విజయవాడ వరదలు: మీసోసైక్లోన్ల ప్రభావం

కృష్ణా నది, బుడమేరు వాగు, కొల్లేరు సరస్సు మధ్య ఉన్న విజయవాడ నగరం ఇటీవల తీవ్రమైన వరదలను ఎదుర్కొంది. ఈ నీటి వనరుల మూలంగానే సహజంగా నే ఈ ప్రదేశం అధిక తేమతో ఉంటుంది. వాతావరణంలో అనూహ్యమైన మార్పుల మూలంగా వరద అంచనాలకి అందని స్థితిలోకి జారిపోయింది.  ఈ వరదలు మీసోసైక్లోన్లు, స్థానిక భౌగోళిక పరిస్థితులు మరియు నగర కట్టడాలు వంటి మిశ్రమ కారణాల వల్ల సంభవించాయి. ఈ వర్షాలు సముద్రపు తుఫాను కాకుండా, భూ-ఆధారిత సైక్లోన్ (మీసోసైక్లోన్ అంటారు) వల్ల సంభవించాయి. ఈ సైక్లోన్ పశ్చిమ ప్రాంతపు అరేబియా సముద్రం నుండి తేమను, దేశం తూర్పు ప్రాంతాల నుండి భూమి ఆధారిత ఉష్ణాన్ని సేకరించి రూపు సంతరించుకుంది.

 
మీసోసైక్లోన్లను అంటే ఏమిటి?
సాధారణంగా సైకోన్లు సముద్రంలో పుడుతాయి. కానీ ‘మీసోసైకోన్లు’ నేల మీద పుట్టేవి.  గాలిలోని ఉష్ణోగ్రతా ,  తేమ వ్యత్యాసాల వల్ల మీసోసైక్లోన్లు ఏర్పడతాయి. ఈ తూఫానులో బలమైన పైకి లేచే గాలులు ఉంటాయి. పైకి లేచే గాలులు తేమను పైకి తీసుకెళ్తాయి, అక్కడ అది చల్లబడి మేఘాలుగా మారుతుంది. మేఘాలు చాలా దట్టంగా మారినప్పుడు, అవి భారీ వర్షంగా కురుస్తాయి. ఉష్ణోగ్రత ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు గాలిలో ఎక్కువ తేమను నిలుపుకోగలవు, దీని వల్ల భారీ వర్షపాతం సంభవించే అవకాశం పెరుగుతుంది.  భూమీ, సముద్రం మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గాలి ప్రవాహాలను సృష్టిస్తాయి, ఇవి మీసోసైక్లోన్ల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. ఉష్ణోగ్రత మార్పులు వాతావరణ అస్థిరతకు దారితీస్తాయి, ఇది మీసోసైక్లోన్ల ఏర్పాటుకు అనుకూలం.
 
వాగులు పొంగడానికి కారణాలు

భారీ వర్షం వల్ల నేల త్వరగా  మడుగవుతుంది. దీని వల్ల అదనపు నీరు నేరుగా వాగులలోకి ప్రవహిస్తుంది. అధిక ప్రవాహం వల్ల నది ఒడ్డులు కోతకు గురవుతాయి, దీని వల్ల వాగు మార్గం మారవచ్చు. వాగు మార్గంలో ఉన్న అవరోధాలు నీటి ప్రవాహాన్ని మరింత నిరోధించి, వరద ప్రమాదాన్ని పెంచుతాయి.

 
ప్రస్తుత పరిస్థితి

సాధారణంగా 11,000 క్యూసెక్స్ ప్రవాహంతో ప్రవహించే బుడమేరు వాగు 17,000 క్యూసెక్కులకి చేరింది. భారీ వర్షాల కారణంగా, ఇది మరింత పెరిగి 45,000 క్యూసెక్కులవరకు పొంగింది. 2005లో నమోదైన 75,000 క్యూసెక్స్ ప్రవాహం కంటే ఇది తక్కువే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 36 గంటల్లో విజయవాడలో 26 సెం.మీ. వర్షపాతం నమోదైంది విజయవాడలో వరద పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిన అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వంపులు తిరిగిన బుడమేరు, నీటి ప్రవాహాన్ని నెమ్మదింప చేసి, వరద పరిస్థితులను తీవ్రతరం చేసింది.  పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కురిసిన వర్షాలు చిన్న వాగులు మరియు కాలువలను నింపి, చివరకు బుడమేరు వాగును చేరుకుంటాయి.  భారీ వర్షాల కారణంగా కొండచరియలు కూలిపోవడం జరిగింది, ఇది రహదారులను మూసివేసి, రవాణాకు అంతరాయం కలిగించింది కృష్ణలంక రిటైనింగ్ వాల్ వరద నియంత్రణ పెద్దగా చేయలేకపోయింది.

 
వరదలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు:
              వాగుల సరళీకరణ: అతిగా వంపులు తిరిగిన బుడమేరు వాగుని సరళీకరించటం మొదటి కర్తవ్యం

వాతావరణ పర్యవేక్షణ: మీసోసైక్లోన్లను ముందస్తుగా గుర్తించి హెచ్చరికలు జారీ చేయడం.

నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ: సమగ్ర నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ పద్ధతులను అమలు చేయడం.

వరద నియంత్రణ నిర్మాణాలు: డ్యాములు, రిజర్వాయర్లు వంటి నిర్మాణాలను ఏర్పాటు చేయడం.

నగర ప్రణాళిక: సరైన డ్రైనేజీ వ్యవస్థలతో నగరాలను నిర్మించడం.

అటవీకరణ: అడవులను పెంపొందించడం ద్వారా నేల కోతను నివారించడం.

ప్రజా అవగాహన: వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడం.

ఈ చర్యలన్నీ సమన్వయంతో అమలు చేస్తే, భవిష్యత్తులో వరద ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. మీసోసైక్లోన్ల వంటి తీవ్ర వాతావరణ దృగ్విషయాలపై మరింత పరిశోధన చేయడం వల్ల మరింత ప్రభావవంతమైన నివారణ చర్యలను రూపొందించవచ్చు.

*

విజయ నాదెళ్ళ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించడం, వాటి సరైన disposal, రకరకాల పొల్యూషన్ లను తగ్గించడం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెయ్యవలసినవి

  • విశ్లేషణ బాగుంది. ఐతే కృష్ణ లంక రిటైనింగ్ వాల్ వల్ల అంతగా ప్రయోగానం లేదు అన్నారు. ఇది సరైనది కాదు. అది లేకపోతే కృష్ణ లంక, రాణిగారి తోట తదితర ప్రాంతాలు కూడా చాల నష్టపోయేవి.

  • మీసో సైక్లోన్ల గురించి చక్కగా వివరించావు విజయా. పరిష్కార మార్గాలు కూడా చూపావు. క్లుప్తంగా ఉండటం బాగా నచ్చింది

  • అందరి వాక్యలు చదివి, సరిచేసుకునే ప్రయత్నం చేయగలను. ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు