విద్యార్థులతో విహార యాత్రలు!

నేను రిసెర్చ్ స్కాలర్ గా నెలకి 250 రూపాయల ఉపకార వేతనం తో పి.హెచ్.డి మొదలుపెట్టిన ఏడాదికి మా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లోనే నెలకి 400 రూపాయల జీతం తో లెక్చరర్ గా 1969 లో చేరాను. పాఠాలు చెప్పడం, లాబొరేటరీ క్లాసులు తీసుకోవడం మొదలైన విధులతో పాటు రోజంతా గడిచిపోయేది. భోజనం అయ్యాక రాత్రి 8 గంటల నుంచీ నా పి.హెచ్ డీ పని మొదలు పెట్టి కనీసం అర్ధ రాత్రి దాకా సాగేది.

లెక్చరర్స్ గా నెనూ, మూర్తీ త్వరలోనే మంచి మేష్టార్లు అనే పేరు తెచ్చుకున్నాం. అందు వలనే కాకుండా నేను బ్రహ్మచారిని కాబట్టీ, విద్యార్ధులతో స్నేహంగా ఉండే తత్త్వం, సమయమూ కూడా ఉంది కాబట్టీ విద్యార్థుల కోరిక మీద నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత కూడా అప్పగించారు. అనగా ..బి, టెక్ లో ఆఖరి రెండు సంవత్సరాలలో ఉన్న విద్యార్దులని ఏడాదికి ఒకటి, రెండు సార్లు ఇంజనీరింగ్ ఫేక్టరీలకీ, విహార యాత్రలకీ తీసుకెళ్ళే బాధ్యత నాకు అప్పగించారు. కంప్యూటర్లూ, గింప్యూటర్లూ, ఫోన్ల్ల్లూ, గీన్లూ లేని ఆ రోజుల్లో అంతా వ్రాత ఉత్తరాల మీదనే ఏర్పాట్లు చెయ్యాల్సి వచ్చేది. కానీ విద్యార్ధులలో చాకుల్లాంటి వాళ్ళతో కలిసి పని చెయ్యడం కాబట్టి సరదాగానే ఉండేది. అలా నేను రెండు, మూడు ఏళ్ళలో కనీసం పది సార్లు పాతిక, ముఫై మంది తో ఐఐటి బస్సులో చాలా చోట్లకి వెళ్ళాను. ముఖ్యంగా బొంబాయి, పూనా లలో ఉన్న టాటా, గోద్రెజ్, మహీంద్ర, లార్సెన్ & టూబ్రో మొదలైన పెద్ద మాన్యుఫేక్చరింగ్ కంపెనీలకి వెళ్ళడం మరపురాని అనుభూతే.

మా ఐఐటి కి దగ్గరలోనే ఉన్న ఇండియాలో మొదటి సారిగా కార్లు, లారీలు తయారు చేసిన ప్రిమియర్ ఆటోమొబైల్స్ అనే కంపేనీకి మన తెలుగాయనే మేనేజింగ్ డైరెక్టర్. అలాగే లెడర్లీ ఫార్మస్యూటికల్స్ కి రామలింగ స్వామి అనే ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి మా పెద్దన్నయ్య సహాధ్యాయి ఏడిద కామేశ్వర రావు మొదలైన వారికి ఉద్యోగాలు ఇప్పించే వారు. అలాంటి తెలుగు వారిని తల్చుకుని మాకు ఎంత గర్వంగా ఉండేదో. చెంబూర్ లో ఉండే వై.కె. రావు అనే ఆ కామేశ్వర రావు & కమల గారి ఇంటికి నెలకో సారి తెలుగు భోజనం కోసం వెళ్ళేవాళ్ళం నేనూ, మూర్తీ, రావూనూ. ఆయన తమ్ముడు వెంకటేశ్వర రావు గారు నాకు కాకినాడ లో ఇంజనీరింగ్ మేష్టారు అయితే మరొక తమ్ముడు లక్ష్మీనారాయణ అనే లచ్చి, నేనూ మా గాంధీ నగరం క్రికెట్ టీమ్ లో ఆడేవాళ్ళం. ఇప్పటికీ నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా, లక్ష్మీ నారాయణ ని చూడకుండా ఉండను. అతను రోజూ మా సుబ్బన్నయ్య దగ్గరకి వచ్చి కబుర్లు చెప్తూనే ఉండే ఆత్మీయ మిత్రుడు.

ఇక మా విద్యార్థులతో మూడేళ్ళ పాటు చేసిన విహార యాత్రలూ, పారిశ్రామిక సందర్శనలలో అన్నింటిలోకీ నాకు ఇంకా గుర్తున్న అనుభవం మేము ఒక సారి…1972 లో అనుకుంటాను…మహా బలేశ్వర్ అనే హిల్ రిసార్ట్ కి వెళ్ళడం. సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో, బొంబాయికి 200 మైళ్ళూ, పూనా కి దక్షిణం గా 75 మైళ్ళ దూరం లో చుట్టూ లోయలతో కృష్ణా నది పుట్టుక ప్రాతం అయిన ఆ మహా బలేశ్వర్ ప్రకృతి అందచందాలు ఒక ఎత్తు అయితే, ముగ్గురు అమ్మాయిలు ఉన్న మా బి. టెక్ విద్యార్ధి బృందం తో నాలుగు రోజులు గడపడం మరొక ఎత్తు అయితే….మేము ఉన్న బస లోనే సుమారు 25 మంది ఉన్న మరొక అంతర్జాతీయ బృందాన్ని కలవడం, వారి విన్యాసాలలో పాలు పంచుకోవడం ఇప్పటికీ నేను మర్చిపోనిదే.

ఆ బృందం నాయకుడు ఇంకెవరో కాదు. మహాత్మా గాంధీ గారికీ, చక్రవర్తుల రాజ గోపాలాచారి గారికీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ గారే. మహాత్మా గాంధీ గారి “మూడు కోతులు” రూపం లో మహా బలేశ్వర్ లో ఉన్న “మంకీ పాయింట్’ ని తన బృందానికి చూపించడానికి ఆయన వచ్చారు. ఆ రోజుల్లో ఉన్నత విలువలు ఉన్న ప్రజాస్వామ్యానికీ, లంచగొండి తనం నిర్మూలనానికీ, ఇతర సామాజిక రుగ్మతల మీద వ్యతిరేకంగా ఆయన “మోరల్ రి ఆర్మమెంట్” అనే పేరిట సుమారు 30 మంది యువతీయువకులతో “ఎనీ థింగ్ టు దిక్లేర్” అనే పేరిట ఒక నృత్య రూపకం ప్రపంచం అంతటా ప్రదర్సిస్తూ ఉద్యమం నడిపే వారు. అనేక దేశాల యువతీయువకులు ఏదో ఒక విమానాశ్రయానికి వెళ్ళడం, అక్కడ కస్ఠమ్స్ వాళ్ళు “ఎనీ థింగ్ టు డిక్లేర్?” అని అడగగానే “యస్, నా నిజాయితీని డిక్లేర్ చేస్తున్నాను” అని ఒక ఇంగ్లండ్ అమ్మాయి, “సమాజం మీద నా ప్రేమని డిక్లేర్ చేస్తున్నాను” అని ఒక ఫ్రాన్స్ అబ్బాయి..ఇలా అందరూ ఏదో ఒక ఉన్నత ఆశయాన్ని డిక్లేర్ చేస్తూ ఆఖర్న అందరూ కలిసి పాట పాడుతూ మంచి నృత్యం చెయ్యడమే ఆ నృత్య రూపకం లో ప్రధానాంశం. మా అదృష్టం బావుండి మేము మహా బలేశ్వర్ వెళ్ళినప్పుడు ఆయనా, ఆ బృందం అక్కడ ఉండడం, ఆ ప్రదర్శన లో నేను కూడా ఒక వ్యాఖ్యాత గా పాల్గొనడం నిజంగా ఇప్పటికీ మరపు రాని అనుభూతి గానే మిగిలి పోయింది. మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడే నా విద్యార్థులతో కలిసి అక్కడ సరస్సులో బోట్ షికారు, కొండల మీద హైకింగ్ ఫొటోలు ఇక్కడ పెట్టాను. అవి చూస్తే తెలుస్తుంది నాకెంత సరదా ఉందేదో ఆ రోజుల్లో…ఇప్పటికీ చింత చచ్చినా పులుపు చావ లేదు అనే చెప్పగలను.

అందులో ఒక ఫొటోలో మధ్యన ఉండి పడవ నడుపుతున్న కుర్రాడి పేరు బాపట్. అతనే రెండో ఫొటోలో కుడి పక్కన ఉండే పొడుగాటి కుర్రాడు. ఇతను నాకు ఎందుకు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్నాడంటే…అతను నా అభిమాన విద్యార్థులలొ ఒకడు అవడమే కాకుండా బ్రహ్మాండమైన క్రికెట్ బేట్స్ మన్. సుమారు మూడు, నాలుగేళ్ళు నేనూ, మూర్తీ, రావూ మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టీమ్ కో స్టాఫ్ టీమ్ లోనో ఆడినప్పుడు అతను ఐఐటి స్ట్యూడెంట్స్ టీమ్ కి ఆడేవాడు…మాకు ఎదురుగా.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నాకు చేదోడు, వాదోడు గా ఉండేవాడు.

అతని క్లాస్ లోనే ఫెర్నాండెజ్ అనే గోవా కుర్రాడు ఉండేవాడు. ఇతనితో అప్పుడప్పుడు మేము టూర్లకి వెళినప్పుడు కానీ, కేంపస్ లోనే జరిగే ప్రోగ్రాముల్లో కానీ అప్ప్పటికప్పుడు ఆలోచించి, చిన్న చిన్న స్కిట్స్ వేసేవాళ్లం… సరదాకి. అలాంటి ఒక స్కిట్ లో నేను అలిసిపోయి గడ్డిలో పడి ఉంటే ఆకలితో చస్తానేమో అని నాకు ఒక బ్రెడ్డు ముక్క పెట్టి బతికించిన సీన్ ఫొటో ఒకటి దొరికింది. అది ఇక్కడ జతపరిచాను. అతను జీవితం లో కాస్త చదువుకుని, ఆ తర్వాత గోవాలో చర్చి లో పాస్టర్ గా స్థిరపడాలని అలాగే స్థిరపడ్డాడు.

ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇద్దరు ప్రముఖులు నా శిష్యులు. అలా అని నా మూలాన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు సుమా అని నేను గొప్ప చెప్పుకోవడం లేదు. నేను కేవలం వాళ్ళకి కొన్నేళ్ళు పాఠాలు చెప్పాను. అది కేవలం యాదృచ్చికం. వాళ్ళలో ఒకతను జైరామ్ రమేష్. అతను 1971 నుంచీ నేను 1974 లో అమెరికా వచ్చే దాకా మా మెకానికల్ ఇంజనీరింగ్ లో విద్యార్థిగా..అంటే అతని డిగ్రీ కోర్స్ లో 3,4,5 సంవత్సరాలు నాకూ, మూర్తికీ ఒక విధంగా చెప్పాలంటే అభిమాన విద్యార్థి. అతని తండ్రి ప్రొఫెసర్ సి.కె. రమేష్ గారు ఎంతో హుందా గా, జెట్ స్పీడ్ తో అనర్గళంగా మాట్లాడే వారు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా ఉంటూ మేము నిర్వహించే సంగీతం కార్యక్రమాలకి వచ్చే బెంగుళూరు తమిళులు. ఇక జైరామ్ కి నేను ఆ మూడేళ్ళూ ఫ్లూయిడ్ మెకానిక్స్, థీరీ, లాబ్స్, ఇన్స్ మెంటేషన్ & కంట్రోల్స్ చెప్పేవాడిని. చాలా తెలివైన వాడు కాబట్టి మార్కులు బాగా రావడమే కాక, ఏ మాట కామాటే చెప్పుకోవాలి అంటే ‘పట్టు పరిశ్రమ’ కూడా బాగా తెలిసిన వాడే. నన్నూ, మూర్తినీ బాగానే కాకా పట్టేవాడు. అతని ఐఐటి లో డిగ్రీ 1975 లో పూర్తి అవడానికి ముందే నేను అమెరికా వచ్చేశాను. అతను కార్నెగీ మెలాన్ లో పబ్లిక్ పోలిసీ లో మాస్టర్స్, బోస్టన్ ఎమ్. ఐ. టీ లో టెక్నాలజీ పొలిసీ & ఎకనామిక్స్ లోనూ చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ రాజకీయాలలో ప్రవేశించి అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. చిదంబరం, ఆలూవాలియా, మన్మోహన్ సింగ్, సామ్ పిత్రోడా స్థాయిలో సోనియా గాంధీకి కుడి భుజంగా మారి, యు.పి.యే కి “కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ మేనిఫెస్టో, రచయిత గానూ, ఈ నాటి ఆధార్ కార్డ్ రూపశిల్పి గానూ, కేంద్ర మంత్రివర్గం లో కామర్స్ మంత్రి గానూ, కాంగ్రెస్ పార్టీ సిధ్దాంత కర్త గానూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అతను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచే రాజ్య సభ సభ్యుడి గా ఎంపిక అయ్యాడు. ఒకటి, రెండు సార్లు జైరామ్ మా హ్యూస్టన్ వచ్చినప్పుడు అతడిని కలిశాను. ఎప్పుడూ, సార్ అంటూ మర్యాదగానే మాట్లాడతాడు. ఒక సారి ఒకానొక పబ్లిక్ సమావేశం లొ నేను సరదాగా, చిలిపిగా “ఏమయ్యా జైరామ్, నేనేమో నీకు మూడేళ్ళు ఫ్లూయిడ్ మెకానిక్స్ నేర్పిస్తే, నువ్వు అదంతా పక్కకి పెట్టేసి ఇలా ఎకనామిక్స్, ఫైనాన్స్ అంటూ రూటు మార్చేశావు ఏమిటీ?” అని అడగగానే పాపం ఒక క్షణం బిక్క మొహం వేసి, నవ్వేశాడు. ఆ తర్వాత నేను అడిగిన అసలు ప్రశ్న కి భలే సమాధానం చెప్పాడు.

