
ఈ నేపథ్యం అర్థమయ్యాక నాకు నార్మన్ తో చర్చించడం సులువయ్యింది. నా పుస్తకాన్ని ప్రచురించేందుకు అప్పటికే ఒక సంస్థ సిద్ధంగా ఉందని, అయినా, నా సబాటికల్ సెలవులో ఫండ్ పూర్తి జీతమిచ్చిందిగనక దీని మొదటి హక్కులు ఫండ్ కే ఇవ్వడం ధర్మమని నేను భావిస్తున్నానని చెప్పాను. ఆయన అది చాలా భావ్యంగా ఉందన్నాడు.
అయితే ఇక్కడో సమస్య ఉంది. సాధారణంగా ఫండ్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఎక్కడా తీవ్ర పదజాలం, కరుకైన విమర్శలకు అది తావియ్యదు. దాంతో పాఠకులకు నా రచన చప్పగా అనిపించవచ్చు. కాస్త సందేహిస్తూనే నార్మన్ తో దీన్ని ప్రస్తావించాను. ఆయన ‘ఇది మన తొలి ప్రయత్నం గనక మీ శైలినే యధాతథంగా ఉంచి చూద్దాం’ అంటూ ప్రోత్సహించారు. వ్రాతప్రతిని కంపోజ్ చేసి పుస్తకరూపం ఇవ్వాల్సిన గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ వారు ఉత్సాహపడ్డారు. అప్పటిదాకా ఫండ్ వార్షిక నివేదికలను మాత్రమే రూపొందించడం వారి పని. తాము ఏకంగా పుస్తకాన్ని ప్రచురించే సామర్థ్యం ఉన్నవాళ్లమని నిరూపించుకోవాలని వాళ్ల ఉబలాటం.
పబ్లికేషన్, ఎడిటోరియల్ ఆఫీసులు ఎక్స్ టర్నల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ లోనే ఉండేవి. దానికి పాకిస్తానీ జాతీయుడు అజీజ్ అలీ మొహమ్మద్ డైరెక్టర్ గా వచ్చారు. తాను కొత్త ప్రచురణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందున ఇది విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
ఎలా చూసినా నా పుస్తకం ఒక ప్రయోగం.
కాని రకరకాల కారణాల వల్ల పుస్తకం పని అనుకున్నంత చురుగ్గా సాగలేదు. టైపింగ్ కే నాలుగు నెలలు పట్టింది. మొదటి ఎడిటర్ కు ఇంట్లో అత్యవసర పనేదో తలెత్తి సెలవు పెట్టి వెళ్లిపోయారు. మరో ఎడిటర్ రావడానికి సమయం పట్టింది. రిఫరీల కామెంట్లు రావడానికి, మార్పుచేర్పులు చెయ్యడానికి కూడా ఆలస్యమైంది. మొత్తానికి ఒక ఏడాదంతా గడిచిపోయి, 1983 మార్చిలో నా పుస్తకం విడుదలైంది.
పాఠకులు దాన్ని ఆదరిస్తారా, ఎటువంటి సమీక్షలు వస్తాయి, విజయవంతమవుతుందా అని నాకు ఒకటే టెన్షన్. ఫండ్ పబ్లికేషన్ ప్రోగ్రామ్ భవిష్యత్తు ఈ పుస్తకం జయాపజయాల మీద ఆధారపడి ఉంది మరి. కాని ఆ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది, 3 నెలల్లో మలి ముద్రణకు నోచుకున్న తొలి ఫండ్ ప్రచురణ అదే. అది మేనేజ్ మెంటుకు సంతోషాన్నిచ్చింది, పబ్లికేషన్స్ శాఖకు ఊపిరులూదింది.
వీటికన్న ముఖ్యమైన అంశం మరొకటుంది. అప్పటికి ఫండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సబాటికల్ ప్రోగ్రామ్ పై కాస్త గుర్రుగా, విమర్శానత్మక దృష్టితో ఉండేది. నా పుస్తక విజయాన్ని ఉదాహరణగా చూపెట్టి అడ్మినిస్ట్రేషన్ ఆ ప్రోగ్రామ్ ను కొనసాగించింది.
ఈ పుస్తకం స్పానిష్ లోకి అనువాదమైంది. లాటిన్ అమెరికన్ బడ్జెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జర్నల్లో సీరియల్ గా ప్రచురితమైంది. పబ్లిక్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ దాన్ని చైనీస్ లోకి అనువదించింది. నేను పెట్టిన చేంతాడంత పొడవున్న శీర్షికను మార్చేసి ‘ఎకనామిక్స్ ఆఫ్ బడ్జెటింగ్’ అని ఆకర్షణీయంగా పెట్టుకున్నారు వాళ్లు!
*
Good to know the experiences
ఎక్కడో మారుమూల పల్లెటూరు నుండి , ఐఎంఎఫ్ వరకు మీ అనుభవాలు చదవడం చాల ఆనందంగా ఉంది .