మాటలు
వాటి అర్థాన్ని, శక్తిని కోల్పోతున్నాయా
మృత భూభాగం మీద
విత్తనాలు చల్లినట్టు
నిస్తేజంగా నిర్జీవంగా పడివున్నాయా
ఏ చెవినీ తాకక
ఏ హృదయాన్నీ మీటక
మేటేసుకుపోయాయా ?
వినడా ! కనడా ! నరుడు
మనసుకింపైన దాన్ని దేన్నీ
అంటుకోడా
అసలు మనసుకింపైనవి లేవా
గాల్లో వేలాడినట్టు
కరిమబ్బు కురవనట్టు-
ఏమిటీ
పాడుబడిన
రాజ్య రమాక్షేత్రం
ఏకదళమా
ద్విదళమా
బీజరహిత పరీవాహక ప్రాంతమా
ఏమో-
దేన్నీ అనుసంధించలేని
అనుభవించలేని అనువర్తించలేని
విఫల యజ్ఞఫలం- జ్ఞానఫలం
రాళ్లు కూడా మాట్లాడుతాయని విన్నాను-
కానీ నీళ్లు రాళ్లవటం
మొండేళ్లా
నడిరోడ్డు మీద దొర్లటం-
ఏం దృశ్యమిది- ఏమిటి గుట్టు
మాటి మాటికి
తపోభంగం చేసే కభేళా దృశ్యం-
తూము నిండా
రక్తం ప్రవహిస్తుంది
మాంస ఖండాలు గాల్లో
పక్షుల్లా ఎగురుతున్నాయి
రోదసి నిండా కళాకాంతులు లేని
జీవచ్ఛవాల పరిభ్రమణం
ఏది భూభాగం, ఏది ఆకాశం
ఏదీ సమవర్తుల సాంద్ర తరువిలసనం
రెండు కాదు, మూడు కాదు
వేలవేల సంవత్సరాల చరిత్రలో
ఎక్కడైనా ఒక స్వర్ణయుగపు
జాడ వున్నదా ?
నిఖిలం, అఖిలం అంతా
భ్రమల సంయోగ ప్రక్రియయేనా
ఏడీ కాటికాపరుడు
ఏరీ హరిశ్చంద్ర చంద్రమతులు
ఎక్కడో తేలుతున్న మరెక్కడో వాలుతున్న
కొమ్మ మీద కూర్చోలేక
భూమిలో పడి మొలవలేక-
ఏమిటీ త్రికాల త్రిశంకు స్వర్గస్థితి-
ఎక్కడో దేన్నో నరకాల్సింది
ఎక్కడో దేన్నో లోన నిక్షిప్తం
చేసుకోవాల్సింది-
ఇప్పుడంతా బయల్పడి
కుబుసంలా మిగిలి-
ఎటు పోవాలో తెలియక
ఏ మార్గమూ విచ్చుకోక
నిస్సంతు నాలుగురోడ్ల కూడలిలో-
* * * * *
ఎవరూ వాడని బాటని
ఎంచుకోమన్నాడు Robert frost
కొండలెక్కి లోయల్లో దిగి
ఎప్పుడో ఒకప్పుడు
ఏదో నదీతీర ప్రాంతంలో
నిన్నది విసిరేస్తుంది
అప్పుడు జన్మించటం జరుగుతుంది
చెట్టు ఎదిగి నాలుగు దిశలకీ
విస్తరించటం ప్రారంభిస్తుంది
* * * * *
నరుడా ! నీకు జయము
మానవుడా ! నీకు జయము
విజయీభవ విజయీభవ
దిగ్విజయీభవ..
*
చిత్రం: సృజన్ రాజ్
Superb poem sir. Kudos
గొప్ప కవితరాసిన శివారెడ్డి గారికి కవితను అందించిన సారంగ అధినేత డియర్ అఫ్సర్ కి అభినందనలు..
గొప్ప కవితను ఇచ్చిన గురువు గారికి
నమస్సులు..
కవితను అందించిన సారంగ సంపాదక వర్గానికి ధన్యవాదాలు..