జై రామ్ రమేష్ ని నేను అడిగిన ప్రశ్న “ చరిత్రలో భారత దేశం పరాయి పాలనలో ఉండి ఇండస్ట్ఱియల్ రివల్యూషన్ లో పాలు పంచుకునే అవకాశం కోల్పోయింది. ఇప్పుడు మన దౌర్భాగ్యులైన రాజకీయవేత్తల కారణంగా ఐటీ రివల్యూషన్ అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉందా?” ఆ ప్రశ్న తనకి వర్తించుకుని నన్ను కోప్పడతాడేమో అనుకున్నాను కానీ….జైరామ్ రమేశ్ సమాధానం:

“ఆ ప్రమాదం లేదు రాజూ సాబ్. ఎందుకంటే ఈ ఐటీ రంగం, కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్ నెట్ లు రాజకీయ వాదులూ, ప్రభుత్వాధినేతల పరిధిలో, వాళ్ళు కంట్రోల్ చెయ్యదగినవి కాదు. అంచేత మానవ మేధస్సు తో వాటంతట అవే అభివృధ్ది అవుతాయి. భారతీయుల మేధస్సు కి అందులో సరి అయిన చోటు లభించకుండా ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. ఈ సారి మనం మిస్ అయే అవకాశం లేదు”

ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరొక శిష్యుడు కాని శిష్యుడు గానే నేను చెప్పుకునే వాడు నందన్ నిలేకాని. అలా డొంక తిరుగుడు గా ఎందుకు అనవలసి వచ్చిందీ అంటే…అతను నా క్లాస్ లో కనీసం రెండేళ్ళు ఉన్నాడు అని రోల్ కాల్ లో చాలా సార్లు పిలిచిన కారణంగా ఆ పేరు ఇంకా గుర్తు ఉంది కానీ, మనిషి మటుకు అస్సలు గుర్తు లేడు. అతను ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో విద్యార్థి కాబట్టి నేను బోధించే మెకానికల్ ఇంజనీరింగ్ తాలూకు పాఠ్యాంశం అయిన ఫ్లూయిడ్ మెకానిక్స్ అన్ని బ్రాంచ్ వాళ్ళకీ కామన్ సబ్జెక్ట్ గా సుమారు వంద మందిలో అతను గుంపులో గోవిందా లాగా అతను ఒకడు మాత్రమే. ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడుగా, అనేక విధాలుగా నందన్ నిలేకాని పేరు వినని వారు ఉండరు. ఏ మాటకామాటే చెప్పుకోవాలీ అంటే అంత గొప్పవాడు గుర్తు లేడు కానీ అతని క్లాస్ మేట్ అయిన నూర్జహాన్ అనే అమ్మాయి మటుకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజుల్లో మొత్తం కేంపస్ లో ఐదారుగురు అమ్మాయిలలో భలే పొందిక గా ఉండే ఈ అమ్మాయీ, మరొక ఇద్దరూ మా లెక్చరర్స్ కి కేటాయించే ఒక ఎపార్టెమెంట్ లో ఉండేవారు. అప్పుడు అదే ఏకైక గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు వేరే భవనం కట్టారు అని విన్నాను.

ఇక మరొక అపురూపమైన అనుభూతి……”మూడ్ ఇండిగో” గురించీ, తలత్ మొహమూద్ గురించీ మరొక సారి….

*

 

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు