విజయవాడ విలువెప్పుడు తెలిసిందంటే….

మధ్యాహ్నం పూట భోజనానికని ఊళ్ళోకి వెళ్ళొస్తుంటే విజయవాడ ఎంత గొప్పగా ఉందో అర్థమయింది.

 ప్పట్లో అంటే ఎనభైల చివర్లో,తొంభైల మొదట్లో దేశమంతటా లోకల్ రేడియో స్టేషన్ లను సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ ప్రారంభించింది.. వీటి స్థాపన వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం స్థానికులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య రేడియో ఒక వారధి లా ఉండి సమస్యలకు పరిష్కార వేదికగా నిలవాలి అనేదిహ అలా 1989 మార్చి 24న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన తొలి ఎఫ్.ఎమ్.స్టేషన్ ఆకాశవాణి కొత్తగూడెం స్టేషన్.

కొత్తగూడెం మొదలయ్యే రెణ్ణెళ్ళ ముందు ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఒక టీంను రెడీ చేసి కొత్తగూడెం పంపారు.డ్యూటీ ఆఫీసర్ గా నేను,ఒక సీనియర్ అనౌన్సర్ గా ఎమ్.వాసుదేవమూర్తి విజయవాడ నుంచి 

హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి డ్యూటీ ఆఫీసర్ ముళ్ళపూడి భాస్కర్, సీనియర్ అనౌన్సర్ వట్టం సత్యనారాయణ (కార్మికుల కార్యక్రమం లో ఏకాంబరం, చిన్నక్క, రాంబాబు ల్లో ఏకాంబరం) చేరుకున్నాం.మహమూద్ ఖాన్ అనే అనుభవశాలియైన ప్రోగ్రాం ఆఫీసర్ కి అక్కడ పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు.. ఢిల్లీ నుంచి సీనియర్ డైరెక్టర్ డా.ఆర్.అనంత పద్మనాభరావు గారు టూర్ మీద వచ్చారు.వారు ఈ రెండు నెలల కాలంలో స్టేషన్ ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.

మేమేమో టూర్ మీద వెళ్ళినవాళ్ళం కాబట్టి రెండునెలలు అయిపోయిన తర్వాత మేము తిరిగి వెళ్ళి పోవచ్చు.ఈలోగా చాలా మంది మిత్రులు భయపెట్టారు. నువ్వక్కడే ఉండిపోవటానికి రెడీ అయిపో అంటూ..ఈ భయాల మధ్య కొత్తగూడెం లో అడుగుపెట్టాను.

కొత్తగూడెం స్టేషన్ కోసం ప్రారంభం కోసం ఉన్న రెణ్ణెళ్ళ కాలం నాకు చాలా నేర్పింది.విజయవాడలో సీనియర్స్ ని ఏదైనా నేర్పమని అడిగితే తొందరేముంది అని దాటేసేవారు. కొత్తగూడెంలో అలా వీలు కాలేదు.

నన్నూ, వాసుదేవ మూర్తి గారిని డా.అనంత పద్మనాభరావు గారు ఖమ్మం టూర్ మీద పంపించారు.టూర్ లో టూర్ అన్న మాట.అక్కడ జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులను కలిసి మేమొచ్చిన పనిచెప్పి వారితో మెసేజెస్, వారి శాఖలు ప్రజలకు ఏవిధంగా తోడ్పడుతున్నాయో రికార్డు చేశాం.అప్పుడక్కడ ప్రముఖ సాహితీవేత్త డా.రాపాక ఏకాంబరాచార్యులు ఎస్.సి.కార్పొరేషన్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా ఉండేవారు. వారు ఉగాది కోసం వారి ఆర్గనైజేషన్ లో సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవారిని ఉగాది సందర్భంగా ఓ సాహిత్య కదంబ కార్యక్రమానికి సిద్ధం చేశారు.ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డు చేస్తూ పోయాం..

అప్పటివరకు స్పూల్ టేప్ ని రికార్డర్ పై లోడ్ చేయటం తెలియని నాకు ఇన్ని కార్యక్రమాలు రికార్డు చేయటం, ఎడిట్ చేయటం ఒక సవాలుగా మారింది.అయితే కొత్తగూడెం కేంద్రం ఇంజనీరింగ్ మిత్రులు సాయం పట్టడంతో డబ్బింగ్ /ఎడిటింగ్ టెక్నిక్ తెలిసికొని విజయవంతంగా ఆ ప్రక్రియ పూర్తి చేశాను. నాకెవరూ ఏమీ చెప్పట్లేదన్న బెంగ తీరిపోయింది. మా డైరెక్టర్ గారు స్టేషన్ ప్రారంభం కాకుండానే పూర్తిస్థాయిలో పని వాతావరణాన్ని సృష్టించేశారు. ఈమని కృష్ణశాస్త్రి అనే యువకుడు కొత్త గూడెంలోని యువ కళాకారులతో మంచి సంగీత కార్యక్రమాలు రికార్డు చేశాడు. అతనే రాసి సంగీతం సమకూర్చి అద్భుతంగా పాడి ఆశ్చర్యపరిచాడు. తర్వాతి కాలంలో అతను అక్కడే అనౌన్సర్ గా  జరిగిన రిక్రూట్మెంట్ లో కఠినమైన పోటీనెదుర్కొని సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళమ్మగారు ఈమని శివకామేశ్వరి చక్కని లలిత సంగీత గాయని. చిత్తరంజన్ గారి శిష్యురాలు ఆరోజుల్లో కొత్త గూడెం తర్వాత నిజామాబాద్,వరంగల్, కర్నూలు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం పట్టణాల్లో రేడియో స్టేషన్లు మొదలయ్యాయి.ఇంచుమించుగా రెండేళ్ల కాలంలో ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆదిలాబాద్ లో మాత్రం మీడియం వేవ్ స్టేషన్ అప్పటికే  కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది.

అప్పటివరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం,కడప నగరాల్లో మాత్రమే ఉన్న ఆకాశవాణి ఇంకో ఏడెనిమిది కేంద్రాలు స్థాపన చేయటం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.ఎఫ్.ఎమ్.ప్రసారాల ప్రత్యేకతమేమిటంటే యాభై,అరవై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వినిపిస్తాయి.చాలా చక్కని నాణ్యత కలిగి ఉంటాయి.అప్పుడప్పుడే రేడియో సెట్లను ఎఫ్.ఎమ్.తో కలిపి తయారు చేస్తున్నారు.శ్రోతలకు ఈరకంగా ప్రసారాలు వినటం కొత్త.మా రేడియోలో మన స్టేషన్ వినపడటం లేదని వచ్చి ఫిర్యాదు చేస్తుండేవారు. 

రేడియోలో అప్పటికీ, ఇప్పటికీ భద్రాచలంలోని శ్రీరామ నవమి పండుగపై ప్రత్యక్ష వ్యాఖ్యనం వినటం ఒక వరంగా భావిస్తారు శ్రోతలు.. అలా ఆ సంవత్సరం ప్రత్యక్ష వ్యాఖ్యానం నిర్వహించే అవకాశం కలిగింది..ఆ సంవత్సరం చిత్తరంజన్,కెబికె మోహనరాజు, స్థానికంగా ఉన్న ఈమని శివకామేశ్వరి తదితర గాయకులు చక్కగా రామదాసు కీర్తనలు ఆలపించి హాజరైనవారందరికీ ఆహ్లాదాన్ని పంచారు.

కొత్తగూడెం లో ఏప్రిల్ నుంచి ఎండలు పుంజుకున్నాయి.స్టేషన్ ఉన్న రామవరం ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉండేది. మధ్యాహ్నం పూట భోజనానికని ఊళ్ళోకి వెళ్ళొస్తుంటే విజయవాడ ఎంత గొప్పగా ఉందో అర్థమయింది. విజయవాడలో చేరిన మొదటి సంవత్సరం హైదరాబాద్ వదిలేసి వచ్చినందుకు బాధగా ఉండేది.

కొత్తగూడెం లో పనిచేసిన రెండు నెలల్లో విజయవాడ విలువ తెలిసింది. ఎప్పుడెప్పుడు విజయవాడ లో పడతానా అనుకునేవాడిని. రెండునెలల పదిరోజుల అనంతరం సీనియర్ అనౌన్సర్ కోకా సంజీవరావు గారితో కలిసి ఆయన స్కూటర్ మీద ఇద్దరం విజయవాడ తిరిగొస్తుంటే మధ్యమధ్యలో ఆగి మామిడిచెట్లున్నచోట ఆగి సేదదీరాక వీలైతే ఒకటో రెండో మామిడికాయలు కోసేవాళ్ళం..అదో జ్ఞాపకం..

విజయవాడ వచ్చేసరికి కొత్త డైరెక్టర్ జి.కె.కులకర్ణి గారు స్టేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకున్నారు..ఆయన రావటంతోనే చాలా మార్పులు చేశారు..

అవేమిటంటే…

*

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు